Loading...

12, జనవరి 2009, సోమవారం

పునరపి జననం-2

చరాచర జగత్తులో ఉండే ఎన్నో వస్తువుల మీద ఆశ, వాటినన్నింటినీ పొందాలనే ఆశ, పొందేవరకూ జీవించాలనే ఆశ, ఎప్పటికీ జీవించాలనే ఆశ, తన బాధ్యతలు తీరేవరకూ ఉండాలనే ఆశ ..... ఎందుకీ ఆశలు?  

ఆశ మీద అసలు ఆశ ఎందుకు?  
బుద్ధ భగవానుడు  
అన్ని దుఖాలకు కోరికలే మూలం  
అని చెప్పాడు.

కోరికలు , ఆశలు లేకపోతే దు:ఖాలే ఉండవు.
దు:ఖం ఉండకూడనేదీ (సుఖం ఉండాలనే కదా తాత్పర్యం) ఆశే. సుఖ దు:ఖాలను సమానంగా , చేదుని తీపిని ఒకే రకంగా ఆస్వాదించడం మనకు ఎప్పుడు వంటబడుతుంది? చేదు మీద, తీపి మీద, సుఖం మీద, దు:ఖం మీద ఆశ పోయినప్పుడు.

ఆశ లేకపోవడం అంటే ఏమిటొ చిన్నప్పుడు అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు చక్కగా అర్థం అవుతూంది మంచి జరిగితే సరే, చెడు జరిగితే సరే ఏదైనా ఒకే రకంగా తీసుకోవడం కొంచెం కొంచెంగా అలవాటు అవుతూంది. మనము నిమిత్తమాత్రులమని జరిగేది జరగక మానదని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వ్రాసే కలానికి మనం ఏం వ్రాశామో తెలిసే అవకాశం లేదు. అవసరమూ లేదు. ఏ ప్రభావమూ ఉండదు. కాని మనకు ఈ అవసరం ఉంది. ఇదేవిధంగా మనకు, మనచుట్టూ జరిగే విషయాల మీద నియంత్రణ ఉండదని మనము అర్థం చేసుకోవాలి.మనం నిమిత్తమాత్రులమని అర్థం చేసుకోవాలి.
 
ఈ దేహం లోకి మనం రావటం, వెళ్ళిపోవటం కూడా మన ప్రమేయం లేకుండా జరిగినప్పుడు అర్థం కాదా మనము నిమిత్తమాత్రులమని. మనము వేరని దేహము వేరని అర్థం చేసుకోవాలి. మనది కాని దేహం మీద మన ప్రమేయం లేకుండా జరిగే ఈ ప్రపంచపు ఘటనల మీద ఆసక్తిని వదలాలని గుర్తించిన నాడు ఈ జర్జర దేహాన్ని వదిలేందుకు ఎటువంటి దు:ఖమూ మనల్ని బాధించే అవకాశము లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి