Loading...

13, జూన్ 2020, శనివారం

అంతా భ్రాంతియే

ప్రతికూల పరిస్థితులలో కూడా నిర్వికారంగా/చలించకుండా ఉండే స్థితికి స్ఫూర్తిగా ఉండే ఆలోచనల గురించి చెప్తుంది భిక్షుగీత/ఉద్ధవగీత.
ప్రాకృతిక మార్పుల వలన శారీరక బాధ గానీ, ఇతరుల కఠినోక్తులకు మానసికవేదనగానీ కలిగినా స్పందించక, వాక్కులలో గానీ, మానసికంగా గానీ చింతారహితంగా ఉండడమే తితిక్ష అనబడుతుంది.
కృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన విషయాలు ఇందులో ఉంటాయి. ఇలాంటి అరుచిగా కనిపించే విషయాలను కథారూపంగా చెప్తే ఆసక్తికరంగా ఉంటుందనేమో ప్రతి గంభీరమైన చర్చ కూడా ఎక్కువగా మనకు కథగా చెప్తారు.
ఒక నగరంలో ఉన్న అత్యంత ధనవంతుడు, లోభి, కోపిష్ఠి అయినవాడు ఒక సమయంలో తనదే అనుకున్న ధనం నుంచి, కుటుంబం నుంచి, సమాజంనుంచి దూరమైనప్పుడు, భిక్షువై సకలవిధాలైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిన తరువాత లోతుగా ఆలోచించి, ప్రపంచంలో ఎదురయ్యే ఈ స్థితిని వ్యాఖ్యానంలో నిరూపణ చేసి చెప్పిన విషయాలనే భిక్షుగీత అంటారు. దీని గురించి కృష్ణుడు ఉద్ధవునికి చెప్పినట్టుగా భాగవతంలో ఉంటుంది.
-
డబ్బులూ, మనుషులూ దూరమైనప్పుడు వచ్చిన వైరాగ్యమా! సరేలే అది మామూలేగా!' అనుకోవడం కాదు. అన్నీ దూరమైనా వైరాగ్యమూ, లోతైన చింతన రావడం అంత తేలికేమీ కాదు.
-
ధనం యొక్క ప్రాశస్త్యము గురించి మనకు ఇతరత్రా అక్కడక్కడా కొన్ని వివరణలు దొరుకుతుంటాయి. లోకరీత్యా అది అనుభవమే అందరికీ.
ఇందులో ధనం యొక్క దుష్ప్రభావం గురించిన చర్చ ఉంది.
ఇది కూడా లోకం లో స్వంత లేదా పరుల అనుభవాల వల్ల ఎంతో కొంత అందరికీ తెలిసినదే.
కాబట్టి ధనం యొక్క ప్రాశస్త్యము, దుష్ప్రభావము రెండిటి గురించిన చర్చ పక్కకు పెడదాం.
--
ఆ భిక్షువు తిండి, బట్ట కూడా లేకుండా అనేక అవమానాలకు గురి అవుతూ ఒక స్థిరమైన ప్రదేశం కూడా లేకుండా తిరుగుతూ భిక్షాటనతో జీవిస్తూ చెప్పిన గీత ఇది.
-
నాయం జనో మే సుఖదుఃఖ హేతుర్న
దేవతాఽఽత్మా గ్రహ కర్మ కాలాః ।
మనః పరం కారణమామనన్తి
సంసారచక్రం పరివర్తయేద్యత్ ॥

భావం - నా సుఖదుఃఖాలకు కారణం ఈ మనుష్యులు కాదు, దేవతలు కాదు, శరీరం కాదు, గ్రహములు, కర్మములు, కాలము మొదలైన వేవియూ కాదు. శాస్త్రములు, జ్ఞానులు - మనస్సే వీటికి పరమకారణమని చెప్తారు. మనస్సు మాత్రమే ఈ సంసారచక్రాన్ని నడిపిస్తూ ఉన్నది.
-
ఈ శ్లోకం హేతుబద్ధంగా ఉందని తోస్తుంది. ఈ గీత కు ఆసక్తి కరమైనది ఈ అంశమే. మన బాధలకు మనుష్యులే కారణమని వారితో వైరభావం పెంచుకోకుండా, గ్రహములు, కర్మఫలాలు కారణమని మూఢనమ్మకాల మాయలో పడకుండా, కాలము కారణమని మార్పును నిందించకుండా మనస్సు యొక్క మొగ్గుదల (inclination) కారణమని, దానివల్లే ప్రపంచగతిలో జరుగుతున్నవన్నీ మనకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో కనిపిస్తూ సుఖదుఃఖాలను కలిగిస్తున్నాయని, కాబట్టి మనస్సు/మన తలపోతలే కారణమన్న ప్రతిపాదన ఇది.

సుఖదుఃఖప్రదో నాన్యః పురుషస్యాత్మవిభ్రమః।
మిత్రోదాసీనరిపవః సంసారస్తమసః కృతః ॥

భావం - మనకు మనం తప్ప అన్యులెవరూ సుఖాన్ని గానీ, దుఃఖాన్ని గానీ కలిగించలేరు. స్నేహితులు, ఉదాసీనులు, శత్రువులు ఈ సంసారమంతా అజ్ఞానముచేత, స్వయంకల్పిత భ్రాంతి చేత సృష్టించుకున్నవే.
(స్నేహభావము, ఉదాసీనత్వము, శత్రుత్వము మనము ఏర్పరచుకున్న భావాలు. వీటి ద్వారా సుఖదుఃఖాలు కలిగితే మనకు మనమే కలిగించుకున్నట్టే.)
---
ఇవి కాకుండా సర్వమూ ఆత్మ స్వరూపమైనప్పుడు ఇతరులు, కర్మఫలములు, కాలము, గ్రహములు కూడా ఆత్మ స్వరూపమే కాబట్టి ఇందులో ఎవరు దేనిని నిందించగలరు అనే చర్చ కూడా ఉంది కానీ దానిమీద సాధికారత నాకు రాలేదు కాబట్టి అర్థమైనంత వరకే, ముఖ్యవిషయం వరకే తీసుకున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి