Loading...

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సర్వ ప్రాణి సమభావం

కొంతమంది చిలుకలను, కుందేళ్ళను, కుక్కలను పెంచుతుంటారు. అంతెందుకు, పంట, పాడి కోసం ఇంట్లో పశువులను పెంచే వేల కుటుంబాల్లో మాదీ ఒకటిగా ఉండింది.

వాటిలాగే సాలీళ్ళు, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు, అందులు, పురుగులు, పాములు అవీ ప్రాణులేగా! కానీవాటిని చూస్తే భయం, ఓ విధమైన ఏవగింపు అనే భావం నుంచి తప్పించుకోలేకపోతున్నాను. సర్వధర్మ సమభావం లాగే సర్వప్రాణి కోటి పట్ల సమభావం పెంచుకోవాలనేది చాలా ఉన్నతమైన ఆలోచన. ఎన్నో మంచి పుస్తకాల్లో వాటి గురించి చదువుతుంటాము. కానీ ఆచరణలో పెట్టటానికి కష్టపడే నా లాంటి వాళ్ళెంతమందో!

మా అబ్బాయికి కూడా వాడితరం వాళ్ళందరి లాగే స్పైడర్ మాన్, హారీ పోటర్ అంటే ఎంతో ఇష్టం. వాడికి ఆ పుస్తకాలు, సీడిలు నేనే వెదికి కొని బహుమతిగా ఇస్తాను. కానీ నేను చదవలేను, చూడలేను.

ప్రపంచంలో అన్నీ అందమైన సీతాకోకచిలుకలు, పూలు,చెట్లూ మాత్రమే ఉండవు. అవి వున్నట్లే ఇవీ ఉంటాయి. అలా అయిష్టం చూపకూడదని అన్నాడు వాడు. చెంప ఛెళ్ళుమన్నట్టయింది. ఎన్నోసందర్భాల్లో ఎన్నో మంచివిషయాలు నేను ఆచరిస్తూ వాడికి నేర్పాను. కానీ ఈ విషయంలో ఇంత గొప్ప విషయంలో వాడు నాకు నేర్పగలుగుతున్నాడు. కానీ నేను నేర్చుకోగలనా? ఎప్పటికయినా?

మన పెద్దలు, గురువులు, మునులు , దేవుడు కూడా చెప్పిన సత్యమది. ఎంతో సాధారణంగా చెప్పేశాడు.
మరి నేనెందుకిలా ఉన్నాను?

౧. భగవంతుడు కూడా దుష్ట సంహారం చేయవలసి వచ్చినపుడు, తెలిసి తప్పు చేసే మూర్ఖులకు గుణపాఠం చెప్పాల్సినపుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అనే అవతారాల్లో జంతు రూపానికి ప్రాధాన్యత నిచ్చాడు.

౨. కంచిలో బంగారు బల్లిని స్పర్శిస్తే గానీ కంచి యాత్ర పూర్తి గాదు.

౩. రాజస్థాన్ లోని ఒక దేవాలయంలో ఎలుకలకి ఉన్న ప్రాముఖ్యత గురించి విన్నాను.

౪.ఇక క్రమం తప్పకుండా నాగుల చవితి చేసి వెండి పాము కు పాలు పోసి పూజిస్తాము. (ఊళ్ళో ఉన్నప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి వచ్చేవాళ్ళము.)

ఇక ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఈవిల్ పవర్స్ ని ఎదుర్కోవడానికి సాలీడు, కోడిపుంజు (స్పైడర్ మాన్, మల్లన్న) రూపాల్తో హీరోలు వచ్చినట్టు కథలు రాసి ప్రజాదరణ పొందుతున్నారు.

మరి నేనెందుకిలా ఉన్నాను?

మనుషుల్లో నచ్చినవారిని, నచ్చనివారిని ఒకేరకంగా చూడాలనే భావాలు అలవర్చుకోగలిగినపుడు సర్వప్రాణిసమభావం మాత్రం రావటం లేదేం?

ప్రతి ఒక్క ప్రాణీ పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేవే అని తెలుసు.
మనిషే ప్రతి ప్ర్రాణి వల్ల ఏదోవిధంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనం పొందుతున్నాడు అని తెలుసు.
మనిషి వల్ల పర్యావరణానికి గానీ ఏ ఇతర ప్రాణికి గానీ కష్టం, నష్టం తప్ప ఉపయోగం లేదనీ తెలుసు.
మనం వాటికేమీ చెయ్యక్ఖర్లేదు. కనీసం ఈ అయిష్టం మాత్రం పోగొట్టుకుంటే చాలు.

అన్ని ప్రాణుల్లోనూ ఉండేది ఆత్మ. ఆత్మకు ఎటువంటి వివక్ష లేదంటారు. అన్ని ప్రాణుల్లోనూ మనలో ఉండే ఆత్మ ఉంటుందంటారు. మనుషులే కాకుండా మిగిలిన జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు అన్నింటినీ ఒకేరకంగా చూడగలగడం నిజంగా గొప్ప విషయం.

9 కామెంట్‌లు:

  1. శ్రీ భగవద్గీత లో చెప్పినట్లు "విద్యావినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణునియందు,చండాలునియందు,ఆవు,కుక్క,ఏనుగు అన్నిటియందు ఒకే దృష్టి కలిగిఉంటాడు".విచిత్రమేమో మీ టపా చదువుతుంటే నాలో ఆధ్యాత్మికంగా భావనలు చాలా కలిగాయి.

    రిప్లయితొలగించండి
  2. ""ప్రపంచంలో అన్నీ అందమైన సీతాకోకచిలుకలు, పూలు,చెట్లూ మాత్రమే ఉండవు. అవి వున్నట్లే ఇవీ ఉంటాయి. అలా అయిష్టం చూపకూడదని అన్నాడు వాడు"".చాలాబాగా చెప్పాడు మీవాడు.మంచి పరిణతి కలిగిన మాటలు.

    రిప్లయితొలగించండి
  3. పరాయి వాళ్లయినా కాస్త చదువుకున్న వాళ్లు ఎండ వేళ వచ్చి మంచినీళ్లు అడిగితే రండి లోపలికి వచ్చి కూర్చుని తాగండి అంటాము.

    అదే బిచ్చగాడు వచ్చి అడిగితే బయట ఎండలోనే నుంచో పెట్టి నీళ్లిస్తాము.

    మనుషులందరూ ఒకటే కదా..? మరి బిచ్చగాళ్లని ఇంట్లోకి రానీయమెందుకు?

    గుడి బయట ఉండే రయిని ఎక్కి తొక్కు తాము. మరి గుడిలో అదే రాయికి మొక్కుతాము. రెండూ రాళ్లే కదా....?

    కృష్ణుడు కూడా రాయబారానికి వెళ్లి నప్పుడు దుర్యోధనుడి ఇంట భోజనం చేయనంటాడు.

    దానం చేసేటప్పుడు కూడా పాత్రాపాత్రత ఎరిగి దానం చేయాలని పెద్దలంటారు.

    ఎప్పుడు ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అలాఅని మనం ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువా చూడమని కాదు. అలా చూస్తే అది తప్పు.

    తన, పర బేధం ఉండ కూడదు. అలా అని దొంగకి ఇల్లప్పగించ కూడదు. రెండూ ఏది ఎప్పుడు ఎంత పాఠించాలో అంతే అలానే పాఠించలి. అదే మీరు చేస్తున్నది. అందులో తప్పులేదని నా భావన. చాలా రాయాలి కానీ ఇప్పటికి ఇంతే.... :)

    ధన్యవాదాలు. :)

    రిప్లయితొలగించండి
  4. మీరు చెప్పింది అక్షర సత్యం కానీ ...కొన్ని ప్రాణుల పట్ల భయాన్ని , జుగుప్సనూ పోగొట్టుకోవడం అంత తేలిక కాదు కానీ ప్రయత్నం చేయొచ్చు . మీ బాబుకి అభినందనలు !

    రిప్లయితొలగించండి
  5. @విశ్వప్రేమికుడు
    మీరు చెప్పిందీ నిజమే>
    అందుకే కాబోలు పుణ్యం చేస్తేనే ఉన్నతమైన జన్మలు కలుగుతాయని అంటారు.

    రిప్లయితొలగించండి
  6. పరిమళ గారూ!
    అవునండీ,చాలా కష్టమండీ!
    మీకూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. హేయ్!! మందాకినీ మీ ఆర్టికల్ చాలా బాగుంది:)
    మీరన్నది నిజమే బొద్దింకల్ని నిర్ధక్ష్యంగా చంపేస్తాం
    "బేగాన్" వేసి బల్లి ఇంకా ఇలాంటి పురుగుల్ని అటు ఇటు చూడకుండగ
    కాని మీ అబ్బాయిలా అందరూ వుండరనుకొంటా...
    మా అమ్మాయికి బొద్దింక,బల్లి,ఇలాంటివన్నా
    చాలా భయం "అమ్మా... బొద్దింక వచ్చిందే...
    బేగాన్ తీసుకొని రా" అని గావుకేకలేస్తుంది:)
    అందరికీ ఇలా సున్నితంగా అన్నీ సమానమే
    అనుకొనే మనసు భగవంతుడు ఇచ్చిన వరం
    అంటాను ఏమంటావు మందాకినీ ? :)

    రిప్లయితొలగించండి
  8. శక్తీ!
    ముందుగా ధన్యవాదాలు.
    వరం ఏమో గానీ ఎంతో కష్టమంటాను.

    రిప్లయితొలగించండి