Loading...

7, అక్టోబర్ 2021, గురువారం

నల్లమబ్బంచు తెల్లనురగచీర

 

భోజ కృతి చంపూరామాయణం లో బాలకాండ చదివాను.
హడావిడిగా కథ చెప్పేస్తున్నాడు భోజుడు.
వాల్మీకి రామాయణం (సంస్కృతానికి తెలుగు అర్థం మాత్రమే ఇచ్చిన గీతా ప్రెస్ వాళ్ళ ముద్రణ) చదివిన తర్వాత ఇంకో రామాయణమేదీ ఆకట్టుకోదని తెలిసినా చదివాను. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉన్నా, ఆకట్టుకోలేదసలు. పూర్తిగా చదివే ఉద్దేశ్యం ఇప్పటికి లేదు. మిగతా కవులటుంచితే, భోజుడు కదా! సరే భోజులెంతమందో, కాళిదాసు కొలువున్న భోజుడి గురించి ఎక్కువ ఆశిస్తాం. ఆ భోజుడు, ఇతడు ఒకరేనా కాదా అన్న చర్చలో ఆసక్తి లేదు.
కానీ ఇందులో నచ్చిన దృశ్యం ఒక గంగావతరణం.
గంగావతరణదృశ్యం
దిగంతాలను తాకుతూ ఆకాశమధ్యంలో వ్యాపించిన ధవళతరంగాలతో , శంఖము వలె శశాంకుడు శోభితమైన నక్షత్రమాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మందాకినిలో మందారము మొదలైన చిన్న వృక్షాలు కొట్టుకొనిపోతుండగా, వాటి శాఖాంతాలు మాత్రమే కనిపిస్తున్నాయి. (శాఖల చివర పువ్వులు మాత్రమే కనిపిస్తుంటే సుమధారిణియైనట్టు ఉందేమో, భోజుడామాట అనలేదెందుకోమరి.) దిగంతాల వరకూ ధవళ వస్త్రగానుండగా అటూ ఇటూ చివరల నల్లటి మేఘమాల సన్నటిగీతలా కనిపిస్తోంది.(నల్లంచు తెల్లచీరా!!)
ఆ వర్ణనకేదో సుమారైన పద్యమైనా తెలుగులో వ్రాద్దామని ప్రయత్నం. 
చెల్లాటమ్ముల రాలెనో నగలనన్ శీతాంశు తారావళుల్
నల్లంచై మొయిలున్నదో యనగ ఫేనమ్ముల్ దిశల్ జేర, నా
కల్లోలాంశుక , దివ్యపుష్పశిఖియై గంగాంబ తా వచ్చెనే,
యుల్లాసమ్ముగ; పృథ్విపుణ్యనదియై, యుద్ధారమే లక్ష్యమై.
--లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితము.
ఆటలలో రాలిన నగలో అన్నట్టు చంద్రుడు, చుక్కలు కనిపిస్తుండగా, మొయిలు నల్లంచు గా నురగల తెలుపు దిశలంటగా, అలలే అంబరమైన గంగాంబ
దివ్యపుష్పాలు ధరించి పృథ్వికంతటికీ పుణ్యనదియై ఉద్ధరించే లక్ష్యముతో ఉల్లాసముగా వచ్చెనే!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి