Loading...

8, ఏప్రిల్ 2013, సోమవారం

మయూరుని సూర్యశతకము, అర్థము -6


౫౧. ఆక్రాన్త్యా వాహ్యమానం పశుమివ హరిణావాహకోగ్ర్యో హరీణాం
భ్రామ్యన్తం పక్షపాతాజ్జగతి సమరుచిస్సర్వకర్మైకసాక్ష్యం
శత్రుం నేత్ర శ్రుతీనామవజయతి వయోజ్యేష్టభావే సమేపి
స్థామ్నాం ధామ్నాం నిధిర్యస్సభవ దఘనుదే నూతన స్స్తాదనూరుః ||
అవతారిక
ఈ శ్లోకమునందు కవి అనూరుఁడు గరుత్మంతుని జయించినట్లు చెప్పుచున్నాడు. ఆ చెప్పుటలో యిద్దరికి గల విలక్షణత్వమును శబ్దగతమగు శ్లేషచేత (అనగా శబ్దచ్ఛలము చేత) సాధించినాడు. ఇందుకర్త అనూరుడు, కర్మ గరుత్మంతుడు. గరుత్మంతునికి చక్కగా చెప్పు చలార్థము ప్రధానార్థము ప్రక్కనే వ్రాయబడును ఇందు ప్రథమా విభక్త్యర్థములు అనూరునివి.ద్వితీయా విభక్త్యర్థములు గరుత్మంతునివి.
అర్థము
హరీణాం= పెక్కుగుఱ్ఱముల యొక్క (సూర్యుని గుఱ్ఱములను), వాహకాగ్ర్యః = నడపించువాడు (అనూరుడు) హరిణా= విష్ణువు, నిత పశుమివ ఆక్రాన్త్యా= పశువుని ఆక్రమించినట్లు , వాహ్యమునం= వాహనముగా చేయబడిన (గరుత్మంతుని) మరియు , జగతి= లోకమందు సమరుచిః = సమానమగు కాంతి కలవాడు అనగా లోకమంతటను సమానముగా కాంతిని ప్రసరింపజేయువాడని అర్థము. సమానమయిన ఆదరము కలవాడు అని ధ్వని అట్టి అనూరుడు, పక్షపాతాత్ భ్రామ్యంతం = రెక్కలు విదల్చుచు (పక్షపాతముతో )తిరుగుచున్న(గరుత్మంతుని) పక్షపాతమనగా ఒకరి యందు వైరము ఒకరియందు అనురాగము అని ధ్వని (అట్టి గరుత్మంతుని,) పక్వకర్మైకసాక్షీ= సర్వకర్మములకు సాక్షి యగు అనూరుడు, వయోజ్యేష్ఠభావే= వయస్సుని తనయినటువంటి పెద్దతనము సమేపి= సమానమయినదయినను నేత్రశ్రుతీనాం= సర్పములకు శత్రుం= శత్రువగు (గరుత్మంతుని) అనూరుడు, గరుత్మంతునికి అన్న అందుచేత యితనికి వయోజ్యేష్టత్వమున్నది, ఇక వయశ్శబ్దమునకు పక్షులని అర్థముది. ఆ అర్థముచేత పయోజ్యేష్ఠుడనగా పక్షులలో శ్రేష్ఠుడగు గరుత్మంతుడు . ఈ విధముగా గరుత్మంతునికి అనూరునకు పయోజ్యేష్ఠత్వము సమానముగానే యున్నను అనూరుని విశేషముగొప్పది. ఎట్లన అనూరుడు కర్మసాక్షి. గరుత్మంతుడు నేత్రములకు శ్రుతులకు (చెవులకు) శత్రువుగా చెప్పబడినాడు. నేత్రశత్రువులనగా కన్నులే చెవులయిన సర్పములు. వాస్తవార్థము సర్పములకు శత్రువని ఛలార్థము కనులకు చెవులకు అనగా చూడని వినని వాడని సర్వకర్మలకు సాక్షియైనవాడు అనూరుడు మరియు, స్థేమ్నాం= విస్తారములయిన, ధామ్నాం= తేజస్సులకు నిధిః= నిధి అయిన వాఁడు, యః = యెవడో, సః = అట్టి, నూతనః = క్రొత్తగా ఉదయించుచున్న అనూరుః = అనూరుడు, భవదఘనుదే= మీ పాపములు, పోగొట్టుటకు స్తాత్= అగుగాక.
భావము (నాకు తెలిసి)
ఈ పద్యములో విష్ణువాహనము అయిన గరుత్మంతునితో సూర్యుని సారథి అయిన అనూరుని పోల్చి అనూరుని శ్రేష్ఠత్వము నిరూపించడం జరిగింది. హరికి వాహనము గా గరుత్మంతుడుండగా హరి(సూర్యుడు) రథపు గుఱ్ఱములను నడిపించువాడని, గరుత్మంతుడు పక్షపాతము (రెక్కలు విదల్చుట) చూపగా అనూరుడు పక్షపాతము (ఒకచో వైరము, ఒకచో ప్రీతి) చూపకుండా సమానమయిన కాంతి ప్రసరించేలా రథము నడుపువాడని, గరుత్మంతుడు పక్షులకు పెద్ద అయినచో, గరుత్మంతుడనే పక్షికి అనూరుడు పెద్దసోదరుడని, నేత్రశ్రుతులు అనగా కన్నులే చెవులైన (చెవులులేని) పాములకు శత్రువు గా అనగా కన్నులకు , చెవులకు శత్రువుగా అనగా చూడని, వినని వాడుగా గరుత్మంతుడుండగా, సర్వకర్మలకు సాక్షి గా అనూరుడు ఉంటాడని అట్టి తేజోనిధి అయిన అనూరుడు మీ పాపములు పోగొట్టుగాక అని కవి పలుకుతున్నారు.
(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
౫౨. దత్తార్ఘై ర్ధూరనమ్రై ర్వియతి వినయతో వీక్షిత స్సిద్ధ సాధ్యై
స్సానాధ్యం సారథిర్వః సదశతరుచేస్సాతిరేకం కరోతు
అపీయప్రాతరేవ ప్రతతహిమ వయస్యన్దినీరిన్దుభాసో
యః కాష్ఠా దీపనో౭గ్రే జడితయివ భృశం సేవతే పృష్ఠతో౭ర్కం ||
అర్థము
యః= ఎవడు ప్రాతరేవ= ప్రాతఃకాలమందే, ప్రతతహిమవయః స్యందినీ = విస్తారమగు మంచు కురియుచున్న, ఇందు భాసః = చంద్రకాంతులను , అసీయ= బాగా పానము చేసి, జడితః ఇవ= చలికలిగిన వాని వలె , అగ్రే= యెదుట , కాష్ఠాదీపనః= దిక్కులను జ్వలింపచేయువాడై (చలికాచుకొనుటకు కట్టెలను మండించుచున్నవాడు అని ధ్వని), అర్కః = సూర్యుఁడు , పృష్ఠతః = వెనుకవైపుగా, సేవతే= సేవించుచున్నాడో, సః= అట్టి , వియంతి దూరనమ్రైః దత్తార్ఘైః  సిద్ధసాధ్యైః  వీక్షితః =ఆకసమున దూరముగా నమ్రులయి అర్ఘ్యము నిచ్చెడి సిద్ధసాధ్యలచేతచూడబడుచూ, వినమితః= నమస్కారము చేయబడు , దశసతరుచేః సారథిః = సూర్యుని సారధియగు అనూరుడు, వః = మీకు  , సానాధ్యం కరోతు= సనాథత్వమును కలిగించుగాక. అనగా మీకు రక్షకుడగు గాక అని అర్థము.
భావము (నాకు తెలిసి)
ప్రాతఃకాలమందే విస్తారమగు మంచు కురియు చంద్రకాంతులను తాగినందు వలన చలికలిగినట్టుగా దిక్కులను వేడి చేసి చలికాచుకుంటున్నట్టున్నవాడై, దూరంగా అర్ఘ్యములిచ్చు సాధువులచే చూడబడుచున్నవాడైన సూర్యుని సారథి అనూరుడు మిమ్ములను అనాథలుగా కాకుండ చూడుగాక, అంటే సనాథత్వమును కలిగించుగాక.
***************************************
౫౩.ముఞ్చన్ రశ్మీన్దినాదౌ దినగమసమయే సంహరశ్చస్వతన్త్ర
స్తోత్ర ప్రభ్యాతవీర్యో౭విరతహరి పదాక్రాన్తి బద్ధాభియోగః
కాలోత్కర్షాల్లఘుత్వం ప్రసభ మధిపతౌయోజయన్యోద్విజానాం
సేవాప్రీతేన పూష్ణాత్మసమయివకృతస్త్రాయతాం సోరుణోవః||
అర్థము
దినాదౌ = ఉదయకాలమున, రశ్మీన్= కిరణములను ,ముఞ్చన్= ప్రసరింపజేయుచున్నవాడై , దినగమసమయే= సాయంకాలమున , సంహరంశ్చ= ఉపసంహరింపజేయుచున్నవాడై , స్వతంత్రః = స్వతంత్రుడై , స్తోత్ర ప్రఖ్యాత వీర్యః = సంధ్యావందన సమయమందు, స్తుతి మంత్రములచేత ప్రఖ్యాపింపబడిన మహిమ గలవాడై, అవిరత హరిపదాక్రాంతి బద్ధాభియోగః =  గుఱ్ఱములను తోలుటయందు పట్టుగలవాడై, కాలోత్కర్షాత్= కాలము యొక్క ఉత్కర్షము వల్లన (కాలక్రమమున) , ద్విజానాం అధిపతౌ = చంద్రుని యందు , ప్రసభం = బలాత్కారముగా ,లఘుత్వం = కొద్దితనమును,యోజయన్= కూర్చుచున్న వాడైః , యః = ఎవడు సేవాప్రీతేన= సేవచేతను సంతోషించిన, పూష్ణాః= సూర్యుని నతస్వసము ఇవ= తనతో సమానునిగా కృతః = చేయబడెనో, సః = అట్టి , అరుణః= అరుణుడు, వః = మిమ్ము, త్రాయతాం = రక్షించుగాక.
ఈ శ్లోకమునందు సూర్యునకు అనూరునకు సమానమగు ధర్మములు చెప్పబడినవి. మూడవ అర్థము ఒకటి కూడా ఉన్నది.
తోత్ర  ప్రఖ్యాత వీర్యః = గుఱ్ఱముల త్రోలు కొరడా చేతను ప్రఖ్యాతి కలవాడు ద్విజాధిపతి యందు లఘుత్వమును కూర్చినవాడు అనగా ద్విజశబ్దమునకు, పక్షులర్థము . వానికి అధిపతి యనగా గరుత్మంతుడు , వానిని వాహనముగాజేసి తక్కువ చేసినవాడు హరి పదాక్రాంతి యందు పట్టుదల గలవాడు. ఇత్యాది విశేషణములచేత అర్జునునకు సారధ్యము జేయు కృష్ణుడు కూడ ధ్వనించుచున్నాడు. ఈ కృష్ణుడే సూర్యమండలాంతరవర్తి అగుటచేత కృష్ణభగవానునికి, సూర్యభగవానునికి అభేదస్థితి గలిగి అట్టి సూర్యుడు అనూరుని తనతో సమానముగ చేసెనని తాత్పర్యము.
భావము (నాకు తెలిసి)
ఉదయకాలమున కిరణాలను ప్రయోగించి, సాయంసమయమున ఉపసంహరించుచున్న స్వతంత్రుడైన, సంధ్యావందనాదులందు స్తుతింపబడుచున్న, చంద్రుని అల్పునిగా జేయుచున్న సూర్యునితో సమానునిగ జేయబడ్డ అనూరుడు మిమ్ముల రక్షించుగాక.
మూడవ అర్థము పైన చెప్పబడియున్నది.
ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ
౫౪. శాతశ్శ్యామా లతాయాః పరశురివ తమోఽరణ్యవహ్నేరివార్చిః
ప్రాచ్యే వాగ్రే గ్రహీతుం  గ్రహకుముదవనం ప్రాగు దస్తాగ్రహస్తః
ఐక్యంభిన్దన్ద్యుభూమ్యోః అవధిరివ విధాతేవ విశ్వప్రబోధం
వాహానాం వోవినేతా వ్యవనయతు విపన్నామ ధామాధిపస్య
అర్థము
శ్యామాలతాయాః = రాత్రియనెడు లతకు, శాతః= వాడియయిన, పరశుః ఇవ= గండ్రగొడ్డలి వలెనున్నట్టియు , తమోరణ్యవహ్నేః = చీకటి యనెడు అరణ్యమందలి దావాగ్ని యొక్క , అర్చి ఇవ= వెలుగువలెనే  నున్నట్టియు , అగ్రే= యెదుట (నున్న), గ్రహకుముదవనం= గ్రహములనెడు కలువతోటను , గ్రహీతుః= పట్టుకొనుటకు , ప్రాచ్యా= తూర్పుదిక్కుచేత , ప్రాగుదస్తాగ్రహస్తః ఇవ= ముందునకు చాచిన ముంజేయివలె నున్నట్టియు, ద్యుభూమ్యౌః= భూమ్యాకాశముల యొక్క , ఐక్యం = ఏకమగుటను లేక కలసిపోవుటను, ఛిందన్= ఛేదించుచున్న, అవధిః ఏవ= సరిహద్దు వలెనున్నట్టియు, విశ్వప్రబోధం= లోకములకు మేలుకొలుపును, విధాతా ఇవ= కలుగ జేయుచున్నట్లున్నట్టియునగు, ధామాధిపస్య= సూర్యునియొక్క , వాహనాం వినేతౌ = గుఱ్ఱములు తోలు అనూరుడు, వః = మీయొక్క,విపన్నామ ఆసిదయొక్క పేరును (ఆపదను అన్నమాట) , వ్యపనయతు= పోగొట్టుగాక.
భావము (నాకు తెలిసి)
చీకటి లతను ఖండించే గండ్రగొడ్డలిగా, చీకటి వనాన్ని దహించే దావాగ్ని వెలుగుగా, గ్రహములనబడు కలువలను అందుకొనేట్టుగా చేయి వంటి కిరణాలను చాచినట్టున్న, భూమ్యాకాశాల ఏకత్వాన్ని ఛేదించే సరిహద్దై, లోకములను మేలుకొలుపు సూర్యుని గుఱ్ఱములు తోలు అనూరుడు మీ ఆపదలను పోగొట్టుగాక.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
౫౫. పౌరస్త్యస్తోయదర్తోః పవనయివ పతత్పావకస్యేవధూమో
విశ్వస్యేవాది సర్గః  ప్రణవయివ పరం పావనోవేదరాశేః
సంధ్యానృత్యోత్సవేచ్ఛోరివ మదనరిపోః నన్దినాన్దీనినాద
స్సౌరస్యాగ్రే సుఖం వోవితరతు వినతానన్దనః స్యన్దనో వః ||
అర్థము
తోయదర్తోః = వర్షఋతువునకు , పౌరస్త్యః = ముందు బుట్టిన పవనః యివ= వాయువు వలెనున్నట్టియు, పతన్= పడుచున్న , పావకస్య ధూమః యివ= నిప్పుపొగవలె నున్నట్టియు, విశ్వస్య ఆదిసర్గః ఇవ= లోకపు మొదటి సృష్టివలెనున్నట్టియు , వరం = మరియు, వేదరాశేః = వేదసమూహముయొక్క (వేదరాశికి ముందున్న) , పావనః = పవిత్రమైన , ప్రణవః  ఇవ= ఓంకారమువలె నున్నట్టియు, మదనరిపోః = శివుడు సంధ్యానృత్యోత్సవేచ్చోః =సంధ్యానృత్యము చేయగోరియు , కడగా (యిచటనున్న షష్ఠీ విభక్తికి సతి సప్తతి అర్థము చెప్పవలెను.) , నందీనాందీనినాదః ఇవ= నందికేశ్వరుడు చేయు ప్రస్తావధ్వనివలెనున్నట్టియు, సౌరస్యస్యన్దనస్య అగ్రే = సూర్యుని రథమునకు ముందున్న, వినతానందనః = అనూరుడు, వః = మీకు, సుఖం= సుఖమును , వితరతు= ఇచ్చుగాక.
భావము (నాకు తెలిసి)
ఇందులో కవి గొప్పవాటి ముందు కనిపించే అన్నింటితో అనూరుడిని పోల్చి చెపుతున్నాడు.
వర్షమునకు ముందు వాయువు వలె, నిప్పు నకు ముందు వచ్చు పొగవలె, లోకపు మొదటి సృష్టివలె, వేదరాశికి ముందున్న ప్రణవము వలె, శివుడు సంధ్యానృత్యము చేయుటకు ముందు నందీశుని ప్రస్తావధ్వని వలె సూర్యుని రథమునకు ముందున్న వినతానందనుడు (అనూరుడు) మీకు సుఖమునిచ్చుగాక.
+++++++++++++++++++++++++++++++++++++++++++
౫౬. పర్యాప్తం తప్తచామీకరకనక తటేశ్లిష్టశీతేతరాంశా
వాసీదత్స్యన్దనాశ్వానుకృతిమరకతే పద్మరాగాయమాణః
యస్సోత్కర్షాం విభూషాం కురుతయివకులక్ష్మాభృదీశస్యమేరో
రేనాంస్యహ్నాయ దూరం గమయతు సగురుః కాద్రవేయద్విషోవః ||
అర్థము
యః = ఎవడు (అనూరుడు) , ఆసీదత్స్యందనాశ్వానుకృతిమరకతే = సూర్యుని గుఱ్ఱములు సమీపించుటచేత అది ప్రతిబింబించి మరకత మణి ఖచితము వలెనున్న , తప్తచామీకరకనకతటే = బంగారపు చరియల మాటున, పద్మ రాగాయమాణః = పద్మరాగమణివలె నయిన వాడై, శ్లిష్ఠశీతే తరాంశోః = సూర్యునితో చేరిక కలిగిన , కులక్ష్మీభ్య దీశస్యమేరోః = కులపర్వతములకు ప్రభువయిన మేరు పర్వతమునకు, పర్యాప్తం = చాలినంతగా , ఉత్కర్షాం  విభూషాం= యెక్కువ అలంకారమును కురుతే ఇవ= చేయుచున్నట్లున్న, సః =అట్టికాద్రవేయద్విషః గురుః = గరుత్మంతుని అన్నయగు అనూరుడు వః = మీయొక్క ఏనాంసి= పాపములను , అహ్నియ= శీఘ్రముగా దూరంగమయతు = దూరముచేయుగాక.
ఇందు కులక్ష్మాభృదీశస్య= అనునది ప్రధానార్థము సప్తకుల పర్వతముల ప్రభుడని కులము చేత రాజాధిరాజని ప్రతీయమానార్థము, రాజాధిరాజు రత్నములు పొదిగిన భూషణములు ధరించును. ఇందు " కటక" అను పదమునకు ప్రధానార్థము చరియప్రతీయమానము వలయము(కంకణము) సూర్యాశ్వములు సువర్ణవలయము నందు మరకతమణులు చుట్టుగా పొదగబడిఎఱ్ఱని అనూరుడు మధ్యపొదిగిన పద్మరాగమయినాడు.
భావము (నాకు తెలిసి)
సూర్యుని కాంతి పడిన మేరుపర్వతం అంటే కులపర్వతములకు ప్రభువయిన మేరువుకు ప్రత్యేక అలంకారము చేయుచున్నట్లుగా సూర్యుని గుఱ్ఱముల పచ్చని కాంతి వలయమునకు మధ్యలో ఎఱ్ఱని అనూరుడు పొదగబడినట్టుగా కనిపించుచున్నాడు , అట్టి అనూరుడు మీ పాపములను దూరముచేయుగాక.
_________________________________________
౫౭. నీత్వాశ్వాన్సప్త కక్షా ఇవ నియమవశం వేత్ర కల్పప్రతోద
స్తూర్ణం ధ్వాన్తస్వరాశాదితరజన ఇవోత్సారితే దూరభాజి
పూర్వంప్రష్ఠోరథస్య క్షితి భృవదధిపతీన్దర్శయంస్త్రాయతాం వ
స్త్రైలోక్యాస్థానదానోద్యతదివసపతేః  ప్రాక్ప్రతీహారపాలః ||
అర్థము
 వేత్రకల్పప్రతోదః = దండము (బెత్తము) వంటి కొరడా కలవాడును (కలవాడై) , సప్త అశ్వాన్= ఏడు గుఱ్ఱములను, సప్తకక్ష్యా ఇవ = ఏడు కక్ష్యలవలె (రాజప్రాసాదములందు వరుసగా ఒక్కొక్కద్వారమును దాటిన తరువాతనుండు ఒక్కొక్క భాగము కక్ష్య అనబడును.) నియమవశం నీత్వా= తన అదుపునకు తీసుకొని ధ్వాన్తస్యరాశౌ= చీకట్లగుంపు ఇతరజనే ఇవ = ఇతరజనము వలె , ఉత్సారితే = నెట్టబడి, తూర్ణం = శీఘ్రముగా, దూరభాజి= దూరమునకు పోగా, రథస్య=  రథమునకు ప్రష్ఠః = ముందునడచువాడై పూర్వం = ముందుగా , క్షితి భృదధిసతీన్= పర్వతరాజములను (భూపాలురను), దర్శయన్= చూపుచున్న (చూపువాడై) త్రైలోక్యాస్థాన దానోద్యదివసపతేః =  త్రైలోక్యరాజ్యదానమునకు ఉద్యమింఛిన సూర్యుని యొక్క , ప్రాక్ప్రతీహారపాలః = తూర్పు అనుద్వారమును పాలించు (ముఖ్య ద్వారపాలకుడు, ద్వారపాలకముఖ్యుడు) అయిన, అనూరుడు, వః = మిమ్ము , త్రాయతాత్= రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
దండముతో ఏడు గుఱ్ఱములను శాసించుచూ, ఇతరజనులవలె అడ్డున్న చీకటిగుంపులను దూరముగా నెట్టుచున్న, ఏడు గుఱ్ఱములనబడే కక్ష్యలను దాటుచున్న, పర్వత రాజులకు (రాజులకు ) దారిచూపు తూర్పు ద్వార పాలకుడయిన అనూరుడు మిమ్ము రక్షించుగాక.
///////////////////////////////////////////////////
౫౮.పాశానాం శాన్తపాలాదరుణవరుణతోమాగ్రహీః ప్రగ్రహార్థం
తృష్ణాం కృష్ణస్య చక్రే జహిహి నహిరథోయాతి మేనైక చక్రః
యోక్తుం యుగ్యం కిముచ్చైశ్రవసమభిలషస్యష్టమం వృత్రశత్రో
స్త్యక్తాన్యాపేక్ష విశ్వోపకృతిరితి రవిశ్శాస్తి యం సోవతాద్వః ||
అర్థము
అరుణ = అనూరుడా,అశన్తపాలాత్ వరుణతః = దిక్పాలకుడగు వరుణుని నుండి, ప్రగ్రహార్థం = పగ్గములకొరకు , పాశాన్= పాశములను , గృహిః = గ్రహింపకుము, యేన= ఏ కారణము చేత, ఏక చక్రః = ఒంటి చక్రము గల, రథః = రథము, నహియాతి= నడువదుకదా (అను కారణము చేత అని అధ్యాహారము) అని కృష్ణవ్య చక్రే = విష్ణువు యొక్క చక్రము నందు , తృష్ణాం = కోరికను, జహిహి= విడిచి పెట్టుము, వృత్రశత్రోః = దేవేంద్రుని యొక్క , ఉచ్చైశ్రవసం = ఉచ్చైశ్రవమను అశ్వమను, అష్టమం యుగ్యం = యెనిమిదవ గుఱ్ఱంగా , యోక్తుం= చేర్చుటకు , అభిలషసి కిమ్= కోరుచుంటివా ? , ఇతి= అని త్యక్త్యాన్యాపేక్ష, విశ్వోపకృతి = యితరుల అపేక్షను వీడి  విశ్వమునకు ఉపకారము చేయు, రవిః= సూర్యుడు, యం= ఎవనిని, శాస్తి = శాసించుచున్నాడో, సః = ఆ అనూరుడు , వః = మిమ్ము, అవతాత్= రక్షించుగాక.
(వరుణుని ఆయుధము పాశము, గుఱ్ఱపు పగ్గమునకు దానినడుగవలదని.)
భావము (నాకు తెలిసి)
అనూరుడా, వరుణుని ఆయుధమైన పాశమును గుఱ్ఱపు పగ్గములకొఱకై అడుగకుము, (ఒంటి చక్రపు రథము నడువదేమో అని) విష్ణువును చక్రము కొఱకు అడుగకుము. దేవేంద్రుని ఉచ్చైశ్రవమును ఎనిమిదవ గుఱ్ఱంగా చేసుకోవాలని కోరుకొనకుము. ఇతరులనుండి ఏమీ ఆశించక విశ్వమునకు ఉపకారము చేయు రవి చేత నీవు శాసింపబడుచున్నావు, అని కవి అనూరుని సంబోధించి, అట్టి అనూరుడు మిమ్ము రక్షించుగాక అంటున్నాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

౫౯. వజ్రిఞ్జాతం వికాసీక్షణకమల వనంభాసి నాభాసి వహ్నే
 తాతం నత్వాశ్వపార్శ్వాన్నయయమ మహిషం రాక్షసా వీక్షితాః స్థ
సప్తీన్సించ ప్రచేతః పవనభజజవం విత్తసావేదితస్త్వం
వన్దేశర్వేతి జల్పన్ప్రతిదిశమధిపాన్పాతు పూష్ణోగ్రణీర్వః ||
అర్థము
వజ్రిన్ = ఇంద్రుడా, ఈక్షణకమలవనం = నీ నేత్రములనెడి తామరపూలతోట (ఇంద్రుని శరీరమంతయును కన్నులని పురాణగాధ) , వికాసిజాతం= నికాసము కలదయినది, వహ్నో= (నీవు) ప్రకాశింపకున్నావు, యమ= యముడాతాతం= నీతండ్రి యగు సూర్యుని నత్వా= నమస్కరించి మహిషం =  నీ వాహనమగు దున్నను , అశ్వపార్శ్వం = గుఱ్ఱముల పార్శ్వమునుండి నయ= తొలగింపుము, రాక్షసాః = ఓ రాక్షసులారా (నైరుతి రాక్షసుడు కనుక ఆ దిక్కుననున్న రాక్షసులను సంబోధించుట ) మీరు , వీక్షితాస్థ =  చూడబడుచున్నారు , ప్రచేతః = ఓ వరుణుడా, సప్తీన్= గుఱ్ఱములను  సించ= తడుపుము, పవన = ఓ వాయుదేవా జనం = వేగమును , భజ= పొందుము, విత్తపాల= ఓ కుబేరుడా, త్వం= నీవు,  ఆవేదితః= (సూర్యునకు) తెలుపబడితివి , శర్వ= ఓ శంకరా, (నిన్ను) , వందే = నమస్కరించుచున్నాను, (శంకరుడు ఒక దిక్కుకు పాలకుడయినను , అతడు సర్వస్వరూపుడను  శాస్త్రము చేత నమస్కారము, ఇతి= అని ప్రతిదిశం = ప్రతిదిక్కునందును, అధిపాన్ = ఆయా దిక్కుల అధిపులను (అధిపులతో జల్పన్ = మాటలాడుచున్న , పూష్ణః అగ్రణీం = సూర్యుని ముందు నడచు అనూరుడు, వః = మిమ్ము, పాతు = రక్షించుగాక.
విశేషము = " ఆదిత్యం చ శివం విద్యాత్ శివమాదిత్యరూపిణం
                ఉభయోరంతరం నాస్తి ఆదిత్య స్య శివస్వచ ||"
సూర్యుని శివునిగా తెలియవలెను, శివుని సూర్యరూపుని గా తెలియవలెను. శివునకు సూర్యునకు భేదము లేదు.
భావము (నాకు తెలిసి)
సూర్యుడు అష్టదిక్పాలతో సేవలు పొందగలడని, వారు సూర్యుని నుండి లాభపడగలరని కవి నిరూపించుచున్నాడు. ఇంద్రుడా, నీ వేయి కన్నుల తామరతోట సూర్యుని రాకతో వికసిస్తుంది, యముడా, నీ తండ్రి సూర్యునినమస్కరించి అతని గుఱ్ఱములకు నీ వాహనమగు దున్నను అడ్డుగా నిలుపక తొలగించుము, రాక్షసులారా , (నైఋతి అనుచరులు) మీరు చూడబడుతున్నారు, వరుణుడా , గుఱ్ఱములను నీ జలధారలతో తడుపుము, వాయుదేవుడా , సూర్యునితో వేగమును పొందుము, కుబేరుడా, నీవు చూడబడుతున్నావు, శంకరా, నీకు నమస్కారము.
ఇట్లు ఆయాదిక్పాలకులతో సంపర్కంగలిగిన  సూర్యునికి ముందు నడచు అనూరుడు మీకు శుభములనిచ్చుగాక.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
౬౦. నోమూర్చాచ్ఛిన్నవాఞ్ఛశ్శ్రమవివశవపుర్నైవ నాప్యాస్యశోషీ
పాన్ధపాథ్యేతరాణిక్షపయతు భవతాం భాస్వతోగ్రేసరః వః
యస్సంశ్రిత్య త్రిలోకీమటతి పటుతరైస్తాపమానో మయూఖై
రారాదారామ లేఖామివ హరితమణి శ్యామలామశ్వపఙ్క్తిం||
 అర్థము
యః = ఎవడు హరితమణిశ్యామలాం = మరకతమణి వంటి రంగు కలిగిన , అర్వపంక్తిం = గుఱ్ఱముల పంక్తిని , సంశ్రిత్య= ఆశ్రయించి పటుతరైః = తీక్ష్ణములయిన , మయూఖైః = సూర్యకిరణములచేత, తాప్యమానః = తపింపచేయబడుచున్న వాడై , ఆరాదారామరేఖాం ఇవ = దగ్గరనున్న తోటను, తిరిగినట్లు త్రిలోకీం = ముల్లోకములను  అటతి = తిరుగుచున్నాడో (అట్లు తిరుగుచున్నాను) మూర్చాచ్ఛిన్న వాంఛః నో= మూర్ఛచేత కోరికలు (చేష్టలు) తెగినవాడు కాడో , శ్రమవివశవపుః నైవ = బడలిక చేత వశము దప్పినవాడు కానేకాడో , నాపి ఆస్యశోషి = ముఖమెండినవాడు కూడ కాకున్న వాడో, సః = అట్టి , పాన్ధః= పాంధుడగు (ఎప్పుడును సంచరించువాడు) , భాస్వతః అగ్రేసరః = సూర్యునకు ముందు నడచు అనూరుడు, అవతాం = మీకు, పథ్యేతరాణి = అహితములను , క్షపయతు = పోగొట్టుగాక.
భావము (నాకు తెలిసి)
ఎవడైతే మరకతమణి వర్ణపు గుఱ్ఱములనాశ్రయించి తీక్ష్ణ కిరణములతో తపింపజేయబడుతూ, మూర్ఛ, బడలిక తెలియనట్టు దగ్గరలో నున్న తోటను చుట్టివచ్చినట్లు ముల్లోకములను తిరుగుచున్నాదో అట్టి నిరంతర సంచారి యైన సూర్యునికి ముందు నడచు అనూరుడు మీకు కీడులను తొలగించుగాక.
{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{