Loading...

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

జీవనం ~ మరణం

జీవనం ~ మరణం

నిద్ర పోయినపుడు మనకు కలలు వస్తుంటాయి. కలలో ఉన్నంత సేపు అది నిజమనే భ్రమిస్తూ ఉంటాము. మెలకువ వచ్చేవరకూ అది కల అని తెలీదు. మెలకువ వచ్చాక అది ఎలాంటి భయంకరమైన పీడకల అయినా, మామూలు కల అయినా కూడా గుర్తొచ్చినపుడు నవ్వుకుంటామే కానీ, ఆ కల మనమీద పెద్దగా ప్రభావం చూపే దృష్టాంతాలు తక్కువ.

కల లాంటిదే మన జీవితం. మనం పుట్టిన నాటి నుంచీ చనిపోయే వరకూ ఉండే ఓ పెద్ద కల తో మనమీ జీవితాన్ని పోల్చవచ్చు. కలలో మనం దేనికైనా భయపడి ఏడ్చినట్టే, ఏ ఫస్ట్ రాంకో వచ్చినట్టు ( అది నిజం కాదని మనకు తెలీదు గదా!)జీవితంలో జరిగే విషయాలకు మనం ప్రతిస్పందన చూపుతుంటాం. అంటే మనకు ఇష్టమైన విధంగా మనుషులు, పరిస్థితులు ఉన్నప్పుడు పొంగిపోవటం, అలా కానప్పుడు కుంగిపోవటం చేస్తుంటాము.

కానీ జీవితమే బుడగ లాంటిదనీ, ఎప్పుడు పగిలిపోతుందో చెప్పలేమని, కోటానుకోట్ల నీటి బిందువుల్లో బుడగ గా ఏర్పడుతూ, కాసేపటికే పగిలి మళ్ళీ అదే నీట్లో కలిసిపోయినట్టుగా మన జీవితం కూడా అంటే మన శరీరం కూడా పంచభూతాలైన నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశము ..వీటి సహాయంతో ఏర్పడి, మళ్ళీ ఓనాడు వీటి లోనే కలిసిపోతుంది. ఈ మధ్యలో ఉండేది శాశ్వతం కాదు. అసలు మనది కాదు.

పంచభూత స్వరూపమైన ప్రకృతిని పరమాత్మగా భావించే సంప్రదాయం మనది. పరమాత్మ ప్రకృతి రూపం దాల్చి ఉన్నాడని మనం నమ్ముతాము. ఆ ప్రకృతిలో ఓనాడు మనం కలిసిపోబోతున్నాము అంటే సంతోషం గాక దు:ఖమెందుకు? మన శరీరం అగ్నిలో కాలి, బూడిదై మట్టిలో కలిసిపోతుంది. ఊపిరి గాలిలో కలిసిపోతుంది. ఆత్మ అనంతాకాశంలో కలిసిపోతుంది. అస్థికల్ని నీటిలో వదులుతారు. ఈ విధంగా పంచభూతాలలో కలిసిపోబోయే రోజే మనకు కల ముగిసి మెలకువ వచ్చిన క్షణం.


నిద్రలో ఏడుస్తున్న వారిని చూసి కలలో ఏదైనా చూసి ఉంటారని మనం అనుకుంటాము. వారిని లేపి కూర్చోబెట్టి, మంచినీళ్ళు తాగించి, వెన్ను తట్టి విశ్రాంతిగా పడుకోమని చెప్తాం కదా! అలాగే మన జీవితంలో కష్టాలు మనని బాధించినపుడు మనం తేలిగ్గా తీసుకోవటానికి ప్రయత్నించాలని పెద్దలు చెపుతుంటారు. సుఖంగా ఉన్నపుడు మనం మిగతావేమీ పట్టించుకోము. కష్టం వచ్చినపుడు ప్రపంచంలో ఎవరికీ లేని కష్టం మాకే వచ్చిందని అనుకుంటాం.

అవతలివారి కష్టం ఎప్పుడూ మన కష్టం కన్నా తేలిగ్గానే కనిపిస్తుంది. ఎలాగంటే ఏనాటికీ మన కల మనం చూసినంత స్పష్టంగా అవతలి వారి కలల్ని మనం చూడలేము కదా! అలాగే ఇదీనూ!

భూమి మీద పుట్టిన జీవరాసులన్నీ భూమిలో కలిసిపోవడం సహజమైన ప్రక్రియ. పుట్టుక, పెరుగుదల లాగే మరణం కూడా సహజమైనదే అయినప్పుడు సంతోషం కలగాలిగా! అందుకే నేనెప్పుడూ మరణాన్ని సహజంగా, సంతోష కరమైనదిగా భావిస్తాను.

సుఖదు:ఖాలను సమంగా తీసుకోగలిగే స్థితప్రఙ్ఞత ఇంకా నాకు అలవడలేదు.
తన పర తారతమ్యం ఇంకా నాకు పోనేలేదు.

కానీ మరణం మాత్రం నాకు బాధని కలిగించే విషయం కాదు. జీవితంలో కలగబోయే అన్ని పరిణామాలను స్వీకరించడానికి ఎదురుచూసినట్లే మరణానికై కూడా ఇష్టంగా ఎదురు చూడగలుగుతున్నాను.

మరణాన్ని ప్రేమించగలిగితే, జీవితాన్ని ద్వేషించాలని నా ఉద్దేశ్యం కాదు.
జీవితాన్ని ప్రేమించగలిగిన మనం మరణాన్ని ద్వేషించకూడదని.
భయపడకూడదని.

ఆ మాటనే అపశకునంగా భావించడం తప్పని నా ఉద్దేశ్యం.
ఉన్న ఊరు వదలి ఏదైనా పనిమీద బయటి ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ మన ఊరు వెళ్ళాలని ఎలా అనుకుంటామో అలాగే మరణించి ప్రకృతిలో లీనం అవ్వాలని ఆశించడం కూడా.

ఇక్కడ ఉన్న మనుష్యుల వల్లనో, పరిస్థితులవల్లనో చనిపోవాలని ఎవరూ కోరుకోకూడదు. తప్పకుండా మన ప్రయత్నం ద్వారా, దైవకృపతోనూ అన్నీ అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ కష్టపడ్డా, సుఖపడ్డా భగవంతుని ప్రసాదం అని నమ్మేదాన్ని నేను. అలాగే మరణం కూడా భగవంతుని కరుణయే.

అయ్యో, మనం లేకపోతే ఇల్లు ఏమౌతుంది, సంసారం ఏమౌతుంది, పిల్లలేమౌతారు, ఆయన/ఆవిడ/అమ్మ ఎలా తట్టుకుంటారని భయపడ్డం అర్థంలేని విషయం. నేను ఉన్నా లేకపోయినా ప్రపంచం ఎప్పటి లాగే ఉంటుంది. ఇలాగే తెల్లవారుతుంది. ఇలాగే పొద్దు గుంకుతుంది. అందరి జీవితాలు, వాటిలో వ్యస్తత, గొడవలు, సర్దుబాట్లు అన్నీ అలాగే ఉంటాయి.

పెద్దలు, మహానుభావుల పలుకుల్లో తెలుసుకున్న సత్యాలివి. పునశ్చరణ చేసుకుంటూనే ఉండాలి. రోజూ తోమినా రాగిచెంబు రోజూ గాలి తగిలి నల్లబడినట్టు అన్నీ తెలిసినా విషయాసక్తి, ప్రపంచం పట్ల మోహం వదలని మనసుకు ఇలాంటి పునశ్చరణ కొంతైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.

9 కామెంట్‌లు:

  1. Too good andee.Maatalu raavatleadu naaku mee taatvika chintanaki.chaalaa baagaa cheppaaru.inta baaga cheppi inkaa meeku STITHA PRAGNATA raaledante elaaga?Ghantasaala paata superb.pindesaaru anthe gundeni alaa....

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు ఋషి గారూ!
    ఎంతైనా ఋషి లాంటి వారి ప్రవచనాలు విని అంతో ఇంతో వంటబట్టించుకున్నదే కదా..!

    రిప్లయితొలగించండి
  3. తురాయి అంటే తలమీద పెట్టుకునే ఆభరణం, టోపీ లాంటిది. కలికితురాయి అంటే అందమైన తురాయి. ఏదైనా వర్గంలో మిక్కిలి శ్రేష్ఠమైన దాన్ని నుడికారంలో కలికితురాయి అంటూ ఉంటారు. ఉదా. ఇక్ష్వాకు వంశానికి రాముడు కలికితురాయి.

    రిప్లయితొలగించండి
  4. Interesting thoughts.
    నిజమే, మరణాన్ని గురించి భయపడల్సిందేంఇ లేదు.

    రిప్లయితొలగించండి
  5. చాలా లోతుగా రాశారు. అన్నీ తెలిసిన విషయాలే అయినా మీరన్నట్టు పురశ్చరణ చేసుకోవడం వలన ఓ వివేకం, ఓ ఉత్తేజం వస్తుంది. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. చిరకాల దర్శనం!! మీరూ మనసులోతులకి వెళ్తున్నారుగా! ఇప్పుడే మీ టపా చూసి వసున్నా.

    రిప్లయితొలగించండి