Loading...

22, మార్చి 2013, శుక్రవారం

మయూరుని సూర్యశతకము, అర్థము-౫

౪౧. మూర్ధ్న్యద్రేర్ధాతురాగస్తరుషు కిసలయోవిద్రుమౌఘస్సముద్రే
దిఙ్మాతఙ్గోత్తమాఙ్గేష్వభినవనిహితస్సాన్ద్రసిన్ధూరరేణుః
సీమ్నివ్యోమ్నశ్చహెమ్నస్సురశిఖరిభువోజాయతే యః ప్రకాశః
శోణీమ్నాసౌ ఖరాంశోరుషసి దిశతు వశ్శర్మశోభైకదేశః||
అర్థము
యః= ఏది, శోణిమ్నా= యెరుపుచేత, అద్రేఃమూర్ధ్ని=కొండశిఖరమున, ధాతురాగః= గైరికాది ధాతువుల యెఱుపై , తరుషు= వృక్షములయందు , కిసలయః= యెఱ్ఱని చివురాకై , సముద్రే= సముద్రమునందు , విద్రుమౌఘః= పగడముల సమూహమై, దాఙ్మాతఙ్గోత్తమాంగేషు= దిగ్గజముల కుంభస్థలములయందు, అభినవనిహితః= క్రొత్తగానుంచబడిన , సాంద్రసిందూరరేణుం= దట్టపు సిందూరపరాగమై ,వ్యోమ్నః సీమ్ని= ఆకసపుటంచున, సురశిఖరి భువః హోమ్నః ప్రకాశః= మేరు పర్వతమున బుట్టిన బంగారుకాంతియై, జాయతే= ఉదయించుచున్నదో, అసౌ = అట్టి ఈ , ఉషసిశోభైకదేశః= ప్రాతఃకాలమున శోభకు ముఖ్యస్థానమగు , ఖరాంశోః ప్రకాశః= సూర్యుని ప్రకాశము , వః= మీకు, శర్మ= సుఖమును , దిశతు= యిచ్చుగాక.
భావము (నాకు తెలిసి)
ఉదయారుణకాంతులతో ప్రకాశించే సూర్యుడే కొండశిఖరములందు గైరికాది ధాతువుల యెఱుపై,  వృక్షముల చివురాకై, సముద్రము నందు పగడముల సమూహమై, దిగ్గజముల కుంభస్థలములయందుంచబడిన సిందూర పరాగమై, మేరుపర్వతపు బంగరు కాంతియై, ప్రాతఃకాలపు ప్రకృతికే సౌందర్యమై అలరారుచున్నది. ఇట్టి సూర్యప్రకాశము మీకు సుఖమునొసగు గాక.
**************************************************
౪౨. అస్తాద్రీశోత్తమాఙ్గేశ్రితశశినితమః కాలకూటేనిపీతే
యాతి వ్యక్తిం పురస్తాదరుణకిసలయే ప్రత్యుషః పారిజాతే
ఉద్యన్త్యా రక్త పీతామ్బరవిశదతరోద్వీక్షితాతీక్ష్ణభానో
ర్లక్ష్మీర్లక్ష్మీరివాస్తు స్ఫుటకమలపుటాపాశ్రయా శ్రేయసే వః 

అవతారిక
ఈ శ్లోకమున కవి సూర్యశోభను లక్ష్మీదేవితోపోల్చినాడు. సముద్రమునుంది ఉద్భవించిన చంద్రుని ముందుగా శివుడు తలదాల్చినాడు. ముందుగా బుట్టిన కాలకూటమును మ్రింగి రూపుమాపినాడు. తరువాత కల్పవృక్షము పుట్టినది. తరువాత లక్ష్మీదేవి బుట్టినది. ఆమెను విష్ణువు అనురాగముతో చూచినాడు. ఈ విశేషములను కొన్నిటిని రూపకాలంకారముతోను ఒక దానిని శ్లేషతోను ఒక దానిని సాధారణ ధర్మముతోను కవి సాధించినాడు.
అర్థము
అస్తాద్రీశోత్తమాంగే = అస్తమయపర్వతమనెడి శివుని యొక్క శిరస్సు, శ్రితశశిని= ఆశ్రయింపబడిన చంద్రుడు కలదగుచుండగా (అనగా శిరస్సును చంద్రుడాశ్రయింపగా అని భావము. సూర్యశోభపక్షమున చంద్రుడస్తమించుచుండగా అని) , తమఃకాలకూటే= అంధకారమనెడి కాలకూటవిషము, నిపీతే = త్రాగబడగా (అంధకారము నశింపగా) అరుణకిసలయే=  యెఱ్ఱని చివురాకులు కల (సూర్యపక్షమున అరుణుడనెడి చివురాకుకల అని భావము) ఈ "అరుణ" పదము రెండు విధములుగా ఉపయోగించినది) , ప్రత్యుషః  పారిజాతే= ఉషః కాలమనెది కల్పవృక్షము , పురస్తాత్ వ్యక్తింయాతే= యెదుట గౌరవమగుచుండగా , ఉద్యంతి= ఉదయించి పైకి వచ్చుచున్నదయి, ఆ రక్త పీతాంబర విశదతరోద్వీక్షితా= అంతటను యెఱుపు రంగు పసుపురంగు కలిగిన ఆకాశము కలదయి  స్ఫుటముగా చూడబడుచున్నదయి (లక్ష్మి పక్షమున పరిపూర్ణాను రాగముగల పీతాంబరునిచేత (విష్ణువుచేత) విశదము గా చూడబడుచున్నదయి) మరియు స్ఫుటకమల పుటాపాశ్రయం= వికసించిన పద్మపుటము నాశ్రయించినదయి (యిది రెండర్థములకు సాధారణము) లక్ష్మీరివ= లక్ష్మీదేవి వలెనున్న, తీక్షభానోః లక్ష్మీః= సూర్యుని శోభ , వః= మీకు శ్రేయసే= శుభము కొఱకు , అస్తు = అగుగాక.
భావము (నాకు తెలిసి)
ఇక్కడ కవి సూర్యోదయ సమయాన్ని, క్షీరసాగరమథన సందర్భంలో లబ్ధి తో అద్భుతమైన పోలిక తెస్తున్నాడు.
క్షీరసాగర మథనము జరిగినపుడు  హాలాహలముఉద్భవించగా  దానిని శివుడు త్రాగుట, చంద్రుడు వెలువడుట, అరుణాంకురాలతో చివురించిన కల్పవృక్షము వెలువడుట, నీటినుండి పద్మము వచ్చినట్టుగా లక్ష్మీదేవి వెలువడగా విష్ణువు సానురాగంగా చూచుటను  సూర్యోదయసందర్భంలో వరుసగా- చుట్టూ ఆవరించిన చీకటిని హరించుట, చంద్రుడు పడమటి శిఖరము చేరుట (పడమటి శిఖరమనగా నిచ్చట చీకటి అను హాలాహలమును సేవించిన శివుడని, చందురుని స్థిర ఆవాసము శివుని శిరసుగాన పడమటి శిఖరమును శివునితో పోల్చుట,తూర్పున సూర్యోదయమైనపుడు చీకట్లు పడమట చేరాయన్నట్టు చెప్పటం జరిగింది.), యెఱ్ఱచివురులున్న కల్పవృక్షము యెఱ్ఱని కిరణాలు దాల్చిన బాలార్కుడు వెలువడుట, పసుపు ఎఱుపు రంగులు కల ఆకాశము లోని సూర్యుడు- పీతాంబరధరుడైన విష్ణువు లక్ష్మిని చూసినట్టుగా-వికసించిన పద్మము వైపు చూచుటతో పోల్చిన కవి అటువంటి శోభ మీకెల్లరకును శుభము కలిగించునని చెపుతున్నారు.
******************************************************
౪౩.నోదన్వాఞ్జన్మభూమిర్నతదుదరభువోబాన్ధవాః కౌస్తుభాద్యా
యశ్యాః పద్మం న పాణౌన చ నరకరి పూరః స్థలీ వాసవేశ్మ
తేజో రూపాపరైవ త్రిషుభువన తలేష్వాదధానా వ్యవస్థాం
సాశ్రీః శ్రేయాంసి దిశ్యాదశిశిరమహసోమణ్డలాగ్రోద్గతా వః||
అవతారిక
ఇంతకుముందు శ్లోకమున సూర్యకాంతి లక్ష్మీదేవి తో పోల్చబడినది. ఈ శ్లోకమున ఆమెకంటె సూర్యకాంతికి గల విలక్షణత్వమును చెప్పుచున్నాడు.
అర్థము
ఉదన్వాన్= సముద్రము , జన్మభూమి నః = పుట్టినచోటుకాదు, తదుదరభువః =  ఆ సముద్రగర్భమున పుట్టిన, కౌస్తుభాద్యాః = కౌస్తుభమణి మొదలయినవి , న బాంధవాః = బంధువులు కాదు,  మరియు , యస్యాః = సూర్యకాంతికి , పాణౌ= చేతిలో, పద్మంన= పద్మము లేదో? (మరియు) నరకరిపూరఃస్థలీ = విష్ణువు యొక్క వక్షస్థలము , వాసవేశ్శన= నివాసగృహముకాదో, సా= అట్టి తేజోరూపా =తేజోరూపమయినదియు , త్రిషు= భువనతలేషు వ్యవస్థాందధానా= మూడు ఆ లోకముల యందు నిలకడ చేసినదియు, లక్ష్మి చంచల= సూర్యతేజస్సు యందు నిలకడ కలది ఇదియే వైలక్షణ్యము) మరియు అశిశిరము ,హసః = సూర్యుని మండలాగ్రోద్గతా= మండలము నుండి వెలువడిన , పరైవశ్రీః = వేరొక శ్రీ (లక్ష్మి) , వః  = మీకు, శ్రేయాంసి = శ్రేయస్సులను , దిశ్యాత్ = ఇచ్చుగాక.
విశేషము
 శోభా సంపత్తి పద్మాసు లక్ష్మిః శ్రీరివదృశ్యతే= లక్ష్మీ శబ్దము శ్రీ శబ్దమును శోభను, సంపదను, లక్ష్మీదేవిని తెలుపును. కవి యింతకు ముందు శ్లోకమున ఈ శ్లోకమున రెండు శబ్దములను చక్కగా రెండర్థముల యందు ను చక్కగా పొందు పరిచినాడు.
భావము (నాకు తెలిసి)
లక్ష్మీ దేవి వలె సముద్రోద్భవము కాకపోయినా, కౌస్తుభము మొదలగునవి బంధువులు కాకపోయినా, చేతిలో పద్మము లేకపోయినా మూడు లోకములందు స్థిరముగా నిలిచి (లక్ష్మి వలె చంచల కాకుండా) సూర్యమండలమునుండి వెలువడు ఈ సూర్యకాంతి/ప్రకాశము అను లక్ష్మి (సంపద, శోభ అనే అర్థంలో) మీకు శ్రేయములనిచ్చుగాక అని చెపుతున్నారు.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
అశ్వవర్ణనము  

రక్షన్త్వక్షుణ్ణ హేమోపలపటలమలం లాఘవాదుత్పతన్తః
పాతఙ్గాః పఙ్గ్వవజ్ఞాజి తపవనజవా వాజినస్తే జగన్తి
యేషాం వీతాన్య చిహ్నోన్నయమపివహతాం మార్గమాఖ్యాతిమేరౌ
వుద్యన్నుద్ధామదీప్తిర్ద్యుమణిమణి శిలావేదికా జాతవేదాః ||
అర్థము
మేరౌ = మేరు పర్వతమందు , వహతాం = పరుగిడుచున్న, యేషాం= వేనికి, ఉద్యన్= పైకి ప్రసరించుచున్న, ద్యుమణి మణిశిలావేదికాజాతవేదాః = సూర్యకాంతమణుల వేదికయందున్న అగ్ని, వీతాన్యచిహ్నోన్నయమపి = దారిదప్పించుచిహ్నములు లేకపోయినను, మార్గం= దారిని, ఆఖ్యాతి = తెలుపుచున్నదో, తే = అట్టి , అక్షుణ్ణ హేమోపలపటలం = (తమగిట్టలచేత) నలుగని బంగారురాళ్ళను , అలంలాఘవాత్ = మిక్కిలి అలవోకగా, ఉత్పతన్తః = ఎగిరి దాటుచున్నవియును, పంగ్వవజ్జాజిత పవనజవాః = కుంటివాడు అని అవమానించి  వాయువును జయించిన వేగము కలదియునగు (వాయువునకు కాళ్ళు లేవు) , పాతంగాః వాజినః = సూర్యుని గుఱ్ఱములు, జగంతి= లోకములను, రక్షంతు = రక్షించుగాక, మేరువుపై సూర్యకాంతమణులున్నది సూర్యకిరణప్రాసారము చేత ఆ మణులు ప్రజ్వలించి అగ్ని వలె వాటి కాంతి పైకి ప్రసరించినది. అది సూర్యుని గుఱ్ఱములకు దారి చూపుచున్నట్లున్నదని యుత్ప్రేక్ష.
భావము (నాకు తెలిసి)
మేరుపర్వతముపై ఉండి సూర్యుని రథపు గుఱ్ఱముల కాలిగిట్టలచేత నలుగబడకుండా ఉన్న బంగారు రాళ్ళనుండి పైకి ప్రసరించుచున్న అగ్ని (దారిలో ఏ ఆటంకములు లేకపోయినా) దారిని చూపించుచుండగా అలవోకగా వాటిని దాటుతూ, కుంటివాడని అనూరుని అవమానించిన వాయువుకు అసలుకాళ్ళేలేవని , తమవేగమే ఎక్కువని చాటుతున్నట్టుగా సూర్యుని గుఱ్ఱములు ప్రయాణిస్తున్నాయి. అవి లోకాలను రక్షించగలవు.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
౪౫. ఫ్లుష్టాః పృష్ఠేంశుపాతైరతి నికట తయా దత్త దాహాతిరేకై
రేకాహాక్రాన్త కృత్స్నత్రిదివ పథపృథుశ్వాసశోషాః శ్రమేణ
తీవ్రోదన్యాస్త్వరన్తామహిత విహితయే సప్తయస్సప్తసప్తే
రభ్యాశాకాశగఙ్గా జలసరళగళావన్నతాగ్రాసనాః వః||
అర్థము
అతినికటతయా= మిక్కిలి దగ్గర యగుట చేత , పృష్ఠే= వీపునందు, దత్తదాహాతిరేకైః = మిక్కిలి వేడిమిని కలిగించుచున్న , అంశుపాతైః= కిరణములు పడుట చేతను , ఫ్లుష్టాః= తాపము పొందినవియును, ఏకాహాక్రాన్తకృత్స్న త్రిదివపథ పృథుశ్యాసశోషాః = ఒక్క పగలుననే ఆకాసము నంతయు నాక్రమించుట చేత పెద్దనిటూరుపులుకలిగి శోషించినవియును , శ్రమేణ= శ్రమచేత, తీవ్రదన్యాః = యెక్కువదప్పిక గలవియును (అందుచేతనే అభ్యాశాకాశగంగాజలసరళ గళావాన్నతాగ్రాననాః = సమీపముననున్న గంగజలమునకై గళమును ముఖమును వంచినవియునగు, సప్తసప్తేః= సూర్యునియొక్క సప్తయః = గుఱ్ఱములు, వః = మీయొక్క , అహితవిహితయే = అనిష్టములు పోగొట్టుటకు , త్వరన్తామ్ = త్వరపడుగాక.
భావము (నాకు తెలిసి)
సూర్యునికి అతి దగ్గరగా ఉండుటచేత మిక్కిలి వేడిమిని భరిస్తూ, పగటి కాలమాత్రమునందే ఆకాశమంతా ఆక్రమించిన శ్రమచేత అతి దాహమునుపొందినవై సమీపంలో ని ఆకాశగంగ జలమునకై ముఖమును వంచినట్టున్న సూర్యుని ఏడు గుఱ్ఱములు మీ అనిష్టములు పోగొట్టగలవు.
ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ
౪౬. మత్వాన్యాన్పార్శ్వతో౭శ్వాన్స్ఫటికతటదృషద్దృష్టదేహాద్రవన్తీ
వ్యస్తేహన్యస్తసన్ధ్యేయమితిమృదుపదాపద్మరాగోపలేషు
సాదృశ్యాదృశ్యమూర్తిర్మరకతకటకేక్లిష్టసుతాసుమేరోః
మూర్ధన్యావృత్తిలబ్దధృతగతిరవతు బ్రధ్నవాహావళిర్వః ||
అర్థము
సుమేరోమూర్ధని= మేరుపర్వతశిఖరమున, స్ఫటికతటదృషద్దృష్టదేహా=స్ఫటికపురాలయందు ప్రతిబింబించిన తమదేహమును చూచినదయ్యి, పార్శ్వతిః  అన్యాన్ మత్వా= తమ ప్రక్కల యందు వేరుగా నున్న గుఱ్ఱములని తలచి, ద్రవంతీ= పరుగెత్తుచున్నదియు(మరియు) , పద్మరాగోపలేషు = పద్మరాగమణి ప్రదేశములయందు (మరియు)  , వ్యస్తే అహని సన్ధ్యా ఇయం ఇతి = ప్రొద్దుగ్రుంకగా వచ్చిన సాయంకాలపు సంధ్య ఇది అని (పద్మరాగము యెఱ్ఱగా నుండుటచే సాయంసంధ్య అని గుఱ్ఱములు  భ్రమపడినవి) మృదుపదా=మెల్లగా అడుగులు వేయు చున్నవియు మరియు , మరకతకటతే= మరకత మణిప్రదేశమునందు, సాదృశ్యాదృశ్యమూర్తిః = సాదృశము చేత తన ఆకారము కనుపించనిదియు, (మరకత మణుల రంగు సూర్యుని గుఱ్ఱముల రంగు పచ్చనిదే , ఆ సామ్యము చేత వేరుగా పోల్చ శక్యము కాకున్నది , అందుచేతనే, క్లిష్టసూతా = సూర్యుని సారధి అగు అనూరుని కష్టపెట్టినదియు , ఆవృత్తి లబ్ధ ధృవగతిః = (సారధి ) మరల్చుటని కొంచెమాగినదియునగు , బ్రధ్నవాహావళీః = సూర్యుని గుఱ్ఱములసమూహము , వః = మిమ్ము , అవతారిక = రక్షించుగాక.
ఈ శ్లోకము సూర్యాశ్వముల యొక్క వేగగమనము, మందగమనము ఒక్కింత యగుట చెప్పబడినవి.
భావము (నాకుతెలిసి)
మేరుపర్వత స్ఫటికములందు ప్రతిబింబము గాంచి వేఱు గుఱ్ఱములని తలచి పోటీతో వేగంగా పరుగెడుతూ, పద్మరాగమణులున్నచోట యెఱ్ఱని కాంతులుగాంచి సంధ్యాసమయమని వేగం తగ్గిస్తూ, మరకత తటములందు ఒకే రంగు ప్రభావముతో  అనూరుని కష్టపెడుతున్న సూర్యుని గుఱ్ఱములు మిమ్ము రక్షించుగాక.
(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
౪౭. హేలాలోలంవహన్తీ విషధరదమన స్యాగ్రజేనావకృష్టా
స్వర్వాహిన్యాస్సుదూరంజనిత జవజయాస్యన్దనస్యస్యదేన
నిర్వ్యాజన్తాయమానే హరితి మని నిజేస్ఫీత ఫేనాహిత శ్రీ
రశ్రేయాంస్యశ్వపన్క్తి కిశ్శమయతుయమునేన పరాతాపనీ వః ||
అవతారిక
కవి ఈ శ్లోకమున  సూర్యుని గుఱ్ఱముల పంక్తిని యమునానదితో పోల్చినాడు. ఈ రెండింటికిని విశేషణముల చేత ఔపమ్యమును సాధించిన పద్ధతి ప్రతిపదార్థమున తెల్లమగును.
అర్థము
అశ్వపంక్తి పక్షమున హేలాలోలం వహంతీ = విలాసముగా పరుగెత్తుచున్నదియు , యమున పక్షమున ప్రవహించుచున్నదియు, అశ్వపక్షమున - విషధరదమనస్య అగ్రజేన= సర్పముల నడచిన గరుత్మంతుని అన్నయగు అనూరుని చేత, యమున పక్షమున = కాళియ సర్పము నణచిన కృష్ణుని అన్నయగు బల రాముని చేత, సుదూరం = చాల దూరము, అవకృష్టా= లాగబడినదియును, అశ్వపక్షమున - స్యందనస్యస్యదేన= తాము లాగుచున్న రథపు వేగము చేత, యమున పక్షమున , ప్రవాహ వేగము చేత , స్వర్వాహిన్యాః జనిత జవజయో= ఆకాశగంగయొక్క వేగమును జయించినదియు , నిర్వ్యాజం= శుద్ధముగా, తాయమానే  హరితమని= వృద్ధి బొందుచున్న పచ్చదనమునందు (సూర్యుని గుఱ్ఱములు రంగు హరితమే యమున రంగు హరితమే) ,నిజస్ఫీత ఫేనాహితశ్రీః = తననురుగు చేత శోభ కలిగినదియు (గుఱ్ఱములు పరుగిడునప్పుడు నురుగులు గ్రక్కును, నదికి నురుగు ఉండును) పైన రెండింటికి గల సాధారణ ధర్మములు చెప్పబడినవి. ) అట్టి అశ్వపంక్తి అది. తాపనీ = సూర్యసంబంధమయినది, తపనుడనగా సూర్యుడు యమున సూర్యుని కూతురు కనుక తాపని = అపరా యమునేవ = యింకొక యమున వలె నున్న అశ్వపంక్తిః= గుఱ్ఱముల పంక్తి, వః = మీయొక్క అశ్రేయాంసి= దురితములను , శమయతు = శమింపజేయు గాక.
 భావము (నాకు తెలిసి)
విలాసంగా ప్రవహించే యమునా నదివలె గుఱ్ఱముల పరుగును పోలుస్తున్నకవి , సర్పగర్వమడచిన గరుత్మంతుని అన్నయగు అనూరుని చే లాగబడుటను కాళీయుని మదమడచిన కృష్ణుని అన్న బలరాముని చే లాగబడిన యమునతో పోలుస్తూ,  నది పచ్చదనమును, నురగలను గుఱ్ఱముల పచ్చదనముతో , పరుగులో గుఱ్ఱాల నోట వెలువడు నురగతోను, తాపని అనగా సూర్యుని కి సంబంధించిన గుఱ్ఱాలను, సూర్యపుత్రిక అయిన యముననూ కూడా పోల్చి చూపి అట్టి గుఱ్ఱములు మీ దురితములను తొలగించు గాక అని చెపుతున్నారు.
)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
౪౮.మార్గో పాన్తే సుమేరోర్నువతి కృతనతౌనాకధామ్నాం నికాయే
వీక్ష్యవ్రీడానతానాం ప్రతి కుహరముఖం కిన్నరీణాం ముఖాని
సూతేసూయత్యపీషజ్జడగతి వహతాం కన్ధరాగ్రైర్పలదిబ్ధిన్ 
ర్వాహానాం వ్యన్యతాద్వస్సమమసమహారేర్హేషితం కల్మషాణి ||
 అర్థము
సుమేరోః= మేరు పర్వతము యొక్క మార్గో పాన్తే = మార్గపుసమీపమున, నాకధామ్నాం నికాయే =  దేవతల సమూహము , కృతనతౌ= నమస్కారము చేయుచూ , నుపతి = స్తోత్రము చేయుచుండగా, సూతే = రథసారథియగు అనూరుడు, అసూయత్యపి = కోపించుచున్నను , ప్రతికుహరముఖం = (మేరుపర్వతము యొక్క ) ప్రతి గుహాగ్రమందును, వ్రీడావతీనాం = సిగ్గుపడుచున్న, కిన్నరీణాం= కిన్నెరస్త్రీల యొక్క , ముఖాని = ముఖములను , వీక్ష్య= చూచి , పలద్భిః = వెనుకకు మరలుచున్న , కంధరాగ్రైః = మెడలచేత, ఈషజ్జడగతి = కొంచెము మందముగా , వహతాం= పరుగెత్తుచున్న అసమహారే= బేసిసంఖ్య గుఱ్ఱములు గల సూర్యుని యొక్క , వాహానాం = గుఱ్ఱములయొక్క, హోషితం= సకిలింపు , వః = మీయొక్క , కల్మషాణి= కల్మషములను, సమం = ఒకే కాలమున , వ్యన్యతాం= పోగొట్టుగాక.
భావము  (నాకు తెలిసి)
 మేరువు దేవతలకు వాసభూమి.సూర్యుడు ఉదయించునప్పుడు దేవతలు నమస్కరించి స్తుతించుచున్నారు. మేరుపర్వతగుహల మొదళ్ళలో కిన్నెరస్త్రీలున్నారు.వారి ముఖములు గుఱ్ఱపు ముఖములు. సూర్యుని గుఱ్ఱములు మగగుఱ్ఱములు. వాటిని చూచి స్త్రీ స్వభావము చేత కిన్నరీ ముఖములకు సిగ్గు కలిగినది. సూర్యుని గుఱ్ఱములు కిన్నరీ ముఖములు చూచి ఆసక్తికలిగి మెడలు వెనుకకు మరల్చి వేగమును తగ్గించినవి. సారధికి కోపము కలిగినది. అట్టి సూర్యుని గుఱ్ఱముల సకిలింతలు కల్మషధ్వంసము చేయుగాక.
-------------------------------------------------------------------
౪౯. ధున్వన్తో నీరదాళీర్నిజరుచి హరితాః పార్శ్వయోః పక్షతుల్యా

స్తాలూత్తానైః ఖలీనైః ఖచితముఖరుచశ్చ్యోతతాలోహితేన
ఉడ్డీయేవ వ్రజన్తోవియతి గతివశాదర్క వాహాః క్రియాసుః
క్షేమం హేమాద్రి హృద్యద్రుమశిఖరశిరః శ్రేణిశాఖాశుకా వః ||
అర్థము
 నిజరుచి హరితాః = తమకాంతి చేత పచ్చనయి , పార్శ్వయూః = యిరుప్రక్కల , పక్షతుల్యాః = రెక్కలతో సమానమయిన  , నీరదాళీః= మేఘపంక్తులను , ధున్వంతః = విదల్చుచున్నవియును మరియు , తాలూత్తానైః = దవడలపై వెల్లకిలబడిన , ఖలీనైః = కళ్ళెముల చేత , ఖచితముఖరుచః= కప్పబడిన ముఖకాంతి కలిగినవియు, లోహితేనయ్యాతతః = రక్తము స్రవించుచున్నవియు, జవీవశాత్= వేగము వలన , వియతి= ఆకాశమందు, ఉడ్డీయేవవ్రజంతః= యెగిరివెళ్ళుచున్నవోయనిపించు, హేమాద్రి హృద్యద్రువశిఖరశిరశ్శ్రేణిశాఖాశుకాః= మేరుపర్వతమనెడి అందమైన వృక్షముయొక్క శాఖలయందు చిలుకలయిన (చిలుకలవలెనున్న) , అర్కవాహాః=  సూర్యుని గుఱ్ఱములు , వః = మీకు, క్షేమం= క్షేమమును, క్రియానుః = చేయుగాక.
కవి ఈ శ్లోకమున సూర్యుని గుఱ్ఱములను చిలుకలతో పోల్చినాడు. సూర్యుని గుఱ్ఱములు పచ్చనివి.చిలుకలు పచ్చనివి , ఆకసమున పయనించు గుఱ్ఱముల పచ్చదనము చే ప్రక్కలనున్న మేఘములు పచ్చబడి  అది పచ్చని రెక్కలవలె నున్నవి. మేరు పర్వతశిఖరములు చెట్టుకొమ్మలవలె నున్నది. వాటిమీద పయనించు సూర్యాశ్వముల గమనము చిలుకల ఉడ్డీనం. అనగా పక్షుల గమన విశేషము. గుఱ్ఱముల నోటియందు కళ్ళెములుండుట చేత నోటి పచ్చదనము కప్పబడి వాటి ఒరిపిడి చేత రక్తము స్రవించి అవి చిలుక ముక్కువలె నున్నది. ఈ ఉపమాలంకారము  కడు రమ్యముగనున్నది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
౫౦. ప్రాతః శైలాగ్రరఙ్గే రజని జవని కాపాయ సంలక్ష్యలక్ష్మీ
ర్విక్షీవ్యాపూర్వపుష్పాఞ్జలి ముడునికరం సూత్రధారాయమాణః
యామేష్వఙ్కేష్వివాహ్నః కృతరుచిషు చతుర్ష్వేవజాతప్రతిష్ఠా
మవ్యాత్ప్రస్తావయన్వోజగదటన మహానాటికాం సూర్యసూతః ||
అర్థము
ప్రాతఃశైలాగ్రరంగే = ఉదయపర్వతముయొక్క పై భాగమనెడి రంగస్థలమందు, రజని యవని కాపాయసంలక్ష్య లక్ష్మిః = రాత్రియనెడి తెరలాగుటచేత చక్కగా కనిపించుచున్న శోభ కలవాడును , ఉడు నికరం= నక్షత్రసమూహమనెడు, అపూర్వ పుష్పాఞ్జలిం = అపూర్వమైన పుష్పాంజలిని,  నిక్షీవ్య= చల్లి, సూత్రధారాయమాణః = సూత్రధారుని వలె నున్నటువంటివాడును, అంకేష్విద= అంకముల వలె , కృతరుచిషు = రుచి పుట్టించెడి , అహ్నః చతుర్ష్వేవ యామేషు = పగటి యొక్క నాలుగు జాములయందు , లబ్ధప్రతిష్ఠాం = ప్రతిష్ఠను పొందిన, జగదటనమహానాటికాం= జగత్ మహాప్రబోధము పొంది తిరుగుట అనెడి పెద్దనాటకమును (నాటకమునకు) , ప్రస్తావయన్ = నాందీ ప్రస్తావము చేయుచున్న, సూర్యసూతః = సూర్యుని సారథి , వః = మిమ్ము ,అవ్యాత్ = రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
ఇదియును ఒక రమ్యోపమానము, ఉదయపర్వతాగ్రము నాటక రంగస్థలము. చీకటి తెర తొలగినది, నక్షత్రములే పుష్పాంజలి, నాటకరంగమున సూత్రధారుడు మొదట పుష్పాంజలి చల్లును. పగటి నాలుగు జాములయందు నాలుగంకములు సూర్యుని సారథి అను సూత్రధారుడు, జగచ్చైతన్య మహానాటకమునకు  పై విధముగా నాందీ ప్రస్తావము చేసినాడు.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++