Loading...

27, ఏప్రిల్ 2013, శనివారం

మయూరుని సూర్యశతకము, అర్థము -౭

౬౧.సీదన్తోన్తర్నిమజ్జజ్జడఖుర ముసలాస్సైకతే నాకనద్యాః
స్కన్దన్తః కన్దారాళీః కనకశిఖరిణో మేఖలాసుస్ఖలన్తః
దూరందూర్వాస్థలోత్కాః మరకతదృషది స్థాస్నవోయన్నయతాః
పూష్ణోశ్వాః పూరయంస్తై స్తదవతు జవనైర్హుంకృతేనాగ్రగోవః ||

అర్థము
నాకనద్యాః = గంగానదియొక్క , సైకతే= ఇసుకప్రదేశమందు , అంతర్నిమజ్జజ్జడఖురముసలాః = ఇసుకలో కూరుకుపోయి కదలని డెక్కలనెడి రోకళ్ళు కలిగినవై, సీదన్తః =శ్రమపడు చున్నవియు , కనకశిఖరిణః =మేరు మేఖలాసు= (ఆ మేరు పర్వతముయొక్క ) చరియలయందు, స్ఖలన్తః = జారుచున్నవియు, దూరం= దూరముగా (దూరమందున్న) , దూర్వాస్థలోత్కాః = గరికచేలయందాశకలవియును, మరకతదృషది= మరకత మణిశిలయందు (శిలలయందు) , స్థాన్నవః= నిలచు స్వభావము కలవియునగు, అశ్వాః = సూర్యుని గుఱ్ఱములు , యత్= ఏ స్థలమును , నయాతాః = వెడలకున్నవో (లంఘింపకున్నవో) , తత్= ఆ స్థలమును , జవనైః తైః = వేగముగల ఆ గుఱ్ఱములచేతనే , హుంకృతేన= హుంకారముతో (హుంకరించి) , పూరయన్= నింపుచున్న, పూష్ణః= సూర్యునకు, అగ్రగః= ముందుకుపోవు  అనూరుడు , వః = మిమ్ము , అవతు= రక్షించుగాక.
భావము(నాకు తెలిసి)
నాకమున ప్రవహించే గంగానదీతీరముననున్న ఇసుకలో డెక్కలు రోకళ్ళవలె కూరుకుపోయినపుడు, మేరు పర్వతచరియల నుంచి జారుతున్నపుడు, దూరముగా కనిపించే గరిక(గడ్డి) చేలపై ఆశ కలిగినపుడు, మరకతమణి శిల యందు సూర్యుని గుఱ్ఱాలు నిలిచిపోతే హుంకారముతో ముందుకు తీసుకొని పోవు అనూరుడు మిమ్ము రక్షించు గాక.
++++++++++++++++++++++++++++++++++++++

౬౨.పీనోరః ప్రేరితాభ్రైశ్చరమఖురపుటాగ్రస్థితైః ప్రాతరద్రా
వాదీర్ఘాఙ్గైరుదన్తో హరభిరపగతానఙ్గ నిశ్శబ్ద చక్రః
ఉత్తానానూరు మూర్ధావనతి హఠభవద్విప్రతీపప్రణామః
ప్రాహ్ణే శ్రేయోవిధత్తాంసవితురన్వ్యోమవీధీంరథోవః ||
అర్థము
ప్రాతరద్రాః = ఉదయాద్రి యందు, ప్రాహ్నే = ఉదయకాలమందు, పీనోరః ప్రేరితాభ్రైః = బలిష్ఠమగు రొమ్ముతో మేఘములను చెదరగొట్టినవియు, చరమఖురపుటాగ్రస్థితైః =వెనుక కాలిడెక్కలపై నిలచినవియు, ఆదీర్ఘాంగైః =ఒడలంతయు పొడవుగా చాచినవియునగు , హరభిః = గుఱ్ఱములచేత , ఉదన్తః = ఎగురగొట్టబడినదై, అపగతానంగ నిశ్శబ్ద చక్రః = వేరొక దాని సంగము (బందు కట్టు వంటి వాని సంబంధము) లేకపోవుటచేత చప్పుడు లేని చక్రము తొలగినదై , ఉత్తానానూరుమూర్ధావనతి హఠభవద్విప్రతీప ప్రణామః = వెల్లకిల అయిన అనూరుడు హఠాత్తుగా తలవంచుటచేత వెనుకకు వంగినదియును, వ్యోమవీధౌ అవతరన్= ఆకాశవీధి యందెక్కుచున్నదియునగు , సవితుఃరథః = సూర్యుని రథము , వః = మీకు , శ్రేయః= శ్రేయస్సును , విధత్తాం = చేయుగాక.
ఈ శ్లోకార్థము కనుల గట్టుటకు తాత్పర్యము వ్రాయబడుచున్నది. సూర్యోదయము ఉదయాద్రియందు జరుగును . తరువాత బింబము క్రమముగా మీదికెక్కును. ఆ ఎక్కుటలో సూర్యుని రథాశ్వములు తమ రొమ్ములతో మబ్బులను చెదరగొట్టుచున్నవి. అట్లు చెదరగొట్టుటకు గుఱ్ఱములు నాలుగు కాళ్ళు సమముగా నుంచకముందు కాళ్ళను వంచి శరీరమును నిలువుగా నిగుడించి వెనుకకాలిడెక్కలమీదనే నిలిచినవి. నాలుగుకాళ్ళు మార్గమున సమముగా నుంచి నడచినచో రథముకూడా సమముగా నుండును. ఇప్పుడట్లు కాదు మేఘములను చెదరగొట్టుచులాగుటచేత రథమెగిరెగిరి పడుచున్నది. అప్పుడు రథచక్రము పట్టులేక పోవుటచేత చల్లగా జారుకొన్నది. ఆ సంరంభములో అనూరుడు వెల్లకిలా పడుటచేత నతని తలకూడ వెనుకకు వంగినది. ఈ హఠాత్పరిమాణం వలన ముందుకువంగి ఉండవలసిన రథము కూడా వెనుకకే వంగినది. ఇది ఒక దృశ్యభావనము.
[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[


౬౩. ధ్వాన్తౌఘ ధ్వంసదీక్షా విధి పటువహతా ప్రాక్సహస్రఙ్కరాణా
మర్యమ్ణాయోగరిష్ణుః పదమతుల ముపానీయతాధ్యాసనేన
సశ్రాన్తానాం నితాన్తం భరమివ మరుతామక్షమాణాం విసోఢుం
స్కన్ధాత్స్కన్ధం వ్రజన్వోవృజినవిజితయే భాస్వతః స్యన్దనోస్తు ||
అర్థము
యః = ఏది (రథము) , ధ్వాన్తౌఘధ్వంసదీక్షా విధిపటు= చీకటి గుంపులను ధ్వంసము చేయు దీక్షావిధి యందు సమర్థమయిన, కరాణాం సహస్రం = కిరణముల వేయింటిని, వహతా= మోయుచున్న , అర్యమ్ణా= సూర్యుని చేత , ప్రాకే= ముందుగా, అధ్యాసనేన= అధిష్ఠించుటచేత, అతులం= సాటిలేని, గరిమ్ణః పదం = బరువునకు  స్థానమును, ఉపానీయత= పొందింపబడినదో మరియు, నితాన్తం  సంశ్రాన్తానాం = అలసినవియు, భరం= బరువును , విసోఢుం = సహించుటకు, అక్షమాణాం ఇవ= చేతగానివి వలెనున్న, మరుతాం= వాయువుల యొక్క , స్కంధాత్ స్కంధం = భుజమునుండి భుజమునకు, వ్రజన్= వెళ్ళుచున్న (మారుచున్నదో) అట్టి(ఇది అధ్యాహారము), భాస్వతః స్యందనః =సూర్యుని రథము, వః = మీకు వృజినవిజితయే= పాపములను జయించుటకు, అస్తు= సమర్థమగుగాక.
తాత్పర్యము
చీకటులే చాల బరువయినవి, వానిని పోగొట్టు వేయి కిరణములు అంతకన్న బరువయినవి బరువగు కిరణములు మోయుచు సూర్యుడు రథమధిష్టించుట చేత అది మిక్కిలి బరువయినది. ఈ రథమాకాశమున పోవును. ఆకాశమున వాయు స్కంధములుండును (కొన్ని మహావాయుతరంగములు కలసి ఒక్కొక్క వాయుస్కంధము) మహాభారమున రథమును ఆ వాయుస్కంధమొక్కటియే మోయలేకపోవుట చేత రథము స్కంధమునుండి (భుజమునుండి) స్కంధమునకు మారుచున్నది. బరువు పెద్దదయినప్పుడు భుజములు మారుట సహజము.
{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{{

౬౪.యోక్త్రీ భూతాన్యుగస్యగ్రసితుమివ పురోదన్దశూకాన్దధానో
ద్వేధావ్యస్తామ్బు వాహావళి విహిత బృహత్పక్ష విక్షేపశోభః
సావిత్రః స్యన్దనోఽసౌనిరతి శయరయ ప్రీణితానూరురేనః
క్షేపీయోవో గరుత్మానివహరతు హారీచ్చావిధేయ ప్రచారః ||
అర్థము
పురః= ఎదురుగా , యుగస్య= కాడియొక్క , యోక్త్రీభూతాన్= పగ్గములుగానయిన (పగ్గములు కానివి పగ్గములుగానయిన), దందశూకాన్= సర్పములను, గ్రసితం ఇవ= మ్రింగుటకోయనునట్లు, దధానః = ధరించిన వాడును, ద్వేధావ్యస్తాంబు వాహావళి పిహిత బృహత్పక్ష విక్షేపశోభః = రెండుగా (ఇరుపక్కలకు) చిమ్మబడిన మేఘములచేత కప్పబడిన పెద్ద రెక్కలల్లార్చు శోభగలవాడును, నిరతిశయరయప్రీణితానూరుః = మిక్కిలి ఎక్కువ వేగము చేత , అనూరుని సంతోష పెట్టినవాడును (అనూరుడు గరుత్మంతునకన్నకనుక తమ్ముని వేగము చూచి అన్నకు సంతోషము) , హరీచ్ఛావిదేయప్రచారః= గుఱ్ఱముల ఇచ్చకు అధీనమగు సంచారముగల (ఇది ప్రస్తుతమగు రథము పక్షముననర్థము) (గరుత్మంతుని పక్షమున) విష్ణువుయొక్క అధీనమగు సంచారము కలవాడును అయిన , గరుత్మాన్ ఇవ= గరుత్మంతుని వలెనున్న , అసౌ = ఈ సావిత్రం స్యంసనః = సూర్యుని రథము, వః = మీయొక్క, ఏనః = పాపమును , క్షేపీయః = శీఘ్రముగా , హరతు= హరించుగాక.
తాత్పర్యము
సూర్యరథమును కవి గరుత్మంతునితో పోల్చినాడు. రథపుకాడికి రథమునకు మధ్యనున్న పగ్గములు గరుత్మంతుడు తినుటకు పట్టిన పాములవలె నున్నవి. ఆకసముననున్న మబ్బులును రథముచీల్చుకొని పోవుటచేత అవి రథపు ఇరుప్రక్కలకు వచ్చి ఆ గరుత్మంతుని రెక్కలను పోలినట్లున్నవి. హరి శబ్దమునకు గుఱ్ఱము, విష్ణువు అను అర్థములున్నవి. అందుచేత చివరి విశేషణమును శ్లేషచేత సాధించినాడు. మొదటి రెండు విశేషణములను స్వరూపమ్మునున్న సాదృశ్యమును బట్టి చేసినాడు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

౬౫. ఏకాహేనైవ దీర్ఘాంత్రిభువనపదవీం లంఘయన్యోలఘిష్టః
పృష్ఠే మేరోర్గరీయాన్దళితమణిదృషత్త్వింషి పింషంశిరాంసి
సర్వస్యైవో పరిష్టాదథచ పునరథస్తా దివాస్తాద్రి మూర్ద్ని
బ్రధ్నస్యావ్యాత్స ఏవం దురధిగమసరిస్పన్దనస్స్యన్దనో వః ||
అర్థము
యః = ఏది , దీర్ఘాం= మిక్కిలి పొడవైన, త్రిభువన పదవీం = మూడులోకముల మార్గమును , లంఘయన్= దాటుచు , లఘిష్ఠః = తేలిక అయినదో? మేరోఃపృష్ఠే = మేరుపర్వతముయొక్క వీపుపై దళితమణిదృషత్త్వింషి = మణిశిలాప్రదేశముల కాంతులను చిమ్ముచున్న, శిరాంసి= శిఖరములను, పింషన్ = పిండిచేయుచు , గరీయాన్ = బరువయినదో ? విశ్వస్య= సమస్తప్రపంచమునకు , ఉపరితిష్టాత్ ఇవ= మీదనున్నట్లున్నదో? పునరపిచ = మరియును, అస్తాద్రి మూర్ద్ని = అస్తమయ పర్వతమున , అధస్తాత్ ఇవ = క్రిందనున్నట్లున్నదో? ఏహ= ఇట్లు, దురధిగమ పద స్పందనః = ఊహింపరాని స్థితి, సంచలనము కలిగిన, సః = ఆ, బ్రధ్నస్యన్దనః =సూర్యుని రథము, వః = మిమ్ము, అవ్యాత్= రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
ఏది మిక్కిలి పొడవైన మూడులోకాల మార్గమును దాటగలిగేంత తేలికైనదో; ఏది మేరుగిరి యొక్క కాంతులు చిమ్మే మణిశిలాశిఖరములను పిండిచేయగలిగేంత బరువైనదో; ఏది సమస్త ప్రపంచానికి పైన గలదో, మరియు అస్తమయపర్వతపు క్రిందగలదో - ఇట్టి ఊహింపరాని సంచలనములు గలిగిన సూర్యుని రథము మిమ్ము రక్షించుగాక.
*******************************************************************

౬౬. ధూర్ద్వస్తాగ్ర్యగ్రహాణి ధ్వజపటప వనాన్దోలితేన్దూని దూరం
రాహౌ గ్రాసాభిలాషాదనుసరతి పునర్దత్త చక్రవ్యథాని
శ్రాన్తాశ్వశ్వాసహేలాధుత విబుధధునీనిర్ఘరామ్భాంసి భద్రం
దేయాసుర్వోదవీయోదివిదివసపతేః స్యన్దనప్రస్థితాని ||
అర్థము
ధూర్ద్వస్తాగ్ర్యగ్రహాణి= ఎదురుగానున్న కుజాది గ్రహములను ధ్వంసపఱచుచున్నవియు, దూరం = దూరముగా, ధ్వజపటపవనాందోళితేందూని = పతాక వస్త్రపుగాలిచేత చంద్రుని ఆందోళనపఱచుచున్నదియు (అట్లు చంద్రుడు కంపించు సమయమున( గ్రాసాభిలాషాత్= చంద్రుని కబళించు అభిలాషవలన, అనుసరతి = చంద్రునకు దగ్గరగా వచ్చు రాహౌపునః=  రాహువునకు దత్తచక్ర వ్యధాని= చక్రము చేత బాధకలిగించుచుచున్నవియు (చంద్రుని గ్రసింపవచ్చుసరికి రథచక్రమును చూచి విష్ణు చక్రమని రాహువు వ్యథ చెందుచున్నాడు) , (శ్రాన్తాశ్వశ్వాసహేలాధుతవిబుధధునీ నిర్ఘరాంభాంసి= డస్సినగుఱ్ఱముల నిట్టూర్పుగాలుల చేత గంగానది ప్రవాహ జలములను ఎగురగొట్టుచున్నవియునగు), దివివవీయః (ఆకసమునదూరముగా గంగాజలములను ఎగురగొట్టుచున్నవి) దివసపతిస్యందనప్రస్థితాని= సూర్యుని రథగమనములు , వః = మీకు, భద్రం= శుభమును , దేయాసు= ఇచ్చుగాక.
భావము (నాకు తెలిసి)
ఎదురుగా నున్న కుజాది గ్రహములను ధ్వంసపఱచుచూ, దూరముగా పతాకవస్త్రపు గాలిచేత చంద్రగ్రహమును కంపింపజేయుచు, చంద్రుని కబళించుటకు వచ్చిన రాహువును రథచక్రమును విష్ణుచక్రముగా భ్రమింపజేయుచూ, గంగానది జలములను డస్సినగుఱ్ఱముల నిట్టూర్పు గాలులతో ఎగురగొట్టుతూ ఉన్న రథగమనము మీకు శుభము గూర్చుగాక.
--------------------------------

౬౭.అక్షే రక్షాంనిబధ్య ప్రతిసర వలయైర్యోజయన్తోయుగాగ్రం
ధూఃస్తమ్భేదగ్ధధూపాః ప్రహిత సుమనసోగోచరే కూబరస్య
చర్చాశ్చక్రే చరన్త్యోమలయజపయసా సిద్ధవధ్వ స్త్రిసన్ధ్యం
వన్దన్తే యం ద్యుమార్గే ససుదతు దురితా న్యంశుమత్ స్యన్దనో వః
అర్థము
సిద్ధవధ్వః = సిద్ధాంగనలు , ద్యుమార్గే= ఆకాశమార్గమున , త్రిసంధ్యం = ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలయందు , అక్షే = రథచక్రపు చీలయందు, రక్షాంనిబద్ధ్య= రక్షగట్టి , యుగాగ్రం= కాడిమొదలును , ప్రతిసరవలయైః =కంకణవలయములతో, యోజయన్త్యః =చేర్చుచున్న వారయి, ధూఃస్తమ్భే= డొలుపునందు, దత్తధూపాః = ధూపములర్పించు వారయి, కూబరస్య గోచరేః = ప్రోలు దూలమునందు, ప్రణిహితసుమనసః = పుష్పములుంచువారయి, చక్రేః = చక్రమునందు , మలయజరజసా = చందనపు పొడిచేత, చర్చాం= పూతను రథత్యః = చేయుచున్నవారైః , యం= దేనిని , వందంతే= నమస్కరించుచున్నారో , సః = ఆ, అంశుమత్స్యందనః = సూర్యుని రథము, వః = మీ యొక్క, దురితాని= పాపములను, నుదతు = పోద్రోలు గాక.
ఆకాశమార్గమున సిద్ధాంగనలచే ,మూడు సంధ్యలయందు రథచక్రపు చీల యందు రక్షగట్టి కాడిమొదలును కంకణవలయములతోను, డొలుపునందు ధూపములతోను , దూలము నందు పుష్పములతోను చక్రమున చందనముతోను పూజించబడుచున్న ఆ సూర్యుని రథము మీ పాపములను పోద్రోలు గాక.
౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭
౬౮.ఉత్కీర్ణస్వర్ణరేణుదృతఖురదలితౌ పార్శయోః శశ్వదశ్వై
రశ్రాన్తభ్రాన్తచక్రక్రమనిఖిలమిలన్నేమినిమ్నాభరేణ
మేరోర్మూర్ధన్యఘంవోవిఘటయతు రవేరేకవీథీరథస్య
స్వోష్మోదక్తామ్బురిక్త ప్రకటితపులినోద్దూసరాస్వర్ధునీవ||
అర్థము
మేరోః = మేరుపర్వతముయొక్క , మూర్ధనిశిఖరమందు, ఉత్కీర్ణస్వర్ణరేణః =బంగారుధూళినివిరజిమ్మినదై, అశ్వైః = గుఱ్ఱములచేత , శశ్వత్= ఎల్లప్పుడు, పార్శయోః = ఇరుప్రక్కలను, ద్రుతఖురదళితా= వేగముగా గిట్టలచేత కొట్టబడుచున్నదై, భరేణ= భారముతో, అశ్రాన్తభ్రాన్తచక్రక్రమనిఖిలమిలన్నేమి నిమ్నా= ఎప్పుడు తిరుగుచున్న చక్రముయొక్క గమనముతో , రవేః రథస్య ఏకవీథీ= సూర్యరథముయొక్క ఒక్కటే అయిన మార్గము, స్వోష్మోరక్తామ్బురిక్త ప్రకటితపులినోద్ధూసరా= తన వేడిమి పీల్చుట చేత జలశూన్యమయి బయలుపడిన ఇసుకదిబ్బచేత తెల్లనగు, స్వర్ధనీఇవ= గంగానదివలె, వః = మీ, అఘం= పాపమును, విఘటయతు= చెదరగొట్టుగాక.
భావము (నాకు తెలిసి)
మేరుపర్వతశిఖరమున బంగారుధూళిని విరజిమ్ముతూ గుఱ్ఱములచేత వేగముగా గిట్టలచేత కొట్టబడుచున్నదై  తిరుగుచున్న చక్రపు మార్గమున వేడిమి చే పీల్చబడి జలశూన్యమయి ఇసుకదిబ్బలు బయల్పడిన గంగానది వలె మీ పాపములను చెదరగొట్టుగాక.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

౬౯.నన్తుం నాకాలయానామనిశమనుయతాంపద్ధతిః పఙ్క్తిరేవ
క్షోదో నక్షత్రరాశే రదయ రయమి లచ్చక్రపిష్టస్యధూలిః
హేషాహ్రాదోహరీణాం సురశిఖరిదరీః పూరయన్నేమినాదో
యస్యావ్యాత్తీవ్రభానోః సదివి భువి యథ్వ్యక్త చిహ్నోరథో వః ||
అర్థము
యస్యః = దేనికి, నంతుం= నమస్కరించుటకు, అనిశం = ఎల్లప్పుడు, అనుయతాం= అనుసరించి వెళ్ళుచున్న , నాకాలయానాం= దేవతలయొక్క, పంక్తిః ఏవ= పంక్తియే, పద్ధతిః =మార్గము( రథపు చాలు) , అదయరతామిల చక్రపిష్టస్య= తీవ్రమగు వేగముతోకూడిన చక్రధారతో పిండి చేయబడిన , నక్షత్రరాశేః = నక్షత్రసమూహముయొక్క, క్షోదః = చూర్ణమే, ధూళి= ధూళి(రథగమనము చేత పైకి రేగినదుమ్ము ) , సురశిఖరిదరీః =మేరుపర్వతగుహ, ధ్వని హేషానేమినాదః =గుఱ్ఱములసకిలింత మరియు రథచక్రధ్వనియును (అయినవో), సః =అట్టి, భువి యథా దివి వ్యక్తచిహ్నః = భూమిపైనకనబడినట్లు ఆకసమునకూడ తనగమనచిహ్నములు వ్యక్తమయిన , తీవ్రభానోః రథం= సూర్యుని రథము, వః = మిమ్ము, అవ్యాత్= రక్షించుగాక.
భావము
భూమిపైన రథము నడచినచో చెలరేగిన దుమ్ము చేత ఒక వరుసగా నున్న చాలు చేత చక్రధ్వనుల చేత గుఱ్ఱపు సకిలింతల చేత దాని గుర్తులు తెలియును. మరి సూర్యరథము ఆకసమున పోవును. నిజమునకు దాని గమనచిహ్నములు గోచరించునవి కావు. కాని కవిదేవతా పంక్తిని చాలుగా నక్షత్రరాశిని ధూళిగా గుహలందలి సింహగర్జనములను హయచక్రధ్వనులుగా ఉత్ప్రేక్షించెను
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
౭౦. నిష్పందీనాం విమానావలి వితతదివాం దేవబృన్దారకాణాం
బృన్దైరానన్ద సాన్ద్రో ద్యమపివహతాం విన్దతాం వన్దితుంనో
మన్దాకిన్యామమన్దః పులినభృతిమృదుర్మన్దరే మన్దిరాభే
మన్దారైర్మణ్డితారన్దధదరి దినకృత్స్యన్దనః స్తాన్ముదేవః ||
అర్థము
వందితునోవిందతాం అపి =నమస్కరించుటకవకాశము దొరకని వారైనను ఆనందసాంద్రోద్యమం = ఆనందోత్సాహముతో వహతాః = పరుగిలిడుచున్నవారై  , మరియు విమానావళి వితతదివాం = విమానసమూహములతో ఆకసమును వ్యాపించినవారై , నిష్పందీనాం= చలనములేని దేవబృందారకాణాం =దేవతలు వారిలో ముఖ్యులైన వారి యొక్క బృందైః = గుంపులచేతను మరియు పులినభృతి = ఇసుకదిబ్బలు కలిగిన మందాకిన్యాం= ఆకాశనదియగు గంగయందు, అమంద= కొంచెము మందమయినదియు (మందమైన వేగము గలది) మందిరాభే= ఇటువంటి మందరే= మందరపర్వతమందు(కూడ)మృదుః = మందమైనదియు మరియు మందారైః =దేవతావృక్షములచేత(పుష్పములచేత) మండితారి= అలంకరింపబడిన పూటీలు కలిగిన అరం= చక్రమును , దధత్ ఇవ= ధరించినట్లున్నదియు అగు దినకృత్స్యందనః= సూర్యురథము , వః = మీ, ముదే= సంతోషమునకు , స్తాత్= అగుగాక.
భావము
సూర్యుడుదయించుసరికి నమస్కరింపవలెనని కొందరు దేవతలు పరుగిలిడి వస్తున్నారు కొందరు దేవతలు విమానాల మీద వచ్చి నిశ్చలంగా ఆకాశాన్ని వ్యాపించి యున్నారు. ఈ రద్దీవలన సూర్యరథవేగం కొంతతగ్గింది. గంగానది ఇసుకలో చక్రం కూరుకొని పోవుటచేత అక్కడకూడ కొంతతగ్గినది. ఇండ్లు లేక నిర్మానుష్యంగా ఉంటే ఆచోట రథం వేగంగా పోవును. కాని మందరపర్వతం ఇంటివలె నుండుటచేతనక్కడ కొంత వేగం తగ్గినది. అదియుగాక మందరపర్వతం ముందున్న మందార వృక్షముల వలన రథగతి వేగములు కొంత అడ్డగింపబడి ఆగక పోవుటలో వాటి పుష్పములు చక్రపు ఆకులకు పూటీలకు తగులుకొని రథచక్రం పుష్పాలంకృతం అయినట్లున్నది. వృక్షమును అనోకహమందురు. అనగా బండి గమనమును అడ్డగించునది అని.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~