Loading...

3, జూన్ 2009, బుధవారం

భగవద్గీత

భగవద్గీత ప్రపంచంలోని అన్ని వ్యక్తిత్వ వికాస గ్రంధాల్లోకీ గొప్పదని నాకూ అనిపిస్తుంది. ఈ విషయం యండమూరి గారు చెప్పగా విన్నట్లు గుర్తు. మా చిన్నప్పుడు మా తాతగారు ఇంటి బయట అరుగు మీద కూర్చుని ప్రతిరోజూ శ్రావ్యంగా గీతా గానం చేసేవారు. వెళ్తూ వస్తూ వుంటున్నప్పుడు అందులోని శబ్ద సౌందర్యం నన్ను ఎంతో ఆకర్షించేది.

సర్వాలంకార శోభితమైనట్టి నవ వధువు/వరుడిని చూసినప్పుడు కలిగే నేత్రానందం, ఈ సంస్కృత సబ్ద సౌందర్యంలో ఉందనీ, అది చక్కగా గీతలో కర్ణానందం చేస్తుందని ఒప్పుకోని వాళ్ళెవరు చెప్పండి?

నేను ఆరవ తరగతి చదివేప్పుడనుకుంటా మా వూళ్ళో విశ్వహిందూ పరిషద్ వాళ్ళు భగవద్గీతా పఠనం పోటీలు పెట్టారు 18 శ్లోకాల్ని ఎన్నిక చేసి ఇచ్చారు. అందులో నేను మొదటి బహుమతి గెల్చుకున్నాను. అంగ్ల-తెలుగు చిన్న నిఘంటువు నొకదాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. అది ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.

తర్వాత వాళ్ళు మరిన్ని శ్లోకాల్ని ఎన్నిక చేసిచ్చి మళ్ళీ వచ్చి పోటీ పెడతామన్నారు కానీ రానేలేదు. కాకపోతే అందుకు నేను మా తాతగారి దగ్గర నేర్చుకున్న ఒక శ్లోకం నాకెంతగానో నచ్చి ఇప్ప్పటికీ గుర్తుండిపోయింది. తలుచుకున్నప్పుడు నేనేం చేస్తున్నా మొత్తం శ్లోకం అలా పెదాలమీద దొర్లిపోతుంది.

మత్కర్మకృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జిత:
నిర్వైర స్సర్వభూతేషు యస్సమా మేతి పాండవ!

తాత్పర్యం ఇలా ఉంది.
ఓ అర్జునా! ఎవడు కేవలం నా కొరకే సకల కర్తవ్య కర్మల జేయుచున్నాడో, మత్పరాయణుడో, ఆసక్తిరహితుడో సకల ప్రాణులయందు వైర భావము లేక యుండునో, అట్టి అనన్య భక్తులైన వారు నన్నే పొందుచున్నారు.

ఈ శ్లోకము భగద్గీత లోని 11 వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగములోని చివరిది.
ఇలాంటి శ్లోకాల్ని వినిపించటానికో వీటి గొప్పదనం తెలపటానికో ఇప్పటి తాతయ్యలకు అవకాశము లేదు. ఎందుకంటారా? కొంతమంది వృద్ధాశ్రమాల్లో వదలి వేయబడి వుంటారు. మరికొందరికి స్వయంగా ఆసక్తి ఉండక ఏ టి వి సీరియల్స్ చూడ్డమో, సినిమాలు చూడ్డమో చేస్తుంటారు.

ఇంకొంతమందికి ఇయర్ ఫోన్లు, సెల్ ఫోన్లు చెవులకు తగిలించుకుని ఏమాత్రం పలకరించినా కసురుకునే పిల్లల్ని చూస్తే భయం.

ఫలితాన్ని ఆశించకుండా పనిలో పూర్తి సామర్థ్యాన్ని చూపించమని సలహా ఇచ్చే,
పోరాటం అంటూ దిగాక తన పర భేదం వద్దని బోధించే,
మొదలెట్టిన ఏ పనినైనా ముగించకుండా వదలొద్దనే ,
ఇంకా ఎన్నెన్నో చెప్పే గీత కన్నా ఎక్కువగా వ్యక్తిత్వ వికాస గ్రంధాలు కానీ, కోచింగ్ సెంటర్లు గానీ ఏం చెపుతారబ్బా?

9 కామెంట్‌లు:

  1. భగవద్గీత భట్టీవేస్తే వ్యక్తిత్వ వికాసం రాదు. అందులోని అర్థాల్ని జీవితానికి అన్వయించుకుంటే వికాసం కలుగుతుంది. యండమూరి తన విజయానికి ఐదుమెట్లు ముందుమాటలో చెప్పింది అదే.

    రిప్లయితొలగించండి
  2. తినగ తినగ వేము తీయనన్నట్లు, వినగ వినగ, నిత్యం పారాయణం చేయగా చేయగా భగవద్గీత కర్ణామృతమే.ప్రతిశ్లోకాన్ని చదువుతూ,దాని అర్థాన్ని తెలుసుకుని ఆ సారాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే వ్యక్తిత్వ వికాస గ్రంధాలతో మనకవసరమేలేదు కదా! మన జీవితానికి చక్కని మార్గం చూపిస్తాడు కృష్ణభగవానుడు.

    రిప్లయితొలగించండి
  3. తాతయ్య, నాయనమ్మ ఒళ్లో కూర్చుని నేర్చుకోవలసిన విషయాలని వ్యక్తిత్వ వికాసం సెంటర్ల వాళ్లకి ఫీజులు కట్టి నేర్చుకుంటున్నారండి పిల్లలు..బాగుంది టపా..

    రిప్లయితొలగించండి
  4. @ మహేష్ కుమార్: చిన్నప్పుడు కంఠతా చేయడమే కర్తవ్యమని నా ఉద్దేశ్యం. బుద్ధికుశలత ఎరిగేకొద్దీ సరిగ్గా అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకోవాలి. నేనూ అదే చెప్పాను, (ధర్మ)పోరాటంలో తన పర చూడకూడదనీ,పని మొదలెట్టాక ఆపకూడదనీ, ఫలితం మీద దృష్టి పెట్టకుండా పూర్తి సామర్థ్యంతో పని చేయాలనీను. పోరాటమైతే నేనేమీ చేయలేదు కానీ మిగతా రెండూ నేను చక్కగా అర్థం చేసుకుని పాటిస్తున్నాను కాబట్టే రాశాను.
    భగవద్గీతలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  5. @విజయమోహన్: అదే నేనూ చెప్పదలుచుకున్నది.మనం మన పెద్దవాళ్ళ ద్వారా పొందిన ఈ సౌకర్యాన్ని మన తర్వాతి తరానికి అందించగలగాలి. మీరన్నట్టు వింటూ ఉంటేనే కదా వాళ్ళకు తెలిసేది అని నా బాధ.

    రిప్లయితొలగించండి
  6. @విజయమోహన్: అదే నేనూ చెప్పదలుచుకున్నది.మనం మన పెద్దవాళ్ళ ద్వారా పొందిన ఈ సౌకర్యాన్ని మన తర్వాతి తరానికి అందించగలగాలి. మీరన్నట్టు వింటూ ఉంటేనే కదా వాళ్ళకు తెలిసేది అని నా బాధ.

    రిప్లయితొలగించండి
  7. టెక్నాలజీ ....పిల్లలను మానసిక బంధాలనుండి దూరం చేస్తోంది . మురళి గారన్నట్టు ఫీజులు కట్టి నేర్చుకుంటేనే కానీ అమ్మమ్మో ...అమ్మో చెబితే చాదస్తంగా కొట్టిపడేస్తారిప్పటి పిల్లలు . మంచి టపా !

    రిప్లయితొలగించండి
  8. @ మురళి: ధన్యవాదాలండి. ఇంట్లో ఉండే వాళ్ళతో కలిసి ఇంటి పనులు, బయటి అనులు చూసేటప్పుడు టీం వర్క్, బంధువుల వలన పి ఆర్ స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  9. పరిమళ గారూ! ధన్యవాదాలు.నిజమేనండి, పిల్లలు చాదస్తమని కొట్టి పడెస్తారు, అంతే కాదు, కొందరు పెద్దలు కూడా మా పిల్లలకు ఈ చాదస్తపు మాటలు నేర్పమంటూ కార్పొరేట్ సంస్థలకు ఫీజులు కట్టడానికి మాత్రం తయారుగా ఉంటారు.

    రిప్లయితొలగించండి