Loading...

22, అక్టోబర్ 2021, శుక్రవారం

చుక్కలు- ముత్యాలు- వామనుడు

    త్రివిక్రమావతార వర్ణనలో, నక్షత్రాల వరుస వరుసగా ముత్యాలగొడుగుగా, ముత్యాల హారంగా, ముత్యాల నడుముపట్టీగా, చివరికి ముత్యాల నూపురంగా భాసించిందని వేదాంత దేశికుల వారి కృతి "శ్రీ దేహళీశ స్తుతి" లో ఉందని శ్రీదేవీ మురళీధర్ గారి రచన 'వేదాంత దేశికులు' చదువుతుంటే తెలిసిందిప్పుడే.
    -----
    భక్తప్రియత్వయి తథా పరివర్ధమానే
    ముక్తా వితాన వితతిస్తవ పూర్వమాసీత్ ।
    హారావళిః పరమథో రశనా కలాపః
    తారాగణస్తదను మౌక్తిక నూపుర శ్రీః ॥
    ఊహాతీతమైన త్రివిక్రముని శరీరాకృతి వర్ణన అద్వితీయం. ముందు నక్షత్రమండలం ముత్యాల గొడుగులా స్వామి తల చుట్టూ పరిభమించింది. మరింతగా విజృంభించిన ఆకృతి మెడలో అది ముత్యాల హారమైంది. ఇంకా పైకెదిగిన స్వామి నడుమున ముత్యాల పట్టీ వలె భాసించింది. చివరికి భావనాతీతంగా పెరిగిపోయిన పరమాత్ముని పాదాలకు చక్కని ముత్యాలనూపురమై ఒదిగింది ఆ అఖండ నక్షత్రమండలం!
    --శ్రీదేవీ మురళీధర్ గారి రచన వేదాంత దేశికులు నుండి.
    ----
    అని ఈ పుస్తకంలో చదవగానే ఏమి గుర్తు వస్తుంది? పోతన వర్ణన.
    వామనుడు ఎంతగా పెరిగాడంటే, మొదట అతనికి ఛత్రము వలె శోభించిన సూర్యబింబము, తరువాత శిరోరత్నములా, చెవి ప్రోగులా, కంఠాభరణములా, బంగారు దండకడియములా, కంకణములా, మొలత్రాడులో గంటలా, కాలి అందెగా చివరకు పాదం క్రింద పీటగా భాసించింది.
    రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
    శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
    ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
    ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్
    - పోతన .
    --
    పోతన కన్నా వేదాంత దేశికులు సుమారు వందేళ్ళు ముందటి వారు అంటున్నారు గనుక, పోతన ఈ శ్లోకము నుంచి స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తుంది. అక్కడ నక్షత్ర మండలానికి తగినట్టు సుందరమైన వర్ణన ఉంటే ఇక్కడ సూర్యబింబానికి తగిన వర్ణనగా పోతన అందమైన వర్ణన చేశాడు. రెండూ చక్కని భావనాలహరులే.
    --
    ఈ విషయం ఇంతకు మునుపే గమనించిన చదువరులు విపులంగా వ్యాసం వ్రాసి ఉంటే చదివితే బాగుండును.
    అంతే కాక ఈ సంస్కృత శ్లోకం గురించి ఇంకొంచెం స్పష్టమైన వ్యాఖ్య దొరికితే చదవాలి.
    దేహళీశ స్తుతి ఆళ్వారుల తమిళ కృతి. దాని సారాన్ని దేశికుల వారు సంస్కృతంలో వెలయించారట.

 

19, అక్టోబర్ 2021, మంగళవారం

నా భాష

వెఱ్ఱినవ్వుల యాననమ్ములు, పిచ్చిమాటలునున్నచో
సఱ్ఱుమంచును నిందలన్ దిగ జారు వైనములున్నచో
చిఱ్ఱుబుఱ్ఱను లక్షణమ్ముల చేతలన్ మతి లేనిచో
చుఱ్ఱుమంచన వాతవెట్టుటె సూక్తమైన విధానమౌ.
--లక్ష్మీదేవి.
మత్తకోకిల.
నేను వ్యావహారిక భాషలోనే ఛందోబద్ధమైన పద్యాలు వ్రాస్తుంటాను. నాది వ్యావహారిక భాషోద్యమం కాదు. సంధిసమాసాలతో కూడిన పదబంధాలు, సంస్కృతమిశ్రితమైన తెలుగు, గంభీరంగా వినిపించి, శబ్దార్థాలతో వాటిలో అలంకారాలతో రసోపేతమై శోభించే భాషనే నాకు ప్రియమైనది. కాకపోతే అలాంటివాటిని చదివి కొంతవరకూ అర్థం చేసుకోడమే తప్ప, వ్రాసేంతగా ఆ భాష తెలీదు, చేతకాదు. అందుకే కేవలం వ్యావహారికభాషలోనే వ్రాస్తాను. నాకొచ్చే సలహాలేమంటే అందరికీ అర్థమయ్యేది సరళమైన భాషే కాబట్టి అదే మంచిదని. కానీ నాకు ఇందులో ఏ విశేషమూ కనిపించదు. స్వర్గానికెక్కలేమని ఉట్టికెక్కడమే గాని మరొకటి కాదు.

13, అక్టోబర్ 2021, బుధవారం

వివేకమున్న మాటలా?

సందేహాలూ - గందరగోళాల సభ -
వైరాగ్య భ్రమల్లో ఉన్న అ ఆ ఇ ఈ సభ్యులు.
పంచచామరము.
అ -విరాగమన్ననెేమొ నేర్చు వేళదెన్నడోకదా!
ఆ - బిరాన నేర్పునట్టి తత్వవేది యెవ్వరో కదా!
ఇ - విరాగమందు రాగమా? వివేకమున్న మాటలా?
ఈ - సరైన దారి చూపుమా! విశాలమైన విశ్వమా!
విరాగమన్ననేమొ నేర్చువేళదెన్నడో కదా!
బిరాన నేర్పునట్టి మార్గవేది యెవ్వరో కదా!
విరాగమందు రాగమా? వివేకమున్న మాటలా?
సరైన దారి చూపుమా! విశాలమైన విశ్వమా!
వైరాగ్యం - detachment - దేనిమీదా ఇచ్ఛ గానీ, నాది అన్న భ్రమ గానీ లేకుండడం.
నాడైనా, నేడైనా అందరికీ అవసరమైనది. ఎవ్వరికీ లభించనిది ఇది.
 'దేనిమీదా ఇచ్ఛలేని తత్వం' మీద మాత్రం ఇచ్ఛ ఎందుకు? చొప్పదంటు ప్రశ్న. అంటే అర్థసారం లేని పిప్పి వంటి ప్రశ్న. మూర్ఖప్రశ్న.
ఇచ్ఛ, మమత్వం అనే భ్రమలు సహజంగా వదలడం నిజంగా అవసరమైన స్థితే. కానీ ఆ స్థితిని కోరుకుంటూ, దానికోసం తపిస్తూ ఉన్నారంటే అది వారికి ఆమడదూరమే. దేనికోసమూ తపించని స్థితికి ఒక పక్వతతో చేరడం వల్లే నిజమైన శాంతి కలుగుతుంది అని ఊహిస్తున్నాను. ఊహనే. నిజంగా చేరే స్థితి నాకు, మనలో చాలా మందికి రాదు. వచ్చినవాళ్ళు ఏం చెప్తారో. ఏమీ చెప్పరనుకుంటా.ఇదంతా సహజమని ఒప్పుకొని సంపూర్ణేచ్ఛామమతలతో ఉంటే తప్పేం లేదు.

హోరాహోరీ!!!

May be an image of 1 person and text 

లక్షల ఓట్ల తేడా అంటేనే అవి తేడా ఎన్నికలనే అర్థం. మూర్ఖంగా పడిన ఓట్లతోనే అలా గెలవగలరు. నెహ్రూ అయినా అంతే ఎన్టీయారైనా ఇంకెవరైనా అంతే. ఇక్కడ నెహ్రూ అభిమానులను మించిన అభిమానులున్నవారు 1952 లోనే ఒకరున్నారన్నమాట.

---

నెహ్రూ గెలిచింది ద్విసభ్య నియోజకవర్గం. అప్పట్లో ఒక స్థానంలో ఇద్దరు గెలిచి వచ్చే పద్ధతి ఉండేదిట. ఆవిధంగా ఓట్లసంఖ తగ్గిపోతుంది. (అందుకే నల్లగొండ ఎంపీకి ఆధిక్యంగా వచ్చినన్ని ఓట్,లు నెహ్రూ మొత్తం ఓట్లకన్నా తక్కువ.)

1961లో ద్విసభ్య, త్రిసభ్య నియోజకవర్గాలను రద్దు చేస్తూ చట్టం చేశారు. బ్రిటన్‌లో 1950 ఎన్నికలకు ముందు ఈ పద్ధతే ఉండేది. అయితే అమెరికాలో ఒకరి కన్నా ఎక్కువ మందిని ఎన్నుకునే విధానం ఇప్పటికీ ఉంది. దాన్ని బహుళ సభ్యుల జిల్లా అంటారు. అక్కడా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందిని ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నుకుంటారు. 

కొసమెరుపు -  ఒకరిని ఒకరు అంత చిత్తుగా ఓడిస్తే, హోరాహోరీగా పోరాటం జరిగిందని వ్రాశారు. ఆ పదానికి అర్థం తెలియక వ్రాసుంటారేమో.

8, అక్టోబర్ 2021, శుక్రవారం

ముద్రాలంకారవృత్తము

 

మత్తేభమ్ముల ఘ్రీంకరింపులును, నిర్మానుష్యమౌ కానలున్,
చిత్తాకర్షక పుష్పమంజరులు, నుత్సేకించు శార్దూలముల్
విత్తమ్మన్నదె లెక్కలేదనెడు నిర్వేదమ్ము; నుత్తేజమే
సొత్తై దుంకుచు జింకలుండునన నుల్లాసమ్మునూహించగా.
-- లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితము.

7, అక్టోబర్ 2021, గురువారం

నల్లమబ్బంచు తెల్లనురగచీర

 

భోజ కృతి చంపూరామాయణం లో బాలకాండ చదివాను.
హడావిడిగా కథ చెప్పేస్తున్నాడు భోజుడు.
వాల్మీకి రామాయణం (సంస్కృతానికి తెలుగు అర్థం మాత్రమే ఇచ్చిన గీతా ప్రెస్ వాళ్ళ ముద్రణ) చదివిన తర్వాత ఇంకో రామాయణమేదీ ఆకట్టుకోదని తెలిసినా చదివాను. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉన్నా, ఆకట్టుకోలేదసలు. పూర్తిగా చదివే ఉద్దేశ్యం ఇప్పటికి లేదు. మిగతా కవులటుంచితే, భోజుడు కదా! సరే భోజులెంతమందో, కాళిదాసు కొలువున్న భోజుడి గురించి ఎక్కువ ఆశిస్తాం. ఆ భోజుడు, ఇతడు ఒకరేనా కాదా అన్న చర్చలో ఆసక్తి లేదు.
కానీ ఇందులో నచ్చిన దృశ్యం ఒక గంగావతరణం.
గంగావతరణదృశ్యం
దిగంతాలను తాకుతూ ఆకాశమధ్యంలో వ్యాపించిన ధవళతరంగాలతో , శంఖము వలె శశాంకుడు శోభితమైన నక్షత్రమాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మందాకినిలో మందారము మొదలైన చిన్న వృక్షాలు కొట్టుకొనిపోతుండగా, వాటి శాఖాంతాలు మాత్రమే కనిపిస్తున్నాయి. (శాఖల చివర పువ్వులు మాత్రమే కనిపిస్తుంటే సుమధారిణియైనట్టు ఉందేమో, భోజుడామాట అనలేదెందుకోమరి.) దిగంతాల వరకూ ధవళ వస్త్రగానుండగా అటూ ఇటూ చివరల నల్లటి మేఘమాల సన్నటిగీతలా కనిపిస్తోంది.(నల్లంచు తెల్లచీరా!!)
ఆ వర్ణనకేదో సుమారైన పద్యమైనా తెలుగులో వ్రాద్దామని ప్రయత్నం. 
చెల్లాటమ్ముల రాలెనో నగలనన్ శీతాంశు తారావళుల్
నల్లంచై మొయిలున్నదో యనగ ఫేనమ్ముల్ దిశల్ జేర, నా
కల్లోలాంశుక , దివ్యపుష్పశిఖియై గంగాంబ తా వచ్చెనే,
యుల్లాసమ్ముగ; పృథ్విపుణ్యనదియై, యుద్ధారమే లక్ష్యమై.
--లక్ష్మీదేవి.
శార్దూలవిక్రీడితము.
ఆటలలో రాలిన నగలో అన్నట్టు చంద్రుడు, చుక్కలు కనిపిస్తుండగా, మొయిలు నల్లంచు గా నురగల తెలుపు దిశలంటగా, అలలే అంబరమైన గంగాంబ
దివ్యపుష్పాలు ధరించి పృథ్వికంతటికీ పుణ్యనదియై ఉద్ధరించే లక్ష్యముతో ఉల్లాసముగా వచ్చెనే!!!