Loading...

11, జులై 2023, మంగళవారం

జ్వాలనై

 జ్వాలనై, మణికీలనై, జనసంగరమ్మున వీరనై,

కీలకమ్మగు వైరిమూకనుఁగేలఁ బట్టెడు ధీరనై,

లీలగా పరిమార్చగా నవలీలనేర్చిన చాననై,

శైలనై, చలియించనేరక సాగనెంచితి నారినై. 


యుద్ధమ్మియ్యది జీవనమ్ముననుచో నుద్యుక్తతన్ సర్వదా

సిద్ధమ్మై యొక జ్వాలగారగులుచున్ జృంభించి, షడ్వర్గమి

ట్లూద్ధూతమ్ముగఁ జేసి, నిశ్చలముగా నొప్పారు ధీరత్వమున్

నిద్ధాత్రిన్ కడు జాగరూకతను నే హృత్సారమున్ సాగెదన్.

--

ఇలనున్న లోనున్న నిరువైరిమూకల

భగ్నమ్మునొనరింప పంతమూని

జ్వలియించు కీలగా జాజ్వల్యమై వెల్గు

శక్తి సంహితమైన జ్వాల నవగ,

కలలన్ని చేజార కలతతో మదినిండ

క్రుంగిబోకుండంగ కూలకుండ

చలియించబోనట్టి శైలమ్మునై నిల్చు

సుప్త సామర్థ్యమౌ చోటు నవగ,


ధీరగుణమునిచ్చి తీర్చిదిద్దినయట్టి

యెల్లవారి ఋణములెల్లనిజము

దారి చూపి పంపి ధరణినిలిపియుంచి

ప్రభుతనేలునట్టి ప్రకృతిజయము


--లక్ష్మీదేవి.

 మత్తకోకిల, శార్దూలవిక్రీడితము, సీసము, ఆటవెలది.


---------

మూడ్నాలుగు రోజుల క్రిందట శైలనై అనే పద్యం వ్రాసినా అందులోని ధీరస్వభావం శబ్దంలో ధ్వనించలేదనిపించి, ఇవి వ్రాశాను. కానీ ఇప్పుడు కూడా ధ్వనించలేదు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి