Loading...

8, డిసెంబర్ 2010, బుధవారం

రూపం, రంగు లేనిది...

అందరిలో ఉండే ఆత్మ ఒకటే అంటుంటారు. అది ఎలా ? మంచివాళ్ళు, చెడ్డవాళ్లు; స్వార్థపరులు, పరోపకారులు; మొత్తానికి ఉన్నత గుణాలున్నవారు, లేనివారు అందరిలో ఒకే ఆత్మ ఎలా ఉంటుంది?

మనిషి తయారుచేసే కరెంట్ ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుందా,పెద్దగా ఉంటుందా; బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా; వెలుగునిస్తుందా, మనిషిని కాల్చేస్తుందా? వీటికి జవాబులు చిన్నా, పెద్దా అందరికీ తెలుసు. అలాగే ఆత్మ- రూపం, రంగు లేనిది. ఇంకే వికారమూ లేనిది.ఆత్మ శక్తిస్వరూపము. పరమాత్మగా ఉన్నపుడు అది భగవంతునితో సమానమైనది.

లోకంలోని మనుష్యుల, పశువుల ,పక్షుల శరీరాలు ధరించినపుడు అది జీవాత్మ అవుతుంది. పాంచభౌతికమైన ఈ శరీరాలవలన అది అంటే ఆత్మ అన్ని రకాల వికారాలకు లోనవుతుంది. పాంచభౌతికమైన అంటే భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు వీటితో రూపొందిన ఈ దేహాలు. ఈ దేహధర్మమే తన ధర్మమనుకుంటూ ఆత్మ తన అసలు స్వరూపాన్ని, స్వభావాన్ని వదిలేస్తుంది. ఈ దేహాన్ని వదిలినపుడే తిరిగి పరమాత్మలో కలిసిపోతుంది. అపుడు ఇక ఏ వికారాలూ ఉండవు.

ఎలాగంటే కరెంట్ ని బల్బ్ లో ప్రవేశపెట్టినపుడు కొద్ది వెలుగునిస్తుంది. ట్యూబ్ లో ఎక్కువ వెలుగు నిస్తుంది. కొందరు పుణ్యాత్ములు మనకు తమకున్న ఇంత వివేచనా శక్తిని మనకు పంచి పెట్టారుకదా, అంత మనలో లేదు కదా! ఇలాంటి భేదమే అన్నమాట.

మిక్సీలో కరెంట్ ప్రవహించినపుడు శబ్దం వస్తుంది. లైట్ లో శబ్దం ఉండదు. హీటర్ లో వేడి, ఏసి లో చల్లదనం ఇలా పరస్పర విరుద్ధమైన విషయాలలో ఒకే కరెంట్ పని చేస్తుంది. వైద్య విధానాల్లో కూడా పరస్పర విరుద్ధ పనులకు కరెంట్ ని వాడతారనుకుంటాను. నాకు ఆ విషయాలు తెలీవు. మనుష్యులు తయారు చేసిన కరెంట్ ఇలా ఉంటే, సాక్షాత్తూ ఆ దేవదేవుని సృష్టి లో ఎందుకు మంచి ,చెడు ఉన్నాయి. ఆ భగవంతుడు తలచుకుంటే అన్నీ మంచిగా ఉంచలేడా అనే ప్రశ్న లేదు . ఎందుకంటే ఏది మంచి, చెడు అనేది మనం నిర్ణయించలేనిది. అన్నీ భగవంతుని సృష్టి అయినపుడు అన్నీ మంచివే అయి ఉంటాయి.

ప్రతి వస్తువుకూ ఒక విలువ ఉండే ఉంటుంది. చిన్నప్పుడు బళ్ళో మంచి ఉపాధ్యాయులు కూడా ఒకసారి పక్షపాతం వహిస్తున్నారని విద్యార్థులు పొరబడతారు. నిలకడ మీద ఒక్కోసారి నిజం తెలుస్తుంది. అదే విధంగా భగవంతుని లీలావిలాసాలను గ్రహించి అర్థం చేసుకొనేంత జ్ఞానం మనకు ఉండాలి, ఆ స్థాయి రావాలికదా!
అందుకే అందరిలో పరమాత్మను దర్శించమని చెపుతూ ఉంటారు. తరచి తరచి చూస్తే అంతా ఒక్కటే, అన్నింటిలోనూ ఒకే కరెంట్ ఉన్నట్టే అందరిలోనూ ఉండేది ఒకే జీవాత్మ, అదే పరమాత్మ . ఇది అర్థం చేసుకుని, కొందరు యోగులయ్యారు. వాళ్ళు రుచి గురించి ఆలోచించరు. వెన్నని, మన్నుని ఒకే రకంగా చూసే కన్నయ్య వారికి ఆదర్శం. శరీర పోషణ, పరిరక్షణ గురించి లెక్క చేయరు. చలి, ఎండల వలన; ఆకలి,దాహం వలన; నొప్పినీ , సంతోషాన్నీ ఒకే లా భరించగల యోగులయ్యారు.

ఇందులో ఉన్నా ఇది మనం కాదు అని గ్రహించగలుగుతున్నారు. మనకు చెప్పగలుగుతున్నారు. వాళ్లు ఎంత చెప్పినా మనం అర్థం చేసుకోవటం అంత సులభమేంకాదు. దేహాన్ని కాకుండా ఆత్మని పరమాత్మ స్వరూపంగా భావించి ప్రేమించగలిగటం అంత తేలిక కాదు. తననీ , తనకి హాని కలిగించేవారినీ మనం అంటే మనుష్యులు ఒకేలా చూడగలరా? చూడలేరు. చాలా కష్టం. అయితే అసాధ్యం కాదు. కష్టసాధ్యం .

కళ్ళెదురుగా ఎంతెత్తో కనిపిస్తున్నా , కొండని అందరూ ఎక్కలేరు. కొందరికి శరీరం సహకరించదు, ఇంకొందరికి మనసు సహకరించదు. ఒకరు మొదలుపెట్టి ఆపేస్తారు. మరొకరు అబ్బే , ఈ పని మాది కాదు అనుకుంటారు.
కానీ అనుకుంటే నెఱవేఱ్చలేనిది కాదు.అలాగే జీవాత్మలో పరమాత్మని చూడటం కూడా. ఇన్ని రకాల వైవిధ్యాలున్న ఈ లోకంలో ఎలా ఒకే పరమాత్మని సందర్శించగలం? మంచితనంలో , చెడ్డతనంలో ఎలా దైవత్వాన్ని చూడగలం అంటే..
ఎలా రాజు అయినా, పేద అయినా వాడూ మనిషే కదా అని అంటుంటాం కదా; పరమాన్నంలో , గంజిలో ఆకలి తీర్చే ఆహారాన్ని చూడగలుగుతున్నాం కదా;

సంపదలోనూ, పేదరికంలోనూ మనిషిని నడిపేది ఒక నమ్మకమే అని అంటున్నాం కదా; అలాగే అన్నివైరుధ్యాల్లోనూ పరమాత్ముడున్నాడు అనేది.

ఇది మనం గ్రహించగలగాలంటే శ్రమించాలి. డబ్బులున్నాయి, ఆశలున్నాయి అంటే కర్మాగారాల్లో వస్తువులు తయారవ్వవు కదా! శ్రమ కూడా ఉండాలి. అలాగే ఈ విషయాన్నీ మనం అధ్యయనం, అభ్యాసం చేసె శ్రమ తీసుకుంటేనే అర్థం అవుతుంది.

తెలుసుకోగలిగిన నాడు జ్ఞాని అవుతారు. అపుడు మీరు జ్ఞాని అయ్యారా అని ఎద్దేవా చేయబోకండి. తెలుసుకోవటం లో స్థాయీభేదాలు ఉంటాయి కదా! ఊరికే తెలుసుకోవటం కాకుండా అందరూ ఒక్కటే అని అనుభూతి చెందగలగాలి. ఒక విద్యార్థి ఒక జంతువు శరీరంలోని అన్ని భాగాలు తెలుసుకోవచ్చు. కానీ ఒకరి సందేహాలను తీర్చగలిగే స్థాయి అధ్యాపకునికే ఉంటుంది. ఆయా భాగాలు పని ఆపినపుడు ఎలా సరి చెయ్యాలి అని తెలుసుకున్నవాడు వైద్యుడు. సరిచేయటానికి కావలసిన ఔషధాన్ని తయారుచేసే వాడు పరిశోధకుడు. ఒక్కోస్థాయికీ సంకల్పం, శ్రమ ఆ స్థాయికి తగినట్టుగా చేయగలిగితేనే మనం గమ్యం చేరుకోగలం.

ఈవేళ్టికి నా ఆలోచనలు ఇలా సాగాయి. ఇదంతా నీవేమీ కనిపెట్టలేదు, ఎంతోమంది చెప్పారు అంటారా, అవును మరి.
నేనూ ఎంతో మంది చెప్పినవి విన్నాకే నా ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. మళ్ళీ నేనెందుకు చెప్పటం అంటే ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోవటం ఎలా అలాగే నేర్చుకోవాలోఇలాంటి విషయాలు ఆలోచించటం, నలుగురితో పంచుకోవటం కూడా అలాగే అని నేను భావిస్తున్నాను కాబట్టి. ఇందులో తప్పు దొర్ల్లిన యెడల పెద్దలు తెలియచేయగలరని ఆశిస్తున్నాను.

19, ఆగస్టు 2010, గురువారం

జగజ్జనని - 6

జగజ్జనని - 6



పదరజము గైకొని బ్రహ్మ సృష్టిని చేసె
పదములే శరణందు నను గన్న తల్లీ!
పదములూ నేర్పించి నా చేత రాయించి
పదపూజ చేయగా దీవించు తల్లీ!
- లక్ష్మీదేవి
 అమ్మా, నీ పదరజము గైకొని బ్రహ్మ సృష్టిని చేశాడు. అట్టి నీ పదములే నాకు శరణు. పదములు నాకు నేర్పి నా చేత వ్రాయించి నీ పదపూజ చేయగా దీవించమ్మా.

జగజ్జనని - 5

జగజ్జనని -5



కన్న తల్లి ఒడిలోన ఒదిగియుండెడి కూన,
ఎన్నదెట్టి చింతలూ కలతలేవైన!
ఎన్నడైనా గాని నీ అభయహస్తము గాంచినా,
మిన్ను మీద పడినా భయమేయునా!

-లక్ష్మీదేవి.
కన్నతల్లి ఒడిలోన ఉన్న పసిపాప కెట్టి భయమూ ఎలా కలుగదో నీ అభయహస్తము గాంచినవారికి అదేవిధముగా ఎట్టి భయమూ ఉండదు.

17, ఆగస్టు 2010, మంగళవారం

జగజ్జనని - 4

జగజ్జనని - 4

మృదు మందహాసమున జనని కరుణను తలపించు శీతలమ్ము!
కుదుట పడజేయు రొదలు నిండిన మానసమ్ము
వెదుకగానెచట దొరకబోదని, ఒకవంతు సరిపోలు అనుభవమ్ము
నెదుట కురిపించి చూపించు నెలబాలు చల్లదనమ్ము!
-లక్ష్మీదేవి.

అమ్మ వారి మృదువైన మందహాసము ఎంత చల్లనిదంటే రొదలు, సొదలు నిండిన మనసును కుదుటపడేలా చేస్తుంది.  అందులో ఒకవంతును చూపుతున్నట్టుగా వెన్నెలగా కురిపించి వెన్నెలలోకి రాగానే మనసును కొంత ఆహ్లాదపరుస్తుండడమే దానికి నిదర్శనము కాదా. ఔను.

15, జులై 2010, గురువారం

జగజ్జనని - 3

రాముని కరమున అనువున విరిగిన
రమేశునాథుని ధనువున సొబగులు
రమణీయముగా అమిరెను శశిధరు
రమణీ భృకుటిని - గాంచితి కలలో
-లక్ష్మీదేవి.


రాముని చేతిలో అవలీలగా విరిగిన శివుని (రమ+ఈశుడు అంటే విష్ణువు(| మోహినీ రూపమున|)కు నాథుడైన వాని) ధనుస్సు విరిగి ఎలా కనిపిస్తోందో ఆ అందం, శశిధరుని రమణి- ఆ జగజ్జనుని కనుబొమ్మల అందంలో -కలలో గాంచితిని.

21, జూన్ 2010, సోమవారం

జగజ్జనని - 2

శ్వేత వర్ణ దుగ్ధోదధి మధ్యస్థిత
శ్యామాంకిత తనుధారీ చందము పరికింప
తగదేమో ఈ దీన అని తలపొసే తరుణాన
చిరునవ్వులు చిందించే చిత్తరువున
జగదంబిక నేత్రముల కనిపించెను ఆ అందము
తెల్లని తన కన్నులలో నల్లని కనుపాప వోలె
ఆ యమ్మకు ఈ వెన్నుడు మరి కనుపాపడేగా
-లక్ష్మీదేవి.

******
అనుక్షణం అన్నింటిలో దర్శనమిచ్చే అమ్మవారిని గురించి వ్రాయాలని...

అమ్మవారి చిత్తరువు లో తెల్లని కంటిలో నల్లని కనుపాప, ఆ అందంలో తెల్లటి సముద్రంలో మధ్యలో నెలకొని ఉన్ననల్లని నారాయణుని చూసినట్లుంది. అలాంటి నారాయణుని దర్శించ నేను తగనేమో అని ఈ దీనురాలు చింతించనవసరం లేదిక.
ఔను మరి, ఓంకారంలో ప్రభవించిన జగజ్జననికి త్రిమూర్తులూ బిడ్డలేగా.
తల్లికి బిడ్డలు కంటిపాపలేగా!

2, జూన్ 2010, బుధవారం

జగజ్జనని

జగజ్జనని

ప్రసూనమ్మువంటి పల్లవాధర
దరహాస ధవళకాంతిని పోల
అరుణ రంజితమైన ఆకసాన
బాలార్క కిరణ రేఖలమిరె బాగు బాగు

బంగారు ముఖ చందమినుమడించునట్టు
కురుల నీలిమ దాగిన యటుల
భానుడుదయించు ప్రభాత వేళ
కటిక చీకట్లు వెనుదిరిగి సాగు.
-లక్ష్మీదేవి

**********

ఇది అమ్మవారి చిరునవ్వుని వర్ణించాలని చేసిన చిన్ని ప్రయత్నము.
అనుక్షణం అన్నింటిలో దర్శనమిచ్చే అమ్మవారిని గురించి వ్రాయాలని...

పూవు వంటి మెత్తని, లేత చిగుళ్ళవంటి లేత ఎర్రటి పెదవులపై విరిసిన చిరునవ్వుల కాంతిలా,
ఎరుపు రంగు సంతరించుకున్న ఆకాశంలో ఉదయించే సూర్యుని తెల్లటి కిరణాలు కనిపిస్తున్నాయి.

ఇది అమ్మవారి ముఖ సౌందర్యాన్ని గురించి:

బంగారు కాంతులతో వెలిగిపోయే ముఖారవిందంలోని కాంతి రెట్టింపయ్యేట్టు గా ఎక్కడెక్కడ ఉన్న నీలిమ(నలుపు)అంతా కురుల్లో దాగినట్టు,
రవి ఉదయించే తొలిసంజెల్లో చీకట్లు వెనుదిరుగుతున్నాయిట.

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

జీవనం ~ మరణం

జీవనం ~ మరణం

నిద్ర పోయినపుడు మనకు కలలు వస్తుంటాయి. కలలో ఉన్నంత సేపు అది నిజమనే భ్రమిస్తూ ఉంటాము. మెలకువ వచ్చేవరకూ అది కల అని తెలీదు. మెలకువ వచ్చాక అది ఎలాంటి భయంకరమైన పీడకల అయినా, మామూలు కల అయినా కూడా గుర్తొచ్చినపుడు నవ్వుకుంటామే కానీ, ఆ కల మనమీద పెద్దగా ప్రభావం చూపే దృష్టాంతాలు తక్కువ.

కల లాంటిదే మన జీవితం. మనం పుట్టిన నాటి నుంచీ చనిపోయే వరకూ ఉండే ఓ పెద్ద కల తో మనమీ జీవితాన్ని పోల్చవచ్చు. కలలో మనం దేనికైనా భయపడి ఏడ్చినట్టే, ఏ ఫస్ట్ రాంకో వచ్చినట్టు ( అది నిజం కాదని మనకు తెలీదు గదా!)జీవితంలో జరిగే విషయాలకు మనం ప్రతిస్పందన చూపుతుంటాం. అంటే మనకు ఇష్టమైన విధంగా మనుషులు, పరిస్థితులు ఉన్నప్పుడు పొంగిపోవటం, అలా కానప్పుడు కుంగిపోవటం చేస్తుంటాము.

కానీ జీవితమే బుడగ లాంటిదనీ, ఎప్పుడు పగిలిపోతుందో చెప్పలేమని, కోటానుకోట్ల నీటి బిందువుల్లో బుడగ గా ఏర్పడుతూ, కాసేపటికే పగిలి మళ్ళీ అదే నీట్లో కలిసిపోయినట్టుగా మన జీవితం కూడా అంటే మన శరీరం కూడా పంచభూతాలైన నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశము ..వీటి సహాయంతో ఏర్పడి, మళ్ళీ ఓనాడు వీటి లోనే కలిసిపోతుంది. ఈ మధ్యలో ఉండేది శాశ్వతం కాదు. అసలు మనది కాదు.

పంచభూత స్వరూపమైన ప్రకృతిని పరమాత్మగా భావించే సంప్రదాయం మనది. పరమాత్మ ప్రకృతి రూపం దాల్చి ఉన్నాడని మనం నమ్ముతాము. ఆ ప్రకృతిలో ఓనాడు మనం కలిసిపోబోతున్నాము అంటే సంతోషం గాక దు:ఖమెందుకు? మన శరీరం అగ్నిలో కాలి, బూడిదై మట్టిలో కలిసిపోతుంది. ఊపిరి గాలిలో కలిసిపోతుంది. ఆత్మ అనంతాకాశంలో కలిసిపోతుంది. అస్థికల్ని నీటిలో వదులుతారు. ఈ విధంగా పంచభూతాలలో కలిసిపోబోయే రోజే మనకు కల ముగిసి మెలకువ వచ్చిన క్షణం.


నిద్రలో ఏడుస్తున్న వారిని చూసి కలలో ఏదైనా చూసి ఉంటారని మనం అనుకుంటాము. వారిని లేపి కూర్చోబెట్టి, మంచినీళ్ళు తాగించి, వెన్ను తట్టి విశ్రాంతిగా పడుకోమని చెప్తాం కదా! అలాగే మన జీవితంలో కష్టాలు మనని బాధించినపుడు మనం తేలిగ్గా తీసుకోవటానికి ప్రయత్నించాలని పెద్దలు చెపుతుంటారు. సుఖంగా ఉన్నపుడు మనం మిగతావేమీ పట్టించుకోము. కష్టం వచ్చినపుడు ప్రపంచంలో ఎవరికీ లేని కష్టం మాకే వచ్చిందని అనుకుంటాం.

అవతలివారి కష్టం ఎప్పుడూ మన కష్టం కన్నా తేలిగ్గానే కనిపిస్తుంది. ఎలాగంటే ఏనాటికీ మన కల మనం చూసినంత స్పష్టంగా అవతలి వారి కలల్ని మనం చూడలేము కదా! అలాగే ఇదీనూ!

భూమి మీద పుట్టిన జీవరాసులన్నీ భూమిలో కలిసిపోవడం సహజమైన ప్రక్రియ. పుట్టుక, పెరుగుదల లాగే మరణం కూడా సహజమైనదే అయినప్పుడు సంతోషం కలగాలిగా! అందుకే నేనెప్పుడూ మరణాన్ని సహజంగా, సంతోష కరమైనదిగా భావిస్తాను.

సుఖదు:ఖాలను సమంగా తీసుకోగలిగే స్థితప్రఙ్ఞత ఇంకా నాకు అలవడలేదు.
తన పర తారతమ్యం ఇంకా నాకు పోనేలేదు.

కానీ మరణం మాత్రం నాకు బాధని కలిగించే విషయం కాదు. జీవితంలో కలగబోయే అన్ని పరిణామాలను స్వీకరించడానికి ఎదురుచూసినట్లే మరణానికై కూడా ఇష్టంగా ఎదురు చూడగలుగుతున్నాను.

మరణాన్ని ప్రేమించగలిగితే, జీవితాన్ని ద్వేషించాలని నా ఉద్దేశ్యం కాదు.
జీవితాన్ని ప్రేమించగలిగిన మనం మరణాన్ని ద్వేషించకూడదని.
భయపడకూడదని.

ఆ మాటనే అపశకునంగా భావించడం తప్పని నా ఉద్దేశ్యం.
ఉన్న ఊరు వదలి ఏదైనా పనిమీద బయటి ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ మన ఊరు వెళ్ళాలని ఎలా అనుకుంటామో అలాగే మరణించి ప్రకృతిలో లీనం అవ్వాలని ఆశించడం కూడా.

ఇక్కడ ఉన్న మనుష్యుల వల్లనో, పరిస్థితులవల్లనో చనిపోవాలని ఎవరూ కోరుకోకూడదు. తప్పకుండా మన ప్రయత్నం ద్వారా, దైవకృపతోనూ అన్నీ అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ కష్టపడ్డా, సుఖపడ్డా భగవంతుని ప్రసాదం అని నమ్మేదాన్ని నేను. అలాగే మరణం కూడా భగవంతుని కరుణయే.

అయ్యో, మనం లేకపోతే ఇల్లు ఏమౌతుంది, సంసారం ఏమౌతుంది, పిల్లలేమౌతారు, ఆయన/ఆవిడ/అమ్మ ఎలా తట్టుకుంటారని భయపడ్డం అర్థంలేని విషయం. నేను ఉన్నా లేకపోయినా ప్రపంచం ఎప్పటి లాగే ఉంటుంది. ఇలాగే తెల్లవారుతుంది. ఇలాగే పొద్దు గుంకుతుంది. అందరి జీవితాలు, వాటిలో వ్యస్తత, గొడవలు, సర్దుబాట్లు అన్నీ అలాగే ఉంటాయి.

పెద్దలు, మహానుభావుల పలుకుల్లో తెలుసుకున్న సత్యాలివి. పునశ్చరణ చేసుకుంటూనే ఉండాలి. రోజూ తోమినా రాగిచెంబు రోజూ గాలి తగిలి నల్లబడినట్టు అన్నీ తెలిసినా విషయాసక్తి, ప్రపంచం పట్ల మోహం వదలని మనసుకు ఇలాంటి పునశ్చరణ కొంతైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.

13, ఏప్రిల్ 2010, మంగళవారం

వర్తమాన కాలంలో జీవించాలి అనే మాటలన్నీ ...

భూత కాలం, భవిష్యత్కాలం అవసరం లేదు. వర్తమాన కాలంలో జీవించాలి అనే మాటలన్నీ మంచివే. కానీ ఎవరికి? తన ప్రస్తుత పరిస్థితికి భూతకాలమే కారణమని చింతిస్తూ, వర్తమానాన్ని పాడుచేసుకునే వాళ్ళకు, భవిష్యత్కల్పనలో పడి వర్తమానాన్ని పట్టించుకోని వాళ్ళకూ! (ఆ ఒక్కటీ అడక్కు లో హీరో రాజునవుతానని....)

సాధారణంగా మానవులు తనకూ, సమాజానికీ ఉపయోగపడేలా తనపని చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నప్పుడు భవిష్యత్ గురించి కలలు కనొచ్చు, గతంలోని తన మిత్రులనో సంఘటనలనో తలచుకొని సంతోషమో, దు:ఖమో వెలిబుచ్చనూ వచ్చు. అలా చేయటం వల్ల ఎవరి వర్తమానమూ బాధింప బడకూడదు. అంతే..

గతాన్ని మర్చిపోవాల్సిన విషయంగా పరిగణిస్తే, మనం జీవించటంలో అర్థం లేదు.
* మనల్ని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని, లోకఙ్ఞానాన్ని కలిగించే గురువుల్ని మనం మరిచిపోగలమా!
* మనతో ఆడిపాడిన స్నేహితుల్ని, పెద్దయ్యాక ఏదో ఒక అవసరానికి అండగా నిలిచిన స్నేహితుల్నీ మరిచిపోగలమా!
* ఎన్నో ఢక్కామొక్కీలు తిని నేర్చుకున్న జీవిత పాఠాల్ని మరిచిపోగలమా! (మరిచిపోతే మళ్ళీ అవే తినాల్సొస్తుంది కదా..!)

ఇవన్నీ మరిచిపోతే, ఇబ్బందులు ఎదురయ్యేది మనకే!
ఎందుకంటే, గడచిన కాలంలోని మన జీవితాన్ని, పరిస్థితుల ఆధారంగా మనం చేసిన పనులనీ, తీసుకున్న నిర్ణయాలనీ ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటేనే, జీవితంలో మళ్లీ జరిగిన తప్పు జరక్కుండా, సంతృప్తికరంగా జీవించేట్టు చూసుకోగలం. కనీసం ప్రయత్నించగలం.

చాలామంది ప్రతిరోజు డైరీ ఎందుకు రాస్తారు?

ఆవేళ జరిగిన విషయాల్ని తలచుకుంటూ డైరీ రాస్తారు. ఎందుకని మరిచిపోయి వదిలేయరు? జరిగిన సంఘటన మనసుని బాధపెట్టిందా లేదా సంతోష పెట్టిందా అనిన్నీ, వాటి విషయంలో తమ తాత్కాలిక మరియూ శాశ్వత ప్రతిక్రియనీ నిదానంగా ఆలోచించి నమోదు చేసుకుంటారు.

డైరీ రాసేవాళ్ళూ, రాయని వాళ్ళూ కూడా అప్పటి తమ భావోద్వేగాలు రేకెత్తించే ప్రతికియనే గాక రోజులు గడిచే కొద్దీ మారే తమ ప్రతిక్రియనీ ఎవరితోనైనా పంచుకుంటారు. అది కొన్ని విషయాల్లో చెప్పుకోవడంతో ఆగిపోవచ్చు. కొన్ని విషయాల్లో తరతరాల జీవనాన్ని ప్రభావితం చేసే విషయాల్లో అయితే సన్నిహితులతో మాత్రమే కాక సమాజం అంతటితో పంచుకుంటారు. అవే పండుగలు, ఉత్సవాలు, ఉర్సులు, మొ||గునవి.

నిజమే.. ఉగాది, వినాయక చవితి, కృష్ణాష్టమి మొ||నవి ఒక ప్రత్యేక సందర్భం మానవాళికి కల్పించిన సంభ్రమానందాల్ని సమాజంతో కలిసి మరి మరి పంచుకోటానికి జరుపుకుంటారు. దీపావళి, దసరా మొ||నవి చెడు పై మంచి సాధించిన విజయాన్ని సమాజంతో కలిసి మరి మరి పంచుకోటానికి జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం అంటే, అది వ్యక్తిగతమైనది కాదు. తన తండ్రి తద్దినాన్నో, తన పాప పుట్టిన రోజునో సమాజం జరుపుకోవాలని ఆశించం. అయితే మానవాళికి శుభం కూర్చే సందర్భాన్నే సమాజంతో కలిసి ఉత్సవాలు చేసుకునేది. ఉదాహరణకు శ్రీరామ చంద్రుడు రావణున్ని సంహరించటం అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సంహరించటం కాదు. కౌరవుల్ని అంతం చేయటం కూడా అంతే. నీ స్వాతంత్ర్యం నీవు సుఖంగా సంతోషంగా ఉండటం కోసమే గానీ పరులకు హాని కలిగించరాదని లోకానికి తెలియచేయటం కోసమే!

అలా అయితే అందరూ మారిపోయారా, అంటే ఇంక చెడు లేదా అని కాదు.మంచి ఉన్నంత కాలమూ చెడు ఉంటుంది, చీకటి వెలుగులు ఎప్పుడూ ఉంటాయి. చీకటిలో ఉండకు వెలుగులోకి రమ్మని పిలివటమూ, వెలుగు ఇదీ అని చూపించటమూ, ఇలాంటి న్యాయ వ్యవస్థ అమలులో ఉండటం సమాజానికి హితవు అని చెప్పటమూ =====

ఈఉద్దేశ్యాలతోటే పండుగలూ, ఉత్సవాలూ జరుపుకుంటూ, ఆయా సందర్భాల్ని( గతంలోనివే మరి ) చెప్పుకుంటూ ఉంటారు. అందరూ మారరు. కొందరు చీకటినే ఇష్టపడతారు.
అంతేకానీ ఏదో శెలవు, తీపి వంటలు దక్కుతాయని కాదు.

ఇక భవిష్యత్ ...
భవిష్యత్ అనేది అవసరమే లేదంటే ఇక ప్రణాళికలెందుకు?

డైరీ రాయటం గురించి...

ఆ రోజు చెయ్యాలనుకున్నవి చేశామా, లేదా అని ఒక ఉద్దేశ్యం. అంటే భవిష్యత్తు అని రేపటి కోసం వేసిన ప్రణాళిక అమలు చేశామా లేదా అనే కదా! రేపటి కోసంప్రణాళిక అనేది లేకపోతే వారసుల భవిష్యత్ ని తీర్చిదిద్దగలమా?
అనుకోని పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సమాయత్తం కాగలమా?
గతం, భవిష్యత్ రెండూ వర్తమానానికి ముఖ్యమే. కాకపోతే వర్తమానాన్ని బలి పెట్టి గతంలోనో, భవిష్యత్ లోనో జీవించటం మాత్రం తప్పు.

శ్రీ కృష్ణదేవరాయలు, ఇంకా ఎంతోమంది కవులు, కవిపోషకులు ఉండబట్టే, భాష (ఏదైనా) ఇంకా నిలిచి ఉంది. ఈవేళ్టి తరంలో అలాంటి వాళ్ళు లేకపోతే భవిష్యత్ లో భాష మిగలదు.

అలాంటి భాషాభిమానాన్ని అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

ప్రజలు సుఖశాంతులతో జీవించేలా పరిపాలించాడు.

అలాంటి పరిపాలనా దక్షతని (కుటుంబం రాజ్యానికి చిన్న యూనిట్ కదా) అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

రాజ్యాన్ని, ప్రజా జీవనాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దుష్టులను ప్రతీసారీ జయించాడు.
అలాంటి విజయాలకు పట్టుగొమ్మలయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని, దేశభక్తినీ, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని విడిచిపెట్టని ధృడత్వాన్నీ అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

(ఎప్పుడో జరిగిన కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఇప్పుడు ఉత్సవం చేసుకోవడం ఎందుకు, నేను వర్తమానంలోనే జీవిస్తాను అన్న ఒక నేస్తానికి సమాధానంగా... ఈ ఉత్తరం)

23, మార్చి 2010, మంగళవారం

జగదభిరాముడు శ్రీరాముడే !

జగదభిరాముడు శ్రీరాముడే !!
ఇన్నాళ్ళయినా ఇన్ని సార్లు రామాయణం చదివినా, ఏదో తన్మయత్వం కలుగక మానదు. చిన్నప్పుడు మా పిన్ని (చిన్నాన్న భార్య ) మాకందరికీ ముద్దలు పెడుతూ ఎన్నిసార్లు రామాయణం చెప్పి ఉంటుందో! అయినా మళ్ళీ చెప్పమని అడిగి చెప్పించుకునే వాళ్ళం.
బాల రామాయణం చూసినప్పుడు ఆ పిల్లల శ్రద్ధకు ముచ్చటేసింది. గుణ శేఖర్ గారు దర్శకత్వం వహించారు. పిల్లలతో చాలా అవస్థలు పడినట్టు చెప్పారని ఎక్కడో చదివిన గుర్తు. అయినా పెద్దలతో అవస్థలు పడాల్సి వస్తున్న కాలంలో ఇది పెద్ద విషయం కాదు.
ధనువు ఘనమిది; ఘనులలో ఘనులు కూడ
పట్టి కదలించరానిది; యెట్టి దిట్ట
యైన దీనిని నెక్కిడ నలవి కాని
వా(డె యగుచుండె; ఇది స్వానుభవము విను(డు.

యఙ్ఞ తలమును పదను జేయంగ( దల(చి
యల్ల నొకనా(డు నా(గలి నంది దున్ను
చుండ, భూగర్భమున దా(గి యుండు నొక్క
పసిది చేపడె నానోము పంట యన(గ.

అదియె నా బిడ్డగా ముద్దులార( బెంచ(
బెరిగి, యౌవనవతి యయి ప్రీతి గూర్చు
చుండె మా ఇంటి వెలు(గౌచు, నిండు గుణము
గలిగి వర్తించు తెలివి తేటలను మించి.

పలుచటి బెల్లపు పానకం గొంతులోంచి జారినట్టుగా తియ్యగా అనిపించింది సుందర రామాయణంలోని ఈ పద్యాలు చదువుతూంటే. మరి మీకో....?

15, మార్చి 2010, సోమవారం

తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మన మిత్రులందరికీ మన ఉగాది శుభాకాంక్షలు
తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు

10, మార్చి 2010, బుధవారం

మరువకోయి మిత్రమా !

మరువకోయి మిత్రమా
మధురమైన మన భాషని
మురిపించే ముత్యాలై
మనసు దోచు అక్షరాల్ని
ముందు ముందు రానున్న
మన వారల పెన్నిధిని
మనకోసం పెద్దవారు
తీర్చిదిద్ది అందించిన
అందమైన హంగులున్న
సొగసైన మాట ధనం
మనదైన మహార్ణవం
వదులుకునే హక్కు లేదు
లేదు లేదు నీకు
నాకు
తాత సొమ్ము మనుమలకే
తాత భాష మనుమలకే ||
లక్ష్మీదేవి.

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘన కీర్తి గలవోడా

వీర రక్తపు ధార వార వోసిన సీమ
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
బాల చంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ కూడ నీవోడోయ్ ||చెయ్యెత్తి ||

నాయకీ నాగమ్మ, మంగమాంబ, మొల్ల
మగువ మాంచాల నీ తోడ బుట్టిన వోళ్ళె
వీర వనితల గన్న తల్లేరా
ధీర మాతల జన్మ భూమేరా ||చెయ్యెత్తి ||

కల్లోల గౌతమి వెల్లువల క్రిష్ణమ్మ
తుంగభద్రా తల్లి పొంగిపొరలిన చాలు
ధాన్య రాశులు పండు దేశాన
కూడు గుడ్డకు కొదువ లేదోయి ||చెయ్యెత్తి ||

పెనుగాలి వీచింది అణగారి పోయింది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
ముక్కోటి బలగమై ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగూలోన ఊరు పేరుంటాది
తల్లి ఒక్కటె నీకు తెలుగోడా
సవతి బిడ్డల పోరు మనకేలా? ||చెయ్యెత్తి ||
==వేములపల్లి శ్రి కృష్ణ

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఏమి విశేషమో...........!

ఏమి విశేషమో నా భాగ్యవశమో
దేవదేవుని చరితమ్ము నాలకింప
మదిని గెలువగ రమణులభినయింపగ చూసినాను.
ఆదరము లేదందురే జనులకు కళలయందు
ఏడ దాచిరో వీరల గురువులు నిపుణమీరీతి
ముదము పొందగ మనసు మురియగ చూసినాను.
కనుల వుబికెను అమృత భాష్పధార
అధరముల పలికెను ఆనంద పదధార
- లక్ష్మీదేవి.

ఓ రోజు రాత్రి పదకొండింటికి టివి ఛానల్స్ మారుస్తూంటే ఒక నృత్యాభినయం చూశాను. ఆవేళ్టి నా భావ తరంగాలివి.
మహా భారతంలోని కొన్ని ఘట్టాలు, గోపికా కృష్ణుల కేళీ విలాసాలు ఎంతో హృద్యంగా అభినయించారు. తొమ్మండుగురు అమ్మాయిలు ఎంతో సమన్వయంతో, భక్తి శ్రద్ధలతో అభినయించడం చూసి పరవశించిపోయాను. ఆ కాలంలో నాటకాలు ఎంతో జనరంజకంగా ప్రదర్శించబడేవి అని విన్నాను. ఇప్పుడు వచ్చే సినిమాల్లో నాటక ప్రదర్శనని హాస్యం అనే పేరుతో ఎలా దిగజారుస్తున్నారో చూస్తే నాటకం చూసే ధైర్యం చేయలేం.

3, ఫిబ్రవరి 2010, బుధవారం

శ్రీ లక్ష్మీ శిరసా నమామి!!

శ్రీ లక్ష్మీ శిరసా నమామి!!

అనంత శయనుని సీమంతినీ!
అనంత దళ మధ్య స్థిరవాసినీ!
ఆనందామృత అంబుధివాసినీ!
సౌందర్యాధిదేవీ శ్రీ లక్ష్మీ!

దరహాస చంద్రికాయుత శోభినీ!
ధవళాంబర ప్రీతా మనమోహినీ!
మధుసూదనుని ప్రియభామినీ !
కామధేను రూపిణీ శ్రీ లక్ష్మీ!

ఈప్సితార్థదాయినీ చారుహాసినీ!
హస్తినాద ప్రియ మందగామినీ!
మదీయారాధ్య జగన్మోహినీ!
మనసాంబికే దేవి శ్రీ లక్ష్మీ!
- లక్ష్మీదేవి.

8, జనవరి 2010, శుక్రవారం

నారాయణా!!

నారాయణా!!

నారాయణా నీ నామామృతం
నా నాలుక చేసిన కడు సుకృతం
దశావతారముల దివ్య చరితం
దరి చేర్చి మది జేయు ఆనంద భరితం ||నారాయణా||

చతుర్వేదముల పరిరక్షణకై
శతయోజనమ్ముల మత్స్య రూపాన కనిపించినా
అసురులొకవైపు సురలింకొకవైపు
ఆ పాలకడలి మథియింప కూర్మ రూపాన గిరి మోసినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||

అనుంగు భృత్యుని శాపాలు బాపంగ
అవనినే కావంగ వరాహ రూపమును ధరియించినా
ఎందెందు వెతికిన అందందే గలవన్న
చందాన పసివాని బ్రోవంగ నారసింహుడై గర్జించినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||

బాలవటువుగా ఇల జనియించి
బలి మహరాజుకడ యాచించి వామన మూర్తిగ విఖ్యాతినందినా
పరశువు కైదాల్చి నృపులను మర్దించి
పరమశివుని విల్విరుచు విరించిపితకే కైమోడ్చినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||

ధరణిని ఏలే మోహమె లేక
జనకుని మాటకై జనపదమొదలి జానకి తోడుగ కానలకేగినా
ముద్దార పెంచిన తల్లి యశోదకు
మురిపాల తేల్చిన సుందరాంగులకు
మోదము పంచి మోహము తెంచి మోక్షమునిచ్చినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||

బుద్ధుడు నీవై శాంతిని బోధించి
యుద్ధములొద్దని దయను, ప్రేమను కాంతిగ నింపేవు
కల్కివి నీవై అవతరించగా
కన్నుల నిండుగ నిన్ను చూడగా కలలోనైనా వరమునీయవా!
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||
లక్ష్మీదేవి.

~~~~~~~~~~~~~~