Loading...

3, ఆగస్టు 2023, గురువారం

యోచనలు

 చిందరవందరై, కలతఁజెందగఁజేసెడు యోచనల్ సదా

తొందరఁజేయునెప్పుడును,దుస్తరమైన భవాబ్ధిలోపలన్

మందలు మందలై పెరుగు మానవులెల్లర మానసమ్ములన్

కొందలముంగలంగు విధిఁ, గొండలఁ బోలు ప్రమాణమందు నే

డెందమునైన నొక్కపరి ఢీకొని వ్రయ్యలు చేయుచుండు, నే

 కొందరి పుణ్యమో ఫలముఁ గూర్మినిఁ గూర్చుచు రక్షసేయున

ట్లందరు నుందురే? మహిని హ్లాదము, తోషము, ద్వేషరాగముల్

కుందుగఁజేయునెల్లరనుఁ, గోర స్థిరత్వము కానవచ్చునే?

మందము బుద్ధులెల్లరకు, మర్మమెఱుంగగఁజాలనౌనె!సా

నందమునుండగా భువిని నచ్చగ మెచ్చగ నెన్ని లేవొకో?

పందెము వేసినట్లు భవబంధములందున మున్గుటేలొ? యే

చందముఁగాంచి యిప్పగిదిఁజచ్చుచుఁ బుట్టుచునుందురోగదా!

సందడిఁ జేయుచుందిరుగు చాలవిధమ్ముల పక్షిజాతులన్,

విందులఁ జేయుచుం బెరుగు వేల విధమ్ముల పండ్లచెట్ల, కన్

విందులఁజేయుచున్విరియు వింతగురంగుల పూలరాశులం

జిందులువేయుచుంగదలు జీవులనెల్లరఁజూచి నెమ్మదిన్

సందియమెల్లవీడనగు, సఖ్యముమీరగనెల్లవారితో

నెందుననెప్పుడైన మదినింపగుమాటలు చేతలున్నచో

నందె సుఖమ్ముశాంతి చిరముండుననందురు, నప్పుడెట్టి యి

బ్బందులునుండబోవు శుభ భావనలందు జగమ్మువెల్గునోయ్!


-లక్ష్మీదేవి.

 ఉత్పలమాలిక.

వరుసగా ఉత్పలమాలలు కలిపి వ్రాస్తే ఉత్పలమాలిక అని పేరు. ఈ విధంగానే ఇతర వృత్తములలోనూ వ్రాయవచ్చును.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి