Loading...

27, మే 2021, గురువారం

సాహిత్యోత్సవం


హైదరాబాద్ సాహిత్యోత్సవం

             ఈరోజు వెళ్ళడం కుదిరింది. కొన్ని ప్రత్యక్ష పరిచయ కార్యక్రమాలను వినడం, చూడడం; స్థానిక కళాప్రదర్శనలు చూడడం జరిగింది.
      హైడీ  కామిక్ పాత్రను హిందీ పిల్లలకు పరిచయం చేసిన అవంతీ దేవస్థలె, గురు అర్జున్ సింగ్ కృత ఆదిగ్రంథ్ లోని పాటలను అనువదించిన అస్త్రి ఘోష్ వంటి అనువాదకుల తో పరిచయ కార్యక్రమం ఆసక్తికరంగా ఉండింది. ముఖ్యంగా అనువాదంలో భాషను మాత్రమే కాక భావనలను అనువదించే విషయం నాకు నచ్చే విషయం. ఇక దానితో పాటు ఒక సంస్కృతిని అనువదించాల్సి వచ్చినప్పుడు వారి ఆలోచనలు శ్రోతలతో పరిచయకర్తలతో పంచుకున్నారు. తరువాత శ్రోతల ప్రశ్నలకు జవాబిచ్చారు.
                      ఒక మాట చెప్పడం మరిచాను.
        ఒక అన్య సంస్కృతికి చెందిన పాత్రను, ఘటనను  స్థానికీకరణం చేయడం గురించి మాత్రం ఇద్దరు అనువాదకులు భిన్నాభిప్రాయాలను వెలువరించారు. స్థానికీకరణం చేయడం వల్ల అనువాదం చేయబడిన భాషలోని చదువరులకు ఆ యా పాత్ర, ఘటన స్వంతంగా అనిపించి దగ్గరౌతుందనేది ఒక అభిప్రాయం అయితే, ఏ భాష లోంచి అనువదిస్తున్నామో ఆ మూల భాషా పరిమళం( ఎసెన్స్) మాయం చేయడం అన్యాయమన్నది రెండో అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల మధ్య చర్చ కొత్తదేం కాదు గానీ, ఇక్కడ కూడా మరింత ప్రస్ఫుటంగా వ్యక్తం చేయబడిందంతే.
    
           అనువాదకులకెప్పుడూ ఒకటికి మించి భాషలు తెలిసే ఉంటాయి. కానీ వారిని ప్రశ్నలు వేసేవారు ఒక ప్రాథమిక ప్రశ్నను ఎప్పుడూ వేస్తుంటారు. మీకెన్ని భాషలు తెలుసు? ఎలా తెలుసు? ఎలా నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది? అని. 😊
         ఒక కొత్త భాష నేర్చుకునేటప్పుడు ఎలా ప్రారంభిస్తే బాగుంటుందన్నదీ ఒక ప్రశ్న. ఈ విషయంలో ఎవరి ప్రాధాన్యతలూ, ఆసక్తులూ వారికున్నప్పటికీ మొట్ట మొదట దృశ్య, శ్రవ్య పద్ధతులు, వాటికి సహాయంగా నోట్స్ అన్నది నా అనుభవం. ఇది టీవీ కావచ్చు, లేదా ప్రత్యక్షంగా ఆ భాషీయుల సంభాషణలు కావచ్చు. అప్పుడే మనం నేర్చుకోవాలనుకున్న భాష సాధారణంగా ఉంటుంది. వికృతంగా ఉండదు. ముప్ఫై రోజులలో డాక్టర్ కావడం ఎలా అన్న పుస్తకం మార్కెట్లో చూసి డాక్టర్ మూర్ఛ పోయాడన్న హాస్యప్రసంగాలు వింటూ ఉంటాము కానీ ముప్ఫై రోజులలో ఫలాని భాష నేర్చుకోవడం ఎలా అన్నది కూడా అటువంటి జోకే. ఆ పుస్తకాలు ఏ మాత్రమన్నా ఉపయోగపడతాయని అనుకోను.


    --------------











  తర్వాత నాకెంతో ఇష్టమైన పల్లీయుల (అంటే ప్రొఫెషనల్ అనే తీసుకోవాలి) కోలాట నృత్యం చాలా బాగుండింది.  ఉత్సాహం తగ్గకుండా , లయతప్పకుండా, పాటతో సహా నాలుగు రకాల కోలాట నృత్యరీతులు ప్రదర్శించారు.
    తర్వాత సుగాలీ (బంజారా?) నృత్యకళాకారులు చేశారు కానీ అది నన్నంతగా ఆకట్టుకోలేదు.
-------
      ఇంకొక పరిచయ కార్యక్రమం కొత్త రచయితలైన సుదీప్ నగర్ కర్, రవీందర్ సింగ్ లతో విన్నాను. రచన వస్తువు, శీర్షిక, ముద్రణ, మార్కెటింగ్ కి సంబంధించి పరిచయకర్తతోనూ, శ్రోతలతోనూ సాగింది. ఆసక్తికరమైన ఈ సంభాషణలో తన రచన గురించి మాట్లాడుతూ సుదీప్ ఎలా విద్యార్థుల పేర్లు జె ఎన్ యూ కాంపస్ కు వెళ్ళగానే కులాల పేరుతో మాత్రమే గుర్తింపబడతాయో చెప్పారు.
 

--------
 









భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో పది పన్నెండేళ్ళనుంచీ నడపబడుతున్న మ్యూజ్ ఇండియా పత్రిక వారు భక్తి కవయిత్రి  ఆండాళ్ ను ఆంగ్లంలో పరిచయం చేసిన రచయితలకూ, దేశవిభజన కాలం నాటి కథ జిందగీనామాను అనువదించిన అనువాదకులకూ బహుమతి ప్రదానం చేసి అనువాదాల్లో వారి అనుభవాలను అడిగి శ్రోతలకు అందించారు. జిందగీనామా ముక్కలు కానప్పటి పంజాబ్ ప్రాంతానికి సంబంధించినది. హిందీ, ఉర్దూ, పర్షియన్ శబ్దావళి తో కూడిన ఆనాటి వాతావరణాన్ని చూపించే ఆ నవలను అనువదించడం ఎంత కష్టంతో కూడిన పనో వారు వివరించారు.
-------
          ఒక కన్నడ కార్యక్రమంలో కొన్ని కవితలను చదివేవారూ గానం చేసేవారితో ప్రదర్శన ఉండింది.
         ఆ కవితల కన్నా చివరిగా శ్రోతల కోరిక మేరకు ప్యాసీ అనే పాటను వారు చాలా బాగా పాడారు.  ప్యాసీ అనే పాట కర్ణాటక నుంచి తమిళనాడుకు ప్రవహించే కావేరి నది పాడినట్టుగా వ్రాయబడిన పాట. మొదటి పంక్తులే ఎంతో ఆకట్టుకున్నాయి.
     కావేరి నీళ్ళ కోసం కర్ణాటక, తమిళనాడు మధ్య ఎప్పుడూ వివాదమే. ఆ రెండు రాష్ట్రాలనూ తన పిల్లలుగా భావించే కావేరి ఆ వివాదాలకు బాధపడి పాడుతోందట - మీకు నీళ్ళు త్రాగిస్తూ నేను దాహార్తినై మిగిలిపోతున్నాను. ఎవరి చేతిలో మీరు కీలుబొమ్మలుగా మారుతున్నారు అంటూ  సాగే పాట ఆకట్టుకుంది.
--------

        ఇంకేదో కార్యక్రమంలో సాగరికా ఘోష్, 'సంఘ్ వాళ్ళు కాంగ్రెస్ లో ఇందిరను మాత్రం విమర్శించరు' అని ఏదో వాళ్ళు భయపడుతున్నట్టు ఫీలైంది. నవ్వొచ్చింది. తర్వాతి మాటల్లో ఆవిడో నేషనలిస్ట్, పేట్రియాటిక్ అన్నది. ఆ రెండూ కలుపుకొని చూడలేకపోయింది పాపం. అత్యవసరపరిస్థితి వంటి కొన్ని చర్యలను విమర్శించినా, దేశ హిత కార్యక్రమాల విషయంలో బలపరిచినా- దేశం కోసం ఆలోచించి చేసే పనులైతే సంఘ్ వాళ్ళు సమర్థిస్తారనే విషయం ఆమెకెప్పుడు అర్థం కావాలి? పార్టీ కళ్ళద్దాలతో చూడ్డం అలవాటైతే ఇలాంటి దృష్టిలోపమే ఏర్పడుతుంది.

      తర్వాత చెప్పుకోదగ్గది ఎన్ ఆర్ బి (నేషన్ రాక్ బీట్) అనే సంస్థ సభ్యులు గా విద్యార్థినీ విద్యార్థులు గాన, నృత్య, రేఖాచిత్రాది కళలలో తమ సామర్థ్యాన్ని ఒక రోడ్ షో లా ప్రదర్శించిన తీరు. అదీ నచ్చింది. మనస్ఫూర్తిగా అభినందించాను.
గమనిక : ఇది ఒక పాత పోస్ట్.

26, మే 2021, బుధవారం

బడులేవి?

గలగల మాటల
 కిలకిల నవ్వుల 
గణగణ గంటల 
బడులను సడులేవి? 
 
 పొత్తపు మూటల
తత్తరపాటుల 
చిత్తపు మెత్తల 
బడులను సడులేవి? 
 
 చదువుల రాతల 
ఎదిగెడు తలపుల 
ఒదిగిన ఆశల 
బడులను సడులేవి? 
 
 
 ఒంటరితనముల, 
తంటా, గొడవల,
 తుంటరి చేష్టల
బడులను సడులేవి?
 
 పోటీ, పందెము, 
చాడీ, చతురత,
 వాడీ, వేగపు 
బడులను సడులేవి? 
 
 వేషములుండెడు 
 రోషములుండెడు 
దోషములుండెడు 
బడులను సడులేవి? 
 
 బుద్ధులు, బలములు,
 సిద్ధత, చొరవలు 
 ఉద్ధతి యుండెడు 
బడులను సడులేవి? 
 
 అల్లరి పనులా 
 తుళ్ళింతలు గల
 పిల్లల గుడులగు
బడులను సడులేవి?
 
 - లక్ష్మీదేవి.

24, మే 2021, సోమవారం

సాగుభూమి-మబ్బుల విహారం

 

విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యమాలిక ‘స్వాగతము’ పంట పొలముల స్థితిగతులను, రైతుజనుల ఆలోచనలను విశదంగా సహజంగా వర్ణిస్తారు. సహజోక్తి అలంకారము. ఇందులో ఉన్న పొలముల దృశ్యము మనమెవరైనా చూసి ఉంటామా? ఎక్కువమందిమి చూసి ఉండము. సరళమైన పదాల్లాగే ఉన్నా, మన వాడుక లో లేవు గనుక ఈ భావం వ్రాద్దామనిపించింది.
--
ఆ సాగుభూమి, పంటపొలాల విహారం కాస్సేపు.
----
ఉ) వెన్నెల తీవచాలునకు వెన్కగ నేలకు డిగ్గివచ్చి యీ
చిన్నరిమబ్బు క్రొమ్మెఱుగు చేడియతో విహరించుచుండె, మా
పొన్నలు పూతపట్టు, నిక సొంత పొలాలకు నీరమెక్కెడిన్,
మొన్నటి దాక వానలకు మోములు వాచిరి మాదు కర్షకుల్.
వెన్నెల తీగల వరుసలకు వెనుకగా ఈ చిన్న మబ్బు కొత్త మెఱుపుచెలితో విహరిస్తోంది. మా పొన్న చెట్లు పూతకు రానున్నాయి. సొంత పొలాలకు నీరు వస్తుంది. మొన్నటి వరకూ మా రైతులము వానకు మొగం వాచి ఉన్నాము.
చం) నెఱియలుపడ్డ మా పొలము నిండను తుంగలు తుమ్మదుబ్బులున్
పెరిగెను, దుక్కిటెద్దడుగు పెట్టగజాలని మా పొలాలలో
నురుమద శైవపాదకటకోజ్జ్వలనాద మనోహరంబుగా
నుఱిమిన నీ కొసంగెద నుపాయనముల్ నవబాష్ప బిందువుల్!
(ఎండి) నెఱ్ఱెలు చీలిన మా పొలము నిండా గడ్డి, తుమ్మ పొదలు పెరిగాయి, దుక్కిటెద్దు అడుగు పెట్టడమే కష్టమైన మా పొలాలలో గొప్ప మిడిసిపాటు కల శివపాదకడియపు ఉజ్జ్వలనాదము వలె మనోహరముగా నీవు ఉఱిమితే నీకు నా అనందబాష్పాలనే కానుకగా ఇస్తాను.
ఉ)కూరలపాదులెల్ల పురుగుల్ మొదలంటగ నాకిపోయె, మా
కోరడివెంబడిన్ తలలు కొంచెముగా పయికెత్తు మొక్కలున్
తీరెను, నీ నినాదమున తేరుకొనెన్ పసరాకు వేసి సిం
గారములొల్కెడున్ నిగనిగల్ వెలయించుచున్నవో ప్రభూ!
కూరల పాదులు పుర్వు పట్టి నశించాయి, మా కోరడి(మట్టి కాంపౌండ్ వాల్) వెంట కొంచెం తలెత్తిన మొక్కలూ పోయాయి. నీ శబ్దాలకు తేరుకున్నాయి. చిగురు వేసి సింగారాలు కురిపిస్తున్నాయి నిగనిగల వెలుగుతున్నాయి ప్రభూ!
ఉ)అందపు వానచిన్కు పడెనన్నది చాలని ప్రాత విత్తనా
లుందగవి దెచ్చి మా పెరటి లోపల నాటిన కూరపాదులన్
పందిరికెక్కనిమ్ము, తొలి వర్షపు చిన్కులు చిన్కి దొడ్డిలో
నందనమూడి వచ్చి పడెనా యనిపింపుము సత్కృపానిధీ!
అందమైన వానచినుకు పడిందే చాలన్నట్టు పాత విత్తనాలు తగినవి తెచ్చి మా పెరట్లో కూరపాదులు నాటాము, వాటిని పందిరి ఎక్కనివ్వు, తొలిచినుకులు కురిసి (స్వర్గం నుంచి) నందనం ఊడి మా పెరట్లో పడిందా అనిపించనీ దయానిధీ!
చం) పొడిపొడియై తలల్ ముదిరిపోయిన యెఱ్ఱని కారుజొన్నలో
పడి తిని కొత్తలో పసరుటుంగిడి తాకిన యావుదూడలున్
తడబడిపోయె మా యెడద తల్లడిలెన్, తొలి వానచిన్కు పై
బడి సుఖమయ్యె నేటి అనపాయత నొందెను మాదు సస్యముల్.
పొడివై ముదిరిన జొన్నలు తిన్న కొత్తలో ఆవుదూడలు ఉంగిడి (ఒకానొక వ్యాధి)బారిన పడగా మా ఎద తల్లడిల్లిపోయింది. తొలి వానచినుకులు మీదపడి సుఖం కలిగి, మా పంటలకు ఆపద తొలగినది.
ఉ)గొంటరి నీవు, మా మదురుగోడను వ్రాలిన రావితొఱ్ఱలో
పెంటియ తాను నొంటి విలపించుచున్నది పావురాయి, నీ
వెంటనె చూచుచున్ గడిపె వేసవి యంతయు, నీవు వచ్చి మా
పంటలతోడిపాటుగ కృపామతి దానికి దప్పి తీర్చవే!
కఠినాత్ముడివి నీవు, మా మదురుగోడ(కాంపౌండ్ వాల్) పై వాలిన రావి చెట్టు తొఱ్ఱలో ఒక ఆడపావురం ఒంటరిగా విలపిస్తోంది. నీ కోసం చూస్తూ వేసవి అంతా గడిపింది. నీవొచ్చి మా పంటలతో పాటు దానిదప్పిక కూడా తీర్చుమా కృపామతీ!
ఉ) ఒప్పులకుప్ప మా చిఱుత యూచిన గొంతున వాన వాన వ
ల్లప్పలు తిర్గుచున్ చదికిలంబడు, కన్నులు వ్యాప్తమై కనును
కప్పును పల్లెకుచ్చెలుల కాళ్లకు నృత్యము సేయ పెద్ద న-
-వ్వొప్పగ వచ్చి నా పదములూరక కౌగిట పూను గట్టిగా!
ఒద్దికగా గొంతు విప్పి మా చిన్నిబిడ్డ వానావానావల్లప్పలు తిరుగుతూ చతికిలబడుతుంది. కన్నులు పెద్దగ చేసి చూస్తుంది. తన వల్లెవాటు కుచ్చిళ్ళు నాట్యము చేస్తుండగా కాళ్ళకు అడ్డుపడుతుంటాయి. పెద్ద నవ్వొచ్చేసి నా కాళ్ళను చుట్టేసి నన్ను గట్టిగా పట్టుకొని నా సందిట చేరుతుంది.
చం)పొలములవట్టి నీరములు బోదెల నిండవు నారుమళ్ళలో
చెలమల నీరుతోడి యరచేతులు బొబ్బలు పొక్కె, బోదె లో
పలి జలమందు పిచ్చుకలు పాపము ముక్కులు ముంచుచుండె, నీ
విలయము దాటిపోయెననిపించెను నీ యురుముల్ కృపానిధీ!
నారుమళ్ళ పంటకాలువలలో నీరు నిండదు. చెలమల్లో నీటిని తోడితోడి అరచేతులు బొబ్బలెక్కాయి. కాలువనీటిలో పిచ్చుకలు పాపం, ముక్కులు ముంచుచున్నాయి. నీ విలయము దాటిపోయిందేమో అన్నట్టు నీ ఉరుములు కృపానిధీ!
నీ కృపచేత రేపటికి నీరములెక్కును మా పొలాలకున్
ఉ)తేకువ నాటులై కలుపు తీయని మళ్ళను నమ్మ పూలు కా
జాకులు, కాజపూలు తఱుచై కలుపేరెడు మాలపిల్లలున్
శ్రీకలకంఠ గీతికలచే పులకింపగ చేతురో ప్రభూ!
నీ దయతో రేపటికి నీరెక్కుతుంది. నిబ్బరంగా నాటులు అయ్యి, కలుపు తీయని మళ్ళలో కాజాకులు, కాజపూలు(కలుపుమొక్క) ఎక్కువై కలుపు ఏరే మాలపిల్లలు కోకిలలవలె పాటలతో పులకింపజేస్తారు ప్రభూ!
చం)ఒదిగిన బోదెకాలువలు నుచ్చెను మోటయు తోడ, కంబుసం
పదగల వంగచాలులకు మధ్యగ వేసిన గోగుమొక్కల
ల్లదె కొనసాగి యే వేళకొ యందును కోతకు , కంద పిల్కలున్
ప్రిదిలిన నేలపై బయలుపెట్టును పొమ్ము తలాకుపొట్లముల్.
ఒదిగి ఉన్న పంటకాలువలు, మొలచిన మోటలు(నీరు తోడు సాధనాలు), సజ్జపైరు, వంగచాళ్ళకు మధ్యలో వేసిన గోగుమొక్కలు అలా అలా పెరిగి ఏ నాటికి కోతకొస్తాయో! కందపిలకలు విచ్చిన చోటు నేలఉసిరికచెట్లను బయల్పరుస్తుందిపో!
చం)పిల పిల తేనెలై పికిలి పిట్టల యీలలు నీకు స్వాగత
మ్ములొసగు, పైడిగంటగళమున్ శ్రుతి చేసి నుతించు వానకో
యిల, కడు దీనమౌ కనులనెప్పుడు నీ వరుదెంతువంచు నీ
వలనుకె చూచు బెగ్గురులు బంతులు తీరిచి నిన్ను గొల్చెడున్.
పిలపిలలాడే తేనెల పికిలిపిట్టల ఈలలు నీకు స్వాగతం పలుకుతాయి. వానకోయిల బంగారుఘంటానాదం వంటి గొంతును శ్రుతి చేసి నిన్ను నుతిస్తుంది. దీనంగా నీ రాకకోసమే నీవైపే చూస్తూ ఉండే బెగ్గురు పక్షులు పంక్తులుగా నిలిచి నిన్ను పూజిస్తాయి.
ఉ)నీవరుదెంతు వంచును ధ్వనించెను చల్లగాలి సోకుచున్,
నీ వలిచిన్కు పడ్డ యవనీస్థలి కమ్మని తావి చిమ్మెడున్,
నీవప్రశీతలాకృతివి నీవొకరుండవె సేద్యకాండ్రకున్,
కావలి కాచు దైవమవు కష్టములన్ గడతేర్చువాడవున్.
నీవొస్తున్నావని చల్లగాలి సోకి చెప్పకనే చెప్పింది. నీ చినుకు రాలిపడిన చోట నేల కమ్మని తావి చిమ్ముతుంది. నీవు పొలానికి చలువ చేసే ఆకృతివి, నీవొక్కడవే (దిక్కు) సేద్యగాళ్లకు, కావలి కాచే దైవానివి, కష్టాలను తీర్చేవాడివి.
ఉ)దొంతులు తెచ్చి కానికలతో నెదురౌదుము బంతిపూలు , చే
మంతులు, చంద్రకాంతములు, మంకెన పూవులు, పోక బంతులున్,
వింతల గన్నెరుల్, హృదయవీథుల మా యెడ విశ్రమింపు, మా
చింతల తోపులో విడిది చేయుము శ్రావణమాసవేళలన్.
బంతులు, చేమంతులు, చంద్రకాంతాలు, మంకెనపూలు, పోకబంతులు, వింతైన గన్నేరులను దొంతులు దొంతులు గా తెచ్చి నీ కు కానుకలిచ్చుకుంటాము. మా హృదయవీథులలో మా దగ్గర విశ్రాంతి తీసుకో. శ్రావణమాసాల్లో మా చింతతోపులో విడిది చేయి.
శా)నీలాంబోధర కాంతిపుంజములు నిండెన్ ప్రాక్ప్రతీచీ దిశా
లోలాభ్యంతర వీథికావళుల నాలో గోపికాశ్రేణి లీ
లాలాస్యంబును సేయు, నాదము శ్రవోలంకారమయ్యెన్, మయూరీ
లో లచ్ఛవి పింఛ సంచిత కళారింఛోళి సంఛన్నమై.
నీలిమేఘాల కాంతి పుంజాలు తూర్పుపడమర దిక్కుల్లో నిండాయి. అంతఃపుర వీధులలో గోపికాశ్రేణులు లీలానృత్యాలు చేస్తారు. నాదము శ్రవణానందంగా ఉంటుంది. నెమలి పింఛపు ఛాయలలో కళాసందోహము సంపన్నమైంది.
----

చక్కని దృశ్యావిష్కరణ.
--------------------
కడియం అంత శబ్దం ఎలా చేస్తుందా అని ఆలోచించాను. రెండు కడియాలు ఉన్నా కూడా .
ఒక వేళ చేతి కంకణాలైతే రెండు చేతులను కలిపే భంగిమలో అవి పరస్పరం తగిలే అవకాశం ఉండొచ్చు. కానీ ఒకరివే రెండు పాదాలు ఎంత దగ్గరగా వచ్చినా రెండు పాదాల కడియాలు ఒకదాన్నొకటి కొట్టుకునే అవకాశం తక్కువే.
 
(శివతాండవము, గౌరీ లాస్యము ఒకేసారి జరుగుతుండగా చరణాభరణాలు పరస్పరం తగిలితే మధురనాదవర్ణనము కవిసమయమౌతుందని ఊహిస్తున్నాను.)
 సందర్భము ఉరుముల భీషణ నాదము కాబట్టి శివునికి మాత్రమే అన్వయించవలసి ఉంది.
బహుశా నాకు అందని అన్వయమేమైనా ఉండవచ్చును.
 
 

9, మే 2021, ఆదివారం

ఆశ- ఎమిలీ

విపత్తుల్లో, వేదనల్లో ఆ భీతావహ స్థితులనే మళ్ళీ మళ్ళీ తలచుకోవడమేల? భరించలేని భయాలనే జపిస్తూ ఉండడమెందుకు? యాసిడ్ పడి ముఖం కాలినవాళ్ళు మళ్ళీ మళ్ళీ అద్దం చూసుకుంటే కలిగేది దుఃఖం తప్ప ఇంకేమీ లేదు అని నా అభిప్రాయం. అందుకే ఈ వేదనల రోదనల సమయంలో నాకు నచ్చిన ఒక కవితను అనువదించాను. ఇందులో తప్పులు, ఒప్పులు ఉంటే చర్చించడానికి నాకు అభ్యంతరం ఉండదు. కవితను ఆస్వాదించడమంటే మరింత లోతుగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉండడంలోనే ఉందని నా అనుకోలు.
ఎమిలీ డికెన్ సన్ సుమారు నూటేభై ఏళ్ళ క్రిందటి ఆంగ్లకవయిత్రి.
ఆమె వ్రాసిన ఈ హోప్ అనే కవిత నిత్యనూతనమైనది, సార్వకాలికమైనది, సార్వజనీనమైనది అనిపిస్తుంది.
-------
‘ఆశ’ ఒక ఱెక్కలున్న గువ్వపిట్ట
మనసు కొమ్మపై వాలుతుంటుంది.
పదాలు లేని రాగాలేవో పాడుతుంది.
విరామమే లేకుండా.
సుడిగాలుల్లో కూడా ఇంపుగా వినిపిస్తుంది.
తుఫానులెంత వేదన కలిగిస్తున్నా,
ఈ చిన్న గువ్వపిట్టను ఎంత వెక్కిరిస్తున్నా,
ఎంతో మందిని వెచ్చగా పొదువుకుంటుంది.
ఎంతో దుర్భరమైన ప్రాంతాల్లో,
ఎంత కల్లోల సంద్రాల్లో కూడా.
అయినా కానీ ఎప్పుడూ , ఎంత విపత్కర స్థితిలోనూ
నన్ను ఒక్క గింజ కూడా అడగదది.
‘ఆశ’ ఒక ఱెక్కలున్న గువ్వపిట్ట
మనసు కొమ్మపై వాలుతుంది.
భరించరాని వేదనలో, ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో, అడుగు కూడా ముందుకు వేయలేని అశక్తతలో తన ఱెక్కలపై కూర్చోపెట్టుకొని మనలను ఎగిరేలా చేసేది ఒకటే.
'ఆశ.'
అందుకే కవయిత్రి ఆ చిన్ని ఆశను గువ్వపిట్టతో పోలుస్తోంది. అది మనసులో కలుగుతుంది. అందుకే దానికి మనసు కొమ్మలా ఆధారమౌతుంది. పదాలు లేని రాగం - ఎందుకంటే ఆ ఆశకు ఏ ఆధారమూ లేదు. ఏ వాదనా, తర్కమూ లేవు. అయినా ఆశ ఏమూలో గంటలా మోగుతుంది. ఎప్పుడైనా ఆశ నిరాశ అయినా, మళ్ళీ పుడుతుంది కాబట్టి దానికి విరామం లేదు.
సుడిగాలులలో చెవులు హోరెత్తి పోతున్నా ఇది ఇంపుగా వినిపిస్తుంది. వేదనల్లో , వైరాగ్యాల్లో ఆశకేది చోటు అని ఎవరెంత హేళన చేసినా ఎవరి మనసులో ఆశ ఉంటుందో, వాళ్ళకు ఒక ఆధారము, ఒక పొదువుకున్న వెచ్చదనాన్ని ఇస్తుంది. అది ఒక కల్పితమైన భద్రతాభావం. పొదువుకోవడం అంటే పక్షి పిల్లలను పొదువుకుంటుందే, అలా.
ఏ స్థితిలో ఉన్న ప్రాంతాలలో, సంక్షోభం ఉన్న స్థితులలో కూడా ఆశనే ఆసరా. అయినా నేను దాన్ని పెంచి పోషించాల్సిందేమీ లేదు, అది నన్నేమీ అడగదు అనేందుకే ఒక గింజ కూడా అడగదంటోంది కవయిత్రి.
ఆశ - Hope!


దాహం.. మోహం

 

ఉదయ్ శంకర్ గారు వ్రాసిన ఈ కన్నడ పాట చాలా ప్రసిద్ధం.
నటగాయకుడు రాజ్ కుమార్ గారు బాగా పాడారు.
-
తేలిక పదాలతో ఉన్నా, అంకితభావం ఉట్టిపడే సాహిత్యం. అందుకే కొన్ని రోజుల క్రితం  తెలుగులోకి అనువదించాను. అదేరాగంతో, అదే అర్థంతో.
---
ఏమి దాహమెంత మోహ...మేమిదాహమెంత మోహ
మెఱుగజాలనే… స్వామి
ఇంకా నీదు పేరు పలుక ముచ్చటైనదే..

చాలునన్న మాట మరిచి మనము నిన్ను చేరెను
చరణకమల స్మరణలో భ్రమరమై పాడెనే
భ్రమరమై పాడెనే
తేనెగన్న తీపి నీదు నామమందు నిండెనే
పలుకులేవి చాలవు మనము విరిసి మురిసెనే
మనము విరిసి మురిసెనే

నెఱవెన్నెల నిసిలోన మసలుచున్న తీరుగా
నాలొ మధురభావన నేను కన్న కల్పన
నేను కన్న కల్పన

గాలికన్న సులువుకాగ తేలి తేలి సాగనా
వెలుగులోన కరగనా అటుల నిన్ను చూడనా
అటుల నిన్ను చూడనా

ఏమి దాహమెంత మోహ...మేమిదాహమెంత మోహ
మెఱుగజాలనే… స్వామి
ఇంకా నీదు పేరు పలుక ముచ్చటైనదే..
--



8, మే 2021, శనివారం

ఖర్మాకాలం

 1 వ్యక్తి, 'CARONAA Ifuuse the changed spelling of CARONAA and COVVIYD-19 by affixing the same to either doors or in public places or by tying the banner in all public places, CARONAA will be disappeared from not only from Ananthapuram dist. but also from the world. This is guarantee as it is divine power as per NUMEROLOGY, COVVIYD-19 Note For all Kinds of problems such as health, wealth, family problems, marriage etc., you can get solution as per NUMEROLOGY as it is divine Power. From S.V. ANNANDD RAO, Stenographer, Judicial Dept. Ananthapuram. Cell :8919771722, 8985503799.' అని చెప్తున్న వచనం చిత్రం కావచ్చు

7, మే 2021, శుక్రవారం

దివ్వౌషధమై....

 

స్నేహదీపమా కళ్ళు తెరు (1972) అనే మళయాళ సినిమాలో పి. భాస్కరన్ వ్రాసిన పాట. 
 
 
ఇప్పుడు లోకంలో ఉన్న పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందని అనువదించాను.
మళయాళం నుంచే తెలుగులోకి అనువదించాను. ఇంగ్లీష్ పదాల్లో వీడియోలో కన్పిస్తున్న వాటిని కాదని గమనించగలరు.
మళయాళం నాకు రాదు. కానీ కొంత ప్రయత్నం మీద చేశాను. మళయాళం తెలిసినవాళ్ళు ఏమైనా తప్పు చూపితే దిద్దుకోగలను.
సహకరించగలరు.
అదే ట్యూన్, అదే అర్థంలో తెలుగు అనువాదము.
--
లోకములంతా సుఖమలరంగా
స్నేహదీపమా మము గనుమా!
కదననివారణ సాంత్వన నీవై `
అడవులనడుమన గతియగుమా!
పరీక్ష వేళల కత్తి మొనలలో
సంగరమందున భీతిల్ల
హృదయక్షతిలో నెత్తురోడగా
అశ్రునదులలో తల్లడిల్ల
తోడై నీడై దివ్యౌషధమై
జనకా! దేవా! కరమగుమా!
తృణముల, సుమముల, పురువుల, పక్షుల
వన్యజీవుల, వనచరుల
జీవబిందువుగ అమృతము నింపిన
లోకపాలకా! జగదీశా!
ఆనందమ్మను అరుణకిరణమై
అంధకారమిట అవతరించు

2, మే 2021, ఆదివారం

/\

ఎందుకిలా అవతరించిన దేవతల్లా చూడడం కొందరు, అర్థం లేకుండా నిందలకు గురి చేసి రాక్షసుల్లా చూడడం కొందరు?

వాళ్ళూ మనుషులే. ఈ సమయంలో వాళ్ళూ ఎంతో ఒత్తిడికి గురి అవుతున్నారు. వాళ్ళ పని  వాళ్ళు చేస్తున్నారు. అంతే.

గమనించండి.

'I don't know who drew this... but this art speaks louder than words...!' అని చెప్తున్న వచనం మీమ్ కావచ్చు