Loading...

13, ఏప్రిల్ 2010, మంగళవారం

వర్తమాన కాలంలో జీవించాలి అనే మాటలన్నీ ...

భూత కాలం, భవిష్యత్కాలం అవసరం లేదు. వర్తమాన కాలంలో జీవించాలి అనే మాటలన్నీ మంచివే. కానీ ఎవరికి? తన ప్రస్తుత పరిస్థితికి భూతకాలమే కారణమని చింతిస్తూ, వర్తమానాన్ని పాడుచేసుకునే వాళ్ళకు, భవిష్యత్కల్పనలో పడి వర్తమానాన్ని పట్టించుకోని వాళ్ళకూ! (ఆ ఒక్కటీ అడక్కు లో హీరో రాజునవుతానని....)

సాధారణంగా మానవులు తనకూ, సమాజానికీ ఉపయోగపడేలా తనపని చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నప్పుడు భవిష్యత్ గురించి కలలు కనొచ్చు, గతంలోని తన మిత్రులనో సంఘటనలనో తలచుకొని సంతోషమో, దు:ఖమో వెలిబుచ్చనూ వచ్చు. అలా చేయటం వల్ల ఎవరి వర్తమానమూ బాధింప బడకూడదు. అంతే..

గతాన్ని మర్చిపోవాల్సిన విషయంగా పరిగణిస్తే, మనం జీవించటంలో అర్థం లేదు.
* మనల్ని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని, లోకఙ్ఞానాన్ని కలిగించే గురువుల్ని మనం మరిచిపోగలమా!
* మనతో ఆడిపాడిన స్నేహితుల్ని, పెద్దయ్యాక ఏదో ఒక అవసరానికి అండగా నిలిచిన స్నేహితుల్నీ మరిచిపోగలమా!
* ఎన్నో ఢక్కామొక్కీలు తిని నేర్చుకున్న జీవిత పాఠాల్ని మరిచిపోగలమా! (మరిచిపోతే మళ్ళీ అవే తినాల్సొస్తుంది కదా..!)

ఇవన్నీ మరిచిపోతే, ఇబ్బందులు ఎదురయ్యేది మనకే!
ఎందుకంటే, గడచిన కాలంలోని మన జీవితాన్ని, పరిస్థితుల ఆధారంగా మనం చేసిన పనులనీ, తీసుకున్న నిర్ణయాలనీ ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటేనే, జీవితంలో మళ్లీ జరిగిన తప్పు జరక్కుండా, సంతృప్తికరంగా జీవించేట్టు చూసుకోగలం. కనీసం ప్రయత్నించగలం.

చాలామంది ప్రతిరోజు డైరీ ఎందుకు రాస్తారు?

ఆవేళ జరిగిన విషయాల్ని తలచుకుంటూ డైరీ రాస్తారు. ఎందుకని మరిచిపోయి వదిలేయరు? జరిగిన సంఘటన మనసుని బాధపెట్టిందా లేదా సంతోష పెట్టిందా అనిన్నీ, వాటి విషయంలో తమ తాత్కాలిక మరియూ శాశ్వత ప్రతిక్రియనీ నిదానంగా ఆలోచించి నమోదు చేసుకుంటారు.

డైరీ రాసేవాళ్ళూ, రాయని వాళ్ళూ కూడా అప్పటి తమ భావోద్వేగాలు రేకెత్తించే ప్రతికియనే గాక రోజులు గడిచే కొద్దీ మారే తమ ప్రతిక్రియనీ ఎవరితోనైనా పంచుకుంటారు. అది కొన్ని విషయాల్లో చెప్పుకోవడంతో ఆగిపోవచ్చు. కొన్ని విషయాల్లో తరతరాల జీవనాన్ని ప్రభావితం చేసే విషయాల్లో అయితే సన్నిహితులతో మాత్రమే కాక సమాజం అంతటితో పంచుకుంటారు. అవే పండుగలు, ఉత్సవాలు, ఉర్సులు, మొ||గునవి.

నిజమే.. ఉగాది, వినాయక చవితి, కృష్ణాష్టమి మొ||నవి ఒక ప్రత్యేక సందర్భం మానవాళికి కల్పించిన సంభ్రమానందాల్ని సమాజంతో కలిసి మరి మరి పంచుకోటానికి జరుపుకుంటారు. దీపావళి, దసరా మొ||నవి చెడు పై మంచి సాధించిన విజయాన్ని సమాజంతో కలిసి మరి మరి పంచుకోటానికి జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం అంటే, అది వ్యక్తిగతమైనది కాదు. తన తండ్రి తద్దినాన్నో, తన పాప పుట్టిన రోజునో సమాజం జరుపుకోవాలని ఆశించం. అయితే మానవాళికి శుభం కూర్చే సందర్భాన్నే సమాజంతో కలిసి ఉత్సవాలు చేసుకునేది. ఉదాహరణకు శ్రీరామ చంద్రుడు రావణున్ని సంహరించటం అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సంహరించటం కాదు. కౌరవుల్ని అంతం చేయటం కూడా అంతే. నీ స్వాతంత్ర్యం నీవు సుఖంగా సంతోషంగా ఉండటం కోసమే గానీ పరులకు హాని కలిగించరాదని లోకానికి తెలియచేయటం కోసమే!

అలా అయితే అందరూ మారిపోయారా, అంటే ఇంక చెడు లేదా అని కాదు.మంచి ఉన్నంత కాలమూ చెడు ఉంటుంది, చీకటి వెలుగులు ఎప్పుడూ ఉంటాయి. చీకటిలో ఉండకు వెలుగులోకి రమ్మని పిలివటమూ, వెలుగు ఇదీ అని చూపించటమూ, ఇలాంటి న్యాయ వ్యవస్థ అమలులో ఉండటం సమాజానికి హితవు అని చెప్పటమూ =====

ఈఉద్దేశ్యాలతోటే పండుగలూ, ఉత్సవాలూ జరుపుకుంటూ, ఆయా సందర్భాల్ని( గతంలోనివే మరి ) చెప్పుకుంటూ ఉంటారు. అందరూ మారరు. కొందరు చీకటినే ఇష్టపడతారు.
అంతేకానీ ఏదో శెలవు, తీపి వంటలు దక్కుతాయని కాదు.

ఇక భవిష్యత్ ...
భవిష్యత్ అనేది అవసరమే లేదంటే ఇక ప్రణాళికలెందుకు?

డైరీ రాయటం గురించి...

ఆ రోజు చెయ్యాలనుకున్నవి చేశామా, లేదా అని ఒక ఉద్దేశ్యం. అంటే భవిష్యత్తు అని రేపటి కోసం వేసిన ప్రణాళిక అమలు చేశామా లేదా అనే కదా! రేపటి కోసంప్రణాళిక అనేది లేకపోతే వారసుల భవిష్యత్ ని తీర్చిదిద్దగలమా?
అనుకోని పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సమాయత్తం కాగలమా?
గతం, భవిష్యత్ రెండూ వర్తమానానికి ముఖ్యమే. కాకపోతే వర్తమానాన్ని బలి పెట్టి గతంలోనో, భవిష్యత్ లోనో జీవించటం మాత్రం తప్పు.

శ్రీ కృష్ణదేవరాయలు, ఇంకా ఎంతోమంది కవులు, కవిపోషకులు ఉండబట్టే, భాష (ఏదైనా) ఇంకా నిలిచి ఉంది. ఈవేళ్టి తరంలో అలాంటి వాళ్ళు లేకపోతే భవిష్యత్ లో భాష మిగలదు.

అలాంటి భాషాభిమానాన్ని అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

ప్రజలు సుఖశాంతులతో జీవించేలా పరిపాలించాడు.

అలాంటి పరిపాలనా దక్షతని (కుటుంబం రాజ్యానికి చిన్న యూనిట్ కదా) అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

రాజ్యాన్ని, ప్రజా జీవనాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దుష్టులను ప్రతీసారీ జయించాడు.
అలాంటి విజయాలకు పట్టుగొమ్మలయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని, దేశభక్తినీ, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని విడిచిపెట్టని ధృడత్వాన్నీ అలవర్చుకోటానికి మనం రాయల్ని తలుచుకోవాలి.

(ఎప్పుడో జరిగిన కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఇప్పుడు ఉత్సవం చేసుకోవడం ఎందుకు, నేను వర్తమానంలోనే జీవిస్తాను అన్న ఒక నేస్తానికి సమాధానంగా... ఈ ఉత్తరం)

4 కామెంట్‌లు:

  1. మీ టపా నా గుండె కు కూడా తగిలింది. ఎందుకంటే నేను కూడా మీ నేస్తం లానే అంటుంటాను. గతాన్ని వదిలి పెడదాం అనటానికి కూడా బలీయమైన కారణాలే ఉన్నాయి.
    1. దళితులు "అగ్ర వర్ణాల వాళ్ళు మమ్మల్ని గతం లో అణచిపెట్టారు, కాబట్టీ మేము ఇప్పుడు ప్రతీకారం చేయాలి అంటారు.
    2. తెలంగాణా వాదులు యాభైఅలలోకి ఒక్క సెకండ్ లో వెళ్ళి అప్పటి మోసాలను ఇప్పుడు తాము చూసినట్లు చెప్పి ( టీనేజ్ కుర్రాళ్ళు కూడా) పక్కనే ఉన్న ఏ ఆంధ్రా హోటల్ మీదో రాళ్ళు వేస్తారు.
    3. హిందువులు ముస్లిం పాలకులు ఎప్పుడో మనలను అణగ దొక్కారు కాబట్టీ మనం దానిని ఇప్పుడు సరి చేయాలి అంటారు.
    4. పాకిస్తాన్ ఇండియాను విడకొట్టింది కాబట్టీ, ఇండియా పాకిస్తాన్ ను విడకొట్టాలి. ఇండియా పాకిస్తాన్ ను విడకొట్టింది కాబట్టీ పాకిస్తాన్ కాశ్మీర్ ను వేరు చేయాలి..ఈ విష వలయానికి అంతే లేదు.
    ఇలా చారిత్రక అన్యాయాలను వర్తమానం లో సరి చేయటం సరి కాదు. చరిత్ర గర్భం లో గడిచిన విషయాల న్యాయాన్యాయాలను మనం ఇప్పుడు నిర్ణయించలేం. వర్తమానం లో జరిగిన విషయాల లోని న్యాయాన్యాయాలనే నిర్ణయించలేక పోతున్నాం కదా.
    గతం నుంచీ మంచి నేర్చుకొని చెడు ను వదిలేసి ముందుకు సాగితే పరవాలేదు. కానీ మనిషి మంచి కంటే చెడును ఎక్కువ గా గ్రహించే అవకాశం ఉంది. అలానే ఏది మంచి ఏది చెడు అనే విషయం లో మనుషులు మళ్ళీ కొట్లాడుకొంటారు.
    జాతి వివక్షను గతం లో కలిపి అమెరికా ముందుకు సాగుతోంది. గతం లో ఏమైందో ఎందుకు.ఇప్పుడు అందరూ సమానమే. "లెట్స్ మూవ్ ఆన్" అనే స్పిరిట్ తో ఆలోచిస్తే గతాన్ని వదిలి పెట్టటం సరైన విషయమే. మీ స్నేహితుడు ఇవన్నీ మనసు లో పెట్టుకొని అన్నాడో లేదో తెలియదు.
    ఇక పోతే తత్వ వేత్త లు కూడా వర్తమానం లో జీవించమంటారు. కానీ దాని సందర్భం వేరు. ఆధ్యాత్మిక అనుభూతి కోసం వర్తమానం లో జీవించమని వారు చెప్తారు. ఎందుకంటే గతం అనేది మన మనసనే టేప్ రికార్డర్ లో రికార్డ్ అయిన ఒక పాట. వర్తమానం లైవ్ కన్సర్ట్ లాంటిది.

    రిప్లయితొలగించండి
  2. @ప్రసాద్,
    ధన్యవాదాలు.
    మంచే జరుగుతుందని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
  3. ఆలోచించాల్సిన విషయాల్ని మనసుకి హత్తుకునేలా, అర్ధమయ్యేలా రాస్తున్నారు. అభినందనలు

    రిప్లయితొలగించండి
  4. కొత్తపాళీ గారూ!
    అభినందన ఆశీర్వాదంలా శిరోధార్యమైనదని భావిస్తున్నాను

    రిప్లయితొలగించండి