Loading...

22, అక్టోబర్ 2021, శుక్రవారం

చుక్కలు- ముత్యాలు- వామనుడు

    త్రివిక్రమావతార వర్ణనలో, నక్షత్రాల వరుస వరుసగా ముత్యాలగొడుగుగా, ముత్యాల హారంగా, ముత్యాల నడుముపట్టీగా, చివరికి ముత్యాల నూపురంగా భాసించిందని వేదాంత దేశికుల వారి కృతి "శ్రీ దేహళీశ స్తుతి" లో ఉందని శ్రీదేవీ మురళీధర్ గారి రచన 'వేదాంత దేశికులు' చదువుతుంటే తెలిసిందిప్పుడే.
    -----
    భక్తప్రియత్వయి తథా పరివర్ధమానే
    ముక్తా వితాన వితతిస్తవ పూర్వమాసీత్ ।
    హారావళిః పరమథో రశనా కలాపః
    తారాగణస్తదను మౌక్తిక నూపుర శ్రీః ॥
    ఊహాతీతమైన త్రివిక్రముని శరీరాకృతి వర్ణన అద్వితీయం. ముందు నక్షత్రమండలం ముత్యాల గొడుగులా స్వామి తల చుట్టూ పరిభమించింది. మరింతగా విజృంభించిన ఆకృతి మెడలో అది ముత్యాల హారమైంది. ఇంకా పైకెదిగిన స్వామి నడుమున ముత్యాల పట్టీ వలె భాసించింది. చివరికి భావనాతీతంగా పెరిగిపోయిన పరమాత్ముని పాదాలకు చక్కని ముత్యాలనూపురమై ఒదిగింది ఆ అఖండ నక్షత్రమండలం!
    --శ్రీదేవీ మురళీధర్ గారి రచన వేదాంత దేశికులు నుండి.
    ----
    అని ఈ పుస్తకంలో చదవగానే ఏమి గుర్తు వస్తుంది? పోతన వర్ణన.
    వామనుడు ఎంతగా పెరిగాడంటే, మొదట అతనికి ఛత్రము వలె శోభించిన సూర్యబింబము, తరువాత శిరోరత్నములా, చెవి ప్రోగులా, కంఠాభరణములా, బంగారు దండకడియములా, కంకణములా, మొలత్రాడులో గంటలా, కాలి అందెగా చివరకు పాదం క్రింద పీటగా భాసించింది.
    రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
    శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
    ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
    ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్
    - పోతన .
    --
    పోతన కన్నా వేదాంత దేశికులు సుమారు వందేళ్ళు ముందటి వారు అంటున్నారు గనుక, పోతన ఈ శ్లోకము నుంచి స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తుంది. అక్కడ నక్షత్ర మండలానికి తగినట్టు సుందరమైన వర్ణన ఉంటే ఇక్కడ సూర్యబింబానికి తగిన వర్ణనగా పోతన అందమైన వర్ణన చేశాడు. రెండూ చక్కని భావనాలహరులే.
    --
    ఈ విషయం ఇంతకు మునుపే గమనించిన చదువరులు విపులంగా వ్యాసం వ్రాసి ఉంటే చదివితే బాగుండును.
    అంతే కాక ఈ సంస్కృత శ్లోకం గురించి ఇంకొంచెం స్పష్టమైన వ్యాఖ్య దొరికితే చదవాలి.
    దేహళీశ స్తుతి ఆళ్వారుల తమిళ కృతి. దాని సారాన్ని దేశికుల వారు సంస్కృతంలో వెలయించారట.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి