Loading...

23, ఏప్రిల్ 2009, గురువారం

జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


1. దేవకీ సుతుడై ధరకేతెంచి
వసుదేవునికి ముక్తిని గూర్చి
నదిమధ్యమునే బాటలు వేసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

2. వెన్నకు మన్నుకు భేదము గానక
తల్లి యశోదకు వింతలు చూపగ
నందుని కులదీపకుడై వెలసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


3.వేణుగానమున మైమరిపించి
గోలోకమునే మురిపించితివి
గోజను( గావగ గిరిధరియించిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

4.మాయలమామను కంసుని జంపి
తల్లిని తండ్రిని చెర విడిపించి
మధురకు తాతను రాజుగ చేసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


5.నీలమాధవు రూపము దాల్చి
సుభద్రయు బలభద్రుని తోడ
పూరీ సాగరతీరాన వెలసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

6.అసురుల బాపగ దీనుల గావగ
అవతారమునే దాల్చితివి
అవనికి భారము దింపేవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

7. అనురాగానికి అధిపతివై
అష్టభార్యల ప్రేమను పొంది
లీలలు ఎన్నో చూపినవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

8.సూత్రధారివీ రాయబారివీ
రథసారధివై రణమునకేగి
గీతార్థమునే తెలిపినవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

9.ముద్దూ మురిపెము రేపల్లియకు
కేళీ విలాసం బృందావనికీ
కర్ణామృతమును భువికొసంగిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!
- లక్ష్మీదేవి.

2 కామెంట్‌లు: