Loading...

13, నవంబర్ 2020, శుక్రవారం

ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?

 

 

ఒకానొక కవితాసంకలనం లోని 36 ముక్త కవితల్లో ఒకటి మోహనమురళి. మోగేరి గోపాలకృష్ణ అడిగ అనే కవి వ్రాసిన ఈ కవిత కన్నడ సాహిత్యంలో జనప్రియమై, ప్రసిద్ధమైనది. ప్రతి రెండు పంక్తులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాసలు లయబద్ధత, గేయసౌలభ్యం ఉండడం ఇందులో విశేషాలు.
---
స్థూలంగా ఇందులోని విషయం లౌకికప్రవృత్తికి, అలౌకిక అన్వేషణకు మధ్య ఊగిసలాడు అంతరంగపు ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు.
స్వగతంలో మధ్యమపురుషలో మాట్లాడుకుంటున్న ఒక నాయకుని/నాయిక యొక్క స్పష్టాస్పష్టంగా ఉన్న భావాల కలబోతగా ఇది సగటు మనిషి యొక్క సందిగ్ధతను అద్దంలో చూపిస్తుంది.
--
లౌకిక తృష్ణల పంజరమైన దేహంలో ఇరుక్కున్న అంతః చేతన చేరలేని ఆధ్యాత్మ తీరాలకై ఆరాటపడుతోంది. ఆరాటమెంత ఉన్నా వీటిని దాటి వెళ్ళనూ లేదు, రక్తి విరక్తి గా మారగా ఉన్న ‘బంధాల’నే బంధనాలను వదిలిపోవాలనుకున్నా పోనూలేక ఉండనూలేక కొట్టుమిట్టాడుతుంది.
లౌకిక బంధనంలో ఉన్న మనసును ‘ఏ మోహనమురళీ రవము పిలుస్తోంది నిన్ను? ఏ బృందావనాలు ఈ మర్త్యనయనాలను ఆకర్షిస్తున్నాయి?’ అన్న ప్రశ్నతో మొదలౌతుంది.
పిలుపు విన్నా అక్కడిదాకా చేరలేని ‘చర్మ’చక్షువుల అశక్తతను ఎత్తిచూపిస్తూ ఈ పదం ఇక్కడ అవసరం అనిపిస్తుంది. తర్వాతి పంక్తులలో అది నిరూపణ అవుతుంది.
---
*మురళి, బృందావనాలు రాసలీలలతో పాటుగా ఆధ్యాత్మిక అంతరార్ధాలకు సమానంగా ప్రాచీన సాహిత్యంలో వర్ణింపబడినాయి.
వీటి పిలుపు వేణుగానము వలె ఆకర్షణీయమవడం,
* మానవుని అంతఃకరణము తానున్న తృష్ణపంజరమనే దేహాన్ని దాటి ఏ దివ్యతీరాలకో చేరాలనుకోవడం ,
*లౌకిక వాతావరణం మీద ఆసక్తి నశించినా ఈ కంచెను దాటి వెళ్ళలేకపోవడం
అన్న సందిగ్ధ స్థితి వర్ణన ఇందులో ఉంది.
అయితే ఆ ఉందనిపిస్తున్నదేదో ఉందోలేదో, చేరగలమో లేదో కవి ఇతమిత్థంగా తేల్చి ఏమీ చెప్పడం లేదు. ఉందేమో అన్న భావన ఒక మురళీ రవమై పిలిచి ఆకర్షిస్తున్నట్టు, కానీ ముందడుగు వేయలేని తన అశక్త యథార్థ స్థితి పై విరక్తితో ఉన్నట్టూ తెలుస్తుంది.
----
భావము సుమారుగా ఇలా ఉంది
ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?
ఏ దూర బృందావన తీరాలకు లాగుతోంది?
పువ్వులశయ్యలు, చందనచర్చలు, వెన్నెలలో బాహుబంధనాలు, చుంబనాలు ఎన్నో విరిసే ఈ తృష్ణవనపు హద్దులలోపలే ఇంద్రియాల ప్రతిధ్వనిలో (కూడా వినిపించేలా) ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?
ఏ దూర బృందావన తీరాలకు లాగుతోంది?
రాగార్ద్రమైన హృదయము(ప్రేమతో తడిసి మెత్తబడిన మనసు), వెచ్చని స్పర్శలు చుట్టిన పంజరము, ఇదే చాలని కదా అనుకున్నావు? మరి ఈరోజు ఏల ఈ విరక్తి?
(చూపు అటు కానీ, ఇటు కానీ నిలువని) చంచలమైన ఈ కనులలో చూపేమి వెదుకుతోంది? ఇది మధుర యాతనా? దివ్యమైన యాచనా?
దారువులో అగ్ని దాగినట్టు ఈ విరక్తి నీలో ఎక్కడ దాగిఉండిందో , ఒక్కసారి అడవిలో కార్చిచ్చులా అంగాంగాలనూ దహిస్తోంది!
సప్తసాగరతీరాలంత దూరంగా(చేరలేనట్టుగా) ఉందా నీ నిదురించిన అంతఃకరణసాగరము? ఎగసి పడని ఆ అలల మూగసద్దులు ఇక్కడికి చేరాయా?
ఈ ప్రాణము వశము తప్పినది, ఈ దేహపంజరములో ఉన్న చేతన స్వ అధీనములో లేదు. ఉన్నవన్నీ వదలి లేనివాటికై తపించుటే జీవనమా?
------
సుమారుగా ఆ రాగంలో ఒక ప్రయత్నము---
-----
*దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
ఏవొ బృందావనములిట్టుల
కనుల నాకర్షించెనో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*పూలశయ్యల గంధజ్యోత్స్నల బాహుబంధన చుంబనముల
తృష్ణవనముల సీమలోపల ఇంద్రియమ్ముల నిస్వనముల
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*రాగరంజిత మానసమ్ములు వెచ్చదనముల స్పర్శలు
ఇంతె చాలని అంటివే? నేడు ఈ విసుగేలనో!
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*చంచలంపు కన్నులందున తేలె చూపుల సూచనేమో?
ఏమిది? మధుతర యాతనో ? దివ్యమగు ఏ యాచనో?
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*దారువందలి అగ్నివోలెనె ఎచటనున్న విరాగమో
సాధనన్వేషణల తీరున అంటుకున్న ఆవేగమో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*సప్తసాగరతారణమ్ముల సుప్తసాగర మంతరంగమొ
అంకురించని అలలగర్జన ఎట్లు నిన్నిటు చేరెనో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*వివశమైనది ప్రాణము పరవశము నీ యీ చేతనం
చెంతనున్నది వీడి, లేనివాటికి తపనే జీవనం!!
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
ఏవొ బృందావనములిట్టుల
కనుల నాకర్షించెనో!
---
( రికార్డులలో అన్ని చరణాలూ ఉండవు.) ఈ లయలో బాగా కుదురుతుందీ పాట.

వినొచ్చు.
ಯಾವ ಮೋಹನ ಮುರಳಿ ಕರೆಯಿತು ದೂರ ತೀರಕೆ ನಿನ್ನನು?
ಯಾವ ಬೃಂದಾವನವು ಸೆಳೆಯಿತು ನಿನ್ನ ಮಣ್ಣಿನ ಕಣ್ಣನು?
ಹೂವು ಹಾಸಿಗೆ, ಚಂದ್ರ, ಚಂದನ, ಬಾಹುಬಂಧನ ಚುಂಬನ;
ಬಯಕೆತೋಟದ ಬೇಲಿಯೊಳಗೆ ಕರಣಗಣದೀ ರಿಂಗಣ;
ಒಲಿದ ಮಿದುವೆದೆ, ರಕ್ತ ಮಾಂಸದ ಬಿಸಿದುಸೋಂಕಿನ ಪಂಜರ;
ಇಷ್ಟೇ ಸಾಕೆಂದಿದ್ದೆಯಲ್ಲೋ! ಇಂದು ಏನಿದು ಬೇಸರ?
ಏನಿದೇನಿದು ಹೊರಳುಗಣ್ಣಿನ ತೇಲುನೋಟದ ಸೂಚನೆ?
ಯಾವ ಸುಮಧುರ ಯಾತನೆ?ಯಾವ ದಿವ್ಯ ಯಾಚನೆ?
ಮರದೊಳಡಗಿದ ಬೆಂಕಿಯಂತೆ ಎಲ್ಲೊ ಮಲಗಿದ ಬೇಸರ;
ಏನೋ ತೀಡಲು ಏನೋ ತಾಗಲು ಹೊತ್ತಿ ಉರಿವುದು ಕಾತರ.
ಸಪ್ತಸಾಗರದಾಚೆಯೆಲ್ಲೋ ಸುಪ್ತಸಾಗರ ಕಾದಿದೆ,
ಮೊಳೆಯದಲೆಗಳ ಮೂಕ ಮರ್ಮರ ಇಂದು ಇಲ್ಲಿಗು ಹಾಯಿತೆ?
ವಿವಶವಾಯಿತು ಪ್ರಾಣ; ಹಾ ಪರವಶವು ನಿನ್ನೀ ಚೇತನ;
ಇರುವುದೆಲ್ಲವ ಬಿಟ್ಟು ಇರದುದರೆಡೆಗೆ ತುಡಿವುದೆ ಜೀವನ?

 
 
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి