Loading...

24, మే 2021, సోమవారం

సాగుభూమి-మబ్బుల విహారం

 

విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యమాలిక ‘స్వాగతము’ పంట పొలముల స్థితిగతులను, రైతుజనుల ఆలోచనలను విశదంగా సహజంగా వర్ణిస్తారు. సహజోక్తి అలంకారము. ఇందులో ఉన్న పొలముల దృశ్యము మనమెవరైనా చూసి ఉంటామా? ఎక్కువమందిమి చూసి ఉండము. సరళమైన పదాల్లాగే ఉన్నా, మన వాడుక లో లేవు గనుక ఈ భావం వ్రాద్దామనిపించింది.
--
ఆ సాగుభూమి, పంటపొలాల విహారం కాస్సేపు.
----
ఉ) వెన్నెల తీవచాలునకు వెన్కగ నేలకు డిగ్గివచ్చి యీ
చిన్నరిమబ్బు క్రొమ్మెఱుగు చేడియతో విహరించుచుండె, మా
పొన్నలు పూతపట్టు, నిక సొంత పొలాలకు నీరమెక్కెడిన్,
మొన్నటి దాక వానలకు మోములు వాచిరి మాదు కర్షకుల్.
వెన్నెల తీగల వరుసలకు వెనుకగా ఈ చిన్న మబ్బు కొత్త మెఱుపుచెలితో విహరిస్తోంది. మా పొన్న చెట్లు పూతకు రానున్నాయి. సొంత పొలాలకు నీరు వస్తుంది. మొన్నటి వరకూ మా రైతులము వానకు మొగం వాచి ఉన్నాము.
చం) నెఱియలుపడ్డ మా పొలము నిండను తుంగలు తుమ్మదుబ్బులున్
పెరిగెను, దుక్కిటెద్దడుగు పెట్టగజాలని మా పొలాలలో
నురుమద శైవపాదకటకోజ్జ్వలనాద మనోహరంబుగా
నుఱిమిన నీ కొసంగెద నుపాయనముల్ నవబాష్ప బిందువుల్!
(ఎండి) నెఱ్ఱెలు చీలిన మా పొలము నిండా గడ్డి, తుమ్మ పొదలు పెరిగాయి, దుక్కిటెద్దు అడుగు పెట్టడమే కష్టమైన మా పొలాలలో గొప్ప మిడిసిపాటు కల శివపాదకడియపు ఉజ్జ్వలనాదము వలె మనోహరముగా నీవు ఉఱిమితే నీకు నా అనందబాష్పాలనే కానుకగా ఇస్తాను.
ఉ)కూరలపాదులెల్ల పురుగుల్ మొదలంటగ నాకిపోయె, మా
కోరడివెంబడిన్ తలలు కొంచెముగా పయికెత్తు మొక్కలున్
తీరెను, నీ నినాదమున తేరుకొనెన్ పసరాకు వేసి సిం
గారములొల్కెడున్ నిగనిగల్ వెలయించుచున్నవో ప్రభూ!
కూరల పాదులు పుర్వు పట్టి నశించాయి, మా కోరడి(మట్టి కాంపౌండ్ వాల్) వెంట కొంచెం తలెత్తిన మొక్కలూ పోయాయి. నీ శబ్దాలకు తేరుకున్నాయి. చిగురు వేసి సింగారాలు కురిపిస్తున్నాయి నిగనిగల వెలుగుతున్నాయి ప్రభూ!
ఉ)అందపు వానచిన్కు పడెనన్నది చాలని ప్రాత విత్తనా
లుందగవి దెచ్చి మా పెరటి లోపల నాటిన కూరపాదులన్
పందిరికెక్కనిమ్ము, తొలి వర్షపు చిన్కులు చిన్కి దొడ్డిలో
నందనమూడి వచ్చి పడెనా యనిపింపుము సత్కృపానిధీ!
అందమైన వానచినుకు పడిందే చాలన్నట్టు పాత విత్తనాలు తగినవి తెచ్చి మా పెరట్లో కూరపాదులు నాటాము, వాటిని పందిరి ఎక్కనివ్వు, తొలిచినుకులు కురిసి (స్వర్గం నుంచి) నందనం ఊడి మా పెరట్లో పడిందా అనిపించనీ దయానిధీ!
చం) పొడిపొడియై తలల్ ముదిరిపోయిన యెఱ్ఱని కారుజొన్నలో
పడి తిని కొత్తలో పసరుటుంగిడి తాకిన యావుదూడలున్
తడబడిపోయె మా యెడద తల్లడిలెన్, తొలి వానచిన్కు పై
బడి సుఖమయ్యె నేటి అనపాయత నొందెను మాదు సస్యముల్.
పొడివై ముదిరిన జొన్నలు తిన్న కొత్తలో ఆవుదూడలు ఉంగిడి (ఒకానొక వ్యాధి)బారిన పడగా మా ఎద తల్లడిల్లిపోయింది. తొలి వానచినుకులు మీదపడి సుఖం కలిగి, మా పంటలకు ఆపద తొలగినది.
ఉ)గొంటరి నీవు, మా మదురుగోడను వ్రాలిన రావితొఱ్ఱలో
పెంటియ తాను నొంటి విలపించుచున్నది పావురాయి, నీ
వెంటనె చూచుచున్ గడిపె వేసవి యంతయు, నీవు వచ్చి మా
పంటలతోడిపాటుగ కృపామతి దానికి దప్పి తీర్చవే!
కఠినాత్ముడివి నీవు, మా మదురుగోడ(కాంపౌండ్ వాల్) పై వాలిన రావి చెట్టు తొఱ్ఱలో ఒక ఆడపావురం ఒంటరిగా విలపిస్తోంది. నీ కోసం చూస్తూ వేసవి అంతా గడిపింది. నీవొచ్చి మా పంటలతో పాటు దానిదప్పిక కూడా తీర్చుమా కృపామతీ!
ఉ) ఒప్పులకుప్ప మా చిఱుత యూచిన గొంతున వాన వాన వ
ల్లప్పలు తిర్గుచున్ చదికిలంబడు, కన్నులు వ్యాప్తమై కనును
కప్పును పల్లెకుచ్చెలుల కాళ్లకు నృత్యము సేయ పెద్ద న-
-వ్వొప్పగ వచ్చి నా పదములూరక కౌగిట పూను గట్టిగా!
ఒద్దికగా గొంతు విప్పి మా చిన్నిబిడ్డ వానావానావల్లప్పలు తిరుగుతూ చతికిలబడుతుంది. కన్నులు పెద్దగ చేసి చూస్తుంది. తన వల్లెవాటు కుచ్చిళ్ళు నాట్యము చేస్తుండగా కాళ్ళకు అడ్డుపడుతుంటాయి. పెద్ద నవ్వొచ్చేసి నా కాళ్ళను చుట్టేసి నన్ను గట్టిగా పట్టుకొని నా సందిట చేరుతుంది.
చం)పొలములవట్టి నీరములు బోదెల నిండవు నారుమళ్ళలో
చెలమల నీరుతోడి యరచేతులు బొబ్బలు పొక్కె, బోదె లో
పలి జలమందు పిచ్చుకలు పాపము ముక్కులు ముంచుచుండె, నీ
విలయము దాటిపోయెననిపించెను నీ యురుముల్ కృపానిధీ!
నారుమళ్ళ పంటకాలువలలో నీరు నిండదు. చెలమల్లో నీటిని తోడితోడి అరచేతులు బొబ్బలెక్కాయి. కాలువనీటిలో పిచ్చుకలు పాపం, ముక్కులు ముంచుచున్నాయి. నీ విలయము దాటిపోయిందేమో అన్నట్టు నీ ఉరుములు కృపానిధీ!
నీ కృపచేత రేపటికి నీరములెక్కును మా పొలాలకున్
ఉ)తేకువ నాటులై కలుపు తీయని మళ్ళను నమ్మ పూలు కా
జాకులు, కాజపూలు తఱుచై కలుపేరెడు మాలపిల్లలున్
శ్రీకలకంఠ గీతికలచే పులకింపగ చేతురో ప్రభూ!
నీ దయతో రేపటికి నీరెక్కుతుంది. నిబ్బరంగా నాటులు అయ్యి, కలుపు తీయని మళ్ళలో కాజాకులు, కాజపూలు(కలుపుమొక్క) ఎక్కువై కలుపు ఏరే మాలపిల్లలు కోకిలలవలె పాటలతో పులకింపజేస్తారు ప్రభూ!
చం)ఒదిగిన బోదెకాలువలు నుచ్చెను మోటయు తోడ, కంబుసం
పదగల వంగచాలులకు మధ్యగ వేసిన గోగుమొక్కల
ల్లదె కొనసాగి యే వేళకొ యందును కోతకు , కంద పిల్కలున్
ప్రిదిలిన నేలపై బయలుపెట్టును పొమ్ము తలాకుపొట్లముల్.
ఒదిగి ఉన్న పంటకాలువలు, మొలచిన మోటలు(నీరు తోడు సాధనాలు), సజ్జపైరు, వంగచాళ్ళకు మధ్యలో వేసిన గోగుమొక్కలు అలా అలా పెరిగి ఏ నాటికి కోతకొస్తాయో! కందపిలకలు విచ్చిన చోటు నేలఉసిరికచెట్లను బయల్పరుస్తుందిపో!
చం)పిల పిల తేనెలై పికిలి పిట్టల యీలలు నీకు స్వాగత
మ్ములొసగు, పైడిగంటగళమున్ శ్రుతి చేసి నుతించు వానకో
యిల, కడు దీనమౌ కనులనెప్పుడు నీ వరుదెంతువంచు నీ
వలనుకె చూచు బెగ్గురులు బంతులు తీరిచి నిన్ను గొల్చెడున్.
పిలపిలలాడే తేనెల పికిలిపిట్టల ఈలలు నీకు స్వాగతం పలుకుతాయి. వానకోయిల బంగారుఘంటానాదం వంటి గొంతును శ్రుతి చేసి నిన్ను నుతిస్తుంది. దీనంగా నీ రాకకోసమే నీవైపే చూస్తూ ఉండే బెగ్గురు పక్షులు పంక్తులుగా నిలిచి నిన్ను పూజిస్తాయి.
ఉ)నీవరుదెంతు వంచును ధ్వనించెను చల్లగాలి సోకుచున్,
నీ వలిచిన్కు పడ్డ యవనీస్థలి కమ్మని తావి చిమ్మెడున్,
నీవప్రశీతలాకృతివి నీవొకరుండవె సేద్యకాండ్రకున్,
కావలి కాచు దైవమవు కష్టములన్ గడతేర్చువాడవున్.
నీవొస్తున్నావని చల్లగాలి సోకి చెప్పకనే చెప్పింది. నీ చినుకు రాలిపడిన చోట నేల కమ్మని తావి చిమ్ముతుంది. నీవు పొలానికి చలువ చేసే ఆకృతివి, నీవొక్కడవే (దిక్కు) సేద్యగాళ్లకు, కావలి కాచే దైవానివి, కష్టాలను తీర్చేవాడివి.
ఉ)దొంతులు తెచ్చి కానికలతో నెదురౌదుము బంతిపూలు , చే
మంతులు, చంద్రకాంతములు, మంకెన పూవులు, పోక బంతులున్,
వింతల గన్నెరుల్, హృదయవీథుల మా యెడ విశ్రమింపు, మా
చింతల తోపులో విడిది చేయుము శ్రావణమాసవేళలన్.
బంతులు, చేమంతులు, చంద్రకాంతాలు, మంకెనపూలు, పోకబంతులు, వింతైన గన్నేరులను దొంతులు దొంతులు గా తెచ్చి నీ కు కానుకలిచ్చుకుంటాము. మా హృదయవీథులలో మా దగ్గర విశ్రాంతి తీసుకో. శ్రావణమాసాల్లో మా చింతతోపులో విడిది చేయి.
శా)నీలాంబోధర కాంతిపుంజములు నిండెన్ ప్రాక్ప్రతీచీ దిశా
లోలాభ్యంతర వీథికావళుల నాలో గోపికాశ్రేణి లీ
లాలాస్యంబును సేయు, నాదము శ్రవోలంకారమయ్యెన్, మయూరీ
లో లచ్ఛవి పింఛ సంచిత కళారింఛోళి సంఛన్నమై.
నీలిమేఘాల కాంతి పుంజాలు తూర్పుపడమర దిక్కుల్లో నిండాయి. అంతఃపుర వీధులలో గోపికాశ్రేణులు లీలానృత్యాలు చేస్తారు. నాదము శ్రవణానందంగా ఉంటుంది. నెమలి పింఛపు ఛాయలలో కళాసందోహము సంపన్నమైంది.
----

చక్కని దృశ్యావిష్కరణ.
--------------------
కడియం అంత శబ్దం ఎలా చేస్తుందా అని ఆలోచించాను. రెండు కడియాలు ఉన్నా కూడా .
ఒక వేళ చేతి కంకణాలైతే రెండు చేతులను కలిపే భంగిమలో అవి పరస్పరం తగిలే అవకాశం ఉండొచ్చు. కానీ ఒకరివే రెండు పాదాలు ఎంత దగ్గరగా వచ్చినా రెండు పాదాల కడియాలు ఒకదాన్నొకటి కొట్టుకునే అవకాశం తక్కువే.
 
(శివతాండవము, గౌరీ లాస్యము ఒకేసారి జరుగుతుండగా చరణాభరణాలు పరస్పరం తగిలితే మధురనాదవర్ణనము కవిసమయమౌతుందని ఊహిస్తున్నాను.)
 సందర్భము ఉరుముల భీషణ నాదము కాబట్టి శివునికి మాత్రమే అన్వయించవలసి ఉంది.
బహుశా నాకు అందని అన్వయమేమైనా ఉండవచ్చును.
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి