Loading...

3, ఫిబ్రవరి 2014, సోమవారం

మయూరుని సూర్యశతకము- పదవభాగము-అర్థము

91. భూమిం ధామ్నో,భివృష్య్టా జగతి జలమయీం, పావనీం సంస్మృతావపి,
యాగ్నేయీం దాహశక్య్తా, ముహురపి యజమానాం యథాప్రార్థితార్థైః,
లీనామాకాశ ఏవామృతకరఘటితాం ధ్వాన్తపక్షస్య పర్వ
ణ్వేవం సూర్యోష్టభేదాం భవ ఇవ భవతః పాతు బిభ్రత్స్వమూర్తిమ్‌ ||

అర్థము

ధామ్నాః= తేజస్సునకు, భూమిం=భూమి అయినదియు, జగతి = లోకమునందు, అభిదృష్ట్యా= వర్షించుటచేత, జలమయీం= జలరూపమగునదియు (జలమును అని) మరియు, సంస్మృతౌ = సంస్మరించుట యందు (ఇతరులు తనను స్మరించినపుడు అని) , పావనీం= వాయుసంబంధమగు దానిని (పావనీం అనుటచేత స్మరించుటచే పవిత్రులుగా చేయునదియు అని శబ్దచ్ఛలము చేత గూడ గ్రహింపవచ్చును.) ,దాహశక్త్యా= దహింపఁజేయు శక్తి చేత, ఆగ్నేయీం= అగ్నిసంబంధమగునదియు, ముహురపి=మాటిమాటికిని , ప్రార్థితార్థైః= కోరబడిన కోరికలచేత, యాజమానాత్మికాం=యజ్ఞము చేయుదాని రూపమగునదియు(యజ్ఞము చేయువాడు ప్రార్థించుట చేత దానికిష్టసిద్ధులు కలుగఁజేయుట చేత ఇట్లు చెప్పబడినది), ఆకాశే= ఆకాశమునందు, లీనాం = కలిసియున్నదియు (ఆకాశమున కలసియుండుట చేత ఆకాశమయమగు మూర్తిని అని) , ధ్వాన్తపక్షస్య పర్వణి= కృష్ణపక్షము యొక్క పర్వదినమున (అమావాస్యయందు), అమృతకరఘటితాం= చంద్రునితో కూడుకొన్నదియునగు, ఏవం= ఈ విధముగా, అష్టభేదాం= ఎనిమిది విధములగు, స్వమూర్తిం=తన స్వరూపమునకు, భవ ఇవ=శివునివలె, దధత్=ధరించిన, సూర్యుడు, భవతః= మిమ్ము, పాతుమ్= రక్షించుగాక.

వివరణము-- భూమి , జల, అగ్ని, వాయు,ఆకాశ, యజమాన, సూర్యచంద్రులు శివుని అష్టమూర్తులని చెప్పిరి. ఆయాస్వభావసామర్థ్యవిశేషములలో సూర్యుని యందు ఈ ఎనిమిది విశేషములున్నవి.అందుచేత కవి సూర్యునిశివునితో పోల్చినాడు.ఈ విషయమున కాళిదాసశాకుంతలమున ప్రార్థనారూపముననున్న "యా సృష్టిస్పష్టురాద్యా" అనెడి శ్లోకమును స్మరింపవలసినది.

భావము (నాకు తెలిసి)
స్వయముగా తేజోభూమి యైనదియు, వర్షానికి కారణమగుచూ జలరూపి యైనదియు, స్మరింపబడి పవిత్రులను జేయుటవలన ( వాయువు తోడ్పాటు వల్లనే ధ్వని ఉత్పన్నమగుటచేత స్మరణకు కారణమై) వాయురూపియైనదియు, దహించు శక్తి గలిగి యుండుటచేత అగ్నిరూపమనియు, ప్రార్థింపబడి కోరికలు తీర్చగలుగుటచేత యజమానస్వరూపమై, ఆకాశములోనుండుటచేత ఆకాశరూపియై,కృష్ణపక్ష అమావాస్యరోజు చంద్రునితో కలిసి యేక స్వరూపమై, అష్టమూర్తిరూపాలనును ధరించి శివునివలెభాసించుచున్నాడో ఆ సూర్యుడు మిమ్ము రక్షించుగాక.
----------------------------------
92. ప్రాక్కాలోన్నిద్రపద్మాకరపరిమళనావిర్భవత్పాదశోభో
భక్య్తా త్యక్తోరుఖేదోద్గతి దివి వినతాసూనునా నీయమానః
సప్తాశ్వాప్తాపరాన్తాని యధిక్రమ మధరయన్యో జగన్తి స్తుతోలం
దేవైర్దేవః స పాయాదపర ఇవ మురారాతిరహ్నాం పతిర్వః ॥
అర్థము
యః=ఎవడు, ప్రాక్కాలోన్నిద్రపద్మాకరపరిమళనావిర్భవత్పాదశోభః= (సూర్యుని పక్షమున) ప్రాతఃకాలమున పద్మములు వికసించిన కొలనుతో కూడుటచేత ఆవిర్భవించిన కిరణముల శోభ కలవాడై (విష్ణువు పక్షమున) పద్మాఅనగా లక్ష్మీదేవి యొక్క కరముల కలయిక చే ఆవిర్భవించిన పాదశోభ కలవాడు), మరియు త్యక్తోరుశోకోద్గతి = (సూర్యపక్షమున)ఊరు అనగ తొడలు, దానివలన కలుగు శోకమును విడచి (విష్ణుపక్షమున) గొప్పశోకము కలుగుటను విడచి, భక్త్యా= భక్తితో దివి= ఆకసమునందు, వినతాసూనునా=(సూర్యపక్షమున), అరుణుని చేత , (విష్ణుపక్షమున) గరుత్మంతుని చే, తనీయమాన=కొనిపోవబడుచున్నవాడై, మరియు (సూర్యపక్షమున) సప్తాశ్వాప్తాపరాన్తాని=ఏడు గుర్రములచేత పొందబడిన పరలోకముల అంచులు (తుదలు) గల , జగన్తి= జగత్తులను, అధికం=ఎక్కువగా, అధరయన్=క్రిందుగా చేయుచున్నవాడై, (విష్ణుపక్షమున) ఆశుఆప్త అపర అన్తాని=శీఘ్రముగా  పొందబడిన పరలోకముల అంతములు కల జగత్తులను, సప్త=ఏడింటిని, క్రిందుగా చేయువాడు అని, [విశేషణమున సప్తాశ్వాన్త అనుదానిని ,సప్తాశ్వా ఆప్త అనియు, సప్త ఆశు ఆప్త అని పదచ్ఛేదమందు భేదము] మరియు, దేవైః = దేవతల చేత, అలం= మిక్కిలి, స్తుతః= స్తుతింపబడుచున్నాడో, (ఈ విశేషణము ఇరువురికి సమమే), సం= అట్టి, అపరః= మురారాతిః ఇవ= ఇంకొక విష్ణువు వలెనున్న , అహ్నాంపతిః= సూర్యుడు, వః = మిమ్ము , పాయాత్= రక్షించుగాక.

భావము (నాకు తెలిసి)
ఈ శ్లోకములో కవి సూర్యునికి , విష్ణువు నకు ఉన్న సామ్యాన్ని నిరూపిస్తూ, ఇరువురికీ అభేదమని ప్రతిపాదన చేస్తున్నారు.
(సూర్యుని పక్షమున) ప్రాతఃకాలమున వికసించిన పద్మములతో నిండిన కొలనుతో తన కిరణములు కలువగా జనించిన శోభకలిగిన వాడైన, తొడలు లేవను శోకమును విడిచి ఆకసములో తనను భక్తితో కొనిపోవుచున్న అరుణుడను సారథిని కలిగినవాడైన, పరలోకపు అంచులనందుకున్న ఏడుగుఱ్ఱములను బూన్చిన రథముపై నెక్కుటచేత లోకములన్నింటిని అధోలోకములు చేయగలిగినవాడై, [విశేషణమున సప్తాశ్వాన్త అనుదానిని ,సప్తాశ్వా ఆప్త అనియు, సప్త ఆశు ఆప్త అని పదచ్ఛేదమందు భేదము], దేవతలందరి చేత స్తుతింపబడినవాడైనట్టి సూర్యభగవానుడు మిమ్ము రక్షించుగాక!

(విష్ణువు పక్షమున) ప్రభాతకాలములో విరిసిన పద్మము వంటి లక్ష్మీదేవి కరములతో అలంకృతమైన పాదశోభ కలిగినవాడైన, అతి పెద్దశోకమును విడిచి తనను భక్తితో కొనిపోవుచున్న గరుత్మంతుడను సారథిని కలిగినవాడైన, పరలోకపు అంచులను దాటగలిగి ఏడు లోకములను అధోలోకములుగా చేయగలిగిన వాడై,[విశేషణమున సప్తాశ్వాన్త అనుదానిని ,సప్తాశ్వా ఆప్త అనియు, సప్త ఆశు ఆప్త అని పదచ్ఛేదమందు భేదము], దేవతలందరి చేత స్తుతింపబడినవాడైనట్టి విష్ణుభగవానుడు మిమ్ము రక్షించుగాక!
-------------------------
93.యః స్రష్టాపాం పురస్తాదచలవరసమభ్యున్నతేర్హేతురేకో
లోకానాం యస్త్రయాణాం స్థిత ఉపరి పరం దుర్విలన్య్ఘేన ధామ్నా
సద్యః సిద్య్ధై ప్రసన్నద్యుతిశుభచతురాశాముఖః స్తాద్విభక్తో
ద్వేధా వేధా ఇవావిష్కృతకమలరుచిః సోర్చిషామాకరో వః ||

అర్థము

యః =ఎవడు, అపాం= నీటిని సృజించినాడో,(సూర్యుడు వర్షించి నీటిని సృష్టించును) బ్రహ్మ " అప ఏవ న సర్జాదౌ" అను ప్రమాణము నీటినే మొదట సృష్టించును.) మరియు, అచల వరసమభ్యున్నతేః = ఉదయాద్రి యొక్క ఔన్నత్యమునకు , ఏకః హేతుః= తానొక్కటే హేతువైనాడో ? (సూర్యుడు ఉదయించి ఉదయాచలమను గౌరవము కలిగించినాడు , బ్రహ్మ ఎత్తైన కులపర్వతములను సృజించి హేతువగుచున్నాడు. మరియు, యః= ఎవడు, దుర్విలంఘేన = ఇతరులు మీరుటకలవికాని, ధామ్నా= తేజస్సు చేత , త్రయాణాం లోకానాం= మూడులోకములకు పరం మిక్కిలి, ఉపరిస్థితః= పైన నున్నవాడో (బ్రహ్మపక్షమున)ధామ్నాః= స్థానము చేత అని చెప్పవలెను మరియు, ప్రసన్న ద్యుతి శుభచతురాశాముఖః = (సూర్యపక్షమున) తన ఉదయము వలనప్రసన్న కాంతి తోప్రకాశింపజేసిన నాలుగు దిక్కుల యొక్క ముఖములు గలవాడు), సః =అట్టి ఆవిష్కృత, కమలరుచిః= కమలముల కాంతిని ఆవిష్కరింపజేసిన (సూర్యుడు వికసింపజేసి పద్మముల కాంతి నావిష్కరించువాడు , బ్రహ్మపీఠముగా జేసుకొని పద్మకాంతికి కారణమయినవాడు, ద్వేధావిభక్తః వేధాః ఇవ =రెండుగా విభజింపబడిన బ్రహ్మవలెనున్న (రెండవబ్రహ్మ అని), అర్చిషాం ఆకరః= సూర్యుడు ,సద్యః=తక్షణం, వః= మీ యొక్క , సిద్ధైన= సిద్ధికొరకు, స్తాత్= అగుగాక.

భావము (నాకు తెలిసి)
ఈ పద్యములో కవి సూర్యునికి బ్రహ్మతో గల సామ్యమును గురించి వివరిస్తూ, సూర్యుని ఉత్తమత్వాన్ని నిరూపిస్తున్నాడు.
 సూర్యుడు వర్షానికి కారణమగుచూ (వర్షము సృష్టి మనుగడకు ముఖ్యాధారము) సర్వము సృజించగల బ్రహ్మ తో సమానమగుచున్నాడు. కులపర్వతాలను సృజించిన బ్రహ్మ వలె ఉదయాద్రిపై ఉదయించడం మూలంగా దాని ఔన్నత్యాన్ని పెంచుతున్నాడు.ముల్లోకాలకంటే ఉచ్ఛస్థితిలో నున్న బ్రహ్మ వలె అద్వితీయమైన తేజస్సుచే ఎవరి చేతనూ మీరబడరాని పై స్థాయిలో ఉన్నాడు. చతుర్ముఖుడైన బ్రహ్మ వలె తన కాంతి తో వెలిగిన నాలుగు దిక్కులనే ముఖములు గలిగియున్నాడు. ఆసనముగా చేసికొనుటవలన బ్రహ్మ పద్మాలకాంతిని బెంచినట్లుగా తన ఆగమనంతో పద్మాల వికసనమునకు కారణమై వాటి కాంతినావిష్కరించుచున్నాడు. ఈవిధముగా వెలుగుచున్నవాడై బ్రహ్మలోని రెండవాభాగమా అనునట్లు ప్రకాశించు సూర్యుడు మీకు సిద్ధి కలిగించుగాక!
****************************************
94.సాద్రిద్యూర్వీనదీశా దిశతి దశ దిశో దర్శయన్ప్రాగ్దృశో యః
సాదృశ్యం దృశ్యతే నో సదశశతదృశి త్రైదశే యస్య దేశే
దీప్తాంశుర్వః స దిశ్యాద్ అశివయుగదశాదర్శితద్వాదశాత్మా
శం శాస్య్తశ్వాంశ్చ యస్యాశయవిద తిశయాద్దన్దశూకాశనాద్యః ||


అర్థము

యః=ఎవడు, ప్రాక్=ముందుగా, సాద్రిద్యూర్వీనదీశాః=కొండలు , ఆకాశము,భూమి, సముద్రములతో కూడిన , దశదిశః=పది దిక్కులను , దర్శయన్= చూపుచున్నవాడై, దృశః= చూపులను , దిశతి= ఇచ్చుచున్నాడో మరియు సదశశతన్నశి= దేవేంద్రునితో కూడిన , త్రైదశీయేప్రదేశే= సర్వలోకముల, సాదృశ్యం= సాటి (ఎవనికి) , నోదృశ్యతే= కనబడుట లేదో, మరియు యః=ఎవడు అశివయుగ దశాదర్శి తద్వాదశాత్మా=ప్రళయకాలదశయందు  తన పండ్రెండు స్పరూపములను చూపుచున్నాడో(ప్రళయకాలమున సూర్యుని రుద్రకిరణములు విజృంభించును.), దందశూకాశనాద్యః= గరుడుని అన్నయగు అనూరుడు, యస్య = ఎవని యొక్క, ఆశయవిత్=  అభిప్రాయమెరిగినవాడై, అశ్వాన్ = గుర్రలను, శాస్తి= శసించుచున్నాడో , నడపు చున్నాడో, సః= ఆ (అట్టి) దీప్తాంశుః =సూర్యుడు, అతిశయాత్ = ఎక్కువగా, ----సుఖమును, దిశ్యాత్= ఇచ్చుకాక.

భావము (నాకు తెలిసి)
ఎవడు ముందుగా తన కాంతుల మూలకంగా కొండలు, ఆకాశము, భూమి సముద్రములు మొదలైన పది దిక్కులను చూచుటకు చూపునిచ్చుచున్నాడో,దేవలోకము మొదలైన సర్వలోకములలొ సాటిలేనివాడైయున్నాడో, ఎవడు ప్రళయ సమయమునందు తన అతి భీకరస్వరూపముగా పన్నెండు పడగలను చూపగలిగి యున్నాడో, ఎవడు మహాత్ముడగు గరుడుని అన్నయగు అనూరుని తన గుఱ్ఱములను శాసించుటకు సేవకునిగా కలిగి ఉన్నాడో అట్టి సూర్యుడు ఎక్కువ సుఖములను మీకిచ్చుగాక.
=======================================

95. తీర్థాని వ్యర్థకాని హృదనదసరసీనిర్ఝరామ్భోజినీనాం
నోదన్వన్తో నుదన్తి ప్రతిభయమశుభశ్వభ్రపాతానుబన్ధి
ఆపో నాకాపగాయా అపి కలుషముషో మజ్జతాం నైవ యత్ర
త్రాతుం యాతోన్యలోకాన్‌ స దిశతు దివసస్యైకహేతుర్హితం వః॥

అర్థము

యత్ర= ఎవడు, అన్యలోకాన్= ఇతరలోకములను, త్రాతుః= రక్షించుటకు, యాతే= వెళ్ళగా, హృద నద సరసీ నిర్ఘారంభోజినీనాం= గుంటలు, నదుల, సరస్సులు, జలపాతములు, పుష్కరిణులు వీటియొక్క, తీర్థాని= ఉదకములు, వ్యర్థకాని= వ్యర్థములో, మరియు, ఉదన్వన్తః=సముద్రములు అశుభశ్వభ్ర పాతాను బంధి =అశుభ్రమగు గుంటలో  పడుటకు సంబంధించిన , ప్రతి భయం= భయమును (నరకమున పడుదుమనెడి పాపభయము నన్నమాట, నోనుదన్తి =పోగొట్టుకున్నవో, మరియు నాకాపకాయాః= ఆ గంగయొక్క, ఆసః = నీరు, మజ్జితాం = స్నానము జేయు వారికి, కలుషముషః= కలుషములు పోగొట్టునవిగా, నైవ = కాకనేపోవుచున్నవో , సః = అట్టి, దివసస్యఏకహేతుః = పగటికి తనొక్కడే కారణమయిన సూర్యుడు , వః =మీకు, హితం = హితమును , దిశతు = ఇచ్చుగాక.

వివరణము
సూర్యసంబంధము లేక ఏ తీర్థములు సముద్రములు, నదులు తమ పని తాము చేయలేవని తాత్పర్యము.

భావము (నాకు తెలిసి)
ఎవడు అయితే నదులు, సరస్సులు మొదలైన వాటి నీరు వ్యర్థము కాకుండా, మనుజులకు అశుభ్రమైన గుంటలలో పడుభయమును పోగొట్టినాడో, గంగాస్నానము జేయువారికి కల్మషహారిగా దేవనది ప్రసిద్ధి పొందుటలో ప్రధానమైన వాడో అట్టి ఏకైక పగటిరాజు ఆ సూర్యుడు మీకు మేలు కల్గించుగాక.
ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ 

4 కామెంట్‌లు:

  1. చాలా మంచి ప్రయత్నం. చిన్న సలహా. భావం రాసేప్పుడు కొద్దిగా విడమరిచి అయినా వ్యావహారికం లో రాయండి. అక్కడ ఉన్న మాటల అర్ధం మాత్రమె రాస్తే అది తాత్పర్యం అవుతుంది. అదే ఆ మాటలకి సంపూర్ణ వివరణ ఇస్తే అది మాత్రమే ప్రస్తుతం ఉన్న వాళ్లకి అర్ధం అవుతుంది. మీది చదివే వాళ్ళు పదో తరగతి లెవల్ లో ఉంటారని, వార్తా పత్రిక లెవెల్ వాళ్ళనీ మర్చి పోవద్దు. మీరు ఇలాగే సంస్కృత కావ్యాలన్నిటినీ పోస్ట్ చెయ్యచ్చు. దీంతో పాటు ఆడియో కలిపితే ఇంకా బావుంటుంది.
    ఐడియా కోసం తెలుగుభాగవతం.ఆర్గ్ చూడండి. శుభం భూయాత్

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత గారు, మీ చక్కటి సలహాకు, ప్రోత్సాహానికీ సంతోషం కలిగించింది. ఈ శతకం దాదాపు పూర్తయిపోయింది. ఇంకో ఐదారు శ్లోకాలున్నాయంతే. ఈసారి ఇటువంటి ప్రయత్నము చేస్తే , మీసలహా, మార్గదర్శనం గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు. నిన్న బ్లాగులు పని చేయలేదు.అందుకే ప్రతిస్పందన ఆలస్యమైనది.

    రిప్లయితొలగించండి
  3. సాహితీ మిత్రులు సోదరి లక్ష్మీదేవిగారికి నమస్కారములు. మయూరుని సూర్యశతకము పదవభాగము ప్రకటించినందులకు అభినందనలు, కృతజ్ఞతలు. చివరి పదకొండవభాగమునకై వేచిచూస్తూ...స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. నెట్ సమస్య వల్ల కొంచెం ఆలస్యమైనదండి. మీ ఆసక్తి నాకు ప్రోత్సాహకరముగానున్నది. నిజంగా మయూరుని వర్ణనల్లో పోలికలు అపూర్వంగా, ఆనందదాయకంగా ఉన్నాయి. నాకెంతో నచ్చబట్టి ఈ విధంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెడుతున్నాను.

    రిప్లయితొలగించండి