Loading...

8, ఫిబ్రవరి 2014, శనివారం

మయూరుని సూర్యశతకము-పదకొండవభాగము-అర్థము- సమాప్తము

96. ఏతత్పాతాళపఙ్కప్లుతమివ తమసైవైకముద్గాఢమాసీ
దప్రజ్ఞాతాప్రతర్క్యం నిరవగతి తథాలక్షణం సుప్తమన్తః
యాదృక్సృష్టేః పురస్తాన్నిశి నిశి సకలం జాయతే తాదృగేవ
త్రైలోక్యం యద్వియోగాదవతు రవిరసౌ సర్గతుల్యోదయో వః ॥

అర్థము

యద్వియోగాత్= ఏ పని ఎడబాటు వలన , ఏతత్ త్రైలోక్యం = ఈ మూడు లోకములు, భువనత్రయము, పాతాళపంకప్లుతమివ= పాతాళలోకమందలి బురదతో పూయబడినదానివలె, తమసా= చీకటితో, ఏకం= ఏకమైనదై, ఉద్గాఢం= మునిగినది, ఆసీత్ = అయినదో, మరియు అప్రజ్ఞాతాప్రతర్క్యం= తెలియబడనిదై, ఊహింపవీలుకానిదై, నిరవగతి = గమనము లేనిదై, తథా= అట్లే, అలక్షణం = గురుతులు లేనిదై, అన్తస్సుప్తం=లోపలనిద్రించునదై యున్నదో, మరియు సృష్టేః పురస్తాత్ = సృష్టికి పూర్వము, నిఖిలం= సమస్తమును , యాదృక్ =ఎట్టిదయి యున్నదో , నిశినిశి = ప్రతి రాత్రి యందును , తాదృగేవ జాయతే= అట్టిదే యగుచున్నదో , అసౌ = అట్టి ఈ, సర్గతుల్యోదయః = సృష్టితో సమానమయిన ఉదయము గల, రవిః =సూర్యుడు, వః = మిమ్ము, అవతు= రక్షించుగాక.

భావము (నాకు తెలిసి)
ఏ సూర్యోదయము లేనట్లయితే , ఈ మూడు లోకములు పాతాళలోకపు మొత్తం బురద పూయబడినట్లుగా, చీకటిలో మునిగిపోతాయో, అంతే కాక ఊహింపవీలే లేనంతగా కంటికి ఏమీ కనిపించనట్లుగానూ, నిద్రలో మునుగుట వలన గమనము ఆగి పోయినదై, సృష్టి కి మొదలు ఉన్నట్లుగా మారి పోతుంటాయో, అవే లోకములను తిరిగి ఉదయముతో సృష్టిని ఆరంభించినట్టుగా అగుపించేవిధంగా చేయగల ఆ సూర్యుడు మిమ్ము రక్షించుగాక.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

97. ద్వీపే యోస్తాచలోస్మిన్భవతి ఖలు స ఏవాపరత్రోదయాద్రి
ర్యా యామిన్యుజ్వ్జలేన్దుద్యుతిరిహ దివసోన్యత్ర తీవ్రాతపః సః
యద్వశ్యౌ దేశకాలావితి నియమయతో నో తు యం దేశకాలా
వవ్యాత్స స్వప్రభుత్వాహితభువనహితో హేతురహ్నామినో వః ||

అర్థము
యః = ఏది, అస్మిన్ ద్వీపే= ఈ ద్వీపమందు , అస్తాచలో=  సూర్యునకస్తమయ పర్వతము, భవతి= అగుచున్నదో, స ఏవ= అదియే, అపరత్ర= వేరొక ద్వీపమందు, ఉదయాద్రిః = సూర్యునకుదయించు పర్వతమగుచున్నది. మరియు ఇహ= ఈ ద్వీపమందు, యా= ఏది, ఉజ్జ్వలేందుః = చంద్రుడు ప్రకాశించుచున్న, యామినీ= రాత్రియగుచున్నదో, సా= అది, అన్వత్ర= యింకొకద్వీపమున, దీప్తాతపః = ఎండమండుచున్న, దివసః = పగలగుచున్నది, దేశకాలౌ= దేశకాలములు , యద్వశ్యే= ఎవనికి వశములగుచున్నవో, ఇతి= అని ,యం= ఎవనిని, నోతు, నియమయతః =నియమింపకున్నదో, సః= అట్టి స్వప్రభుత్వాహీత భువనహితః= తన ప్రభుత్వము చేత జగత్తుకు హితము చేయు , అహ్నాంహోతుః= పగళ్ళకు హేతువయిన, ఇనః= సూర్యుడు, వః= మిమ్ము, అవ్యాత్= రక్షించుగాక.

భావము(నాకు తెలిసి)
అనేక ద్వీపముల నిలయమైన ఈ భూమియందు ఒకద్వీపమున సూర్యుడస్తమించిన పర్వతమే మరియొక ద్వీపమున ఉదయించిన పర్వతమగుచున్నది. (అనగా మనకు పడమరగా కనిపించునది పడమటి దేశాలకు తూర్పు అగుచున్నది). ఒకద్వీపమందు చంద్రుడు వెలిగే రాత్రిగా ఉండగా, మరొకద్వీపమందు ఎండమండే పగలగుచున్నది. ఈవిధముగా భూమిని వసించే జనులు దేశకాలములకు వశులై (లోబడి) ఉన్నారు. కానీ ఎవ్వనినైతే దేశకాలములు వశము చేసుకొనజాలవో అట్టి దినకరుడైనవాడు తన ప్రభుత(పాలన) చేత  మిమ్ముల రక్షించుగాక.

+++++++++++++++++++++++++++++++++++++++

98. వ్యగ్రై రగ్ర్య గ్రహేన్దు గ్రసనగురు భరైర్నో సమగ్రైరుదగ్రైః
ప్రత్యగ్రై రీషదుగ్రై రుదయగిరిగతో గోగణైర్గౌరయన్‌ గామ్‌
ఉద్గాఢార్చిర్విలీనామర నగర నగగ్రావ గర్భామివాహ్నా
మగ్రే శ్రేయో విధత్తే గ్లపయతు గహనం స గ్రహగ్రామణీర్వః ॥

అర్థము

యః = ఎవడు, అహ్నాం అగ్రే = పగళ్ళ మొదళ్ళ యందు (ప్రాతఃసమయములందు), ఉదయగిరి గతః = ఉదయాచలమున నున్నవాడై, వ్యగ్రైః = జాగరూకములయినవియు, అగ్రైరర్గ్యగ్రహెన్దుగ్రసన గురుభరైః =  యెదుటనున్న కుజాది గ్రహములును చంద్రుని మ్రింగు మహాకార్యభారము కలిగినవియు గ్రహాదుల కాంతినతిశయించివని అర్థము) ,నో సమగ్రైః = సంపూర్ణములు కానివియు (అప్పుడే ఉదయించుచుండుట చేత), ఉదగ్రైః = గొప్పవియు, ప్రత్యగ్రైః = కొత్తవియు, ఈషదుగ్రైః =  కొంచెము తక్షణములయినవియునగు , గోగణైః = కిరణసమూహముల చేత , గాం= భూమిని గౌరయన్ = తెల్ల బరచుచు , ఉద్గాఢార్చిర్విలీనామర నగర నగగ్రావగర్భాం ఇవ= (సూర్యుని) గండశిలలను గర్భమున ధరించినదో అనునట్లు , విధత్తే  = చేయుచున్నాడో, సః = అట్టి, గ్రాహగ్రామణీః = గ్రహపతి అయిన సూర్యుడు , అగ్రేః = ముందు, వః = మీ యొక్క , గహనం = పాపమును , గ్లపయతు = క్షీణింపజేయు గాక.

వివరణము
సాధారణముగా సూర్యోదయసమయమున తెల్లవారుచున్నదందురు . అంతవరకు చీకట్లో అంతయు నల్లగానుండును. సూర్యోదయములో భూమి యంతయు తెల్లవారును. అప్పుడు నగరాదులు భూమి గర్భముననుండును. కవి యిచ్చట గర్భిణి అగు స్త్రీ తెల్లల్నగుటను ధ్వనింపజేసినాడు.

భావము (నాకు తెలిసి)

గండశిలలను గర్భమున ధరించినట్లున్న భూమిని తన క్రొంగొత్త లేత శ్వేత కిరణములతో తెల్లబరచు కుజాది గ్రహపతి అయిన సూర్యుడు మీ పాపములను క్షయము చేయుగాక. ( ఈ పద్య భావం మరింత పరిశీలించి వ్రాయవలసి ఉన్నది.)

=====================================
99. యోనిః సామ్నాం, విధాతా మధు రిపు, రజితో ధూర్జటిః శంకరోసౌ,
మృత్యుః కాలో,అలకాయాః పతిరపి ధనదః, పావకో జాతవేదాః
ఇత్థం సంజ్ఞా రివిత్థాది వద మృతభుజాం యా యదృచ్ఛాప్రవృత్తా
స్తాసామేకోభిధేయ స్తదనుగుణగుణైర్యః స సూర్యోవతాద్వః ॥

అర్థము
విధాతా= బ్రహ్మ, సామ్నాం = సామములకు (సామవేదములకు) , యోనిః = కారణము, ముధురిపుః = విష్ణువు, అజితః = ఓడిపోవనివాడు, ధూర్జటి = శివుడు , శంకరః = శుభములు కలుగ జేయువాడు, మృత్యుః =మృత్యుదేవత, కాలం= కలనా స్వభావము కలది (లోకములను పరిణామ శీలములుగా చేయు స్వభావము కలది) , అలకాయాః పతిః అపి = అలకాపట్టణమునకు పతియగు కుబేరుడు, ధనదః = ధనము నిచ్చువాడు , జాతవేదాః = అగ్ని పావకః , (పవిత్రముగా చేయువాడు), యిత్థం= ఈ ప్రకారముగా, అమృతభుజాం= దేవతల యొక్క , యాః సంజ్ఞాః = ఏ పేరులు, (డబిర్ధాది వత్ డబిర్ధాది శబ్దముల వలె ), యదృచ్ఛా ప్రవృత్తాః =యదృచ్చచేత ప్రవర్తించినవో (సార్థకములు కాక ప్రవర్తించినవో యని), తా సామేవ= ఆ పేరులకే (పేళ్ళకే) , అనుగతః గుణగణైః= తనకున్న గుణముల చేత, యః = యెవడు , అభిధేయః = చెప్పదగిన వాడయి యుండెనో, సః= అట్టి, సూర్యః = సూర్యుడు  , వః = మిమ్ము ,అవతాత్= రక్షించుగాక.

తాత్పర్యము
బ్రహ్మాది దేవతలకున్న "సామములకు కారణము" అని మొదలుగానున్న ఆయా పేరులు సార్థకములు కావు , ఆ నామధేయములన్నియును సూర్యునికే అన్వర్థములని , డిద్ధడబిద్ధవంటి శబ్దముల కర్థము లేదు. బ్రహ్మదేవతలకున్న సామయోని అజిత, శంకరాది నామములు డిద్దడబిద్దాదులు వంటివే , సూర్యునకయినచే అవి సార్థకములయినవి.

భావము (నాకు తెలిసి)

సామములకు కారణస్వరూపుడని బ్రహ్మను, ఓడిపోనివాడని మధురిపు(విష్ణువు)ను, శుభములనిచ్చు వాని శం కరుడని , కలనాస్వభావము (మార్పుకుకారణము) గా కాలమును, కుబేరుని ధనప్రదాత యని, అగ్నిని పావకు(పవిత్రముగా చేయువా)డని, ఈ రీతులుగా ఏ ఏ పేరులు దేవతలకున్నవో అంతకన్నా ఎక్కువగా సూర్యభగవానునకు అవి సక్రమంగా నిరూపించబడతాయని ,అట్టి సూర్యుడు మిమ్ముల రక్షించుగాక.

*************************************
100. దివః కిం బాన్ధవః స్యాత్ ప్రియసుహృద థవాచార్య ఆహోస్విదర్యో
రక్షా చక్షుర్ను దీపో గురురుత జనకో జీవితం బీజమోజః
ఏవం నిర్ణీయతే యః క ఇవ న జగతాం సర్వథా సర్వదాసౌ
సర్వాకారోపకారీ దిశతు దశశతా భీషు రభ్యర్థితం వః  ॥

అర్థము
జగతాం = లోకములకు ,దేవః కిమ్= దేవుడా , బాంధవః స్యాత్ బంధువగునా, అధవా= లేక ప్రియసుహృత్ = ప్రియమైన మిత్రమా ! ఆర్యః = కులదైవతమా, రక్షా = రక్షణమా (రక్షకుడా అని) చక్షుః ను= నేత్రమా? దీపః= దీపమా, గురు= అజ్ఞానాంధకారమును పోగొట్టువాడా, ఉతః= లేక జనకః = తండ్రియా? జీవితః= జీవితమా ! బీజం= కారణమా ! మోజః = బలమా! ఏవః= ఈ ప్రకారము ,యః= ఎవడు , కిమితి = ఏ ఒక్కటి అని న నిర్ణీయతే= నిర్ణయింపబడకున్నాడో, అసౌ = అట్టి ఈ సర్వభాసర్వద= అన్ని విధములుగా అన్నిటిని యిచ్చునట్టి సర్వాకారోపకారీ , అన్ని ఆకాశముల ఉపకారము చెయు దశశతభీషుః = సహస్రకిరణములు గల సూర్యుడు, వః= మీకు అభ్యర్థితం = కోరబడినదానిని,  దిశతు= యిచ్చుగాక.

భావము (నాకు తెలిసి)
లోకములకు ఆ సూర్యుడు దేవుడా/బంధువా? ప్రియస్నేహితుడా/ కులదైవమా? రక్షణమా/ నేత్రమా, దీపమా/ అంధకారమును పోగొట్టువాడా? లేక తండ్రియా/ జీవితమా, బీజమా/ బలమా ? ఈ ప్రకారపు కొలతలవి రవిని అంచనా వేయుటకై చాలవు. వీటిల్లో ఒకటిగా ఎవడు నిర్ణయింపబడకుండా నిలిచినాడో అట్టి సర్వోపకారి అయిన వాడే  ఆ సూర్యుడే , అట్టి సహస్ర కిరణములు గల సూర్యుడు , మీకు కోరినవి యిచ్చుగాక.

ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ
                             ___ఫలశ్రుతి______
101. చత్వారింశత్ ప్రభాయాస్త్రయమథచ పునర్వాజినాం షట్కయుక్తం
పశ్చాన్నేతుర్ ద్విషట్కం పునరపిచ దశస్యందన స్త్ర్యైకముక్తం
భూయోష్టౌ మండలస్య , స్ఫుటమథంచ రవేర్వింశతి శ్శ్రీమయూరే
ణేత్థం ప్రాతః పఠేద్యశ్శతకమనుదినః సూర్యసాయుజ్యమేతి ॥


అర్థము
ప్రభాయాః = ప్రభయొక్క (సూర్యప్రభను గురించి), చత్వారింశత్త్రయం = నలుబది మూడు (శ్లోకములు), అథచ పున= తరువాత మళ్ళీ, వాజిన= గుఱ్ఱముల యొక్క (గుఱ్ఱములను ) గూర్చి, షట్కం= ఆరు, ఉక్తం= చెప్పబడినది (బడినవి), పశ్చాత్ =తరువాత, నేతుః = అనూరునకు, ద్విషట్కం= పండ్రెండు , పునరపిచ = మరియు , స్యందనస్య= రథము యొక్క (గురించి) , దశ ఏకం= పదునొకండు , ఉక్తం= చెప్పబడినది, భూయః = తరువాత, మండలస్య = మండలముయొక్క (గూర్చి) , అష్టౌ= యెనిమిది , అధచ= తరువాతను, స్పుటం= స్ఫుటముగా, రవేః = సూర్యునకు గాను, వింశతిః = యిరువది, ఇత్థమ్= యిట్లు , శ్రీమయూరేణ= శ్రీమయూరకవి చేత, ఉక్తం= చెప్పబడిన , శతకం= శతకమును, యః= ఎవడు , అనుదినం= ప్రతిదినమందు ,ప్రాతః =ఉదయమున , పఠేత్ =పఠించునో, వాడు సూర్యసాయుజ్యం = సూర్యసాయుజ్యంను, ఏతి = పొందును.

భావము

సూర్యప్రభను గురించి నలభైమూడు, గుఱ్ఱముల గురించి ఆరు, అనూరుని గురించి పండ్రెండు, రథము గురించి పదునొకండు, భూమండలమును గురించి యెనిమిది, తర్వాత రవి గురించి స్పష్టముగా ఇరవై గా శ్రీ మయూరకవి చేత చెప్పబడిన ఈ శతకమును ఎవరు ప్రతిదినము ఉదయమున పఠించునో వాడు సూర్యసాయుజ్యమే పొందును.

 ఫలశ్రుతి (పాఠాంతరము)

101. శ్లోకా లోకస్య భూత్యై శతమితి రచితాః శ్రీమయూరేణ భక్య్తా
యుక్తశ్చైతాన్పఠేద్యః సకృదపి పురుషః సర్వపాపైర్విముక్తః
ఆరోగ్యం సత్కవిత్వ మపి మతులబలం కాన్తి మాయుః ప్రకర్షం
విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే స్తోత్ర సూర్యప్రసాదాత్‌ ॥

భావము (నాకు తెలిసి)
ఎవరైతే సంకల్పశుద్ధిగా శ్రీమయూరకవి చేత రచింపబడిన ఈ శతకాన్ని చదివినచో సర్వపాపములనుండి విముక్తులగుదురు. మరియు ఆరోగ్యం, సత్కవిత్వం, అతులబలం, తేజస్సు, ఆయువు, విద్యా, ఐశ్వర్యం, అర్థం, సంతానమును సూర్యభగవానుని ప్రసాదం వల్ల లభిస్తాయి.
                             
                                                  శుభమ్ భూయాత్ ॥
౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౨


4 కామెంట్‌లు:

  1. ఇంత చక్కటి పద్యాలను తాత్పర్యాలతో సహా వివరించినందుకు ధన్యవాదాలండీ ! ఆదిభట్ల వారిది కూడా సూర్య నారాయణ శతకం ఉందని విన్నాను ... ఎక్కడా దొరకలేదు నాకు

    రిప్లయితొలగించండి
  2. ఇంత చక్కటి పద్యాలను తాత్పర్యాలతో సహా వివరించినందుకు ధన్యవాదాలండీ ! ఆదిభట్ల వారిది కూడా సూర్య నారాయణ శతకం ఉందని విన్నాను ... ఎక్కడా దొరకలేదు నాకు

    రిప్లయితొలగించండి
  3. సంతోషమండీ. మనకు తెలియని అపురూప సంపదలెన్నో మన భారతీయులు సృజించి ఉంచినారు. ఈ మయూరుని శతకము బయటెక్కడా దొరకడం లేదనే భావనతోనే రసహృదయులైన మిత్రుల కొఱకు ఇక్కడ ఉంచినాను. ఆదిభట్ల వారి నూటయాభైవ జయంతి ఉత్సవాలు జరుగవలసిన సంవత్సరమనీ , సంగీత అకాడమీ, సాహిత్య అకాడమీ మీ బాధ్యతంటే మీదంటూ చేతులు దులుపుకున్నారనీ ఈరోజు ఈనాడు లో చదవడమే తప్ప నాకు వారి గురించి పెద్దగా తెలియదని చెప్పడానికి సిగ్గుపడవలసిన స్థితి నాతో పాటు అనేకమందిది. :(

    రిప్లయితొలగించండి
  4. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులవారు వివరించిన అర్థముతో భువనవిజయం ప్రచురణ సంస్థ వారు ప్రచురించిన పుస్తకంలో ఉన్న సమాచారమే ఇదంతా. గూగులించినపుడు పెద్దవివరాలు దొరకలేదు. (ఈమాట వారు సూర్యశతకాన్ని ఇచ్చియున్నారు కాని అందులో శతకపాఠం తప్ప అర్థము, భావము తెలుపలేదు. ఇంతకష్టమైన సంస్కృతము అర్థముకాని నావంటి సాహిత్యాభిమానులకోసం ఈ పుస్తకములో నున్న అర్థాన్ని యథాతథంగా ప్రచురించినాను. నాకు తెలిసినంతవరకూ భావాన్ని ఇక్కడ పాఠకుల సౌలభ్యం కోసం ఇస్తున్నాను.
    ఈ విధంగా ప్రచురించడంలో ఏ అభ్యంతరం ఉన్నా స్పందించగలరు.

    రిప్లయితొలగించండి