Loading...

7, డిసెంబర్ 2009, సోమవారం

భాస్కరా!

పండితులైన వారు దిగువం దగ నుండఁగ నల్పుఁడొక్కఁడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబుల కేమి యెగ్గగున్?
గొండొక కోఁతి చెట్టుకొన కొమ్మల నుండఁగఁ గ్రింద గండభే
రుండ మదేభసింహ నికురుంబము లుండవె చేరి భాస్కరా!

తాత్పర్యం
చెట్టుక్రింద గండభేరుండ పక్షులు, ఏనుగులు మొదలగు మృగములుండగ నా చెట్టు కడ కొమ్మలందొక కోతి యున్నప్పటికి నా పక్షి మృగములకేమియు లోపము లేనట్లే, నీచుడొకడు పీఠము మీద గూర్చున్నంత మాత్రమున క్రిందనుండు పండితుల కేమియు గొఱత యుండదు.

12, నవంబర్ 2009, గురువారం

"ఎనిమిది"

ఇవాళ ఈ ’అష్ట’సంఖ్యకు సంబంధించి ఎప్పుడో సేకరించి పెట్టుకున్న వివరాలు:

అష్ట దిక్కులు - తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం
ఈశాన్యం, వాయువ్యం, నైఋతి, ఆగ్నేయం

అష్ట దిక్పాలకులు - ఇంద్రుడు, అగ్ని,యముడు, నిర్వతి,
వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు
(ఏ దిక్కుకు ఎవరో సరిగ్గా తెలీదు.)

అష్ట దిగ్గజాలు - అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు,
ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, మాదయగారి మల్లన,
పింగళి సూరన, భట్టుమూర్తి.

అష్ట మహిషులు- రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద,
భద్ర, సుదంత, కాళింది, లక్షణ.

అష్ట లక్ష్ములు - ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి,
సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి.

అష్ట ఐశ్వర్యాలు- దాసీజనం, భృత్యులు, పుత్రులు, మిత్రులు,
బంధువులు, వాహనాలు, ధనం, ధాన్యం

అష్టావధానం - వర్ణన, సమస్యాపూరణం, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి,
పూరణం, అప్రస్తుత ప్రసంగం, ఘంటాగణనం, చదరంగం

ఇక అష్టకష్టాల గురించి, అష్టావక్రుల వారి గురించి ఇప్పుడు వద్దని మానుకున్నాను.
ఏదో నా లాంటి పామరులు తెలుసుకుంటారని రాశాను. ఎవరికీ తెలీదని కాదు.

18, అక్టోబర్ 2009, ఆదివారం

సాంకేతిక కారణాలవల్ల అంతరాయం

@జ్యోతి
అయ్య బాబోయ్! ఏ ఆప్షన్ లూ లేవని కదండీ నా గోల!
ఇన్నాళ్ళూ ఇలా లేదుగా! ఇప్పుడేమిటో మరి.
ఏదైమైనా ధన్యవాదాలండీ!
తుషారసమీరం బ్లాగులో వ్యాఖ్య రాయబోతే అక్కడా ఇదే సమస్య.

15, అక్టోబర్ 2009, గురువారం

సాంకేతిక కారణాలవల్ల అంతరాయం

నా బ్లాగుల్లో ఉన్నట్టుండి ఏమైందో, వ్యాఖ్యలకు సమా ధానం రాయటం కుదరట్లేదు. చూజ్ యువర్ ప్రొఫైల్ అని వస్తోంది, ఏ ఆప్షన్ లూ లేవు.
అందుకే ఈ టపా

@సుభద్ర : మరే(... సుభద్ర గారూ!అందుకే నా అభిమానాన్ని అలా చాటుకున్నానన్నమాట.
మీరైతే ఇంకా పెద్ద టపా రాయగలరని నాకు తెలుసు. ఎదురుచూస్తుంటాను.

@బద్రి : చాలా ధన్యవాదాలండి బద్రిగారూ! నిధి దొరికినట్టుంది.

14, అక్టోబర్ 2009, బుధవారం

కంచు మోగినట్లు కనకంబు మ్రోగునా?

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావు గారు దూరదర్శన్ లో శంకరభగవత్పాదులు రచించిన షట్పది గురించి అద్భుతంగా ప్రవచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటల వార్తల అనంతరం ఓ పదిహేను నిముషాల కార్యక్రమం. చాలా బాగా చెప్తున్నారు,

అన్ని పనులు మానేసి టీ.వీ. ముందే కూర్చుంటున్నానంటే నమ్మండి. మిగతా అన్ని ఛానల్స్ లో వచ్చే ప్రవచనాలు నేను వినను. కానీ ఇది మాత్రం మిస్ కాలేకపోతున్నాను. ఎన్ని రకాల ఉదాహరణలు, ఎన్ని గ్రంధాల్లోని శ్లోకాలు కోట్ చేస్తూ గుక్క తిప్పుకోకుండా శ్రావ్యంగా పద్యాలు పాడుతూ శ్రోతల్నీ, ప్రేక్షకుల్నీ మంత్రముగ్ధుల్ని చేస్తూ అద్భుతమైన వాగ్ధాటితో వ్యాఖ్యానం చేస్తారంటే నమ్మండి.. కాదు స్వయంగా విని తెలుసుకోండి.

కొంతమంది ఉంటారు దూరదర్శన్ అనగానే వెక్కిరించటానికి. (గతంలో నేనూ అలా చేశానని ఒప్పుకుంటాను.) కానీ ఇప్పుడు అలా లేదు. దుక్కిపాటి మధుసూదనరావు గారనుకుంటాను...వారి నిర్వహణ పుణ్యమాని కొన్ని కార్యక్రమాలు చాలా బావుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే మిగతా ఛానల్స్ లో సినిమాలు, సినిమా కార్యక్రమాలు, సీరియల్స్ చూసి చూసి విసిగిపోయిన వారికి గ్రీష్మ కాలపు చిరుజల్లుల్లా ఆహ్లాదాన్ని కల్గిస్తున్నాయి.

చాగంటి కోటేశ్వర్రావు గారి ప్రవచనం, మువ్వల సవ్వడి, గానగాంధర్వం ఎంతో బావుంటాయి. అప్పుడప్పుడూ ఉదయం తొమ్మిది గంటలకు జరిగే సాహిత్య చర్చలు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా సాహిత్యంపై చర్చ అనేదొకటి జరుగుతున్నందుకు సంతోషించవచ్చు.

ఒకప్పటి కథల్నీ, సంప్రదాయాల్నీ గుర్తు చేస్తూ నిత్యనూతన (ఎవర్ గ్రీన్) రంగాలైన సాహిత్య, సంగీత, నృత్య కళల్ని ఆధ్యాత్మిక తత్వాన్ని ఎంతో సొబగు తో సమర్పిస్తోన్న దూరదర్శన్ వారికి నా నమో వాకాలు.

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సర్వ ప్రాణి సమభావం

కొంతమంది చిలుకలను, కుందేళ్ళను, కుక్కలను పెంచుతుంటారు. అంతెందుకు, పంట, పాడి కోసం ఇంట్లో పశువులను పెంచే వేల కుటుంబాల్లో మాదీ ఒకటిగా ఉండింది.

వాటిలాగే సాలీళ్ళు, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు, అందులు, పురుగులు, పాములు అవీ ప్రాణులేగా! కానీవాటిని చూస్తే భయం, ఓ విధమైన ఏవగింపు అనే భావం నుంచి తప్పించుకోలేకపోతున్నాను. సర్వధర్మ సమభావం లాగే సర్వప్రాణి కోటి పట్ల సమభావం పెంచుకోవాలనేది చాలా ఉన్నతమైన ఆలోచన. ఎన్నో మంచి పుస్తకాల్లో వాటి గురించి చదువుతుంటాము. కానీ ఆచరణలో పెట్టటానికి కష్టపడే నా లాంటి వాళ్ళెంతమందో!

మా అబ్బాయికి కూడా వాడితరం వాళ్ళందరి లాగే స్పైడర్ మాన్, హారీ పోటర్ అంటే ఎంతో ఇష్టం. వాడికి ఆ పుస్తకాలు, సీడిలు నేనే వెదికి కొని బహుమతిగా ఇస్తాను. కానీ నేను చదవలేను, చూడలేను.

ప్రపంచంలో అన్నీ అందమైన సీతాకోకచిలుకలు, పూలు,చెట్లూ మాత్రమే ఉండవు. అవి వున్నట్లే ఇవీ ఉంటాయి. అలా అయిష్టం చూపకూడదని అన్నాడు వాడు. చెంప ఛెళ్ళుమన్నట్టయింది. ఎన్నోసందర్భాల్లో ఎన్నో మంచివిషయాలు నేను ఆచరిస్తూ వాడికి నేర్పాను. కానీ ఈ విషయంలో ఇంత గొప్ప విషయంలో వాడు నాకు నేర్పగలుగుతున్నాడు. కానీ నేను నేర్చుకోగలనా? ఎప్పటికయినా?

మన పెద్దలు, గురువులు, మునులు , దేవుడు కూడా చెప్పిన సత్యమది. ఎంతో సాధారణంగా చెప్పేశాడు.
మరి నేనెందుకిలా ఉన్నాను?

౧. భగవంతుడు కూడా దుష్ట సంహారం చేయవలసి వచ్చినపుడు, తెలిసి తప్పు చేసే మూర్ఖులకు గుణపాఠం చెప్పాల్సినపుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అనే అవతారాల్లో జంతు రూపానికి ప్రాధాన్యత నిచ్చాడు.

౨. కంచిలో బంగారు బల్లిని స్పర్శిస్తే గానీ కంచి యాత్ర పూర్తి గాదు.

౩. రాజస్థాన్ లోని ఒక దేవాలయంలో ఎలుకలకి ఉన్న ప్రాముఖ్యత గురించి విన్నాను.

౪.ఇక క్రమం తప్పకుండా నాగుల చవితి చేసి వెండి పాము కు పాలు పోసి పూజిస్తాము. (ఊళ్ళో ఉన్నప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి వచ్చేవాళ్ళము.)

ఇక ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఈవిల్ పవర్స్ ని ఎదుర్కోవడానికి సాలీడు, కోడిపుంజు (స్పైడర్ మాన్, మల్లన్న) రూపాల్తో హీరోలు వచ్చినట్టు కథలు రాసి ప్రజాదరణ పొందుతున్నారు.

మరి నేనెందుకిలా ఉన్నాను?

మనుషుల్లో నచ్చినవారిని, నచ్చనివారిని ఒకేరకంగా చూడాలనే భావాలు అలవర్చుకోగలిగినపుడు సర్వప్రాణిసమభావం మాత్రం రావటం లేదేం?

ప్రతి ఒక్క ప్రాణీ పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేవే అని తెలుసు.
మనిషే ప్రతి ప్ర్రాణి వల్ల ఏదోవిధంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనం పొందుతున్నాడు అని తెలుసు.
మనిషి వల్ల పర్యావరణానికి గానీ ఏ ఇతర ప్రాణికి గానీ కష్టం, నష్టం తప్ప ఉపయోగం లేదనీ తెలుసు.
మనం వాటికేమీ చెయ్యక్ఖర్లేదు. కనీసం ఈ అయిష్టం మాత్రం పోగొట్టుకుంటే చాలు.

అన్ని ప్రాణుల్లోనూ ఉండేది ఆత్మ. ఆత్మకు ఎటువంటి వివక్ష లేదంటారు. అన్ని ప్రాణుల్లోనూ మనలో ఉండే ఆత్మ ఉంటుందంటారు. మనుషులే కాకుండా మిగిలిన జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు అన్నింటినీ ఒకేరకంగా చూడగలగడం నిజంగా గొప్ప విషయం.

22, జులై 2009, బుధవారం

నన్నున్ గనవో--గోపిక

20, జులై 2009, సోమవారం

నన్నున్ గనవో -- గోపిక

వెన్నెలలో ఇసుకతిన్నెలపై
వన్నెచిన్నెల చిన్నది
కన్నులతోనే బంధించే
కన్నయ్యను వెతికింది
వెన్నముద్దలు గైకొమ్మని

చిన్ననాట మన్ను తిన్నా
అన్న అప్పుడన్న మాట
మిన్నగ కల్లను చేసినా
అమ్మకు అన్నులమిన్నగ
ఎన్నెన్నో వింతల చూపినా
నిన్ను ఏమార్చనివ్వను
నన్నీవేళ

వెన్నలు వన్నెలు నీకే
రాధామణి కన్నను
జాణను వలపులవీణను
నన్నున్ గనవో!!
- లక్ష్మీదేవి.

17, జూన్ 2009, బుధవారం

మంచి మాటలు

విత్తంబు విద్య కులము
న్మత్తులకు మదంబొసగు మాన్యులకున్ స
ద్వృత్తినొసంగున్ వీనిం
జిత్తంబున నిడి మెలంగ జెలువు కుమారా!

కుమారా!
ధనము, విద్య, ఉన్నతకులము మదించిన వారికి గర్వము పెంచును.
మాన్యులకు మంచి స్వభావమును వృద్ధి చేయును.
ఈ విషయమును మనసులో ఉంచుకుని మెలగుట మంచిది.

పక్కి అప్పల నరసయ్య గారు రచించిన కుమార శతకములోనిది ఈ పద్యము.

విద్వాన్ దండిపల్లి వేంకత సుబ్బా శాస్త్రి గారు వ్యాఖ్యానం రాశారు.

3, జూన్ 2009, బుధవారం

భగవద్గీత

భగవద్గీత ప్రపంచంలోని అన్ని వ్యక్తిత్వ వికాస గ్రంధాల్లోకీ గొప్పదని నాకూ అనిపిస్తుంది. ఈ విషయం యండమూరి గారు చెప్పగా విన్నట్లు గుర్తు. మా చిన్నప్పుడు మా తాతగారు ఇంటి బయట అరుగు మీద కూర్చుని ప్రతిరోజూ శ్రావ్యంగా గీతా గానం చేసేవారు. వెళ్తూ వస్తూ వుంటున్నప్పుడు అందులోని శబ్ద సౌందర్యం నన్ను ఎంతో ఆకర్షించేది.

సర్వాలంకార శోభితమైనట్టి నవ వధువు/వరుడిని చూసినప్పుడు కలిగే నేత్రానందం, ఈ సంస్కృత సబ్ద సౌందర్యంలో ఉందనీ, అది చక్కగా గీతలో కర్ణానందం చేస్తుందని ఒప్పుకోని వాళ్ళెవరు చెప్పండి?

నేను ఆరవ తరగతి చదివేప్పుడనుకుంటా మా వూళ్ళో విశ్వహిందూ పరిషద్ వాళ్ళు భగవద్గీతా పఠనం పోటీలు పెట్టారు 18 శ్లోకాల్ని ఎన్నిక చేసి ఇచ్చారు. అందులో నేను మొదటి బహుమతి గెల్చుకున్నాను. అంగ్ల-తెలుగు చిన్న నిఘంటువు నొకదాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. అది ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.

తర్వాత వాళ్ళు మరిన్ని శ్లోకాల్ని ఎన్నిక చేసిచ్చి మళ్ళీ వచ్చి పోటీ పెడతామన్నారు కానీ రానేలేదు. కాకపోతే అందుకు నేను మా తాతగారి దగ్గర నేర్చుకున్న ఒక శ్లోకం నాకెంతగానో నచ్చి ఇప్ప్పటికీ గుర్తుండిపోయింది. తలుచుకున్నప్పుడు నేనేం చేస్తున్నా మొత్తం శ్లోకం అలా పెదాలమీద దొర్లిపోతుంది.

మత్కర్మకృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జిత:
నిర్వైర స్సర్వభూతేషు యస్సమా మేతి పాండవ!

తాత్పర్యం ఇలా ఉంది.
ఓ అర్జునా! ఎవడు కేవలం నా కొరకే సకల కర్తవ్య కర్మల జేయుచున్నాడో, మత్పరాయణుడో, ఆసక్తిరహితుడో సకల ప్రాణులయందు వైర భావము లేక యుండునో, అట్టి అనన్య భక్తులైన వారు నన్నే పొందుచున్నారు.

ఈ శ్లోకము భగద్గీత లోని 11 వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగములోని చివరిది.
ఇలాంటి శ్లోకాల్ని వినిపించటానికో వీటి గొప్పదనం తెలపటానికో ఇప్పటి తాతయ్యలకు అవకాశము లేదు. ఎందుకంటారా? కొంతమంది వృద్ధాశ్రమాల్లో వదలి వేయబడి వుంటారు. మరికొందరికి స్వయంగా ఆసక్తి ఉండక ఏ టి వి సీరియల్స్ చూడ్డమో, సినిమాలు చూడ్డమో చేస్తుంటారు.

ఇంకొంతమందికి ఇయర్ ఫోన్లు, సెల్ ఫోన్లు చెవులకు తగిలించుకుని ఏమాత్రం పలకరించినా కసురుకునే పిల్లల్ని చూస్తే భయం.

ఫలితాన్ని ఆశించకుండా పనిలో పూర్తి సామర్థ్యాన్ని చూపించమని సలహా ఇచ్చే,
పోరాటం అంటూ దిగాక తన పర భేదం వద్దని బోధించే,
మొదలెట్టిన ఏ పనినైనా ముగించకుండా వదలొద్దనే ,
ఇంకా ఎన్నెన్నో చెప్పే గీత కన్నా ఎక్కువగా వ్యక్తిత్వ వికాస గ్రంధాలు కానీ, కోచింగ్ సెంటర్లు గానీ ఏం చెపుతారబ్బా?

22, మే 2009, శుక్రవారం

చావంటే భయమెందుకు?

చావటానికి భయమెందుకు?

ఎంతో విరక్తి తో చావాలనుకునే వాళ్ళు కూడా చావంటే భయపడుతూనే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే వాళ్ళు కూడా ఎంతో బాధతో,దు:ఖంతో చావు గురించి మాట్లాడుతుంటారు.

నిజం, ఆ ప్రసక్తి వచ్చినప్పుడు ఏడుస్తూ మాట్లాడుతుంటారు అనేది నేను గమనించిన విషయం.వాళ్ళకు ఎన్నో బాధలుండవచ్చు. ఆ బాధలవల్ల వాళ్ళకు చావాలనిపిస్తుంది కానీ చావంటే భయం లేకో, బ్రతుకంటే తీపి లేకో కాదు.

జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించలేకపోయినప్పుడు తమ సామర్థ్యంపై నమ్మకం కోల్పోవాల్సి వచ్చినపుడు చావు తమకు ఇవ్వబడల్సిన శిక్షగా భావిస్తూ మాట్లాడుతుంటారు.

ఇది ఒకసారి అయితే పర్వాలేదు, ప్రతిసారీ మనముందు ఇల్లాంటి ప్రసక్తి తీసుకొచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే మనం మాత్రం ఏం చెప్పగలం? వాళ్ళ కన్నీళ్ళు, విరక్తి అబధ్ధం కాకపోవచ్చు. కానీ ప్రతిసారీ ఏమని ఓదార్చగలం చెప్పండి?
అదీ నాకైతే ఏళ్ళతరబడి జీవించాలని ఆశా లేదు, ఇవాళే చావు వచ్చినా బాధా లేదు.అందుకని నేనేదో బాధ్యతలు తీరిపోయి గానీ ఇంకో కారణం తోనో చావాలనుకుంటున్నానని గానీ అనుకోకండి.

అందరికున్న కష్టసుఖాలే నాకూ ఉన్నాయి.

ఆర్మీలా వీరులు కాకుండా మనలాంటి సాధారణ మనుషుల్లో కొంత మంది గురించి ఆలోచిస్తున్నాను.
వీళ్ళకు ఏ విరక్తి వచ్చినా చావు గురించి మాట్లాడడమో, చచ్చే ప్రయత్నం చేయటమో చేస్తూ ఉంటారు. చావు మీద ఎలాంటి వ్యతిరేకభావమూ లెని, చావుని ఒక సహజమైన ఘటనగా, చెప్పాలంటే ఈ సంసార నరకకూపం నుంచి విముక్తి కల్గించేదిగా గుర్తించే నాలాంటివాళ్ళు ఏమని ఓదార్చగలం? మీరేచెప్పండి!

అదీ బాగా పరిచితులైన వాళ్ళు తరచూ ఇలాంటి ఇబ్బంది కల్గిస్తూంటే ఏం చెప్పాలో తెలీదు. నా భావాలు చెప్పానా, అయితే చస్తే చావు అంటావా,నేను చస్తే నీకేం బాధ లేదా అనో మనసు కష్టపెట్టుకుంటారేమో అనిపిస్తుంది.

అలాగని అయ్యో చావు గురించి ఎందుకు మాట్లాడటమంటూ బాధ పడడం నా వల్ల కాదు.

ఆత్మీయులను పోగొట్టుకొని బాధ పడడం సహజమైన విషయం.కానీ అసలు చనిపోవటమన్నది జరగకూడనిదని, శాపమని అనుకోవటమే జీర్ణించుకోలేని విషయం.

ఇలాంటి సందర్భాలో నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఎలా మాట్లాడాలో తెలీడం లేదు.పుట్టుక ఎంత సహజమో చావూ అంతే సహజమని ఎలా తెలియజేయాలో తెలీటం లేదు.

23, ఏప్రిల్ 2009, గురువారం

జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


1. దేవకీ సుతుడై ధరకేతెంచి
వసుదేవునికి ముక్తిని గూర్చి
నదిమధ్యమునే బాటలు వేసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

2. వెన్నకు మన్నుకు భేదము గానక
తల్లి యశోదకు వింతలు చూపగ
నందుని కులదీపకుడై వెలసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


3.వేణుగానమున మైమరిపించి
గోలోకమునే మురిపించితివి
గోజను( గావగ గిరిధరియించిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

4.మాయలమామను కంసుని జంపి
తల్లిని తండ్రిని చెర విడిపించి
మధురకు తాతను రాజుగ చేసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


5.నీలమాధవు రూపము దాల్చి
సుభద్రయు బలభద్రుని తోడ
పూరీ సాగరతీరాన వెలసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

6.అసురుల బాపగ దీనుల గావగ
అవతారమునే దాల్చితివి
అవనికి భారము దింపేవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

7. అనురాగానికి అధిపతివై
అష్టభార్యల ప్రేమను పొంది
లీలలు ఎన్నో చూపినవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

8.సూత్రధారివీ రాయబారివీ
రథసారధివై రణమునకేగి
గీతార్థమునే తెలిపినవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

9.ముద్దూ మురిపెము రేపల్లియకు
కేళీ విలాసం బృందావనికీ
కర్ణామృతమును భువికొసంగిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!
- లక్ష్మీదేవి.

13, ఏప్రిల్ 2009, సోమవారం

అందరికీ మంచిరోజులు

భగవంతుని పూజలో అందరూ సమానమని నమ్మేసిద్ధాంతం నాది. అందరూ అన్నప్పుడు చిన్నా,పెద్దా, ఆడా, మగా,వికలాంగులూ,బుద్ధిమాంద్యం గల వాళ్ళూ, ఏ లోటూ లేని వాళ్లూ,ఉన్నవాళ్ళూ, లేని వాళ్ళూ అందరూను.

మరి భర్త ఉన్నవాళ్ళూ, భర్త లేని వాళ్ళని స్త్రీలలో మాత్రం ఎందుకు ఈ భావన?
పైన చెప్పినట్టు వయసూ,ఆరోగ్యం, డబ్బు ఉన్నవాళ్ళని లేనివాళ్ళని చూడనప్పుడు భర్త ఉన్న వాళ్ళని, లేనివాళ్ళని ఎందుకు చూడాలి?

కొంత మంది అంటారు -వాళ్ళు తృప్తిగా ఉందే పరిస్థితి లేదు కాబట్టి నిండు మనసు తో చేయాల్సినవాటిలో పాల్గొనరాదు అని.

మరి ఎంతో మంది వేరే ఎన్నో విషయాల్లో జీవితమంతా అసంతృప్తి తో ఉండే వాళ్ళూ, అసూయ తో ఉండేవాళ్ళూ ఉంటారు కదా, వాళ్ళంతా ఎలా అర్హులౌతారు?

కొందరనుకోవచ్చు - ఈ కాలంలో అవన్నీ ఎక్కడున్నాయని. ఖచ్చితంగా ఉన్నాయి. పెద్ద నగరాల్లోనే జీవితమంతా ఉన్నవారికి అనుభవంలోకి వచ్చి ఉండకపోవచ్చు.కానీ పల్లెల్లో, పట్టణాల్లో ఉన్నవారికీవిషయం తప్పక తెలిసే ఉంటుంది. ఏమని అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. సో కాల్డ్ నగరవాసులు అక్కడున్నా కూడా! చూసీ చూడనట్టు పోతూ ఉంటారు. భార్య లేని భర్తలకు ఈ బాధలేవీ ఉండవు.

దంపతులుగా చేయాల్సిన వాటి గురించి నేను చెప్పట్లేదు.

పిల్లలకు ప్రత్యేక సందర్భాల్లో ఆరతులివ్వడం,వ్రతాలూ,పూజలు చేసేప్పుడు ఏర్పాట్లు చేయడం, శుభ సందర్భాల్లో ఉదయం కనిపించడం ఇలాంటివి కూడా పాపాలా?

అయితే కొందరు స్త్రీలు (ఆ కాలం వారు) మనమెంత చెప్పినా వినరు. పైగా ఇంకా వివరించబోతే తమ పరిస్థితికి ఇంకా బాధ పడడం మొదలెడతారు.

ఇక వాళ్ళకేదో మనమే గుర్తు చేసి మరి బాధ పెట్టామేమో అని మనమే బాధపడాలి.
ఎన్నికలొస్తున్నయి కాబట్టి మనం సమాజంలో సమస్యల్ని పట్టించుకోలేదని అందరూ చెప్తున్నారు. కానీ రోజూ మన ఇంట్లో జరిగేదాన్నే పట్టించుకోని మనం ఇక సమాజాన్ని పట్టించుకుంటామా?

ఈ పట్టింపులు ఎంతో గొప్పదైన మన సంస్కృతిలో భాగమని నేను అనుకోను. అందరిలో పరమాత్మని చూడమని, లోన ఉండే ఆత్మ అందరికీ ఒక్కటేనని తెలిసిన మనకు ఈ వివక్ష తప్పని తెలీడానికి ఇంకెంత కాలం పడుతుంది?

ఒక పక్క భర్త పోయిన తర్వాత రెండో పెళ్ళిళ్ళు జరుగుతున్నయి. కాదనను. అబ్బాయికి మొదటి పెళ్ళి అయినా భర్త లెని వారిని చేసుకున్న వాళ్ళని నేనే చూశాను.సంతోషం. కానీ ఇంకో వైపు ఈ పరిస్థితి కూడా ఉంది.
క్రమంగా అందరికీ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.

28, మార్చి 2009, శనివారం

సత్పురుషులు

గంగా పాపం శశీ తాపం
దైన్యం కల్పతరుస్తథా
పాపం తాపం దైన్యం చ
ఘ్నంతి సంతో మహాశయా:

ఈ సుభాషితానికి అర్థం-:
గంగ లో మునిగితే సర్వ పాపాలూ నశిస్తాయి.
జాబిలి చల్లదనం ఎంతటి తాపాన్నైనా చల్లబరుస్తుంది.
ఏది లేదని బాధపడినా కల్పవృక్షం కింద కూర్చుని కోరుకోకనే అందిస్తుంది.
కాని పాపాన్ని, తాపాన్ని, దైన్యాన్నీ కూడా తీర్చగలిగేది
సత్పురుషులే, వారి సహవాసమే!!

21, ఫిబ్రవరి 2009, శనివారం

పూజలేల? అర్చనలేల?

మహాదేవి వర్మ హిందీలో పేరు మోసిన గొప్ప కవయిత్రి. ఓ కవితలో పూజలో విధి విధానం కన్నా భక్తి భావన ముఖ్యమని, వస్తువులన్ని సమకూర్చామా లేదాఅని చూసేబదులు మనసు లగ్నం చేశామో లేదో చూడటం ముఖ్యమని వేదాలలో,పురాణాలలో రాసినదాన్ని కవయిత్రి చక్కటి మాటలలో చెప్పారు. అందుకే ఈ కవిత నాకు చాలా నచ్చింది.ఆవిడ రాసిన క్యా పూజన్ క్యా ఆర్చన్ రే! అనే కవితని నాకు తెలిసిన తెలుగులో రాసుకున్నది నా బ్లాగులో పెట్టుకుంటున్నాను . ఇందులో కాపిరైట్ సమస్యలు రావని అనుకుంటున్నాను.

పూజలేల? అర్చనలేల?

మన మందిరమున వెలసిన ప్రియదేవునికి
ఏ పూజావిధులేలా అర్చనలేలా?

అనంతుడగు స్వామికి కోవెల ఈ చిరు జీవనమే
అభివాదనలొనరిచునులే నా ఊపిరులే!
పదధూళిని కడిగేదో నా కంటను కన్నీరే
పులకింతలు అక్షతలైతే నా వేదన చందనమై
అలరారే!
రాగ భరిత మది ప్రమిదను వెలిగించితినే
కనుచూపుల కలువపూలు అర్పించితినే!
సుగంధముల నా స్పందనలే ధూపాలే
అధరాంకిత జప తాళమునకు కనురెప్పల నటనాలే!
- లక్ష్మీదేవి.

స్వామి అనంతుడైనా నేను శీఘ్ర గతిని అంతమయ్యే జీవనాన్ని మాత్రమే నేను కోవెలగా చేయగలనని,ప్రమిదలో నూనె కు బదులు అనురాగాన్ని నింపానని చెప్పడం ప్రతి పదమూ చాలా చక్కటి అనుభూతి తో రాశారనిపిస్తోంది.

29, జనవరి 2009, గురువారం

సంస్కృతంలో...రాశానోచ్!(తెలుగు లో కూడా చదవండి)

माधव प्रियं मालवी मल्लेश्वरम्
मया मानस गृहेसदा पूजितं|
मनमंदिरम् य: कुर्वन्ति दर्शनीयं

मनसा स्मरामि तं सुमनोहरं ||

ఇప్పుడు ఇదే తెలుగు లో .. .చిత్తగించండి.

మాధవ ప్రియమ్ మాళవీ మల్లేశ్వరం
మయా మానస గృహే సదా పూజితం|
మనమందిరం య: కుర్వన్తి దర్శనీయమ్
మనసా స్మరామి తం సుమనోహరం
-
లక్ష్మీదేవి.


కొంత సందిగ్ధత వల్ల కొంచెం మార్చాను.

24, జనవరి 2009, శనివారం

వికటకవి ...లాగా...

భాష మీద పట్టు ఉన్నవాళ్లు ఎలా అయినా పద్యాలు రాసి చమత్కారాలు చేయగలరు.
జుట్టున్నమ్మ లాంటి కొప్పయినా కట్టగలదన్నట్టు..
వాళ్లు ఎలా రాయగలరో గాని చదివి అర్థం చేసుకోవడానికే మనకు నిఘంటువు కావలసి వస్తుంది. ఇంతకీ తెలుగు-తెలుగు నిఘంటువు అంతర్జాలంలో దొరుకుతుంది -- telugunighntuvu.org
ఇక
ఇప్పుడు నేను పారిజాతాపహరణం లోని రెండు పద్యాలని ఇక్కడ రాయబోతున్నాను. నంది తిమ్మన గారు శ్రీ కృష్ణున్ని వర్ణిస్తూ రాసిన పద్యాలివి. బహుశా అందరికీ ఇవి తెలిసిన వై ఉండవచ్చును. కాని వీటిని నాకోసం పరిరక్షించుకోవడం కోసం రాసుకుంటున్నాను.
మొదటి పద్యం లో మొదటి అక్షరం నుంచి చివరికి, చివరి అక్షరం నుంచి మొదటికి అక్షరాల క్రమం ఒకేలా ఉంటుంది.

నాయసరగసార విరయ
తాయన జయసార సుభగధర ధీనియతా
తాయనిధీ రధగభసుర
సాయజనయ తాయరవిరసాగర సయనా

రెండవ పద్యం లో ఎ పాదానికి ఆ పాదానికి ఆ పాదం అట్నుంచి చదివినా ,ఇట్నుంచి చదివినా ఒకేలా ఉంటుంది.

ధీరవయనీయవరధీ
మారవిభానుమత మమత మనుభావిరమా
సారసవననవసరసా
దారద సమతారహార తామసదరదా

భలే గమ్మత్తుగా ఉన్నాయికదూ!

ఇకపోతే అసలు సంగతేమిటంటే వీటికి అర్థం, భావం తెలీవు. ఎక్కడో క్విజ్ లాగా ఇస్తే రాసిపెట్టుకున్నాను. విజ్ఞులెవరికైనా అర్థం తెలిస్తే వివరింప ప్రార్థన.

22, జనవరి 2009, గురువారం

వ్రతమూ-మనమూ

మససులో మాట సుజాత గారు రాసిన వ్రతము గురించి టపా చదివాక వ్యాఖ్య రాయబోతే అదే పెద్ద టపా అయింది. అందుకే నా బ్లాగులోనే రాస్తున్నాను.

చాలామంది వ్రతాల అనుభవాలు ఇలాగే ఉంటున్నప్పుడు మనం కొత్తగా ఒక ప్రయోగం చేద్దామనిపిస్తుంది. ఏంటంటే పూజ అంతా అయ్యాక కథలు మనం తలా ఒక కథ చెప్తే ఏం? ఎలాగు అన్ని కథలు మనకు తెలిసినవే కదా! పిల్లలకు తెలిస్తే వాళ్లు చెపితే ఇంకా బాగుంటుంది కదా!

మనమూ వ్యావహారిక భాషలో చెప్పడం వల్ల అందరికి చక్కగా అర్థం కూడా అవుతుంది. ఏమంటారు? ఎందుకంటే రుద్రాభిషేకాలు, మిగిలిన పూజల కన్నా ఈ సత్యనారాయణ వ్రతం ఎంతో సులభంగా చేసుకోగలిగేది. ఎంతో గొప్పదైన ఈ వ్రతము చేసుకున్నప్పుడు మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా అవుతుంది. ఇలాంటి గోప్పవ్రతమును ఇలాంటి చిన్న కారణాలవల్ల మనమూ ఆసక్తి ని కోల్పోకూడదని నా ప్రయత్నం.

ఒకవేళ పిల్లలు కథ పూర్తి గా చెప్పలేని పక్షంలో కథ మనం చెబుతూ వాళ్ళని చిన్న చిన్న ప్రశ్నలు వేయవచ్చును.
లేదా కథలో పాత్రల పేర్లు అడుగుతూ కథని కొంచెం ఆసక్తి కరంగా చేయవచ్చును. ఎప్పుడైనా అందరు కలిసి చేసినప్పుడే ఎ పనైనా విసుగు రాకుండా ఉంటుంది.

ఇంకో విషయం ఏమిటంటే మనముఎవరింటికైనా వెళితే వాళ్లు ఆహారపానీయాలు అందించి సంతోషిస్తారు. మనము వద్దంటే ఎంతో బాధ పడతారు. మనము కూడా వాళ్ళను బాధపెట్టకూడదని కొంచెం ఆలస్యమవుతుందని తెలిసినా వేచివుండి వారి ఆతిథ్యము తీసుకుని మరీ వస్తాము.( బహుశా ఈ పరిస్థితి ఏదో ఒకరోజు అందరికి ఎదురయ్యే ). అలాగే

మనము దేవుని ముంగిటిలో కెళ్ళి ప్రసాదం ఆలస్యమవుతుందనుకుంటే ఎట్లా?
ఏదో నాకు తోచింది రాశాను తప్పులుంటే విజ్ఞులు దిద్దగలరని ఆశిస్తాను.

19, జనవరి 2009, సోమవారం

ఎంత భాగ్య శాలివో..

నాకు తెలిసిన ఒక కన్నడ పాటని నాకు తెలిసినట్లు తెలుగులో రాసుకున్నాను.

ఎంత భాగ్యశాలివో ఎట్టి పుణ్యమో
ప్రాణనాథుఁ ప్రేమమీర సేవించే శ్రీదేవీ "ఎంత"
కోటి కోటి భక్త జనులు స్వామి సేవకు వేచివున్నా
సాటిలేని భక్తి తోటి నిత్య సేవ చేసేవు  "ఎంత"

సర్వలోకనాథుడైన .....సర్వ వ్యాపి విష్ణు మూర్తి
స్వామి సన్నిధి పొందినావు ధన్య వైతి వమ్మ నీవు "ఎంత"
గరుడ గమనుడైన వాడు చిత్త చోరుడైన వాడు
భక్త సులభుడైన  స్వామి మదిని నిలుచు నీవు  "ఎంత"
 
-లక్ష్మీదేవి.

15, జనవరి 2009, గురువారం

సందేహం

మిత్రులందరికీ నమస్కారం! నేను ఇంతవరకూ రాసినవన్నీ నా సొంత బుర్రలో పుట్టినవే. దేనికీ అనువాదం కాదు.సేకరించినవి కాదు. మరి ఈ నా బ్లాగుని ఎందుకు సేకరణలు విభాగంలో చేర్చారో తెలీదు. ఈ సందేహాన్ని మనమిత్రులెవరైనా తీరిస్తే సంతోషిస్తాను.

12, జనవరి 2009, సోమవారం

పునరపి జననం-2

చరాచర జగత్తులో ఉండే ఎన్నో వస్తువుల మీద ఆశ, వాటినన్నింటినీ పొందాలనే ఆశ, పొందేవరకూ జీవించాలనే ఆశ, ఎప్పటికీ జీవించాలనే ఆశ, తన బాధ్యతలు తీరేవరకూ ఉండాలనే ఆశ ..... ఎందుకీ ఆశలు?  

ఆశ మీద అసలు ఆశ ఎందుకు?  
బుద్ధ భగవానుడు  
అన్ని దుఖాలకు కోరికలే మూలం  
అని చెప్పాడు.

కోరికలు , ఆశలు లేకపోతే దు:ఖాలే ఉండవు.
దు:ఖం ఉండకూడనేదీ (సుఖం ఉండాలనే కదా తాత్పర్యం) ఆశే. సుఖ దు:ఖాలను సమానంగా , చేదుని తీపిని ఒకే రకంగా ఆస్వాదించడం మనకు ఎప్పుడు వంటబడుతుంది? చేదు మీద, తీపి మీద, సుఖం మీద, దు:ఖం మీద ఆశ పోయినప్పుడు.

ఆశ లేకపోవడం అంటే ఏమిటొ చిన్నప్పుడు అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు చక్కగా అర్థం అవుతూంది మంచి జరిగితే సరే, చెడు జరిగితే సరే ఏదైనా ఒకే రకంగా తీసుకోవడం కొంచెం కొంచెంగా అలవాటు అవుతూంది. మనము నిమిత్తమాత్రులమని జరిగేది జరగక మానదని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వ్రాసే కలానికి మనం ఏం వ్రాశామో తెలిసే అవకాశం లేదు. అవసరమూ లేదు. ఏ ప్రభావమూ ఉండదు. కాని మనకు ఈ అవసరం ఉంది. ఇదేవిధంగా మనకు, మనచుట్టూ జరిగే విషయాల మీద నియంత్రణ ఉండదని మనము అర్థం చేసుకోవాలి.మనం నిమిత్తమాత్రులమని అర్థం చేసుకోవాలి.
 
ఈ దేహం లోకి మనం రావటం, వెళ్ళిపోవటం కూడా మన ప్రమేయం లేకుండా జరిగినప్పుడు అర్థం కాదా మనము నిమిత్తమాత్రులమని. మనము వేరని దేహము వేరని అర్థం చేసుకోవాలి. మనది కాని దేహం మీద మన ప్రమేయం లేకుండా జరిగే ఈ ప్రపంచపు ఘటనల మీద ఆసక్తిని వదలాలని గుర్తించిన నాడు ఈ జర్జర దేహాన్ని వదిలేందుకు ఎటువంటి దు:ఖమూ మనల్ని బాధించే అవకాశము లేదు.

10, జనవరి 2009, శనివారం

సరస్వతీ నమస్తుభ్యం!


9, జనవరి 2009, శుక్రవారం

పునరపి జననం-1


పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం

ఆది శంకరాచార్యులవారు చెప్పిన ఈమాటలో ఎంత అర్థం ఉందో!
మళ్ళీ పుట్టుక మళ్ళీ చావుమళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, మళ్ళీ తల్లి కడుపులో శయనం. ఇది ఒక చక్రం. తిరుగుతూనే ఉండాలి.
లేకపోతే సృష్టి క్రమం ఆగిపొతుంది.

ఇవన్నీ నేను కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతాలు కావని నాకూ తెలుసు. అందరికీ తెలిసినవేనని తెలుసు.

అయినా తమకు చావు వస్తుందేమోనని ఎందుకూ భయపడటం?

మాకు తెలిసినావిడ 102 ఏళ్ళ వయసులో నిన్ననే పొయారు.

సుమారు ఐదారేళ్ళుగా తానెవరో ఎదుటివాళ్ళెవరో తెలీకుండా, కొడుకు కలిపి నొట్లొ పెడితే అర ఇడ్లీ లేదా అంత కొంచెం ఆహారం మాత్రమే తినగలుగుతూ మంచంలో ఉన్నావిడ. ఆవిడ పోతే పాపం ఇన్నేళ్ళకు ఆ ఆత్మ కు విముక్తి లభించింది అనిపించింది.

ఈ జర్జర దేహాన్ని వదిలి హాయిగా అనంత లోకాల్లో కలిసిపోయింది.

ఇది జర్జర దేహమే అని తెలిసినప్పుడు ఎప్పుడు పోతే ఏం?

చక్కటి ఆరోగ్యంతో నవనవలాడుతూ బంతిపూవులా ఉన్నప్పుడు ఏ హార్ట్ ఎటాక్ తోనో, ఏ ప్రమాదంలోనో పోతే మిగిలిన వాళ్ళంతా అయ్యో పాపం అని ఎందుకంటారు? కాళ్ళు చేతులు విరిగితేనో,కళ్ళు పోతేనో,నయం కాని దీర్ఘ వ్యాధి బారిన పడితేనో సంతాపం, సానుభూతి కలిగితే సరే కాని మరణిస్తే ఎందుకు సానుభూతి?

ఈ లోకంలో
అసూయా ద్వేషాల పంకిలంలో
కామక్రోధాగ్నిలో
కష్టనష్టాల సుడిగుండంలో

పడి కొట్టుకుంటూ ఉండటం కన్న మరణం భయంకరమైనదా? ఎంత మాత్రం కాదు. అది ఒక ఆత్మకు విముక్తి. జర్జర దేహం ఎప్పుడు వదిలేసినా ఒకటే

మంచి పండు రాలి పడితే కొన్ని మొక్కలు మొలకెత్తుతాయి.

దెబ్బతిన్న, కుళ్ళిపోయిన పండైతే నేల సారవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.అంతే తేడా.

ఏదో నాకు తోచింది చెప్పాను. తప్పులుంటే విజ్ఞులు దిద్దవలసిందిగా వేడుకోలు.

4, జనవరి 2009, ఆదివారం

మొదటి టపా గురించి

మా ఇంటి దైవం మాళవీమల్లేశ్వరులు అందుకేమాళవీ స్తుతి ఇంటిభాష కన్నడలోరాసింది అలాగేటపాగాజత చేశాను.కన్నడలో దేవుని పాటలు మాత్రమే ప్రయత్నిస్తుంటాను. తెలుగులో అన్నీ రాసేస్తుంటాను(సొంత డబ్బా) హి..హి..హి.. చదివే వాళ్ళ ఖర్మ ఏమో కానీ రాసినప్పుడు నాకు కలిగే తృప్తి ఉంది చూశారూ, అది సాటి లేనిది. త్వరలో నా పెన్సిల్ స్కెచెస్ కూడా అతికించబొతున్నాను. కాచుకోండి!!