Loading...

13, డిసెంబర్ 2021, సోమవారం

పోతన సందేహం

 బాల్యములో పోతన తన తల్లిదండ్రులతో నాటకం గురించి సందేహాలనడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పడం, అందులోని తాత్వికతను లౌకికముగా కానదగిన విషయసమాచారంతో నిరూపించి చెప్పడం సుప్రసిద్ధ కవి వానమామలై వరదాచార్య విరచిత 'పోతన చరిత్రము' కావ్యములో ఒకానొక (కల్పితమైన ?) చక్కటి సన్నివేశము.

-

వచ్చుచుఁ బోవుచుండె నటవర్గము లోనికదేల యన్నచోఁ 
జచ్చుచుఁ బుట్టుచుండె జనసంఘము భూస్థలినేలయంచు వా
రెచ్చట కేఁగుచుండిరన నెవ్వడు వారికి వేసమిచ్చుచు
న్బుచ్చునొ యట్టి సూత్రధరు పొంతకుఁ బోదురటంచుఁ బల్కినన్.


"వస్తూ పోతూ ఉన్నారేం ఈ నటులు లోపలికి?"

"చస్తూ పుడుతూ జనులు భూమిలో ఉండడం లేదూ అలాగే."

"ఎక్కడికి వెళ్తున్నారలా?" "ఎవడు వారికీ వేషం కట్టి

పంపాడో ఆ సూత్రధారి దగ్గరకే"


ఏఁగిన వీరిఁగాంచి యతఁడేమని పల్కునటన్న వారి వే షాగతులంబొనర్చి యెటులాడుఁడు పాడుఁడటంచుఁ దెల్పెనో
యాగతి యాడిపాడిన నహా! యని వారల మెచ్చు నిచ్చు మే
ల్భోగములట్లు జేయమిని పొండని దండనఁ జేయువాఁడనన్.


" అలా వెళ్ళిన వారిని చూసి అతడేమంటాడు?"

" వారి వేషాలను ఎలా ఆడిపాడమని చెప్పాడో అలా 

చేస్తే ఆహా అని మెచ్చి మరిన్ని మంచి భోగాలనిచ్చి చేయనివారిని

పొండని దండన చేస్తాడు"

-

ఇలా సాగుతుంది.

అందమైన పద్యాలు, చక్కటి ధార, సన్నివేశకల్పన, సహజవర్ణన.

--

పరిచయం చేసిన సన్మిత్రుల పట్ల కృతజ్ఞురాలను.

7, డిసెంబర్ 2021, మంగళవారం

ఇంపైన గానము

 రాగాలాపమ్ములో సారముఁగలిగినదై, రమ్య శబ్దంపు ప్రోదై,
సాగే గానమ్మె యింపై, సహృదయముల సంస్కారముంజేయు మందై,
భోగాపేక్షల్ ప్రమోదమ్ములు నొసగెడి యాపూర్ణరాగంపు జల్లై,
యోగానందంపు కొమ్మై, యురవడి పరుగై, యుల్లసమ్మిచ్చునోయీ!


--లక్ష్మీదేవి.

స్రగ్ధర.

30, నవంబర్ 2021, మంగళవారం

ఎన్నో..

 కంటికి కనిపించని యుద్ధాలెన్నో ఒక్కొక్కరికీ తనదైన చిన్ని ప్రపంచంలో
చికిత్సకు నయం కాని గాయాలెన్నో తనదైన మనో లోకంలో
దినసరి సమస్యలే ఊతంగా నిలువగలిగే చింతల సుడిగాలులెన్నో బతుకుబాటలో
ప్రతిష్ఠల ఆనకట్టలు ఆపే వరదలెన్నో  శోకవాహినీగతులలో


మాటలు వివరించలేని ఆనందాలెన్నో ఒక్కొక్కరికీ తనదైన చిన్ని ప్రపంచంలో
చికిత్సే లేకుండా నయమైన గాయాలెన్నో తనదైన మరో లోకంలో
ఆశించకుండానే వరించే చనవుల మందమారుతాలెన్నో జీవనపథంలో
సిరినగవుల తళుకు పొదిగిన కంటి చెమ్మలెన్నో హర్షాతిరేకాల సుస్వర శ్రుతులలో


'మెరుపు చెంగటనున్న మేఘమ్ము'కన్నా అందానందాలు కలిగినది - సిరినవ్వుతో కూడిన కంటిచెమ్మ. కాదా!!

24, నవంబర్ 2021, బుధవారం

మాయ

 ఇలలో విశ్వపు మాయలో పడుచు, నెంతే లోతులన్ మున్గుచున్,
కలగా లేచుచు, నంతలోనె విధిగా కల్లోలమున్ క్రుంగుచు,
న్నిలువంజాలక నుండియున్; మనికిని,న్నీకాయమున్, కాయమున్
విలువైనట్టివటంచు, కోరెదము వే ప్రేమమ్ములన్ చెల్ములన్. 


--- లక్ష్మీదేవి.

మత్తేభవిక్రీడితము.

23, నవంబర్ 2021, మంగళవారం

విముక్తి

 చివరి పయనం కదా విముక్తి..

విముక్తి కదా అచ్చమైన స్వేచ్ఛ..

22, నవంబర్ 2021, సోమవారం

పలుకు

 సౌరునుఁ గల్గియుండినను, ఛందపు రూపునఁ గూర్చి పెట్టినన్;
మారుగ నేర్పుతో వచనమందున నైన; కవిత్వశోభతో
స్వారసికాదులన్ , విమల స్వాంతములన్ మురిపించకున్నదై,
నీరసమైనచో పలుకు నిల్వగఁజాలునె? మెచ్చవచ్చునే?


-- లక్ష్మీదేవి.

ఉత్పలమాల.

తిట్లు _అపనిందలు

 రాజకీయాల్లో మాత్రమే కాదు, ఈ దరిద్రం ప్రతి వృత్తి ఉద్యోగాల్లో, ఇళ్ళల్లో కూడా ఉంది.  అవతలి స్త్రీమీద నెగ్గినట్లు ఆ యా మూర్ఖులకు తోచే పనికిమాలిన భావన కోసం ఆమె పర్సనల్ విషయాన్ని తీయడమో, లేని విషయాన్ని అంటగట్టడమో వంటివన్నీ చేస్తారు. ఆడవాళ్ళు పెద్దగా కొట్లాటల్లో లేకపోవడానికీ , కొట్లాటను పెద్దగా చేయాలంటే భయపడడానికీ కారణం ఇదేనేమో. లేకపోతే ఆవేశాలు, ఉద్వేగాలు మనుష్యులందరికీ ఒకటే కదా! చప్పున ఏమైనా అనేస్తే నిజం కన్నా ఇవే ఎక్కువ బయట తిరుగుతాయి అని నిజాయితీగా ఎదురుతిరగాల్సిన సందర్భంలో కూడా స్త్రీలు తగ్గే జీవనం గడుపుతుండడం ఎవరికి తెలియని విషయం?  వినోదం కోసం ఆ యా అపనిందలను అందరూ చెప్పుకునే బాచ్ లకూ తక్కువలేదు సమాజంలో.  ఇందులో ఇంకా పనికిమాలిన సంగతేంటంటే స్త్రీలు కూడా కొందరు ఇదే చేస్తారు. మానవ సమాజం అంటే అసహ్యం తప్ప ఇంకేమీ కలగదు.

22, అక్టోబర్ 2021, శుక్రవారం

చుక్కలు- ముత్యాలు- వామనుడు

    త్రివిక్రమావతార వర్ణనలో, నక్షత్రాల వరుస వరుసగా ముత్యాలగొడుగుగా, ముత్యాల హారంగా, ముత్యాల నడుముపట్టీగా, చివరికి ముత్యాల నూపురంగా భాసించిందని వేదాంత దేశికుల వారి కృతి "శ్రీ దేహళీశ స్తుతి" లో ఉందని శ్రీదేవీ మురళీధర్ గారి రచన 'వేదాంత దేశికులు' చదువుతుంటే తెలిసిందిప్పుడే.
    -----
    భక్తప్రియత్వయి తథా పరివర్ధమానే
    ముక్తా వితాన వితతిస్తవ పూర్వమాసీత్ ।
    హారావళిః పరమథో రశనా కలాపః
    తారాగణస్తదను మౌక్తిక నూపుర శ్రీః ॥
    ఊహాతీతమైన త్రివిక్రముని శరీరాకృతి వర్ణన అద్వితీయం. ముందు నక్షత్రమండలం ముత్యాల గొడుగులా స్వామి తల చుట్టూ పరిభమించింది. మరింతగా విజృంభించిన ఆకృతి మెడలో అది ముత్యాల హారమైంది. ఇంకా పైకెదిగిన స్వామి నడుమున ముత్యాల పట్టీ వలె భాసించింది. చివరికి భావనాతీతంగా పెరిగిపోయిన పరమాత్ముని పాదాలకు చక్కని ముత్యాలనూపురమై ఒదిగింది ఆ అఖండ నక్షత్రమండలం!
    --శ్రీదేవీ మురళీధర్ గారి రచన వేదాంత దేశికులు నుండి.
    ----
    అని ఈ పుస్తకంలో చదవగానే ఏమి గుర్తు వస్తుంది? పోతన వర్ణన.
    వామనుడు ఎంతగా పెరిగాడంటే, మొదట అతనికి ఛత్రము వలె శోభించిన సూర్యబింబము, తరువాత శిరోరత్నములా, చెవి ప్రోగులా, కంఠాభరణములా, బంగారు దండకడియములా, కంకణములా, మొలత్రాడులో గంటలా, కాలి అందెగా చివరకు పాదం క్రింద పీటగా భాసించింది.
    రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
    శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
    ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
    ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్
    - పోతన .
    --
    పోతన కన్నా వేదాంత దేశికులు సుమారు వందేళ్ళు ముందటి వారు అంటున్నారు గనుక, పోతన ఈ శ్లోకము నుంచి స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తుంది. అక్కడ నక్షత్ర మండలానికి తగినట్టు సుందరమైన వర్ణన ఉంటే ఇక్కడ సూర్యబింబానికి తగిన వర్ణనగా పోతన అందమైన వర్ణన చేశాడు. రెండూ చక్కని భావనాలహరులే.
    --
    ఈ విషయం ఇంతకు మునుపే గమనించిన చదువరులు విపులంగా వ్యాసం వ్రాసి ఉంటే చదివితే బాగుండును.
    అంతే కాక ఈ సంస్కృత శ్లోకం గురించి ఇంకొంచెం స్పష్టమైన వ్యాఖ్య దొరికితే చదవాలి.
    దేహళీశ స్తుతి ఆళ్వారుల తమిళ కృతి. దాని సారాన్ని దేశికుల వారు సంస్కృతంలో వెలయించారట.

 

19, అక్టోబర్ 2021, మంగళవారం

నా భాష

వెఱ్ఱినవ్వుల యాననమ్ములు, పిచ్చిమాటలునున్నచో
సఱ్ఱుమంచును నిందలన్ దిగ జారు వైనములున్నచో
చిఱ్ఱుబుఱ్ఱను లక్షణమ్ముల చేతలన్ మతి లేనిచో
చుఱ్ఱుమంచన వాతవెట్టుటె సూక్తమైన విధానమౌ.
--లక్ష్మీదేవి.
మత్తకోకిల.
నేను వ్యావహారిక భాషలోనే ఛందోబద్ధమైన పద్యాలు వ్రాస్తుంటాను. నాది వ్యావహారిక భాషోద్యమం కాదు. సంధిసమాసాలతో కూడిన పదబంధాలు, సంస్కృతమిశ్రితమైన తెలుగు, గంభీరంగా వినిపించి, శబ్దార్థాలతో వాటిలో అలంకారాలతో రసోపేతమై శోభించే భాషనే నాకు ప్రియమైనది. కాకపోతే అలాంటివాటిని చదివి కొంతవరకూ అర్థం చేసుకోడమే తప్ప, వ్రాసేంతగా ఆ భాష తెలీదు, చేతకాదు. అందుకే కేవలం వ్యావహారికభాషలోనే వ్రాస్తాను. నాకొచ్చే సలహాలేమంటే అందరికీ అర్థమయ్యేది సరళమైన భాషే కాబట్టి అదే మంచిదని. కానీ నాకు ఇందులో ఏ విశేషమూ కనిపించదు. స్వర్గానికెక్కలేమని ఉట్టికెక్కడమే గాని మరొకటి కాదు.

13, అక్టోబర్ 2021, బుధవారం

వివేకమున్న మాటలా?

సందేహాలూ - గందరగోళాల సభ -
వైరాగ్య భ్రమల్లో ఉన్న అ ఆ ఇ ఈ సభ్యులు.
పంచచామరము.
అ -విరాగమన్ననెేమొ నేర్చు వేళదెన్నడోకదా!
ఆ - బిరాన నేర్పునట్టి తత్వవేది యెవ్వరో కదా!
ఇ - విరాగమందు రాగమా? వివేకమున్న మాటలా?
ఈ - సరైన దారి చూపుమా! విశాలమైన విశ్వమా!
విరాగమన్ననేమొ నేర్చువేళదెన్నడో కదా!
బిరాన నేర్పునట్టి మార్గవేది యెవ్వరో కదా!
విరాగమందు రాగమా? వివేకమున్న మాటలా?
సరైన దారి చూపుమా! విశాలమైన విశ్వమా!
వైరాగ్యం - detachment - దేనిమీదా ఇచ్ఛ గానీ, నాది అన్న భ్రమ గానీ లేకుండడం.
నాడైనా, నేడైనా అందరికీ అవసరమైనది. ఎవ్వరికీ లభించనిది ఇది.
 'దేనిమీదా ఇచ్ఛలేని తత్వం' మీద మాత్రం ఇచ్ఛ ఎందుకు? చొప్పదంటు ప్రశ్న. అంటే అర్థసారం లేని పిప్పి వంటి ప్రశ్న. మూర్ఖప్రశ్న.
ఇచ్ఛ, మమత్వం అనే భ్రమలు సహజంగా వదలడం నిజంగా అవసరమైన స్థితే. కానీ ఆ స్థితిని కోరుకుంటూ, దానికోసం తపిస్తూ ఉన్నారంటే అది వారికి ఆమడదూరమే. దేనికోసమూ తపించని స్థితికి ఒక పక్వతతో చేరడం వల్లే నిజమైన శాంతి కలుగుతుంది అని ఊహిస్తున్నాను. ఊహనే. నిజంగా చేరే స్థితి నాకు, మనలో చాలా మందికి రాదు. వచ్చినవాళ్ళు ఏం చెప్తారో. ఏమీ చెప్పరనుకుంటా.ఇదంతా సహజమని ఒప్పుకొని సంపూర్ణేచ్ఛామమతలతో ఉంటే తప్పేం లేదు.

హోరాహోరీ!!!

May be an image of 1 person and text 

లక్షల ఓట్ల తేడా అంటేనే అవి తేడా ఎన్నికలనే అర్థం. మూర్ఖంగా పడిన ఓట్లతోనే అలా గెలవగలరు. నెహ్రూ అయినా అంతే ఎన్టీయారైనా ఇంకెవరైనా అంతే. ఇక్కడ నెహ్రూ అభిమానులను మించిన అభిమానులున్నవారు 1952 లోనే ఒకరున్నారన్నమాట.

---

నెహ్రూ గెలిచింది ద్విసభ్య నియోజకవర్గం. అప్పట్లో ఒక స్థానంలో ఇద్దరు గెలిచి వచ్చే పద్ధతి ఉండేదిట. ఆవిధంగా ఓట్లసంఖ తగ్గిపోతుంది. (అందుకే నల్లగొండ ఎంపీకి ఆధిక్యంగా వచ్చినన్ని ఓట్,లు నెహ్రూ మొత్తం ఓట్లకన్నా తక్కువ.)

1961లో ద్విసభ్య, త్రిసభ్య నియోజకవర్గాలను రద్దు చేస్తూ చట్టం చేశారు. బ్రిటన్‌లో 1950 ఎన్నికలకు ముందు ఈ పద్ధతే ఉండేది. అయితే అమెరికాలో ఒకరి కన్నా ఎక్కువ మందిని ఎన్నుకునే విధానం ఇప్పటికీ ఉంది. దాన్ని బహుళ సభ్యుల జిల్లా అంటారు. అక్కడా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందిని ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నుకుంటారు. 

కొసమెరుపు -  ఒకరిని ఒకరు అంత చిత్తుగా ఓడిస్తే, హోరాహోరీగా పోరాటం జరిగిందని వ్రాశారు. ఆ పదానికి అర్థం తెలియక వ్రాసుంటారేమో.

8, అక్టోబర్ 2021, శుక్రవారం

ముద్రాలంకారవృత్తము

 

మత్తేభమ్ముల ఘ్రీంకరింపులును, నిర్మానుష్యమౌ కానలున్,
చిత్తాకర్షక పుష్పమంజరులు, నుత్సేకించు శార్దూలముల్
విత్తమ్మన్నదె లెక్కలేదనెడు నిర్వేదమ్ము; నుత్తేజమే
సొత్తై దుంకుచు జింకలుండునన నుల్లాసమ్మునూహించగా.
-- లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితము.

7, అక్టోబర్ 2021, గురువారం

నల్లమబ్బంచు తెల్లనురగచీర

 

భోజ కృతి చంపూరామాయణం లో బాలకాండ చదివాను.
హడావిడిగా కథ చెప్పేస్తున్నాడు భోజుడు.
వాల్మీకి రామాయణం (సంస్కృతానికి తెలుగు అర్థం మాత్రమే ఇచ్చిన గీతా ప్రెస్ వాళ్ళ ముద్రణ) చదివిన తర్వాత ఇంకో రామాయణమేదీ ఆకట్టుకోదని తెలిసినా చదివాను. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉన్నా, ఆకట్టుకోలేదసలు. పూర్తిగా చదివే ఉద్దేశ్యం ఇప్పటికి లేదు. మిగతా కవులటుంచితే, భోజుడు కదా! సరే భోజులెంతమందో, కాళిదాసు కొలువున్న భోజుడి గురించి ఎక్కువ ఆశిస్తాం. ఆ భోజుడు, ఇతడు ఒకరేనా కాదా అన్న చర్చలో ఆసక్తి లేదు.
కానీ ఇందులో నచ్చిన దృశ్యం ఒక గంగావతరణం.
గంగావతరణదృశ్యం
దిగంతాలను తాకుతూ ఆకాశమధ్యంలో వ్యాపించిన ధవళతరంగాలతో , శంఖము వలె శశాంకుడు శోభితమైన నక్షత్రమాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మందాకినిలో మందారము మొదలైన చిన్న వృక్షాలు కొట్టుకొనిపోతుండగా, వాటి శాఖాంతాలు మాత్రమే కనిపిస్తున్నాయి. (శాఖల చివర పువ్వులు మాత్రమే కనిపిస్తుంటే సుమధారిణియైనట్టు ఉందేమో, భోజుడామాట అనలేదెందుకోమరి.) దిగంతాల వరకూ ధవళ వస్త్రగానుండగా అటూ ఇటూ చివరల నల్లటి మేఘమాల సన్నటిగీతలా కనిపిస్తోంది.(నల్లంచు తెల్లచీరా!!)
ఆ వర్ణనకేదో సుమారైన పద్యమైనా తెలుగులో వ్రాద్దామని ప్రయత్నం. 
చెల్లాటమ్ముల రాలెనో నగలనన్ శీతాంశు తారావళుల్
నల్లంచై మొయిలున్నదో యనగ ఫేనమ్ముల్ దిశల్ జేర, నా
కల్లోలాంశుక , దివ్యపుష్పశిఖియై గంగాంబ తా వచ్చెనే,
యుల్లాసమ్ముగ; పృథ్విపుణ్యనదియై, యుద్ధారమే లక్ష్యమై.
--లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితము.
ఆటలలో రాలిన నగలో అన్నట్టు చంద్రుడు, చుక్కలు కనిపిస్తుండగా, మొయిలు నల్లంచు గా నురగల తెలుపు దిశలంటగా, అలలే అంబరమైన గంగాంబ
దివ్యపుష్పాలు ధరించి పృథ్వికంతటికీ పుణ్యనదియై ఉద్ధరించే లక్ష్యముతో ఉల్లాసముగా వచ్చెనే!!!

25, సెప్టెంబర్ 2021, శనివారం

ఎటు పోతున్నాం?

 May be an image of text

12, జులై 2021, సోమవారం

ఏం చేస్తున్నావ్ అంటే...

 

ఉలగబోసి ఎత్తుకోవడం అనే సామెత ఉంది. అంటే (అజాగ్రత్త వల్లో, మరోటో) కింద పడిపోయాయి, మళ్ళీ అన్నీ ఏరి/తీసి జాగ్రత్త చేయడం లేదా పాలలాంటివి పడితే అంతా శుభ్రం చేయడం ఇలా అనవసరంగా పని పెంచుకున్నాను అనడం.  ఏం చేస్తున్నావు అంటే ఏముంది, ఉలగబోసి ఎత్తుకుంటున్నా అంటారు, తమ మీద తమకే విసుగుతో.
ఉలగబోసి=ఒలకబోసి= కిందపడేసి
ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు కూడా ఇదే చేస్తున్నట్టున్నాయి.
May be an image of text

9, జులై 2021, శుక్రవారం

పెద్దవృత్తం - చిన్నవృత్తం

 భారతీయులు ఆహా ! భారతీయులు ఓహో ! అంటారని ఎందరో గేలి చేస్తుంటారు. హేళనగా చూస్తారు. పోన్లే మంచిదే ఎందుకీ దురభిమానాలు అనుకునేంతలో, వాళ్ళే మళ్ళీ తమకు నచ్చిన ప్రాంతాలను - ఆంధ్రులు ఆహా! తెలంగాణ్యులు ఓహో! హైదరాబాదీలు ఆహా! గోదావరీయులు ఓహో! రాయలసీమవాసులు ఆహా! కోస్తావాళ్ళు ఓహో! మళయాళీలు ఆహా! విదేశీయులు ఓహో! అనడం ఏమిటో నాకర్థం కాదు.

అది పెద్ద వృత్తమైతే, ఇవి చిన్న వృత్తాలు. ఏముంది తేడా? ఆ వృత్తపరిధిలోని అందరూ అందరికీ తెలియనట్లే ఈ చిన్న వృత్తాల్లో కూడా అందరూ అందరికీ ఏం తెలిసుండరు.
అసలు ప్రాథమికంగానే మంచిచెడులు, ఎక్కువతక్కువలు అందరిలోనూ ఉంటాయి అనేది అందరికీ తెలుసు.
కాబట్టి ఎదుటివారిని దేనికి గేలి చేస్తున్నామో అది మనం చేయకపోవడం బాగుంటుంది. లేదా ఎదుటి వారిని గేలి చేయకుండా ఉంటే బాగుంటుంది.
ఎవరికీ ఉపదేశం? ఎవరో వింటారని, ఆలోచిస్తారని కాదు. ఏదో గోడమీద గోడు. అంతే

8, జులై 2021, గురువారం

చుక్క రూపేమిటి?

 

కన్ను చూపించిందంతా సత్యము కాదు. పూర్వాపరాలను అరసి నిశ్చయించుకోవాలనేది ఎంత సత్యము!
కోరా లో ఒక మంచి ప్రశ్న, సమాధానము చదివాను. ఇక్కడ పెడదామనిపించింది.
If the Sun is a star, why isn’t it shaped like one?
*****
Only fictional stars are shaped like this: ⭐️
In reality, stars have spherical shapes, like our sun does. However, with few exceptions, we just can’t see other stars’ round shapes, because they are too far away.
They have extremely bright surfaces, like the sun does, but they are so far away, that they appear as mere tiny specks of light.
Some stars may appear to have spikes on them, such as in photos that were taken through very powerful telescopes, but those spikes are not really part of the Star. Rather, they are just artifacts that can appear in the lens.
Have you ever seen streaks of light, radiating from a bright city light, in a photo that was taken at night? It’s from the same effect that causes apparent “spikes” on a star.

6, జులై 2021, మంగళవారం

లక్ష్యం - పట్టుదల

 https://www.space.com/virgin-galactic-richard-branson-vss-unity-flight?fbclid=IwAR3t49yq6eHGXkx79BbqwIXvUF_xMSQU90k-Q2aYzOaw5VgWxWZJtEPB2SI

ఇంతకుముందు కూడా వెళ్ళారు, కేవలం స్పేస్ టూరిజం వల్ల ఏం సాధిస్తారు, భూమి గొప్పనా ఆకాశం గొప్పనా, సఫలమౌతుందా విఫలమౌతుందా, భారతీయులున్నారా, విదేశీయులున్నారా ఇవన్నీ కాదు. ఒక పెద్ద లక్ష్యం ఉండడం, ఆ పట్టు వదిలిపెట్టక కొనసాగించడం ఇవి ప్రతి మనిషికీ ముఖ్యం. ఈ విషయంలో కూడా అదే నన్నాకర్షిస్తుంది.

 

26, జూన్ 2021, శనివారం

మూలకాల చిట్టి పేర్లు - లక్షణాలు

 

https://vis.sciencemag.org/chemhaiku/?fbclid=IwAR3Sjt0dEjDef1p3QVx9c_PbYA-aat-vRfBSxouiyIfMEs8Y8nLKvhHjtJU

సైన్స్ మూలకాల పేర్ల పట్టిక - ఆ పేర్ల గురించి వ్రాసినట్టూ , ఇతరంగానూ కూడా ధ్వనించే చిట్టి కవితలు. ఆ పేరు మీద హోవర్ చేయగానే ఆ కవిత ప్రత్యక్షం కావడం, వాటిని చూస్తే వాటి ప్రాపర్టీస్/ఫీచర్స్ కూడా సులువుగా గుర్తొచ్చేలా కూడా ఆలోచించి వ్రాయడం బాగుంది.

17, జూన్ 2021, గురువారం

ఎటు పోతున్నాం?

 వందేళ్ళనాటి ఈ గుళ్ళు

 మంచి తీర్పు. 

అవి చాలు, వాటిల్లో ఉండే శిల్పకళ, ప్రశాంతత, పెద్ద ఆవరణ ఇవన్నీ కూడా రక్షించుకుంటే చాలు.

మళ్ళీ వాడకో గుడి పేటకో గుడి కట్టడం అవసరమే లేదు.

13, జూన్ 2021, ఆదివారం

పిచ్చి-షాక్

 షాకుల మీద షాకులిస్తూ పిచ్చి కుదురుస్తున్నారో పిచ్చి పట్టిస్తున్నారో తెలీడం లేదు. అసలు ప్రజలకు రియాక్ట్ అయ్యే టైమ్ కూడా ఇవ్వట్లేదు.  మళ్ళీ ఓదార్పు అవసరం తప్పకుండా ఉంటుంది  రాజ్యప్రజలకు. 

పేరు చెప్పాల్సిన పని లేదు.  "అందరం పిచ్చోళ్ళమే"  అనే పేరు మార్చుకోగలిగే ఒక రాజ్యం గురించి ఈ సంతాప ప్రకటన. 

😦🥺🙏😑

వార్తలు-గొడవలు

 https://science.thewire.in/the-sciences/when-legit-research-is-presented-as-controversial-good-luck-getting-sciences-help/?fbclid=IwAR1fJ5JPBwXRF6EX5IP4Xxj9KuiO-gwEpOzaFOzKaOtWeHuw1ejQMXRuWvI

11, జూన్ 2021, శుక్రవారం

సె శ శె

 * వారు సెలవిచ్చినారు/వారి సెలవైంది =వారు చెప్పినారు/ఆనతిచ్చినారు

* వీరు సెలవు పుచ్చుకున్నారు = వీరు బయల్దేరినారు; 

     సెలవిప్పించండి = ఆజ్ఞ/అనుమతి ఇప్పించండి (బయల్దేరడానికి)


సెలవు అంటే ఆజ్ఞ, అనుమతి మొదలైన అర్థాలున్నందున ఈ రెండు సందర్భాల్లోనూ

వాడడం జరుగుతుంది.

 ---

మనము ప్రస్తుతం విరివిగా వాడుకునే సందర్భం ఒక్కటే. 

సెలవులు  = పని కి విరామదినములు. ఇది కూడా ఇప్పుడు లీవులు, హాలీడేస్ అంటేనే తెలుస్తుందన్నది వేరే విషయము.

--

సెలవు అంటే ఖర్చు తమిళంలో ఉన్నందున ఆ దరిదాపు ప్రాంతాల్లో ఆ అర్థములో కూడా వాడుతుంటారు.

శెలవు అనే రూపం నిఘంటువులో లేదు. మరింత సరిగ్గా వ్రాస్తామనుకుంటూ శె వాడుతుంటామనుకుంటా.

7, జూన్ 2021, సోమవారం

అడకత్తెర

 

అడకత్తెర
కన్నడ మూలము : కె ఎస్ నరసింహస్వామి
తెలుగు అనువాదము: లక్ష్మీదేవి.
*****
చలికాలం వస్తే ‘ఎంత చలి?’ అంటారు;
వచ్చిందా వేసవి, ‘పాడు ఎండలం’టారు;
వాన పడెనా, ‘విడువదు శని!’ అనుచు నింద;
వీరు మెచ్చునది లేదిచట, తెలిసిందా!
 
చిగురు పసిడి నడుమ పువ్వు కోరెదరు;
పువ్వుల కాలమున పండ్లఁ బొగడెదరు;
‘పండేది? పీల పిందె’ అనుచునొక నింద;
వీరు మెచ్చునది లేదిచట, తెలిసిందా!
 
నిలుచున్న-నడిగేరుః ‘ఏల నిలిచేవు?’
పడుకున్న గొణిగేరుః ‘చింతలే లేవు.’
పరుగిడిన వీపు వెనుక వీరి నింద;
వీరు మెచ్చునది లేదిచట, తెలిసిందా?
 
చదువు తఱి యడిగేరుః వ్రాయి మరలనుచు;
రాతలను వెదకేరు: ఒప్పు తప్పనుచు;
వీరి ముచ్చటలేమొ!వీరిదే నింద;
వీరు మెచ్చునది లేదిచట, తెలిసిందా!
***
వందేళ్ళ ముందు జన్మించిన ప్రసిద్ధ కన్నడ రచయిత కె ఎస్ నరసింహస్వామి వ్రాసిన కవిత 'ఇక్కళ' . ఇక్కళ అంటే పట్టకారు. పట్టకారు మధ్యలో ఇరుక్కున్నట్టే ఈ లోకుల మధ్యన. ఏమి చేసినా తప్పు పట్టేందుకు సిద్ధంగా ఉంటారన్నది సారాంశము. ఇక్కడ మధ్యలో ఇరుక్కున్న సందర్భానికి అడకత్తెర అన్న వాడుక తెలుగులో ఉంది కాబట్టి అదే పేరు పెట్టాను.