Loading...

9, డిసెంబర్ 2020, బుధవారం

హొయసాల శిల్పవైభవం

 


            బేలూరు, హళేబీడు ఒకప్పటి హొయసాల రాజుల రాజధానులు. పదహారు కి.మీ. దూరంలో రెండూ ఉన్నాయి. అద్భుతమైన  శిల్పకళ విరాజిల్లే కట్టడాలు వీళ్ళ శిల్పులు కట్టినవి సుమారు పన్నెండవ శతాబ్దానికి చెందినవి. యుద్ధాలలో కొందరు దుండగులు ముఖ్యంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో మాలిక్ దాడులకు గురై కొన్ని చెదిరినా హంపీ కన్నా కొంచెం మంచి పరిస్థితిలోనే ఉందనుకోవచ్చు.
                    వేదిక, దానిపై నున్న కట్టడం కూడా నక్షత్రం ఆకారంలో ఉండడం హొయసాలుల ప్రత్యేకత. చూడడానికి రెండు కళ్ళు చాలనంత అందంగా ఉంది ఆకారం. ఇక ఈ గోడల పైన యుద్ధవీరుల విన్యాసాలు, వారిని చూసే ప్రేక్షకులు, వేటగత్తెలు, వాహ్యాళికి పిల్లలతో, పెంపుడు కుక్కతో కలిసి వెళ్తున్న స్త్రీలు, ఏనుగుల, గుఱ్ఱాల, సైనికుల, యాళి అనే జంతువుల వరుసలు, నెమళ్ళు, హంసలు, అనేక రకాలైన పూలతలు అందంగా చెక్కబడి ఉన్నాయి.
లోపలి భాగంలో ఉన్న నలభై ఎనిమిది స్తంభాలూ నలభై ఎనిమిది రకాలైన డిజైన్లలో తీర్చిదిద్దారు. అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. 
హొయసాల రాజు విష్ణువర్ధనుడు కట్టించినరాజు, అతని పత్ని శాంతల నృత్యభంగిమలే శిల్పరూపంలో ఉన్నవి.
మొత్తం కట్టడానికి కానీ, పెద్ద శిల్పాలకు కానీ మొదట రెప్లికాలు తయారుచేసి తర్వాత అసలువి కట్టారు. అవీ ఇవీ కూడా చూడవచ్చు.
పైకప్పు లోని శిల్పకళ



యాళిని లొంగదీస్తున్న వీరుడు
రెండు అంతస్తుల్లో బాల్కనీ మాడల్






ఈ అన్ని భాగాలనూ విడదీసి వేరొకచోటికి కావాలంటే తీసికెళ్ళి అసెంబుల్ చేయవచ్చు. అన్ని వివరాలూ అక్కడి స్థలదర్శకుడు (గైడ్) చెప్పినవి.
మల్లయుద్ధమూ- చూస్తున్న ప్రేక్షకగణము   
బాహుబలి వద్దనున్న తెలుగన్నడ అక్షరాలు (శ్రావణబెళగొళ)

లైఫ్ సైకిల్
బెంగళూరు నుంచి హాసన్ చక్కటి రోడ్లు, మధ్యలో మంచి హోటళ్ళు



కంపెనీ మూసేసినా పని చేస్తున్న హెచ్ ఎమ్ టి గడియారం, లాల్ బాగ్

బెంగళూరు లాల్ బాగ్ లో స్వాగతం పలికి దారి చూపుతున్న పక్షి
చూడడానికి ఒకరోజు చాలదు, వ్రాయడానికి ఒక పోస్ట్ చాలదు, ఇదంతా ఒకశాతం మాత్రమే.
మయూరద్వయం

7, డిసెంబర్ 2020, సోమవారం

ఏ జనాభా తగ్గించాల్సింది?

 

 

 

మనుషుల జనాభా తగ్గించే చర్యలు తీసుకు చావలేరు గానీ జంతువుల మీద ప్రతాపమా ఈ ప్రభుత్వాలకు? ఒక పక్క ఈ జంతుజాతి అంతరించి పోతోంది, ఆ జంతుజాతి అంతరించిపోతోందని అభయారణ్యాలు పెట్టినా పెద్ద లాభం లేకుండా పోతుంటే ఏమిటిది? అంత చిన్న కరోనా జీవికి భయపడి మాస్క్ లు పెట్టుకు, ఇంట్లో ఉండి బ్రతకాలనుకుంటున్నామే! కోతుల నుంచి రక్షణకు ఏదో ఆలోచించాలి గానీ అన్నిటినీ చంపడమేంటి? భూమికి పట్టిన పెద్ద దరిద్రం మనిషే.

4, డిసెంబర్ 2020, శుక్రవారం

గొప్పపని

https://mumbaimirror.indiatimes.com/coronavirus/news/teacher-who-animated-books-with-qr-codes-wins-global-prize/articleshow/79556346.cms

నలుగురికి ఉపయోగపడే పని చేయాలని ఉండడం గొప్ప విషయం.

14, నవంబర్ 2020, శనివారం

చెమ్మ చెక్క

 

చెమ్మ చెక్క ఆటల గురించి తెలీనివాళ్ళు జోకులు వేస్తారు గానీ ఆడినవాళ్ళకు అది ఆడేటప్పుడు ఎలా ఆనందంగా ఉంటుందో, శక్తిదాయకంగా అనిపిస్తుందో తెలుస్తుంది. ఇది చూసి నవ్వేవాళ్ళకు అది తెలీదంతే.
అలా చేతులు పట్టుకొని గిఱ్ఱున తిరగడం భలే ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. శరీరంలో నరాలన్నీ ఒక్కసారి యాక్టివ్ అవడం మంచిదా, కాదా సైన్స్ వాళ్ళు చెప్పాలి మరి. మంచిదనే చెప్పగలరు, ఇంకేం లేదు చెప్పడానికి.
పెద్దవాళ్ళైనామని ప్రతీదీ మానేస్తే మనంత దద్దమ్మలు, ఈ మాట బాలేదు, మనంత మొద్దులు  ఎవరూ ఉండరు.
-
పండరీ పురం గుడి లోపల ఇలా చేతులు పట్టుకొని గిఱ్ఱున తిరిగే కార్యక్రమం ఒక ఆచారం. ఆ గుడికి వెళ్ళినప్పుడు నేను భలే ఆశ్చర్య పోయాను. ఎందుకంటే నేనూ ఇలా తిరిగి ఎన్నేళ్ళో అయిపోయింది.
అక్కడ పెద్దా, చిన్నా తారతమ్యం లేదు. సామాన్యంగా ఆడవాళ్ళంతా ప్రాంగణంలో ఒకవైపుకి, మగవాళ్ళంతా ఒకవైపుకి వెళ్ళిపోతారు దర్శనానంతరం. కాబట్టి మగవాళ్ళు చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, ఆడవాళ్ళు మాత్రం ఎలాగూ ఒంటరిగా రాకుండా వాళ్ళ నెచ్చెలులతో వచ్చి ఉంటారు స్థానికులు. చక్కగా ఆడుతున్నారు. గుళ్ళో ప్రదక్షిణ , నమస్కారమంత ముఖ్యమది అక్కడ. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఒక్కసారి మెల్లగా అయినా సరే తిరిగి కూర్చుంటున్నారు.
ఎంత బాగుంటుందో అసలు!



ఏకాంత్

 

మొదటి సహస్రాబ్దము నుంచి గత సహస్రాబ్దము సగము వరకు కొందరు కట్టిన, మరికొందరు పడగొట్టిన భవ్యమైన కోటలు, నగరాలు ఇప్పటి భారతదేశంలోపలివి ఏవైతే ఉన్నాయో, వాటి గురించి చాలా చిన్న పరిచయం, కొన్ని వివరాలు, మరికొన్ని కథలు, ఒక మంచి ఫోటోగ్రఫీ తో పాటు కొంచెంగా వ్యాఖ్యానిస్తూ ఒకే వ్యక్తి (అకుల్ త్రిపాఠీ)- వెరసి 'ఏకాంత్' సిరీస్.
two seasons - 25 & 12 episodes - each 20 mts.
ప్రైమ్ లో ఉంది. 2014 లో తీసినది. ఈ సిరీస్ ను ఎందరో చూసి ఉండొచ్చు. ఎందరో చూసి ఉండకపోవచ్చు. అందుకే ఈ వివరాలు.
--
చరిత్ర, పురాతత్వ పరిశోధన, ఫోటోగ్రఫీ, పర్యటన -
ఈ విషయాలలో ఎందులో ఆసక్తి ఉన్నా, తప్పకుండా చూడొచ్చు. ఎక్కడా విసుగురానివ్వకుండా చక్కగా తీశారు. ముఖ్యంగా ఆ యా ప్రాంతం పూర్తిగా కనిపించేలా, అవగాహన వచ్చేలా high angle shots, bird view shots & aerial shots superb గా ఉన్నాయి.
కొన్ని ఈమధ్యే కట్టినట్టు మొత్తంగా కనిపిస్తుంటే , కొన్ని చోట్ల కొన్ని గోడలు తప్ప ఏం ఉండవు.
వీటిలో సరైన చరిత్ర తెలుస్తుందా? ఇవన్నీ ఎంత మేరకు యథార్థాలు అన్న చర్చకు ఇందులో స్థానం లేదు. కేవలం చిన్న పరిచయం, దృశ్యవీక్షణం అంతే.
ఇందులో ఒక్కో ఎపిసోడ్ లో ఒక స్థలం గురించి ఉంటుంది. అన్నీ వేటికవే. ఏది కావాలంటే అది చూసుకోవచ్చు.
ఆయా ప్రాచీన చారిత్రక స్థలం, అక్కడ పడిపోగా/పడగొట్టగా మిగిలిన/పునరుద్ధరించబడిన కట్టడాలు చూపిస్తూ,
అక్కడి ఆర్కియాలజీ శాఖ ఉద్యోగులు , చరిత్ర అధ్యాపకులు, స్థానిక చరిత్రను పాడే జానపదులు, ఆ నోటా ఈ నోటా విన్న కథలు చెప్పే ప్రజలు వీరిద్వారా కొన్ని వివరాలు అందజేస్తారు.
ఆ కథలకు అనుగుణంగా graphics తో ఆ కాలం నాటి దృశ్యాలను కొన్ని stills ద్వారా చూపిస్తారు.
సాదా మాటల్లో స్పష్టమైన క్లుప్తకథనం. స్క్రిప్ట్ ఎవరు వ్రాశారో వివరాలు తెలియలేదు. అకుల్ త్రిపాఠీనే వ్రాసుకొని ఉండొచ్చు అనుకుంటున్నా.
ఏమాత్రం emotional/sentimental baggage లేదు.
--
మొదటి సీజన్ లో చూపినవి -
 
కుల్ ధారా,విలాస్ గఢ్, భాన్ గఢ్, రామ్ గఢ్ (రాజస్థాన్)
చిక్టన్, న్యార్మా హరిపర్వత్ (కాశ్మీర్)
లఖ్ పత్, రోహా, చంపనీర్ (గుజరాత్)
ఓర్చా (బుందేల్ ఖండ్-ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్)
మురుంద్ జంజీరా(కొంకణతీరపు మహారాష్ట్ర)
తాలక్కడ్ (మైసూర్ దగ్గరి కావేరీ తీరం, కర్ణాటక)
హళేబీడు, కిత్తూరు (కర్ణాటక)
సెల్యూలర్ జైల్, రాస్ ద్వీపము (అండమాన్)
ఉన్నకోటి (త్రిపుర)
శిబ్ సాగర్ (అసోం)
నలందా, వైశాలి(బీహర్)
హంపి(కర్ణాటక)
లక్నో (ఉత్తర్ ప్రదేశ్)
బిష్ణుపుర్ (బెంగాల్)
విజయ్ దుర్గ్ (మహారాష్ట్ర)
 
రెండో సీజన్ చూడాలింకా.
 
రాయగఢ్ (మహారాష్ట్ర)
కుంబల్ గఢ్ (రాజస్థాన్)
అసీర్ గఢ్ (మధ్యప్రదేశ్)
బిజాపుర్(కర్ణాటక)
దౌలతాబాద్(మహారాష్ట్ర)
బర్హన్ పుర్ (మధ్యప్రదేశ్)
కాంగ్డా (హిమాచల్ ప్రదేశ్)
జగేశ్వర్ (ఉత్తరాఖండ్)
జమ్ము , లెహ్ (కాశ్మీర్)
భటిండా (పంజాబ్)
మెహ్రౌలి (దిల్లీ)
--

 
 

13, నవంబర్ 2020, శుక్రవారం

ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?

 

 

ఒకానొక కవితాసంకలనం లోని 36 ముక్త కవితల్లో ఒకటి మోహనమురళి. మోగేరి గోపాలకృష్ణ అడిగ అనే కవి వ్రాసిన ఈ కవిత కన్నడ సాహిత్యంలో జనప్రియమై, ప్రసిద్ధమైనది. ప్రతి రెండు పంక్తులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాసలు లయబద్ధత, గేయసౌలభ్యం ఉండడం ఇందులో విశేషాలు.
---
స్థూలంగా ఇందులోని విషయం లౌకికప్రవృత్తికి, అలౌకిక అన్వేషణకు మధ్య ఊగిసలాడు అంతరంగపు ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు.
స్వగతంలో మధ్యమపురుషలో మాట్లాడుకుంటున్న ఒక నాయకుని/నాయిక యొక్క స్పష్టాస్పష్టంగా ఉన్న భావాల కలబోతగా ఇది సగటు మనిషి యొక్క సందిగ్ధతను అద్దంలో చూపిస్తుంది.
--
లౌకిక తృష్ణల పంజరమైన దేహంలో ఇరుక్కున్న అంతః చేతన చేరలేని ఆధ్యాత్మ తీరాలకై ఆరాటపడుతోంది. ఆరాటమెంత ఉన్నా వీటిని దాటి వెళ్ళనూ లేదు, రక్తి విరక్తి గా మారగా ఉన్న ‘బంధాల’నే బంధనాలను వదిలిపోవాలనుకున్నా పోనూలేక ఉండనూలేక కొట్టుమిట్టాడుతుంది.
లౌకిక బంధనంలో ఉన్న మనసును ‘ఏ మోహనమురళీ రవము పిలుస్తోంది నిన్ను? ఏ బృందావనాలు ఈ మర్త్యనయనాలను ఆకర్షిస్తున్నాయి?’ అన్న ప్రశ్నతో మొదలౌతుంది.
పిలుపు విన్నా అక్కడిదాకా చేరలేని ‘చర్మ’చక్షువుల అశక్తతను ఎత్తిచూపిస్తూ ఈ పదం ఇక్కడ అవసరం అనిపిస్తుంది. తర్వాతి పంక్తులలో అది నిరూపణ అవుతుంది.
---
*మురళి, బృందావనాలు రాసలీలలతో పాటుగా ఆధ్యాత్మిక అంతరార్ధాలకు సమానంగా ప్రాచీన సాహిత్యంలో వర్ణింపబడినాయి.
వీటి పిలుపు వేణుగానము వలె ఆకర్షణీయమవడం,
* మానవుని అంతఃకరణము తానున్న తృష్ణపంజరమనే దేహాన్ని దాటి ఏ దివ్యతీరాలకో చేరాలనుకోవడం ,
*లౌకిక వాతావరణం మీద ఆసక్తి నశించినా ఈ కంచెను దాటి వెళ్ళలేకపోవడం
అన్న సందిగ్ధ స్థితి వర్ణన ఇందులో ఉంది.
అయితే ఆ ఉందనిపిస్తున్నదేదో ఉందోలేదో, చేరగలమో లేదో కవి ఇతమిత్థంగా తేల్చి ఏమీ చెప్పడం లేదు. ఉందేమో అన్న భావన ఒక మురళీ రవమై పిలిచి ఆకర్షిస్తున్నట్టు, కానీ ముందడుగు వేయలేని తన అశక్త యథార్థ స్థితి పై విరక్తితో ఉన్నట్టూ తెలుస్తుంది.
----
భావము సుమారుగా ఇలా ఉంది
ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?
ఏ దూర బృందావన తీరాలకు లాగుతోంది?
పువ్వులశయ్యలు, చందనచర్చలు, వెన్నెలలో బాహుబంధనాలు, చుంబనాలు ఎన్నో విరిసే ఈ తృష్ణవనపు హద్దులలోపలే ఇంద్రియాల ప్రతిధ్వనిలో (కూడా వినిపించేలా) ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?
ఏ దూర బృందావన తీరాలకు లాగుతోంది?
రాగార్ద్రమైన హృదయము(ప్రేమతో తడిసి మెత్తబడిన మనసు), వెచ్చని స్పర్శలు చుట్టిన పంజరము, ఇదే చాలని కదా అనుకున్నావు? మరి ఈరోజు ఏల ఈ విరక్తి?
(చూపు అటు కానీ, ఇటు కానీ నిలువని) చంచలమైన ఈ కనులలో చూపేమి వెదుకుతోంది? ఇది మధుర యాతనా? దివ్యమైన యాచనా?
దారువులో అగ్ని దాగినట్టు ఈ విరక్తి నీలో ఎక్కడ దాగిఉండిందో , ఒక్కసారి అడవిలో కార్చిచ్చులా అంగాంగాలనూ దహిస్తోంది!
సప్తసాగరతీరాలంత దూరంగా(చేరలేనట్టుగా) ఉందా నీ నిదురించిన అంతఃకరణసాగరము? ఎగసి పడని ఆ అలల మూగసద్దులు ఇక్కడికి చేరాయా?
ఈ ప్రాణము వశము తప్పినది, ఈ దేహపంజరములో ఉన్న చేతన స్వ అధీనములో లేదు. ఉన్నవన్నీ వదలి లేనివాటికై తపించుటే జీవనమా?
------
సుమారుగా ఆ రాగంలో ఒక ప్రయత్నము---
-----
*దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
ఏవొ బృందావనములిట్టుల
కనుల నాకర్షించెనో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*పూలశయ్యల గంధజ్యోత్స్నల బాహుబంధన చుంబనముల
తృష్ణవనముల సీమలోపల ఇంద్రియమ్ముల నిస్వనముల
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*రాగరంజిత మానసమ్ములు వెచ్చదనముల స్పర్శలు
ఇంతె చాలని అంటివే? నేడు ఈ విసుగేలనో!
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*చంచలంపు కన్నులందున తేలె చూపుల సూచనేమో?
ఏమిది? మధుతర యాతనో ? దివ్యమగు ఏ యాచనో?
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*దారువందలి అగ్నివోలెనె ఎచటనున్న విరాగమో
సాధనన్వేషణల తీరున అంటుకున్న ఆవేగమో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*సప్తసాగరతారణమ్ముల సుప్తసాగర మంతరంగమొ
అంకురించని అలలగర్జన ఎట్లు నిన్నిటు చేరెనో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*వివశమైనది ప్రాణము పరవశము నీ యీ చేతనం
చెంతనున్నది వీడి, లేనివాటికి తపనే జీవనం!!
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
ఏవొ బృందావనములిట్టుల
కనుల నాకర్షించెనో!
---
( రికార్డులలో అన్ని చరణాలూ ఉండవు.) ఈ లయలో బాగా కుదురుతుందీ పాట.

వినొచ్చు.
ಯಾವ ಮೋಹನ ಮುರಳಿ ಕರೆಯಿತು ದೂರ ತೀರಕೆ ನಿನ್ನನು?
ಯಾವ ಬೃಂದಾವನವು ಸೆಳೆಯಿತು ನಿನ್ನ ಮಣ್ಣಿನ ಕಣ್ಣನು?
ಹೂವು ಹಾಸಿಗೆ, ಚಂದ್ರ, ಚಂದನ, ಬಾಹುಬಂಧನ ಚುಂಬನ;
ಬಯಕೆತೋಟದ ಬೇಲಿಯೊಳಗೆ ಕರಣಗಣದೀ ರಿಂಗಣ;
ಒಲಿದ ಮಿದುವೆದೆ, ರಕ್ತ ಮಾಂಸದ ಬಿಸಿದುಸೋಂಕಿನ ಪಂಜರ;
ಇಷ್ಟೇ ಸಾಕೆಂದಿದ್ದೆಯಲ್ಲೋ! ಇಂದು ಏನಿದು ಬೇಸರ?
ಏನಿದೇನಿದು ಹೊರಳುಗಣ್ಣಿನ ತೇಲುನೋಟದ ಸೂಚನೆ?
ಯಾವ ಸುಮಧುರ ಯಾತನೆ?ಯಾವ ದಿವ್ಯ ಯಾಚನೆ?
ಮರದೊಳಡಗಿದ ಬೆಂಕಿಯಂತೆ ಎಲ್ಲೊ ಮಲಗಿದ ಬೇಸರ;
ಏನೋ ತೀಡಲು ಏನೋ ತಾಗಲು ಹೊತ್ತಿ ಉರಿವುದು ಕಾತರ.
ಸಪ್ತಸಾಗರದಾಚೆಯೆಲ್ಲೋ ಸುಪ್ತಸಾಗರ ಕಾದಿದೆ,
ಮೊಳೆಯದಲೆಗಳ ಮೂಕ ಮರ್ಮರ ಇಂದು ಇಲ್ಲಿಗು ಹಾಯಿತೆ?
ವಿವಶವಾಯಿತು ಪ್ರಾಣ; ಹಾ ಪರವಶವು ನಿನ್ನೀ ಚೇತನ;
ಇರುವುದೆಲ್ಲವ ಬಿಟ್ಟು ಇರದುದರೆಡೆಗೆ ತುಡಿವುದೆ ಜೀವನ?

 
 
 


చిక్కనిపువ్వు

 

పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పద్యము -
ఉ .
పరుల ప్రశంస సేసి నవ భాగ్యములందుట కంటె, నాత్మ సు
స్థిరుడయి పున్క పాత్రమున దిన్నను నా మది జింత లేదు, యీ
శ్వరు గుణ తంద్ర గీతముల బాడుదు, జిక్కని పూవు వోలె నా
పరువము వాడకుండ నిలపై మని రాలిన జాలు సద్గురూ !
- పాద్యము నుండి.
-
పరులను పొగడి డబ్బు సంపాదించడం కంటె, (ప్రలోభాల వల్ల అటూ ఇటూ అల్లాడక ) మనసును స్థిరంగా ఉంచుకొని, బొచ్చెలో తిన్నా నా మనసులో చింత లేదు, ఈశ్వరుని గుణగానములు పాడుచు, చిక్కని పువ్వులా పదను వాడకుండా ఇలపై జీవించి రాలిపోతే చాలు గురువర్యా!
-
చిక్కని పువ్వు అంటే ముద్దమందారం, చెండు(బంతి)పువ్వు లా దట్టంగా రేకులు ఉన్న పువ్వు అని తీసుకోవచ్చు. చిక్కని అనే పదం కూడా ఇక్కడ సార్థకంగా వాడినట్టు తెలుస్తున్నది. రేకు మందారము గాని, ఇతర పువ్వులేవైనా వాడినంత త్వరగా ముద్దమందారము, చెండు(బంతి)పువ్వు వాడవు. ఇంకొంచెం కాలం తాజాగా ఉండగలవవి. అందుకే చిక్కని అన్న పదము పద్యము లోని పదను వాడకుండా అన్న భావానికి పొందికగా అమరి పోయింది.

ఏం జరుగుతుందో-జరగాల్సింది జరుగుతుంది.

 

when I was just a little girl
I asked my mother what will I be
Will I be pretty will I be rich
Here's what she said to me
Que sera sera
Whatever will be, will be.
The future's not ours to see
Que sera sera
What will be, will be.
when i was just a child in school
i asked my teacher what will i be
should i paint pictures should i sing songs
Here's what she said to me
Que sera sera
Whatever will be, will be.
The future's not ours to see
Que sera sera
What will be, will be.
When I grew up and fell in love
I asked my sweetheart what lies ahead
Will we have rainbows day after day
Here's what my sweetheart said
Que sera sera
Whatever will be, will be.
The future's not ours to see
Que sera sera
What will be, will be.
Now I have children of my own
They ask their mother what will I be
Will I be handsome will I be rich
I tell them tenderly
Que sera sera
Whatever will be, will be.
The future's not ours to see
Que sera sera
What will be, will be.
Que sera sera


10, నవంబర్ 2020, మంగళవారం

చదువరులు

 చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి

భారతప్రాంతపు పులులకు మంచి రక్షణ - మంచి మాట

పులుల సంఖ్య తగ్గిపోతుండడం, దానికి తగిన చర్యలు ప్రభుత్వ ప్రైవేట్ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతుండడం వింటుంటాం. అయితే ఇందులో ఒక శుభవార్త ఏమిటంటే ఈ ప్రయత్నాల ఫలితంగా పులుల సంఖ్య కొద్ది మాత్రం పెరగడం. అందులోనూ మన భారత ప్రాంతపు అడవులలో మిగతా చోట్ల కన్నా ఇంకొంచెం మంచి సంఖ్య ఉండడం సంతోషకరమైన విషయమే.దీంట్లో చాలా పెద్ద రహస్యమేమీ లేదు. చిన్న పరిశీలన. అంతే.
A culture of tolerance and good protection laws work in unison to make tiger conservation possible in India. The Indian cultural belief of 'live and let live' expands to include all living beings.
However, when people do kill wildlife or other animals illegally, there are enough teeth in India’s wildlife protection laws to punish such miscreants.

ఈ విషయం గురించి, మరికొంత పులుల జీవనంలో సాధకబాధకాల  గురించి మంచి సంభాషణ ఒకటి ఇక్కడ లింక్ లో ఉంది. చదవదగిన ఆర్టికల్.


 పులుల జీవన సాధకబాధకాలు

 

 

 

 

 

 

 

 

 

 

31, అక్టోబర్ 2020, శనివారం

పద్యస్మృతులు

 

అప్పుడప్పుడూ వ్రాసుకున్న పద్యాల్లో కొన్ని.
తప్పు దొర్లిన చోట్లు పరిశీలించుకుందామని పెట్టాను.
ఇప్పుడు వస్తున్న మూడొంతుల ఆధునిక కవిత్వం లా ఇవీ అర్థం లేని వ్యర్థాలే. అర్థం ప్రత్యేకంగా చెప్పేందుకు ఏంలేదు. తెలిసిన పదాలు, తోచిన భావాలూ కూర్చినది. ఇందులో నిఘంటువు కందని పదాలూ, దీర్ఘ సమాసాలు ఉండవు.
ఉత్పలమాల-
కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ సరళ దృష్టినిఁ గల్గి సదానుకూలుఁడై
మారని శ్రద్ధతో గురువు మానక బోధలఁ పాఠనమ్ములన్
చేరిన శిష్యులందుఁదగు శీలగుణమ్ములఁ బెంచగాదగున్.
_______
చంపకమాల-
చదువుల తల్లి శారదకు చక్కని రీతుల పిల్లలందరున్
కుదురుగ చేసిరర్పణలు గొప్పగ పద్యపుపద్మమాలికల్,
మదిని ముదమ్మునిండగను మాయమ రాదొకొ తాను ముగ్ధయై!
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
________
చంపకమాల-
అనయము క్షీరనీర ముల నారసి పేరును గొన్నతీరుగన్
మనమొక రాజహంసయయి మంచిని పెంచి సుఖించు టొప్పగున్.
వినయము తోడ వేడుకొన వీణనుఁ బూనిన శారదాంబ వా
హనమున కున్న మంచిగుణమబ్బును. నమ్ముము మానసంబునన్.
--------
ఉత్పలమాల-
పాతకులై జనావళిని బాధలు పెట్టెడి హీనమైనదు
ర్నీతిని మట్టుబెట్టవలె. నేతలు పెద్దలు దేశభక్తులున్
మా తరమెట్టులౌననుచు మౌనము దాల్చుట పాడికాదికన్
చేతల యందుచూపవలె, చిక్కులు తీర్చుచు మానవాళికిన్.
----------
చంపకమాల-
నినుగని పొంగిపోవగ ననేకములైన మనోవికారముల్
ననువిడిపోవు నిక్కముగ, నాకములన్నియు నన్నుచేరునే!
మనమిక వెండికొండయగు, మాటయె మంత్రము కాకయుండునా
వినుమొక మాఱు నాదు మొఱ, వేడితి నీకడ నాదిదేవరా!
-----------
మత్తేభవిక్రీడితము-
మిసిమిన్ చూపెడు చిన్నియాకులవి నెమ్మేనన్, విలాసంబుగా
ముసినవ్వుల్ కురిపించుచున్ నటనలన్ మోహింపజెయ్యున్, నిలన్ .
కుసుమంబందున హాసముల్ సొగసులై కొంగ్రొత్త గా శోభిలున్,
హసితమ్మొక్కటి మోమునందు బలు వయ్యారమ్ము నొల్కించుచున్.
-------------
ఉత్పలమాల-
తెల్లని ఱెక్కలన్ గలిగి తీయగఁ బల్కెడు రాజహంసమా!
యెల్లరి మానసమ్మలర యిచ్చటికిప్పుడు వచ్చినావటే!
వెల్లువ లయ్యె నా మదిని వింతగ సంతసమో మరాళమా!
యుల్లము పాడె, నా సఖుని యొద్దకు చేరుచు మానసమ్మిదే!
----------
సరసాంక-
వినుమోయి నాదు మనవిన్ వినిపింతు నేడే
కనుమా ప్రియమ్ములొలికే కలహంసమా! నా
మనమందు ఱేని తలపుల్ మధురోహలై నే
డు నిజమ్ములయ్యె; తినరండు మృణాళరాజిన్.
-------------
ఉత్పలమాల-
కన్నుల నాట్యమున్ గనిన, గాంచి రసజ్ఞత తోడ నెప్పుడున్,
మిన్నుల తేరుపై చనిన మేలగు భావము పొందుచుందునే!
పన్నగధారి ! నిన్ దలచి, పాడెదనో నట రాజ! శంకరా!
మిన్నగ గొప్పదౌ రుచిని మెచ్చి యొసంగితివే నటేశ్వరా!
--------------
మత్తకోకిల-
నీలదేహము మోహనమ్మది నింగిబోలుచు నుండునే!
బాలకృష్ణుని వేణునాదము పారవశ్యము పెంచునే!
పాలసంద్రము జేతు నా మది పవ్వళింపవె శ్రీహరీ!
మ్రోలవాలితి నయ్య శీఘ్రమె మ్రొక్కులందవె నీవిదే!
------------
ఉత్పలమాల-
మాపురమందు భవ్యమగు మందిరమొక్కటి చూచిరావలెన్
గోపురమందు పావురము గూటిని కట్టిన తీరు నచ్చటన్
చూపరులెల్ల ముచ్చటగ చూచుచు నుందురు తప్పకుండగాన్.
జ్ఞాపకమందున నిల్చెనది చక్కని పల్లెకు తాను గుర్తుగాన్.
________
ఉత్పలమాల-
తేనెల నూరు మాధురుల, తీయదనంబును మెచ్చువారలున్,
జ్ఞానులు, కావ్య సంరచన కమ్మగ జేయుచు నుండువారలున్,
వీనులు మెచ్చు రీతి కడు వేడుక సాహితి విందుజేతురే!
మానసమందె సంతసము; మక్కువ తోడ నమస్కరింతు నేన్.
----------
ఉత్పలమాల-
జ్ఞానము నిచ్చు పెద్దలకు, చక్కటి విద్యను నేర్పు వారికిన్,
మౌనము దాల్చి; వందనము, మాన్య వరేణ్యుల దల్చి జేసెదన్.
ప్రాణము తోడ నే భువిని బాయక నుండెడు నాళులన్నియున్,
ధ్యానము లోన నిల్పి గురు దర్శన భాగ్యము చేయకుందునే?
-------------
ఉత్పలమాల-
బీటలు వారెనే పుడమి బీదతనంబున రైతులేడ్వగా
మాటలు కాదు సేద్యమును మానక జేయుట నేటి రోజునన్
నాటిన పైరు వచ్చునని నమ్మకమన్నది లేకపోయెనే
చేటగు కాలమే జనుల చింతల బెంచుచునుండెనే హలా!
-------------
ఉత్పలమాల-
ఎవ్వరు నేర్పిరో మరుల నిట్టుల నద్భుత రీతులందులన్
మువ్వల సవ్వడో యనగ మ్రోవగ జేయుచు జెల్గెనీతడే!
పువ్వుల తావిలో కలము ముంచుచు వ్రాసెనొ! బొండు మల్లెలన్
రువ్వుచు, నిల్పె నిజ్జగము రోయక నుండగ భావుకత్వమున్.
--------------
చంపకమాల-
గగనపు సీమలోనరుగు కారుమొయిళ్ళను గాంచి, ముద్దుగా
నగవుల నొల్కు పత్నిని మనంబున దల్చిన యక్షుడాశతో
దిగులును మానమంచునొక తియ్యని వార్తను జేర్చకోరుటన్
సొగసుగ కావ్యరూపమున శోభిల వ్రాసెను కాళిదాసుడే.
-------------
మత్తేభవిక్రీడితము-
వినుమాముద్దులగూర్చుచున్ తిరిగి నువ్వీరీతి యాటాడుచున్
మనముల్లాసము జెందగా మిగుల సంభాషించ నింపాయెనే!
యినుడుంగ్రుంకెను ప్రొద్దు పోయెనిక నీవీ లాలిలో హాయిగా
కనుచున్ స్వప్నము నిద్దురించవలె , నీకై నేను పాడంగనే.
------------
ఉత్పలమాల-
ఇవ్వని తీరునన్ తనువ దెల్ల వసంతుఁడు పూనె, నమ్మవే
జవ్వని! నాఁడు నా ప్రియుఁడు చక్కని వాఁడు,మనోహరమ్ముగా
నవ్వులు రువ్వుచున్ భువికి నాకము దించుచు, నన్ను చేరగా,
మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్.
----------
ఉత్పలమాల-
పుస్తకరాశి యిట్లు బలు ముచ్చట గొల్పుచు నుండుతావిదే,
మస్తకమెల్ల నింపునివి, మానవజాతికి పెన్నిధౌ, మరే
వస్తువు గొప్ప కాదుకద, వ్రాసిన వారి కలంబు కన్న, నే
నాస్తిగ నెంచుకొందునిక హాయిని బెంచెడి గ్రంథరాశినిన్.
--------------
ఉత్పలమాల-
భూతలమందు వర్షణము పొంగగ వాగులు నెల్ల చోటులన్
కాతరులైరి యెల్లరట కాటుక మబ్బుల ధాటికె,ట్టులో
శీతల మంద వాయువులచే వణికించెడు వేళ, సాగె నా
రాతిరి; తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్.
------------
మత్తేభవిక్రీడితము-
నవలానాయకుడెవ్వడో? యెపుడొ యేనాడో చెలీ దర్శన
మ్ము? విశేషమ్మగు భాగ్యమెన్నడది? నా మ్రొక్కుల్ ఫలింపంగ నన్,
జవరాలన్ మురిపించు నాథుడెవడో? చక్కన్నివాడెవ్వడో,
ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.
--------------
మత్తేభవిక్రీడితము-
పవిధాటిన్ తెగు పత్రముల్ పగిది నీ ప్రాణమ్ము కాయమ్ము,దా
లవలేశమ్మును ప్రీతి లేనటుల చేలమ్మంచు వీడంగనే,
భవబంధమ్ములు వీడ; బిడ్డలెవరో? ప్రాణేశ్వరుండెవ్వడో?
ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.
--------------
ఉత్పలమాల-
అల్పమె రాలఁ జెక్కుకళ? లద్భుతమై యలరారుచుండదో
కల్పములెన్నొదాటినను, కన్నులకింపులు గూర్చి భవ్యమై
శిల్పుల పేర్మి బెంచునిది; శీతలమౌ తెలిమంచుతెమ్మెరన్
శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.
----------
మత్తకోకిల-
కొత్తరూపును కీటకమ్మది కోరివచ్చిన నేమి? యీ
తిత్తి తోలును వీడి చేరుము దేవదేవుని సన్నిధిన్.
మత్తు వీడుము, జన్మ మృత్యువు- మాయమర్మమె కాదొకో!
చిత్తమందున భక్తినిల్పుచు సేవజేయుచు నుండుమా!
--------------
చంపకమాల-
హయముల మించు వేగమున హర్షమునింపు జనాళి వ్రాతలన్,
రయమునఁ దెచ్చి యిచ్చుచు, కలంతలఁ దీర్చగ నాప్తుఁగల్పుచున్,
మయసభఁ బోలు జాలమిది , మాయల జాలము; మేలు కార్యముల్
ప్రియముగ సల్పుమా! పరుల భీతిల జేయకు కీడొనర్చుచున్.
------------
చంపకమాల-
బుధజన సేవితాంఘ్రి యుగమున్ స్మరియించుచు పద్యమల్లగా
సుధలను నింపుమీవె విన సొంపుగ నుండగ నాంధ్రభారతీ!
మధువనమట్లు వేదికయె మారగ జేయవె శబ్దమాధురీ
దధిని రసానుభూతి యిక దక్కగ వెన్నగ మమ్ముబ్రోవవే!
--------------
మత్తకోకిల-
వచ్చెనోయి వసంతమిచ్చట బాలబాలకులెల్లరున్
వచ్చిచేరి సరాగమాడుచు పాడియాడిరి ప్రేమతో
పచ్చనాకుల రంగుపువ్వుల పల్లెసీమల అందమే
మెచ్చి వారికి రంగులిచ్చుచు మేలమాడగ వేడుకే!
------------
మత్తేభవిక్రీడితము-
జనసమ్మోహన శక్తి చేత, వినగా సంగీతమెల్లప్పుడున్,
విని యాస్వాదనఁజేయగల్గినను వెన్వెంటన్ ధ్వనుల్ పెచ్చుమీ
రినచో భక్తినిఁ బాడు గీతమయినన్, రెట్టింపు గానున్నచో
ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.
-------------
ఉత్పలమాల-
నే కలగన్న స్వామివని నిన్ను సదా నెఱనమ్మియుంటి నా
థా! కనులేల చెమ్మగిలె? తర్కముఁ జేయను, వాదులాడ, నే
నీ కమలాక్షిగానె? మరి నిక్కము ముఖ్యము నీదు శాంతియే,
నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే!
---------------
మత్తకోకిల-
కాలమెల్లను తోడునీడగ కష్టమందున సాయమై,
చాల మేలునుఁ జేయుచుండగ సఖ్యభావన చాలుగా!
నేల నింగినిఁ బోలి యున్నను నెయ్యమెప్పుడు స్వచ్ఛమే,
బాలలందున మైత్రి యేర్పడ పట్టువీడక నుండదే!
----------------
ఉత్పలమాల-
అల్లనసాగరమ్మున మహత్తగు నల్పపు పీడనమ్మదే
మెల్లగ నేర్పడంగను సమీరము వేగముతోడ వీచగా
జల్లులఁ జెట్లు చేమలును స్నానములాడుచునుండ హాయిగా
చల్లగ నయ్యె నీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చినంతనే.


22, అక్టోబర్ 2020, గురువారం

పంచచామరములు


 
వివేకమున్ననేమి యందు వృద్ధిఁగాంచకున్నచో
భవంపు మోహఛాయలైన వాడకుండనున్నచో
నవీనమార్గమేమిటన్న నాదు సందియమ్ము లో
దివమ్మురాత్రి జీవనంపు తీరు వ్యర్థమే కదా!
 
విమానయానమల్లె నింగి వేగిరమ్ము సాగుటన్
సమాహితమ్ముగా మనమ్ము చక్కజేయకున్నచో
ప్రమాదమెంత పొంచియుందొ భావియందునన్ కదా!
తమమ్ము నిండి యున్నదోయి ధాత్రియెల్ల దిక్కులన్. 
 
ప్రయాణమెల్ల చక్కనైన పద్ధతుండనీ సదా!
నయానయానముండనిమ్ము నావ సాగనీ సదా!
రయమ్ము తగ్గినంతనేమి రమ్యమై సు వాసనా
మయమ్ముగా వసంతవాసమై ఫలించనీ సదా

18, జూన్ 2020, గురువారం

ఒహో యాత్రికుడా!

రచన   : - మల్లవరపు విశ్వేశ్వరరావు
గతంలో ఆకాశవాణిలో ప్రసారమైనది.
-

ఓ యాత్రికుడా! ఒహో యాత్రికుడా!
ఉదయారుణకాంతిపుంజ సదనము దెస పయనింతువొహో యాత్రికుడా!

హృదయపూర్ణ మృదులగాన
సుధల జల్లి మధుపథాన
కదలిపోవుచున్నావొహో యాత్రికుడా!

అంధకార దీర్ఘనిశాబంధనమ్ము సడలించుక,
గంధవాహ తురంగమ స్యందనమ్ము కదలించుక,
సింధుపార పూర్వదిశాసుందరతీరమ్ముఁ జేరునో యాత్రికుడా!

శీతల హేమంతకాల శిథిల జీర్ణపర్ణశాల
వదలి కదలివచ్చితివొహో యాత్రికుడా!

చైత్రమాస కుసుమలతా పత్రతోరణమ్ములూగ,
చిత్రచిత్ర కలవిహంగ గాత్రనిస్వనమ్ము  రేగ,
మిత్రవరా! నేడు నీ పవిత్ర యాత్ర సాగింతువొహో యాత్రికుడా!!

15, జూన్ 2020, సోమవారం

లక్ష్యం చేరకనే..?

జరిగిన మిగతా పనుల list లో janatha curfew చేర్చడం ఎందుకు? దాని అంతిమ లక్ష్యం చేరుకోకుండానే దాని గురించి గొప్పలు చెప్పుకుంటే ఎలా? ఎలాగూ చేరలేమని తెలుసుకున్నారేమో 😄😃

చిత్రంలోని అంశాలు: 'The Union Minister further said "LED bulb is illuminating 2.5 crore household today. It's not the lantern age today but of LED bulb." "The biggest work Modi government has was to take country's pride to the world." Mr. Shah said "Modi government on August 5, 2019 dared article 370 and He also said "This Modi government through court's judgement, processed construction of Ram Janam Bhumi temple." Shah also "Janata curfew will be imprinted in country's golden history for following a leader's appeal. After former' అని చెప్తున్న వచనం

13, జూన్ 2020, శనివారం

అంతా భ్రాంతియే

ప్రతికూల పరిస్థితులలో కూడా నిర్వికారంగా/చలించకుండా ఉండే స్థితికి స్ఫూర్తిగా ఉండే ఆలోచనల గురించి చెప్తుంది భిక్షుగీత/ఉద్ధవగీత.
ప్రాకృతిక మార్పుల వలన శారీరక బాధ గానీ, ఇతరుల కఠినోక్తులకు మానసికవేదనగానీ కలిగినా స్పందించక, వాక్కులలో గానీ, మానసికంగా గానీ చింతారహితంగా ఉండడమే తితిక్ష అనబడుతుంది.
కృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన విషయాలు ఇందులో ఉంటాయి. ఇలాంటి అరుచిగా కనిపించే విషయాలను కథారూపంగా చెప్తే ఆసక్తికరంగా ఉంటుందనేమో ప్రతి గంభీరమైన చర్చ కూడా ఎక్కువగా మనకు కథగా చెప్తారు.
ఒక నగరంలో ఉన్న అత్యంత ధనవంతుడు, లోభి, కోపిష్ఠి అయినవాడు ఒక సమయంలో తనదే అనుకున్న ధనం నుంచి, కుటుంబం నుంచి, సమాజంనుంచి దూరమైనప్పుడు, భిక్షువై సకలవిధాలైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిన తరువాత లోతుగా ఆలోచించి, ప్రపంచంలో ఎదురయ్యే ఈ స్థితిని వ్యాఖ్యానంలో నిరూపణ చేసి చెప్పిన విషయాలనే భిక్షుగీత అంటారు. దీని గురించి కృష్ణుడు ఉద్ధవునికి చెప్పినట్టుగా భాగవతంలో ఉంటుంది.
-
డబ్బులూ, మనుషులూ దూరమైనప్పుడు వచ్చిన వైరాగ్యమా! సరేలే అది మామూలేగా!' అనుకోవడం కాదు. అన్నీ దూరమైనా వైరాగ్యమూ, లోతైన చింతన రావడం అంత తేలికేమీ కాదు.
-
ధనం యొక్క ప్రాశస్త్యము గురించి మనకు ఇతరత్రా అక్కడక్కడా కొన్ని వివరణలు దొరుకుతుంటాయి. లోకరీత్యా అది అనుభవమే అందరికీ.
ఇందులో ధనం యొక్క దుష్ప్రభావం గురించిన చర్చ ఉంది.
ఇది కూడా లోకం లో స్వంత లేదా పరుల అనుభవాల వల్ల ఎంతో కొంత అందరికీ తెలిసినదే.
కాబట్టి ధనం యొక్క ప్రాశస్త్యము, దుష్ప్రభావము రెండిటి గురించిన చర్చ పక్కకు పెడదాం.
--
ఆ భిక్షువు తిండి, బట్ట కూడా లేకుండా అనేక అవమానాలకు గురి అవుతూ ఒక స్థిరమైన ప్రదేశం కూడా లేకుండా తిరుగుతూ భిక్షాటనతో జీవిస్తూ చెప్పిన గీత ఇది.
-
నాయం జనో మే సుఖదుఃఖ హేతుర్న
దేవతాఽఽత్మా గ్రహ కర్మ కాలాః ।
మనః పరం కారణమామనన్తి
సంసారచక్రం పరివర్తయేద్యత్ ॥

భావం - నా సుఖదుఃఖాలకు కారణం ఈ మనుష్యులు కాదు, దేవతలు కాదు, శరీరం కాదు, గ్రహములు, కర్మములు, కాలము మొదలైన వేవియూ కాదు. శాస్త్రములు, జ్ఞానులు - మనస్సే వీటికి పరమకారణమని చెప్తారు. మనస్సు మాత్రమే ఈ సంసారచక్రాన్ని నడిపిస్తూ ఉన్నది.
-
ఈ శ్లోకం హేతుబద్ధంగా ఉందని తోస్తుంది. ఈ గీత కు ఆసక్తి కరమైనది ఈ అంశమే. మన బాధలకు మనుష్యులే కారణమని వారితో వైరభావం పెంచుకోకుండా, గ్రహములు, కర్మఫలాలు కారణమని మూఢనమ్మకాల మాయలో పడకుండా, కాలము కారణమని మార్పును నిందించకుండా మనస్సు యొక్క మొగ్గుదల (inclination) కారణమని, దానివల్లే ప్రపంచగతిలో జరుగుతున్నవన్నీ మనకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో కనిపిస్తూ సుఖదుఃఖాలను కలిగిస్తున్నాయని, కాబట్టి మనస్సు/మన తలపోతలే కారణమన్న ప్రతిపాదన ఇది.

సుఖదుఃఖప్రదో నాన్యః పురుషస్యాత్మవిభ్రమః।
మిత్రోదాసీనరిపవః సంసారస్తమసః కృతః ॥

భావం - మనకు మనం తప్ప అన్యులెవరూ సుఖాన్ని గానీ, దుఃఖాన్ని గానీ కలిగించలేరు. స్నేహితులు, ఉదాసీనులు, శత్రువులు ఈ సంసారమంతా అజ్ఞానముచేత, స్వయంకల్పిత భ్రాంతి చేత సృష్టించుకున్నవే.
(స్నేహభావము, ఉదాసీనత్వము, శత్రుత్వము మనము ఏర్పరచుకున్న భావాలు. వీటి ద్వారా సుఖదుఃఖాలు కలిగితే మనకు మనమే కలిగించుకున్నట్టే.)
---
ఇవి కాకుండా సర్వమూ ఆత్మ స్వరూపమైనప్పుడు ఇతరులు, కర్మఫలములు, కాలము, గ్రహములు కూడా ఆత్మ స్వరూపమే కాబట్టి ఇందులో ఎవరు దేనిని నిందించగలరు అనే చర్చ కూడా ఉంది కానీ దానిమీద సాధికారత నాకు రాలేదు కాబట్టి అర్థమైనంత వరకే, ముఖ్యవిషయం వరకే తీసుకున్నాను.

24, మార్చి 2020, మంగళవారం

అయోమయం..

పెను విపత్తు ముంచుకొచ్చిందనుకున్నాం.
అంతలోనే ఒక దేశం అగ్ర దేశంగా మారడానికి చేస్తున్న కుట్ర అనీ,
కార్పొరేట్ ప్రపంచం పెను ఉత్పాతాలను సృష్టించిందనీ,  ప్రతీ సారీ ఒక కాలావధి అనంతరం తన ఆధిపత్యం షేక్ కాకుండా చూసుకోడానికి ఆర్థిక స్థితులను అతలాకుతలం చేస్తూ, సరిచేస్తూ ఉండడం ఇలా ఎన్నో సార్లు జరిగిందనీ ఇదీ అదేననీ
ఎన్నో ఊహాగానాలు ఎన్నో వివరణలతో ప్రచారం పొందుతున్నాయి.
ఇవేవీ నిజాలనడానికి ఏ ఆధారం లేదు.

ఏదిఏమైనా ప్రకృతి లో అందరూ అన్నీ సుఖంగా ఉండాలని మనుష్యులు అనుకోరు అన్నది మాటిమాటికీ ఋజువవుతోంది.🙁😑😶

22, మార్చి 2020, ఆదివారం

గంటలు కొట్టాం!!!


ప్రతీరంగంలో అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే అందరికీ మా కృతజ్ఞతలు తెలిపాము. ☺️👏
మా వీధిలో ముందు మేమే మొదలుపెట్టాం. చాలామంది వెంటనే రెస్పాండ్ అయ్యారు. బయటకు, బాల్కనీలకు వచ్చి గంటలు కొట్టారు శంఖారావం చేశారు . రోడ్ మీద నడిచేవాళ్ళు, ఆగినవాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు, పిల్లలంతా ఇంకా ఉత్సాహం చూపించారు.
----
గమనికలు
1. మోదీ మీద భక్తి తో ఈ పని చేయలేదు.
2. ట్రైన్స్ టికెట్స్ కొన్ని ఆటోమేటిగ్గా కాన్సిల్ అయ్యాయి. ఫ్లైట్ టికెట్స్ డేట్ మార్చుకున్నాము.
3. ఇంతటితో కరోనా గొలుసు తెగిందనీ, చప్పట్లు/గంటలు వైరస్ ను చంపేస్తాయనే మూఢనమ్మకాలను నమ్మము.
పబ్లిసిటీ కోసం కాక ఇంకా ఎంతో మందికి తెలీడం లేదని మాత్రమే ఇదంతా వ్రాస్తున్నాను.
---
  ఇది మంచిపనే గానీ , సిల్లీ పని కాదని నా ఉద్దేశ్యం. అందుకే పెట్టా.
అందరూ అన్ని సేవలూ డబ్బులు తీసుకొనే చేస్తారు. అందులో సందేహం లేదు.
అందరం ఒక్కొక్కసారి ఆ సేవల్లో ఇబ్బందులు, కష్టాలు , నష్టాలు, ఎదురుదెబ్బలు, మోసాలు ఎదుర్కొన్నవాళ్ళమే.
అయినా సరే, అవసరానికి సహాయం అందించిన ఎన్నో రంగాల వారికి థాంక్స్ గివింగ్ అనేది మన దేశంలో కూడా ఒక సంప్రదాయంగా మారితే తప్పు లేదు. మంచి అలవాటు.
ఫోటో వివరణ అందుబాటులో లేదు.

12, మార్చి 2020, గురువారం

పాత గోడ- కొత్త గోడ

'నలుగురూ నాలుగురకాలుగా ..' అనే దరిద్రమైన ఫోబియా ఆనాటి సమాజం మాత్రమే సృష్టించిందనుకుంటే పొరబాటు.
అదే దరిద్రమైన ఫోబియా నేటి మీడియా/సోషల్ మీడియా కూడా సృష్టిస్తోంది.
చదువు, వ్యక్తిత్వాలు, వికాసాలు చాలా పెరిగాయనీ, విదేశీ భావాల ఎక్స్ పోజర్ వల్ల మన సమాజపు పాతకాలపు 'జడ్జ్ మెంటల్' బిహేవియర్ మారిందనీ చెప్పుకోవడం గొప్పలకు మాత్రమే.
అప్పుడు ఆ గోడల దగ్గరా, అరుగుల మీదా జరిగే పంచాయతీలు, జడ్జ్ మెంటల్ మాటలు, ఇప్పుడు ఈ గోడల దగ్గరా, 'ఛా'నల్స్ లోనూ జరుగుతూనే ఉన్నాయి.
నాగరికతలూ, ఆధునిక భావాలు వట్టి ఎండమావులే. కనిపించి మాయమయ్యేవే. ఏ కాలపు సమాజాలైనా అవే బురదలో దొర్లుతుంటాయి.

3, మార్చి 2020, మంగళవారం

మానసిక వ్యాధి స్థాయిలో ఆచారమూఢత్వము

చిత్రంలోని అంశాలు: 'దంపతుల్ని మింగేసిన 'మడి' పద్ధతులు భరించలేక భార్యను చంపి... భర్త ఆత్మహత్య మెసూరు, న్యూస్టుడే: ఆమెకు మడి. ఏ పనిచేసినా శుచిగా, శుభరంగా ఉండాలి. తనతోపాటు ఇంటిల్లిపాదీ అలాగే ఉండాలనేది ఆమె పట్టు. అదే ఆమె ప్రాణాల మీదకి తెచ్చింది. కర్ణాటక మైసూరు జిల్లా మండహర్లిలో ఈ చోటుచేసుకుంది. (40) ర్తలు. వీరికి 15 సంవత్సరాల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త బయటి వస్తే... స్నానం చేశాక గానీ లోప లికి అనుమతించేవారు మార్లు చేయాల్సి వచ్చేది. నుంచి వచ్చాక బడి సంచుల్ని నీటితో ప్రోక్షణ చేసేవారు. తొలి నాళ్లల్లో పుట్టమణి పద్దతులు, సంప్రదాయలను ఎలాగోలా భరించినా ఇటీవలి 'మడి' ప్రతిమించిందని భర్త ఆవేదనకు లోనయ్యాడు. నేపధ్యంలో మంగళవారం కలిసి కట్టెల్ని తీసుకొచ్చేందుకు లోని అడవికి తీసుకెళ్లి ఆమెను మార్చాడు. అనంతరం తానూ ఉరివేసుకుని తీసుకొచ్చి, చేసుకున్నాడు.' అని చెప్పే సంభావ్య వచనం



https://www.vijayavani.net/man-killed-his-wife-in-nanjanagoodu/
నా సర్కిల్ లో పూర్తి ప్రతిరోజూ మడి పాటించేవారూ ఉన్నారు, పూర్తి లిబరల్ గా ఉండే వారూ ఉన్నారు. అటువంటప్పుడు ఇది ఏమిటి? ఎంత లిమిట్ వరకూ? పరమార్థమేమిటి? తనవరకూ పాటించడం, అవతలి వారిని ఇబ్బంది పెట్టేవరకూ వెళ్ళడం ఈ రెండింటి మీద ఉండే గీత సన్నదనం ఎంత? ఇటువంటి విషయాలలో నాలో ఎంతో ఘర్షణ ఉంది. ఈ మధ్య ఎవరికి వారు తమ లిమిట్స్ తెలుసుకోవడం, తాము పాటిస్తున్న నిష్ఠలోతుపాతుల గురించి తెలిసి ఉండడం ముఖ్యమన్న ఒక నిష్కర్షకు వచ్చాను. కానీ ఆ నిష్కర్ష విషయంలో కూడా మూర్ఖపు పట్టు లేదు. ఆ నమ్మకాల విషయంలో నా గౌరవం పెరిగేలా ఏమన్నా తెలిస్తే నాకూ సంతోషమే. కానీ కనుచూపు మేరలో అలాంటిదేమీ లేక frustrated గా ఉండి పెట్టిన పోస్ట్.