Loading...

9, మే 2021, ఆదివారం

ఆశ- ఎమిలీ

విపత్తుల్లో, వేదనల్లో ఆ భీతావహ స్థితులనే మళ్ళీ మళ్ళీ తలచుకోవడమేల? భరించలేని భయాలనే జపిస్తూ ఉండడమెందుకు? యాసిడ్ పడి ముఖం కాలినవాళ్ళు మళ్ళీ మళ్ళీ అద్దం చూసుకుంటే కలిగేది దుఃఖం తప్ప ఇంకేమీ లేదు అని నా అభిప్రాయం. అందుకే ఈ వేదనల రోదనల సమయంలో నాకు నచ్చిన ఒక కవితను అనువదించాను. ఇందులో తప్పులు, ఒప్పులు ఉంటే చర్చించడానికి నాకు అభ్యంతరం ఉండదు. కవితను ఆస్వాదించడమంటే మరింత లోతుగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉండడంలోనే ఉందని నా అనుకోలు.
ఎమిలీ డికెన్ సన్ సుమారు నూటేభై ఏళ్ళ క్రిందటి ఆంగ్లకవయిత్రి.
ఆమె వ్రాసిన ఈ హోప్ అనే కవిత నిత్యనూతనమైనది, సార్వకాలికమైనది, సార్వజనీనమైనది అనిపిస్తుంది.
-------
‘ఆశ’ ఒక ఱెక్కలున్న గువ్వపిట్ట
మనసు కొమ్మపై వాలుతుంటుంది.
పదాలు లేని రాగాలేవో పాడుతుంది.
విరామమే లేకుండా.
సుడిగాలుల్లో కూడా ఇంపుగా వినిపిస్తుంది.
తుఫానులెంత వేదన కలిగిస్తున్నా,
ఈ చిన్న గువ్వపిట్టను ఎంత వెక్కిరిస్తున్నా,
ఎంతో మందిని వెచ్చగా పొదువుకుంటుంది.
ఎంతో దుర్భరమైన ప్రాంతాల్లో,
ఎంత కల్లోల సంద్రాల్లో కూడా.
అయినా కానీ ఎప్పుడూ , ఎంత విపత్కర స్థితిలోనూ
నన్ను ఒక్క గింజ కూడా అడగదది.
‘ఆశ’ ఒక ఱెక్కలున్న గువ్వపిట్ట
మనసు కొమ్మపై వాలుతుంది.
భరించరాని వేదనలో, ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో, అడుగు కూడా ముందుకు వేయలేని అశక్తతలో తన ఱెక్కలపై కూర్చోపెట్టుకొని మనలను ఎగిరేలా చేసేది ఒకటే.
'ఆశ.'
అందుకే కవయిత్రి ఆ చిన్ని ఆశను గువ్వపిట్టతో పోలుస్తోంది. అది మనసులో కలుగుతుంది. అందుకే దానికి మనసు కొమ్మలా ఆధారమౌతుంది. పదాలు లేని రాగం - ఎందుకంటే ఆ ఆశకు ఏ ఆధారమూ లేదు. ఏ వాదనా, తర్కమూ లేవు. అయినా ఆశ ఏమూలో గంటలా మోగుతుంది. ఎప్పుడైనా ఆశ నిరాశ అయినా, మళ్ళీ పుడుతుంది కాబట్టి దానికి విరామం లేదు.
సుడిగాలులలో చెవులు హోరెత్తి పోతున్నా ఇది ఇంపుగా వినిపిస్తుంది. వేదనల్లో , వైరాగ్యాల్లో ఆశకేది చోటు అని ఎవరెంత హేళన చేసినా ఎవరి మనసులో ఆశ ఉంటుందో, వాళ్ళకు ఒక ఆధారము, ఒక పొదువుకున్న వెచ్చదనాన్ని ఇస్తుంది. అది ఒక కల్పితమైన భద్రతాభావం. పొదువుకోవడం అంటే పక్షి పిల్లలను పొదువుకుంటుందే, అలా.
ఏ స్థితిలో ఉన్న ప్రాంతాలలో, సంక్షోభం ఉన్న స్థితులలో కూడా ఆశనే ఆసరా. అయినా నేను దాన్ని పెంచి పోషించాల్సిందేమీ లేదు, అది నన్నేమీ అడగదు అనేందుకే ఒక గింజ కూడా అడగదంటోంది కవయిత్రి.
ఆశ - Hope!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి