Loading...

4, సెప్టెంబర్ 2023, సోమవారం

శోకం

 ఆయువు తీరుగా కలతలన్నియు మాయునటంచు నమ్మి  నీ

సాయము కోరగా నిటుల సన్నిధిఁ జేరి వినంతిఁజేయఁ,గావవే,

న్యాయమె నీకు? నన్నిటుల యాతమనఁబెట్టెదేల! వే

గాయములందె నీ మనము, కన్నులు మూయు ముహూర్తమెన్నడో! 


--లక్ష్మీదేవి 

ఉత్పలమాల 

కవిత

 కవితాం వరయతి యో౽సౌ సుభగమ్మన్యో౽థవా స్వయం నృపశుః

కవితా వరయతి యం పునరేష వరో భవతి కవిసార్థే ।।

కవితా వనితాచైవ స్వయమేవా ౽౽గతా వరా 

బలదాకృష్యమాణా తు సరసా విరసా భవేత్।।


-- ప్రాచీన సూక్తి 



28, ఆగస్టు 2023, సోమవారం

ఛలము

 ధనధాన్యాదులమోహమో, ఘనత సంధానింపగా యత్నమో,
తనవారందరి బాగుకై పరులపై దాష్టీకదుర్మార్గమో
దినదైనందినచర్యలిప్పగిది నిర్దేశింప, నెల్లప్పుడున్
జనసామాన్యుల వర్తనన్ఛలమె యాచారమ్ముగా నిల్చెనో!


--లక్ష్మీదేవి.

మత్తేభవిక్రీడితము.

25, ఆగస్టు 2023, శుక్రవారం

కాంక్షలెన్నొ!

 

అలివేణి కురులందు నలరారు నీలంపు
సిరిరాశినై వెల్గు శ్రేయమెంతొ
యెలనాగ ముగమందు నెలమించు నగవందు
మెఱుపునై చెల్గంగ మేలదెంతొ
కలకంఠి స్వరమందుఁ గమనీయ రాగంపు
గరిమనై వినరాగ ఘనత యెంతొ
లలితాంగి నడలందు లయకారి మువ్వనై
మురిపెంపు సడికాగఁ బుణ్యమెంతొ 
 
భువినిజన్మమంది పువ్వునై వికసించి
పరిమళించనైన భాగ్యమెంతొ
కవనగీతమందు గానఫణితియందు
గమకమైనఁ జాలు కలిమి యెంతొ. 
 
-లక్ష్మీదేవి.
సీసము, ఆటవెలది.

24, ఆగస్టు 2023, గురువారం

నిలకడ

 దుర్వ్యాపారమ్మెప్డు  మనంబందున నిలువగఁ దగదు, విడగనగునే?
నిర్వ్యాపారమ్మైన స్థితిన్నే నిలిచితపములను నెఱపగనగునే?
నిర్వ్యీర్యమ్మౌ భంగుల,  నేదే నిలకడలనెఱుగని విధుల, నిటులే
దుర్వ్యాఖ్యానమ్ముల్ లిఖియింపందొరగుదునన మది దురటిలునుగదా!!


--లక్ష్మీదేవి.

సరసిజ వృత్తము.


#నాపద్యాలు

#ఆనందాలు


😊😊

 

--లక్ష్మీదేవి.
సరసిజ వృత్తము.

 

21, ఆగస్టు 2023, సోమవారం

నిత్యసత్యము

నిత్యోల్లాసమ్మందుననున్నన్నిరవధిక సుఖము నిలచునట, సదా
సత్యాన్వేషాసక్తినినున్నన్సబలమగు తపము సఫలమట, తతః
నిత్యస్సత్యమ్మైనదియేదో నికరముగఁ దెలిసి నిలబడుటకు, నా
వ్యత్యాసమ్మెల్లందెలియంగావలె, గురువు కరుణపడయగవలెనోయ్.
 
 
-లక్ష్మీదేవి.
సరసిజ వృత్తము.
ఒక ప్రయత్నము.

20, ఆగస్టు 2023, ఆదివారం

డమరుక

 
జవసత్త్వమ్ముంచుము సాజమగు యోగములలో,
శివనామమ్మందు తనించి, కడకాలములలో
భవబంధమ్మెల్లనుబోవ, మది చింతనములో
చవిఁజేకొన్నంత, ప్రభాసమగు స్వాంతనములో .

--లక్ష్మీదేవి 
డమరుక వృత్తము. 

14, ఆగస్టు 2023, సోమవారం

నొప్పించు గతిన్

ఊరంతనుఁ జాటించుచు, నుద్రేకముల
న్నూరంతలు రెట్టించుచు, నొప్పించుగతిన్,
గోరంతనుఁ బోనివ్వక కొండంతలుగా,
వీరంగములేలోగద వేయింతలుగా? 


--లక్ష్మీదేవి.

కలహంసి వృత్తము.



12, ఆగస్టు 2023, శనివారం

మౌక్తిక

 మందగామినీ మాళవీసతీ
యిందురూపిణీ హృన్నివాసినీ
కుందనాకృతీ ఘోరదర్శినీ
నందదాయినీ నన్నుఁగావుమా!

- లక్ష్మీదేవి 

10, ఆగస్టు 2023, గురువారం

విజృంభణ

 ఓఘమ్మై యాకాశంబెల్లన్వొడికముగనమరుచునునొప్పుగా వడి సాగునీ
మేఘమ్ముల్వయ్యారమ్మొల్కన్మెఱుపులఁజతగనిడుచు మేలుగాఁగురియున్గదా
దాఘమ్మెల్లందీర్చున్దానై ధరణిని జనులకును సదా, విశేషముగాననన్
శ్లాఘింపంగాదే నిత్యమ్మా జలదములను, మరిమరి సంతసించుచునెప్పుడున్.

 

-లక్ష్మీదేవి.

భుజంగవిజృంభితము
చాలా అరుదుగా వాడబడు వృత్తము.
ఈరోజే చూసి, చేసిన మొదటి ప్రయత్నము.

 

జలద వృత్తము

 

వానలు మెండుగా కురియఁ, బావనమౌ
కానలు నిండుగా పెరుగ కారణమౌ.
కానల దండిగా నిలిపి కాచినచో,
వానలకండయై పిలుచు పైడి యగున్.

 

- లక్ష్మీదేవి.

జలదము

8, ఆగస్టు 2023, మంగళవారం

పాడితి

 కరుణాలవాల నినుఁగాంచినంతనే

విరివోలె నాదు మది విచ్చెనిప్పుడే

మరుభూమిఁబోలు భువి, మందిరమ్ముగా

తరియింపఁజేయగల దైవమీవెగా


సుమసౌరభమ్ము సొగసైనతోటలో

తమకమ్ముఁబెంచి తపియింపఁజేయగా,

మమకారమిందు మనసెల్ల నిండగా

ప్రమదమ్ముఁగూర్పఁ, బదమిట్లు పాడితిన్.


--లక్ష్మీదేవి.

మంజుభాషిణి (వేర్వేరు యతిస్థానాలతో)



వియద్గంగా

 

భయోత్పాతమ్ము పుట్టించే భవచ్ఛేదమ్ము లైనంతన్
జయద్ధ్వానమ్ములెన్నెన్నో జగమ్మంతా ధ్వనింపంగా
ప్రయాణమ్మందు మోదమ్ముల్ ప్రసాదమ్మై లభింపంగా
వియద్గంగా ప్రవాహమ్మున్విహారమ్మందు నేఁజేతున్.
 
 
-లక్ష్మీదేవి.
వియద్గంగా
వృషభగతిరగడ (అంత్యప్రాసలేదు)

5, ఆగస్టు 2023, శనివారం

జీవాధారము

 ఏ వేళందుననైనఁ జింతనల సంప్రీతిన్నివారించుచున్
జీవాధారము నీవెయైతివొక మంజీరంపునాదమ్ముతో
నీవే నేనుగఁ బాడనెంచితివి తేనెల్వారు కారుణ్యమై
భావావేశముఁ బొంగు పద్యముల నింపైనట్టి రాగమ్ముతో

---లక్ష్మీదేవి.

శార్దూలవిక్రీడితము.

3, ఆగస్టు 2023, గురువారం

యోచనలు

 చిందరవందరై, కలతఁజెందగఁజేసెడు యోచనల్ సదా

తొందరఁజేయునెప్పుడును,దుస్తరమైన భవాబ్ధిలోపలన్

మందలు మందలై పెరుగు మానవులెల్లర మానసమ్ములన్

కొందలముంగలంగు విధిఁ, గొండలఁ బోలు ప్రమాణమందు నే

డెందమునైన నొక్కపరి ఢీకొని వ్రయ్యలు చేయుచుండు, నే

 కొందరి పుణ్యమో ఫలముఁ గూర్మినిఁ గూర్చుచు రక్షసేయున

ట్లందరు నుందురే? మహిని హ్లాదము, తోషము, ద్వేషరాగముల్

కుందుగఁజేయునెల్లరనుఁ, గోర స్థిరత్వము కానవచ్చునే?

మందము బుద్ధులెల్లరకు, మర్మమెఱుంగగఁజాలనౌనె!సా

నందమునుండగా భువిని నచ్చగ మెచ్చగ నెన్ని లేవొకో?

పందెము వేసినట్లు భవబంధములందున మున్గుటేలొ? యే

చందముఁగాంచి యిప్పగిదిఁజచ్చుచుఁ బుట్టుచునుందురోగదా!

సందడిఁ జేయుచుందిరుగు చాలవిధమ్ముల పక్షిజాతులన్,

విందులఁ జేయుచుం బెరుగు వేల విధమ్ముల పండ్లచెట్ల, కన్

విందులఁజేయుచున్విరియు వింతగురంగుల పూలరాశులం

జిందులువేయుచుంగదలు జీవులనెల్లరఁజూచి నెమ్మదిన్

సందియమెల్లవీడనగు, సఖ్యముమీరగనెల్లవారితో

నెందుననెప్పుడైన మదినింపగుమాటలు చేతలున్నచో

నందె సుఖమ్ముశాంతి చిరముండుననందురు, నప్పుడెట్టి యి

బ్బందులునుండబోవు శుభ భావనలందు జగమ్మువెల్గునోయ్!


-లక్ష్మీదేవి.

 ఉత్పలమాలిక.

వరుసగా ఉత్పలమాలలు కలిపి వ్రాస్తే ఉత్పలమాలిక అని పేరు. ఈ విధంగానే ఇతర వృత్తములలోనూ వ్రాయవచ్చును.



30, జులై 2023, ఆదివారం

ఆనందం.

 నవ్యాషాఢే చలతి ప్రియమానందలీలావిలాసం

దివ్యాస్వాదాత్స్ఫురితమమలం దేవభామాకలాపం

భవ్యోత్సాహాత్ ముదితమనమాభాషయంతీ సతోషే

కావ్యారంభస్య శుభకరణం కర్తుమాజ్ఞాం దదాతి.


नव्याषाढे चलति प्रियमानन्दलीलाविलासम्

दिव्यास्वादात्स्फुरितममलं देवभामाकलापम्

भव्योत्साहात् मुदितमनमाभाषयन्ती सतोषे

काव्यारम्भस्य शुभकरणं कर्तुमाज्ञां ददाति.


(ఆభాషయంతీ - శత్రుప్రత్యయ వచన విషయంలో సందేహం)

(आभाषयन्ती - शतृ प्रत्यय वचन विषये स्पष्टा नास्म्यहं)


-లక్ష్మీదేవి.

మందాక్రాంతము.



29, జులై 2023, శనివారం

నాలో నీకై ..నీలో నాకై

 నాలో నీకై శ్రుతసుభగమై, నర్మసౌహార్ద్రభావ
మ్మాలాపించున్ సుధలొలుకగా హ్లాదనాదావళిన్, నా
నీలో నాకై మధువొలుకగా నిర్మలానందముల్, నే
నాలోకింతున్ కనుల నిను, నీ యంతరంగాన నన్నున్.


--

--లక్ష్మీదేవి.
మందాక్రాంతము.

28, జులై 2023, శుక్రవారం

పుస్తకపరిచయం

 

ఫ్రమ్ ఎ డాక్టర్స్ డైరీ

 

మందాక్రాంతము

 మందాక్రాంతం మధురవచనం మానసాహ్లాదగీతం

శ్రుత్వా నిత్యం శ్రవణసుభగం సోల్లసం నందదేయం

ద్వైదీభావం విగత గతినాం దైవసాయుజ్య మూలం

మోక్షాకాంక్షం మనసి సతతం పోషితుం ప్రార్థయామి.


ఒక ప్రయత్నం.

24, జులై 2023, సోమవారం

యుగళ గీతం

ధవళము క్షీరారుణముల

నవవికసితసుమములిందు నా కనువిందై,

శివ శివసతి ప్రతిరూపై

సవిలాసముగను వెలసెను చక్కని జంటై.


-లక్ష్మీదేవి.

కందము.



11, జులై 2023, మంగళవారం

జ్వాలనై

 జ్వాలనై, మణికీలనై, జనసంగరమ్మున వీరనై,

కీలకమ్మగు వైరిమూకనుఁగేలఁ బట్టెడు ధీరనై,

లీలగా పరిమార్చగా నవలీలనేర్చిన చాననై,

శైలనై, చలియించనేరక సాగనెంచితి నారినై. 


యుద్ధమ్మియ్యది జీవనమ్ముననుచో నుద్యుక్తతన్ సర్వదా

సిద్ధమ్మై యొక జ్వాలగారగులుచున్ జృంభించి, షడ్వర్గమి

ట్లూద్ధూతమ్ముగఁ జేసి, నిశ్చలముగా నొప్పారు ధీరత్వమున్

నిద్ధాత్రిన్ కడు జాగరూకతను నే హృత్సారమున్ సాగెదన్.

--

ఇలనున్న లోనున్న నిరువైరిమూకల

భగ్నమ్మునొనరింప పంతమూని

జ్వలియించు కీలగా జాజ్వల్యమై వెల్గు

శక్తి సంహితమైన జ్వాల నవగ,

కలలన్ని చేజార కలతతో మదినిండ

క్రుంగిబోకుండంగ కూలకుండ

చలియించబోనట్టి శైలమ్మునై నిల్చు

సుప్త సామర్థ్యమౌ చోటు నవగ,


ధీరగుణమునిచ్చి తీర్చిదిద్దినయట్టి

యెల్లవారి ఋణములెల్లనిజము

దారి చూపి పంపి ధరణినిలిపియుంచి

ప్రభుతనేలునట్టి ప్రకృతిజయము


--లక్ష్మీదేవి.

 మత్తకోకిల, శార్దూలవిక్రీడితము, సీసము, ఆటవెలది.


---------

మూడ్నాలుగు రోజుల క్రిందట శైలనై అనే పద్యం వ్రాసినా అందులోని ధీరస్వభావం శబ్దంలో ధ్వనించలేదనిపించి, ఇవి వ్రాశాను. కానీ ఇప్పుడు కూడా ధ్వనించలేదు.






6, జులై 2023, గురువారం

మేలగున్

 చిత్తమందునఁ దోచినట్టులఁ చెప్పగా సరి యౌనె, యా

త్తు జ్ఞానము నబ్బినట్టుల ప్రౌఢమౌ విషయమ్ములం
దుత్తబోలుగ తేలిపోగల నూకబోలిన సంగతుల్
మొత్తమొక్కెడ తెచ్చి పోయుట ముందు మానుట మేలగున్.

- లక్ష్మీదేవి 
మత్తకోకిల.

4, జులై 2023, మంగళవారం

తల్లీ!

 తల్లీ! జన్మనొసంగి సత్కృతుల నుత్థానంబునందంగ నా

యుల్లంబందున బుద్ధి సన్మతుల నీవుద్భాసిలంజేసియుం

గల్లోలమ్మనఁ గ్రాలు మస్తకము దుర్గ్రాహ్యమ్ము తానై, సదా

యల్లాడింపగ నిట్లు నాయువును నే వ్యర్థమ్ముఁగావించితిన్.


-లక్ష్మీదేవి.

శార్దూలవిక్రీడితము.

3, జులై 2023, సోమవారం

యోగము

 వేద్యమ్మెల్లం దెలుపుటకునై విజ్ఞులేరూపమందో

సద్యోజాతమ్మగు ఘటనలన్ సర్వకాలమ్ములందున్

విద్యాదానమ్మొసగుదురు వేవేల మార్గమ్ములందున్,

మద్యోగమ్మీ పగిది మెఱుగై మౌఢ్యముల్ మాయరాదో!


-లక్ష్మీదేవి.

మందాక్రాంతము.



27, జూన్ 2023, మంగళవారం

 కటియల్లి కరవిట్టనూ అనే పురందరదాసు పదము. పండరీపురనాథుడు పాండురంగడు (కృష్ణుడే) నడుముపైన చేతులుంచుకున్న మూర్తిగా దర్శనమిస్తాడు. ఆ భంగిమ గురించి భక్తకవి పురందరదాసు తలపులు. సాధారణంగా పనులు చేసి అలసినప్పుడు నడుం మీద చేతులుపెట్టుకొని నిలబడతాము. అలా ఈ యీ పనులు చేసి అలసెనో అని ..

-

పాఠమూ, పాడడమూ కూడా పలురకాలుగా కనిపిస్తోంది.

నేనెప్పుడో విన్న రాగం వెదికితే కనిపించలేదు.  


https://www.youtube.com/watch?v=Dgjd24q5WwY


కటిపైన కరముంచెనూ ఎంతగా తానూ

అలసేనో పాండురంగడూ

కటిపైన కరముంచెనూ 


గొల్లబాలలనొడగూడి తా వచ్చి

గొల్లెతలింట చొరబడి వెన్నతెచ్చి

బల్మిని తృణావర్త ఇత్యాది అసురుల

కొల్లగ చెండాడ ఆయాసమాయెనొ 

కటిపైన కరముంచెనూ ఎంతగా తానూ

అలసేనొ పాండురంగడూ


ముదముతో వ్రజమందు పదునారు వేల

సుదతులనాలించు మదమందునో

మదగజగమనల మదమాపకా కృష్ణ

ఒదిగి మామనుఁ ద్రుంచ ఆయాసమాయెనొ 

కటిపైన కరముంచెనూ


రాజసూయయాగమందు రాజరాజేశ్వరులు

రాజులు ఇత్యాది సురులందరూ

భోజనములు చేయనెంగిళులు ఇత్యాది

రాజీవాక్షుడు తీయ నాయాసమాయెనొ

కటిపైన కరముంచెనూ


సురపతి సుతుని సారథ్యమూఁ జేసి

బిరబిర చక్రము వేసిననంతలో

పరిపరి విధముల తురగములను కడుగు

పలువిధ పనులను ఆయాసమాయెనొ

కటిపైన కరముంచెనూ


ప్రేమతోడను వచ్చు భక్తులు తన చరణ

కమలయుగ్మముఁ దాకి సేవించగా

మమత తోడను వారి భవము హరముఁ జేయు

కమలనాభుడు శ్రీ పురందర విఠలుడు

కటిపైన కరముంచెనూ


ఇలా అర్థం తెలుగులో వ్రాసుకున్నది

--లక్ష్మీదేవి.


25, జూన్ 2023, ఆదివారం

సహజ జీవనవిధి

alternate thinking - click to read.

only take necessary drugs when necessary.” In other words, “taking medicine to prevent something” makes little sense.

 

- i think it's considerable life style.

17, జూన్ 2023, శనివారం

భ్రమ

 

లౌకిక మోహమాయకు
అజ్ఞానానికి
జ్ఞానానికి
దూరంగా గానీ, దగ్గరగా గానీ ఏ మనిషైనా ఉండొచ్చు. దానికి gender/education/age/level of exposure to the world విషయాలలో మినహాయింపులు ఉండవు.
ఫలానా జెండర్ కో, ఇంత చదువుకున్నవాళ్ళకో, ఇంత వయసున్నవాళ్ళకో, ఇంత లోకానుభవం ఉన్నోళ్ళకో మాత్రమే ఆ అవకాశం ఉంటుంది అనుకోడం మాత్రం నూటికి నూరు శాతం భ్రమే.

15, మే 2023, సోమవారం

The Last Emperor of South India, Venkatapathi Devaraya.

 

Venkatapathi Devaraya, The Last Emperor..!-by
Neelayapalem Vijay Kumar
వెంకటపతి దేవరాయలు !
ఎవరితను ? బహుశా ముందుగా వచ్చే ప్రశ్న ఇదేనేమో?
‘ఖులీ కుతుబ్ షా’ ఎవరు అంటే నూటికి అరవై మంది హైదరాబాదు, గోల్కొండ అంటూ చెప్పేస్తారేమో
అదే వెంకటపతిదేవ రాయలు ఎవరు అంటే, వాడెవడు అంటారేమో..!
వెంకటపతి దేవరాయలు, గోల్కొండ కులీ కుతుబ్ షాహీ సమకాలికుడు. బీజాపూర్ ఆలీ ఆదిల్షా సమకాలికుడు. ఇంకా చెప్పాలంటే, మొఘలు రాజు అక్బర్ సమకాలికుడు. అక్బర్ రెండు సార్లు దక్షణాది దక్కన్ మీద దండెత్తి రావాలి అనుకోని రెండుసార్లు చంద్రగిరిలోని వెంకటపతిదేవరాయలకి రాయబారం పంపించాడు. దక్షిణాపతిని మొత్తం ఏలిన వాడు ఇతను. కానీ మనకు మన తెలుగు చక్రవర్తి పేరు కూడా తెలీదు.
మన ఆంధ్ర చరిత్రను మనం మరచిపోయాము. ఇంకా చెప్పాలంటే మనము అసలు పట్టించుకోమేమో ! కోపం వస్తుందేమో కానీ, చరిత్ర పట్ల అత్యంత అనాదరణ వున్న రాష్ట్రం ఏదైనా వుంది అంటే అది ఆంధ్ర మాత్రమే...
విజయనగర సామ్రాజ్యం తళ్ళికోట యుద్ధం, హంపీ విద్వంసంతో అంతం అయిపోయిందని మనం చిన్నప్పటి నుంచీ చదివాము. కానీ ఆ సామ్రాజ్యం, హంపీ విద్వంసం తర్వాత దాదాపు తొంబైఏళ్ళు నడిచిందని, హంపీకి ముందు వున్న రాజ్యంలో 70 శాతం రాజ్యంతో, నాటి ఆంధ్రలోని పెనుకొండ, చంద్రగిరి, రాయ వెల్లూరు రాజధానులుగా దాదాపు దక్షిణ భారతదేశమంతా పరిపాలించారని మనకేవ్వరూ చెప్పలేదు. చరిత్రలో చదవలేదు. మన పాఠశాల సోషల్ పుస్తకాల్లో చూడలేదు. 
1565లో అయిదు బహమనీ ముస్లిం రాజ్యాలు కలిసిపోయి, జిలానీ సోదరుల డబుల్ క్రాసింగ్ తో, తళ్లికోట యుద్ధంలో ఆళియ రామరాయలను చంపేసిన నాటి రాత్రి, అతని సోదరుడు తిరుమల రాయలు, ఖజానా ధనం, భంధువులు, సన్నిహితులతో రాత్రికి రాత్రికి పెనుకొండకు పారిపోయి అక్కడ సామ్రాజ్యం ఏర్పరచారు అనేదాకా చదివాము.
కానీ, ఆ తర్వాత, 1585 నుంచి వెంకటపతి దేవరాయలు చక్రవర్తిగా ఈ రోజుటి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లతో దక్షిణ భారత దేశాన్ని, నాటి తంజావూర్, మదురై, జింజీ, వేలూర్, చిత్రదుర్గ, రామనాద్, పుదుక్కోటై ,కంజీవరం, చిదంబరం, మధురాంతకం, ఇక్కేరీ, మైసూర్, బేలూర్, కోలార్, మంగలూర్ నాయక రాజ్యాల నుంచి, ఈనాటి రాయలసీమ లోని, కర్నూల్, ఆదోని, నంద్యాల్, గుత్తి, కడప, సిద్ధవటం, గండికోట, మడకశిర, అనంతపూర్, చంద్రగిరి, మొదలుకొని, నెల్లూరు నుంచి, కొండవీడు దాటి, వినుకొండ, కొండపల్లి మీదుగా ఇప్పటి వైజాగ్ దగ్గర కశింకోట వరకు ఏక చ్త్రదిపత్యంగా దక్షిణ భారతావని మొత్తం ముప్పై సంవత్సరాలకు పైగా పరిపాలించిన విజయనగర చక్రవర్తి.
విజయ నగర రాజ్యాన్ని, తిరిగి దాదాపు కృష్ణదేవరాయల నాటి పూర్వ వైభవానికి తెచ్చిన ఒక “తెలుగు చక్రవర్తి” వెంకటపతి దేవరాయలు.  
పోర్చుగీస్, డచ్, డెన్మార్క్, దేశస్తులకు తన సముద్ర పోర్టులయిన, పులికాట్, నుంచి తూర్పు తీరంలో వ్యాపారానికి ఇచ్చి పన్నులు వసూలు చేసిన వాడు. ఒక్క మచిలీపట్నం (కుతుబ్ షా ఆధీనంలో వుండేది), తూర్పు తీరం మొత్తం వేంకటపతిరాయల ఆధీనంలో వుండేది. ఇంగ్లిష్ వారికి మొదట వ్యాపార అనుమతిని ఇచ్చిన వాడు కూడా వేంకటపతే. కానీ ఆ ఒప్పందం సంతకాలు అయ్యే లోపలే చనిపోయాడు. తదనంతరం అతని వారసులు 15 సంవత్సరాల తర్వాత అదే చంద్రగిరి కోటలో అప్పటి వేంకటపతిరాయల ఒప్పందాన్ని పునరుద్ధరించి ఇప్పటి మద్రాసుని, అప్పటి చెన్నపట్నాన్ని వ్యాపారంకోసం బ్రిటీష్ వారికి ఇచ్చారు,
వెంకటపతి రాయల తర్వాత, దక్షిణాపదిని ఇంత పెద్ద ఎత్తున ఏలిన సర్వం సహా చక్రవర్తి ఎవరూ లేరు. కొంతవరకు టిప్పు సుల్తాన్ ఆ స్థాయికి వచ్చాడు గానీ, అతని సామ్రాజ్యం మధ్యలో చాలా రాజ్యాలు అతని ఆధీనంలో లేవు. పైగా అదికూడా అతి కొద్ది కాలమే.
అందుకే, అరవీటి వెంకటపతి రాయలు అనే ఈ విజయనగర చక్రవర్తి, శ్రీ కృష్ణదేవరాయల రెండవ కూతురి కొడుకు, దక్షణభారత దేశంలోకి ముస్లిం రాజ్యాలైన, గోల్కొండ, బీజాపూర్ , మొఘల్ రాజ్యాలు రాకుండా కర్నూల్ దగ్గర కృష్ణా నదిని, ఇటు వైపు నేటి బెజవాడ పక్కన వుండే కృష్ణా నది తీరాన్ని సరిహద్దుగా నిర్ణయించి ముప్పై సంవత్సరాలపాటు దక్షినాదిని ఏలిన వెంకటపతి రాయలు “దక్షిణాపద చివరి చక్రవర్తి....". The Last Emperor of South India, Venkatapathi Devaraya.  
ఇంకా నమ్మకం కుదరకపోతే, ఈ సారి “తిరుమల”, వెళ్ళినప్పుడు, అవును బాబూ, మన వేంకటేశ్వరుని తిరుమలకు వెళ్ళినప్పుడు, లోపలి వెళ్ళేటప్పుడు, మహాద్వారం దాటగానే, వెండి వాకిలికి ఎడమ వైపున, తులాభారం వుంటుంది, చూసే వుంటారు, ఆ పక్కనే. నిలువెత్తు వెంకటపతి దేవరాయల విగ్రహం వుంటుంది, చూడండి....
అతని చరిత్రే, ఆ తెలుగు చక్రవర్తి చరిత్ర
ఈ Last Emperor of South India…..
ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనిపిస్తే, ఈ పుస్తకం అన్నీ ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం అవుతుంది. అలాగే ఆన్ లైన్ లో Amazon ద్వారా కూడా లభ్యం అవుతుంది.
చివరిగా, ఇంతటి ఆఫ్ బీట్ పుస్తకాన్ని అడగ్గాన్నే ప్రచురించిన “అన్వీక్షికీ పబ్లిషర్స్” కు ఎన్నెన్నో ధన్యవాదాలు.
Amazon Purchase Online Link ::::::....




12, మే 2023, శుక్రవారం

జనులు

 ఒండొరులననుకరింపను

నొండొరులను వెక్కిరింపనుత్సాహితులై

దండుగ పనులనుఁ జేయగ

దండిగ జనులుంద్రు కనగ ధారుణియందున్. 


--లక్ష్మీదేవి.

కందము.



9, మే 2023, మంగళవారం

మాయ

 కోటలును మిద్దెలను గొప్పవగు తీరుగనుఁగొత్తపఱి కట్టగలవారై

తోటలను పువ్వులను తోపులను మానులనుఁదుష్టిఁ గన పెంచగలవారై

మాటలనుఁ గూర్చుకొని మంత్రముల తీరుగను మాయలనుఁ బెట్టగలవారై

సాటి సరి లేదనగ సర్వులను మీరుచును సాగుదురు గెల్చగలవారై. 


--లక్ష్మీదేవి.

మంగళమహాశ్రీ.


అడ్డొచ్చునా

 పూవనమందు వాయువన పోవగ రాదొ, విరక్తి రక్తులన్

యావను వీడి సాగుటకు యౌవనమేటికి నడ్డువచ్చునో?

భావము మేల్మిగా కలిగి, పావన సుధ్వనులందు పాడగా

జీవము సంస్కరింపబడ, చేవను నీ బ్రదుకెల్ల సాగదే! 


--లక్ష్మీదేవి.

ఉత్పలమాల


23, ఏప్రిల్ 2023, ఆదివారం

ఏమో

 చర్మపు తిత్తిలో బ్రదుకు సాగగ శక్తినిఁ గూర్చుచుంటిమో,

నిర్మలమైన కాయమున నేరక వ్యర్థము నింపుచుంటిమో!

మర్మపు యోచనమ్ములను మాయని చింతలు, సంతసమ్ములన్

ధర్మము రూపునేరకయె దట్టముగానిడి మోయుచుంటిమో! 


--లక్ష్మీదేవి.

ఉత్పలమాల.


22, ఏప్రిల్ 2023, శనివారం

ఇదీకథ.

 


19, ఏప్రిల్ 2023, బుధవారం

haha

 No photo description available.

17, ఏప్రిల్ 2023, సోమవారం

ఓహో!

 నిన్నల యాకులు రాలగ
న్నెల లేలే చివుళ్ళు, ల్లవములుగా
చెన్నుగ రేపను రూపము
నున్నవి, చింతల విడువుము నోహో యనుమా.

-- లక్ష్మీదేవి 
కందము 

16, ఏప్రిల్ 2023, ఆదివారం

తిప్పలు

 బండలు కొండలు వఱ్ఱులు వారగ భంగముఁ జేయుచు వైళముగా

నెండలు మెండుగ హెచ్చగ మానిసి కిబ్బడి ముబ్బడి హింస యనన్

కుండల నీళులు కోటలు మేడలు గోడలు మిద్దెలు కూడనివై,

తిండికి నిత్యము తిప్పటనుండెడు దీన మృగమ్ముల తిప్పలెవో!


--లక్ష్మీదేవి.

మానిని.


15, ఏప్రిల్ 2023, శనివారం

దివ్యమై

 దివ్యాలంకృతమైన ఛందములలో దీపించు శబ్దాళితో

నవ్యానందమునిచ్చుచుండు ఝరితో జ్ఞానార్థ సంసిద్ధితో

కావ్యాడంబరమందు మేలురకమై కైవల్యమే లక్ష్యమై

సవ్యమ్మై వెలుగొందు సంభ్రమములీ సాహిత్యసౌగంధముల్.


దివ్యాలంకృతమైన రూపసిరితో దీపించు వాగ్ధాటితో

భవ్యాడంబరమైన శబ్దఝరినిన్ భావమ్ము నిండారగా

నవ్యమ్మై వెలుగొందు బోధనముతో నాణ్యమ్ము నింపారగా

సవ్యంబౌ విధి మార్గదర్శివయి కృష్ణా! పార్థుఁ బాలింతువో! 


--లక్ష్మీదేవి.

శార్దూలవిక్రీడితములు.



10, ఏప్రిల్ 2023, సోమవారం

Special!




 

6, ఏప్రిల్ 2023, గురువారం

తోట

 కలలోఁగాంచినలోకమందునొక సింగారంపుపూదోటలో

నిలలోఁగానగరానియట్టిదగునాహేమంతసౌందర్యమున్

ఫలముంపుష్పపురాశులందొలుకు సౌభాగ్యమ్మునేఁగంటి, శ్రీ

నిలయమ్మై యలరారుచున్నదది యా నిర్గూఢమౌ చోటులో.


--లక్ష్మీదేవి.

మత్తేభవిక్రీడితము.


5, ఏప్రిల్ 2023, బుధవారం

కృతి

 సతతంబారంభమందిచ్ఛఁగొలిపి, వడిగా సాగి, స్వారస్యమౌచో,

శ్రుతితోనాలంకృతమ్మై, సొబగుల సడితో, శోభనిండారగా నా

కృతి యాకర్షించు, ధాత్రిన్ కృతికరుకు సదా కీర్తి ప్రఖ్యాతి కూడు

న్నతులావిద్వాంసుకా ప్రజ్ఞ ప్రతిభగల విన్నాణ రూపమ్ముకందున్.


-లక్ష్మీదేవి.

మహాస్రగ్ధర.



1, ఏప్రిల్ 2023, శనివారం

ఏల?

 చిన్ని గీతమొక్కటైన

వన్నెలద్దుకున్నదైన

నెన్నినాళ్ళు యెన్ని యేళ్ళు యెన్ని నోళ్ళలో

జున్ను పాల స్వాదనమ్ము

యన్న తీరు నిల్చియుండి

నెన్నదగ్గ పాటవోలె మన్నుచుండగా

ఒప్పు తప్పు విప్పి చెప్పి

గొప్ప గొప్ప తీరుఁ బల్కు

తిప్పలేల? చెప్పలేక ముప్పు లేలొకో!

యప్పుడట్లు నిప్పుడిట్లు

కప్పదాటు మాటలల్లి

కుప్పిగంతులేయుచుండు నొప్పులేలొకో! 


--లక్ష్మీదేవి.

భోగషట్పదులు.



26, మార్చి 2023, ఆదివారం

సాంత్వన

 క్రొత్త ననదండలను కూర్చుచును, నా

చిత్తమున నన్యముఁదలంపకను, నే

నిత్తమును నర్చనల నిన్నుఁగొలిచే

సత్తువనొసంగిననె సాంత్వన యగున్ 


--లక్ష్మీదేవి.

ఇందువదన వృత్తము. దీనికి వనమయూరమన్న పేరు కూడా ఉంది. 


24, మార్చి 2023, శుక్రవారం

అదో

 నల్లని కన్నున తెల్లని కనీనకమై

నల్లని మిన్నున చందురుడు నవ్వెనదో!

పల్లవి పాడిన భావనల బంధురమై

చల్లగ చందన గంధముల చల్లెనదో!


--లక్ష్మీదేవి.

జలంధరము. (యతి పాటించలేదు.)


22, మార్చి 2023, బుధవారం

శార్వరి

 శార్వరసప్తాహ సరళి పూజా

నిర్వహణమ్మెల్ల నెనరు కూడం

బర్వములింపైనఁ బగిది పృథ్విన్

సర్వుల నానంద ఛవియె తోచున్.


--లక్ష్మీదేవి.

మౌక్తికమాల.

 

ఇది అల్పాక్కర కూడా.

9, మార్చి 2023, గురువారం

భారతీయ శాస్త్రవేత్త

ఇలాంటి వారెందరో ! వీరందరి గురించి భాష పుస్తకాలలో కథగా, సామాజిక శాస్త్రాలలో స్వాతంత్ర్య యోధునిగా, విజ్ఞాన శాస్త్రంలో విజయుడైన పరిశోధకునిగా సంబంధించిన పాఠాలు హైస్కూలు చదువులలో ఉండవేలో!! కనీసం పేరైనా ఉందా ఎక్కడైనా..?

 This is a story of an Indian revolutionary who in the early 20th century, travelled across europe, america, the erstwhile soviet union, Japan and china to become part of an international front against british imperialism.


Pandurang sadasiv  Khankhoje from maharashtra had attempted to bring Independence to India during the First World War, by bringing a revolutionary army via Indian Baluchistan. 


Khankhoje,  dedicated his research to the improvement of crops and by opening Free Schools of Agriculture for the farmers in Mexico 1928.


more details here. 


https://www.peepultree.world/livehistoryindia/story/people/dr-pandurang-khankhoje-the-ironic-revolutionary?fbclid=IwAR0wi6VEk3LitQLHCHgiQzNEUUdQTJtCzEJMPJwFtW8QKjskcAuRiN88NcE

--


https://scroll.in/roving/675432/rare-photos-of-pandurang-khankhoje-an-indian-revolutionary-in-1920s-mexico?fbclid=IwAR3EESQd-wBhFBk8X-HkOjzuzCwhb1IrSb1Pp4pboH31a0Q-YHMHgHiHj7k


No photo description available.

23, ఫిబ్రవరి 2023, గురువారం

బాసలేనా?

 భామానసమానకాంతులు న్నెచిన్నెల వింతలై
లాహేలలకూపిరూదిన క్షణమ్ము నిరంతమై
వేవిన్ పరితాపమందున వేగుచుండ, వసంతమా!
బాలేరికి చేసెదో మరి, త్తువే భువి ముంగిటన్.

-లక్ష్మీదేవి 
మత్తకోకిల



14, ఫిబ్రవరి 2023, మంగళవారం

రాగము

 వినగల రాగమాధురులు వీనులవిందుగనాలపించి నా

యనగల తీరుతెన్నులను నందముగా పలికింపజేసి నే

కనగల స్వప్నవాటికల కావ్యరసంచిత చిత్రరూపమై 

మనగలకూర్మిఁబంచితివి మర్మవినూతనమైన భంగినిన్.


-లక్ష్మీదేవి

చంపకమాల 

6, ఫిబ్రవరి 2023, సోమవారం

స్వరము

 మధురిమలొసగిన తీయని

సుధలనుఁ బాటలఁ గురియుచు శోభస్కరమై

యధరములొలికిన పలుపలు

విధముల రాగిణి స్వరములు వీనుల విందుల్.


--లక్ష్మీదేవి.

కందము 

2, ఫిబ్రవరి 2023, గురువారం

నిరంతరం వసంతమై

నిరంతరమ్ముగా వసంతనిష్ఠమైన లోకమై
సురంజనమ్ముగా ప్రపంచశోభలున్న చాలదే?
రాంతకమ్ముగా విషాణునైజమున్న లోకమున్
రింతనీకృపన్ప్రసాదమంచునిచ్చుచుందువా?


పంచచామరము యతియుక్తము


నిరంతరమ్ముగా వసంతమున్ననేమి దైవమా?

సురంజనమ్ముగా ప్రపంచమున్ననేమి నష్టమా?

నరాంతకమ్ముగా విషాణువున్న లోకమందునన్

మరింతగా కృపన్ ప్రసాదనమ్ముఁజేయుమా సదా!


పంచచామరము యతిముక్తము


--లక్ష్మీదేవి.



1, ఫిబ్రవరి 2023, బుధవారం

స్నేహమాధుర్యం

 చిరకాలమ్ముగ నున్నభావనలు సుస్నేహంపు మాధుర్యముల్

సరిరానేదియులేనియట్టివగు నాస్వాదించుసౌహార్ద్రముల్

సిరులందొల్కెడు భవ్యమై చిలుకునా స్నిగ్ధంపు సౌందర్యముల్

నిరతమ్మిట్టులె నుండగాఁదగును పన్నీరంపు సౌగంధమై. 


-లక్ష్మీదేవి.

మత్తేభవిక్రీడితము.


31, జనవరి 2023, మంగళవారం

పల్లె

 పల్లె పట్టులఁ గొల్వు తీరిన పైరుపంటల బాటలో

చల్లచల్లని గాలియుయ్యెల సద్దుఁజేయుచునుండగా

పొల్లుమాటల నవ్వులందునఁ బుణ్యకాలపు బాల్యమై

చెల్లిపోయెను సంబరమ్ములు జీవనమ్మున భాగమై


--లక్ష్మీదేవి.

మత్తకోకిల


30, జనవరి 2023, సోమవారం

లోకం

 వింతవింతగ లోకమన్నది వేల రూపులఁజూపుచున్

సుంతయైనను తోచనీయదు సొంతమన్న ప్రమోదమున్

మంతనమ్ములు గుంపుగుంపుల మర్మమై కొనసాగగా

నంతకంతకు రోత కల్గదె యంతరంగమునందునన్. 


-లక్ష్మీదేవి

మత్తకోకిల


27, జనవరి 2023, శుక్రవారం

అందామా

 ఆటలన్నీ ఆడుకుందాం

పాటలన్నీ పాడుకుందాం

మాటలల్లో తీపి మాగే కథలు విందామా

బాట వేసీ బావి పెట్టీ

దాటలేనీ గోడ కట్టీ

కోట కట్టీ జట్టు కూడీ తుర్రుమందామా 


-- లక్ష్మీదేవి 

భామినీ షట్పద (అనుసరణ)

24, జనవరి 2023, మంగళవారం

చిత్రమే

 శ్యామల స్నిగ్ధరూపుఁగని స్వాంతముశాంతమునందు నిల్పి ని

ష్కామపు కార్యముందొడగఁగష్టముఁదోచును, నాటుపోటులన్

భ్రామికలెండమావులనుఁ బర్వులు పెట్టెడు కార్యమందు నే

నేమియు కష్టముంగననిదెంతయు చిత్రముగాదె చూచినన్?


--లక్ష్మీదేవి 

ఉత్పలమాల 

22, జనవరి 2023, ఆదివారం

ఓర్వగలనె?

 సుందర పదముల సొంపుగా కూరిచి

పాడినట్టి నిధుల భాగ్యముండి

మంద మంద గతుల మాధుర్యములతోడ

కూడినట్టి పగిది కూర్మి యుండి

విందు చేసి జనుల ప్రీతినిఁ గొనుచును

వేడుకఁ జేసిన  పేర్మి యుండి

నిందను పడవైచి నిర్మల జన్మము

నడవిని వీడినదగుచునుండ

 

నట్టి గాథఁ జదువ నంతరంగమునందు

గట్టితనము మదినిఁ గానరాదు

గుండె చిక్కఁబట్టి ఘోరమైన కథల

నుండు శోకమెపుడునోర్వలేను.


--లక్ష్మీదేవి.

సీసము, ఆటవెలది.



16, జనవరి 2023, సోమవారం

తరళ

 అనలమై జ్వలియించు తీరుగ నంతరంగపు వేదనన్

దినదినమ్ము భరించుచుండిన తేలికైన విధమ్మునన్

కనులకొల్కులజారునశ్రువు కంటగింపనువారు నీ

మనసులోపలనున్న మాటల మర్మమెన్నడెఱుంగరో! 


-- లక్ష్మీదేవి 

తరళము

15, జనవరి 2023, ఆదివారం

Ho

 


11, జనవరి 2023, బుధవారం

రాయడై

 లిపులి జాడ యేదని ప్రజాళి యనంగనిదో యిటొచ్చితిన్

వరమేలటంచు చలి మ్ముచునున్నది పట్టణమ్ములన్
నలు రంగవల్లినిడు లౌల్యములందునఁజేతఁజిక్కిరే
సులువుగ నంచు సంబరముఁజొక్కెనుపో చలి రాయడై యిలన్.

- లక్ష్మీదేవి 
చంపకమాల 

8, జనవరి 2023, ఆదివారం

పాటవమా?

 నిరాశఁ బెంచు లోకమందు నేరమున్నదందువా?

బిరాన నమ్మి నీవు యాశఁ బెంచుకొందువేలనో?

పరాకు సేయకుండనుండి పాటవమ్ముఁ బెంచుకో!

కరమ్ముఁబట్టి నిన్ను నెప్డు కాచు నట్టిదే సదా!


-లక్ష్మీదేవి 

పంచచామరము 

5, జనవరి 2023, గురువారం

అంతే మరి!

సుందరనయనారవింద!

దృక్స్రగధర! మోహక వాగ్ధారాన్విత!

చిత్తభ్రమణకర! చిద్విలాస లోల!

మానసచోరా ! నిర్మలహృదయా! నిర్వికార స్వభావా!

1, జనవరి 2023, ఆదివారం

Exactly