Loading...

24, ఫిబ్రవరి 2018, శనివారం

అజచరిత్రములోని సరస్వతీ సంప్రార్థన

ఏల్చూరి మురళీధరరావు గారి పోస్ట్ --- వారికి కృతజ్ఞతలతో...


ఈనాటి సుప్రభాత వేళ శ్రీ మతుకుమల్లి నృసింహశాస్త్రి గారి అజ చరిత్రమును చదువుతున్నప్పుడు అవతారికలో ఈ స్తుతి కనబడింది. దైవదత్తమైన ఆ మహాపాండితికి, అపూర్వమైన ఆ కల్పనాశిల్పశోభకు, అపారమైన ఆ భక్తిపారమ్యానికి ఆశ్చర్యాతిశయం కలిగింది. ఇంతటి గాఢబంధంతోనూ, గంభీరమైన భావసంపుటితోనూ రచితమైన సరస్వతీ సంప్రార్థన ఇంకొకటి ఇంతవరకు నాకు కానరాలేదు. సర్వవిధాల ఆయన కవితాధోరణి నిరుపమానం అనిపించింది. అర్థతాత్పర్యాలతో ప్రకటించినట్లతే కావ్యం విద్యార్థిలోకంలో సుప్రతిష్ఠితమై ఉండేదని అనిపించింది.
అద్భుతావహమైన ఆ పద్యరాజం ఇది:
ఘన ఘనశ్రీ సముత్కటజటా వర పదక్రమయుక్త్రయీమయ రమ్యవేణి నానాస్వరవ్యంజనప్రతా నానూనశబ్ద మహాశబ్దశాస్త్రవీణ భూరిగుణవిశేషపుంజైకనిత్యసంబంధవత్తర్కవిభ్రాజిరశన సరససాలంక్రియోజ్జ్వలసువర్ణపదోరుసంగీతసాహితీస్తనభరాఢ్య
క్షిప్రసద్గతిముఖరభాట్టప్రభాక రీయమంజీరయుగరమణీయచరణ జలజ నిత్యప్రగల్భవాచాల వాణి నిలచుఁ గాఁత మదీయాస్య జలరుహమున.
📷♦️ ఘన ఘనశ్రీ ... రమ్యవేణి – ఘన = దట్టముగా క్రమ్ముకొన్న, ఘన = మేఘము యొక్క, శ్రీ = శోభవంటి శోభచే, సముత్కట = విరివియైన, జటా = కేశముల అల్లికచే, వర = శ్రేష్ఠమైన, పద = స్వరూపముతోడి, క్రమయుక్ = విధానమును కలిగిన, త్రయీమయ = మూడు పాయలతో సంలగ్నమైన, రమ్యవేణి = అందమైన వేనలిని కలిగినదియును –
(ఘన = సంపుటీకరింపబడిన, ఘన = ఘనము అను పేరు గలిగిన గానఫణితి తోడను, శ్రీసముత్కటజటా - శ్రీ = బ్రహ్మవిద్యాసిద్ధికై, సముత్కట = నేర్చికొనుటకు విషమమైన, జటా = జట అను పేరుగల ఫణితి తోడను, వరపదక్రమయుక్ – వర = కోరదగిన, పద = పదము అను పేరు గల పాఠవిశేషము తోడను, క్రమ = క్రమము అను పేరితోడి పాఠక్రమము తోడను, యుక్ = కూడినట్టి, త్రయీమయ = ఋగ్యజుస్సామములను మూడు వేదములు మూడు పాయలుగా ప్రవహించుచున్న, రమ్యవేణి – అందమైన వాక్స్రవంతిని గలదియును - అని ఇంకొక అర్థం);
📷♦️ నానా ... వీణ – నానా = సాహిత్యమునందు అనేక ప్రకారములైన, స్వర = అచ్చుల యొక్క (ఉదాత్త అనుదాత్త స్వరిత ప్లుతములను ఉచ్చారణవిశేషముల యొక్క), వ్యంజన = హల్లుల యొక్క, ప్రతాన = విరివిచే ఏర్పడునట్టి, అనూన = సార్థకములైన, శబ్ద = పదసంపదతోడి, మహాశబ్దశాస్త్ర = విస్తారమైన వ్యాకరణశాస్త్రమునకు ప్రాణశక్తిని కూర్చు, వీణ = వీణాదండమును కలిగినదియును –
(నానా = సంగీతమునందు బహుత్వసిద్ధి గల, స్వర = స్వతోరంజకములైన సప్తస్వరముల యొక్క, వ్యంజన = సువ్యక్తమగు, అనూన = శ్రుతిస్ఫుటవైఖరిని పరిపూర్ణముగా కలిగిన, శబ్ద = ధ్వన్యాత్మకమైన, మహాశబ్దశాస్త్ర = సంగీతశాస్త్రమునకు మూలకందమైన, వీణ = వీణాదండమును కలిగినదియును – అని ఇంకొక అర్థం);
📷♦️ భూరి ... రశన - భూరి = అధికతరమైన, గుణవిశేషపుంజ = సత్యదయాది గుణవిశేష పరంపరతో, నిత్యసంబంధవత్ = ఎల్లప్పుడు కూడియుండవలెనడి, తర్క = ఆకాంక్షచే, విభ్రాజి = ప్రకాశమానమైన, రశన = నాలుకను కలిగినదియును –
(భూరి = విస్తారమైన భూమికతోడి, గుణవిశేషపుంజ = చతుర్వింశతి తత్త్వములను నిరూపించు గుణముల సముదాయముతో, నిత్యసంబంధవత్ = నిత్యత్వసిద్ధిని (సంసర్గమును) కలిగిన, తర్క = తర్కశాస్త్రము యొక్క వికసనముచే, విభ్రాజి = మెరయుచున్న, రశన = మొలత్రాడు కలిగినదియును – అని ఇంకొక అర్థం);
📷♦️ సరస ... భరాఢ్య - సరస = రసవంతమైన, స+అలంక్రియా = సరిగమపదని అను సప్తస్వరముల అందమైన కూర్పుచే సిద్ధించు అలంకారముల ప్రయోగము చేత, ఉజ్జ్వల = ఔజ్జ్వల్యము అను శాస్త్రధర్మమును గల, సు+వర్ణ = షడ్జాది స్వరముల యొక్క గతివిశేషములను ప్రకటించు రచనముల చేతను, పద = పదములు అను రచనావిశేషముల చేతను, ఉరు = విస్తారమైన, సంగీత = సంగీతశాస్త్రము యొక్క మాధుర్యముతో నిండినట్టిదియును –
సరస ... భరాఢ్య - సరస = నవరసముల కూడిక చేత, స+అలంక్రియా = కావ్యశోభాకరములైన అలంకారముల ప్రయుక్తి చేత, ఉజ్జ్వల = విశదమైన, సువర్ణ = అక్షరరమ్యత గల, పద = అర్థవంతములైన సుశబ్దములచే నిండి, ఉరు = విశాలమైన, సాహితీ = సాహిత్యశాస్త్ర మధురిమను ప్రసాదించునట్టిదియును అగు,
స్తనభరాఢ్య – స్తనభర+ఆఢ్య = (ఒకటి ఆపాతమధురమగు సంగీత రసము చేతను, వేరొకటి ఆలోచనామృతమగు సాహిత్య రసము చేతను నిండిన) వక్షోజముల యొక్క బరువుచే, ఆఢ్య = కూడినట్టిదియును;
📷♦️ క్షిప్ర = శీఘ్రగతిని గల, సద్గతిముఖర – సద్+గతి = అందమైన నడకచే, ముఖర = గలగల చప్పుడుచేయుచున్న, భాట్ట ప్రభాకరీయ = మీమాంసా శాస్త్రములో కుమారిల భట్ట మతము, ప్రభాకర మతము అను రెండు మార్గములచే నిర్మింపబడిన, మంజీరయుగ = కాలి అందెల జంటచే, రమణీయ = అనుక్షణము సరిక్రొత్తదిగా భాసించు, చరణ జలజ = పాదపద్మములు గల,
📷♦️ నిత్యప్రగల్భవాచాల – నిత్య = ఎల్లప్పుడు, ప్రగల్భ = ప్రత్యుత్పన్నమైన ప్రతిభను ప్రకాశింపజేయు, వాచాల = వాక్యరీతిని కలిగిన,
📷♦️ వాణి = సరస్వతీదేవి,
📷♦️ మదీయ = నా యొక్క; ఆస్యజలరుహమున – ఆస్య = ముఖమనెడి, జలరుహమున = పద్మమునందు; నిలచున్+ కాఁత = నిలచియుండును గాక. 
------
రాజృ = దీప్తౌ అని ధాత్వర్థం .స్వేన రాజన్త ఇతి స్వరాః. తమంతనే ప్రకాశించేవి కాబట్టి 'స్వరములు' అని పేరు. స్వతోరంజకములని అన్నాను. సాహిత్యము యొక్క ఊనిక లేకుండానే సంగీతంలో రాగధర్మానుసారం ఉచ్చరింపబడి, మనస్సును రంజింపజేసేవి కనుక కూడా స్వరములే.

సాహిత్యపరంగా అర్థం చెప్పినప్పుడు స్వృ ధాతువు నుంచి 'ఉచ్చరింపబడేవి' కనుక స్వరములు. వాటికి మరొక స్వరము యొక్క ఊనికతో నిమిత్తం లేనందువల్ల అవి అచ్చులని రూఢి ఏర్పడింది.
🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి