Loading...

8, జనవరి 2010, శుక్రవారం

నారాయణా!!

నారాయణా!!

నారాయణా నీ నామామృతం
నా నాలుక చేసిన కడు సుకృతం
దశావతారముల దివ్య చరితం
దరి చేర్చి మది జేయు ఆనంద భరితం ||నారాయణా||

చతుర్వేదముల పరిరక్షణకై
శతయోజనమ్ముల మత్స్య రూపాన కనిపించినా
అసురులొకవైపు సురలింకొకవైపు
ఆ పాలకడలి మథియింప కూర్మ రూపాన గిరి మోసినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||

అనుంగు భృత్యుని శాపాలు బాపంగ
అవనినే కావంగ వరాహ రూపమును ధరియించినా
ఎందెందు వెతికిన అందందే గలవన్న
చందాన పసివాని బ్రోవంగ నారసింహుడై గర్జించినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||

బాలవటువుగా ఇల జనియించి
బలి మహరాజుకడ యాచించి వామన మూర్తిగ విఖ్యాతినందినా
పరశువు కైదాల్చి నృపులను మర్దించి
పరమశివుని విల్విరుచు విరించిపితకే కైమోడ్చినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||

ధరణిని ఏలే మోహమె లేక
జనకుని మాటకై జనపదమొదలి జానకి తోడుగ కానలకేగినా
ముద్దార పెంచిన తల్లి యశోదకు
మురిపాల తేల్చిన సుందరాంగులకు
మోదము పంచి మోహము తెంచి మోక్షమునిచ్చినా
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||

బుద్ధుడు నీవై శాంతిని బోధించి
యుద్ధములొద్దని దయను, ప్రేమను కాంతిగ నింపేవు
కల్కివి నీవై అవతరించగా
కన్నుల నిండుగ నిన్ను చూడగా కలలోనైనా వరమునీయవా!
నీకు నీవే సాటి మధుసూదనా!
నన్నేల రావయ్య జనార్దనా! ||నారాయణా||
లక్ష్మీదేవి.

~~~~~~~~~~~~~~



5 కామెంట్‌లు:

  1. మందాకిని గారూ! నా బ్లొగ్ సందర్శించినందులకు కృతజ్ఞతలు!!
    నా మరొక బ్లొగ్ లో "నా-నీ ధర్మపురి నరహరి శతకము" చదవండి..మీ దశావతారాల గీతం చదివినాను..చాలా బాగుంది సంస్కృత పదభూయిష్టమై నొప్పారు చున్నది..ఈ సరళి కొనసాగించండి. దీనికి బాణీ కూర్చబడినదా..?
    మీరే స్వరకల్పన చేస్తారా..?పాడడం కూడానా మీ నామధేయం లాగానే మీ స్వరం మధురిమ లొలుకుతూ..శ్రోతలను గాన మందాకినీ లో ఓలలాడించగలదని..భావిస్తాను...
    సదా మీ స్నేహాభిలాషి
    రాఖీ

    రిప్లయితొలగించండి
  2. @Rakhee
    ధన్య వాదాలు. మీ బ్లాగులు తప్పకుండా చూస్తాను. నా ఊహకు తోచింది, భగవంతుని గురించి నాకు తెలిసింది రాసుకుంటూ ఉంటానండీ. నాకు సంగీతంలో అభిరుచి ఉన్నది. ప్రవేశంలేదు. బాణీ సమకూర్చే టాలెంట్ నాకు లేదు. తోచినట్టు పాడుకుంటూ ఉంటాను. మీ అభిమానానికి, స్పందనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి