Loading...

9, మార్చి 2013, శనివారం

మయూరుని సూర్యశతకము, అర్థము-౪

౩౧.మీలచ్చక్షుర్విజిహ్మశ్రుతి జడరసనం నిఘ్నితఘ్రాణవృత్తి
స్వవ్యాపారాక్షమత్వక్పరిముషితమనః శ్వాసమాత్రావశేషం
విస్రస్తాఙ్గంపతిత్వా స్వపదపహరతాదశ్రియంవోర్కజన్మా
కాలవ్యాళావలీఢం జగదగద ఇవోత్థాపయన్ ప్రాక్పృతాపః ||
అర్థము
కాలవ్యాళావలీఢం= కాలమను సర్పముచేత కాటువేయబడినదియు, పతిత్వా= పడి, న్వవత్= నిద్రించుచున్నదియు, మీలచ్చక్షుః = కనులు మూసినదియు, విజహ్మశ్రుతిః= వినికిడి లేని చెవులుకలదియు, జడరసనం=పలుకులేని నాల్కకలదియు, (వాసన చూచుట ఘ్రాణవృత్తి) స్వవ్యాపారాక్షమత్వక్= తన పని చేసుకొనలేని చర్మేంద్రియము కలదియు, పరిముషిత మనః= దొంగిలింపబడిన మనస్సు కలదియు, శ్వాసమాత్రావశేషం= శ్వాస మాత్రమే మిగిలియున్నదియు, విస్రస్తాంగం= అవయవములు జారిపోయినదియునయిన, జగత్= జగత్తును , అగద ఇవ= ఔషధము వలె, ఉత్థాపయన్= లేపుచున్న , అర్క జన్మాప్రాక్స్రతాపః= సూర్యుని వలన కలిగిన మొదటి వేడిమి, వః = మీయొక్క, అశ్రియం= దారిద్య్రమును , అపహరతాత్= అపహరించుగాక.
భావము (నాకుతెలిసి)
సూర్యోదయము నిస్త్రాణగా పడియున్న, నిద్రించుచున్న జగత్తును మేల్కొల్పునని కవి వివరించుచున్నాడు. కాలసర్పపుకాటుకు గురియైనట్టు నిద్రించే, కనులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము మొదలగు ఇంద్రియాలన్నీ ఉన్నప్పటికీ ఏదీ పనిచేయనట్టు కేవలం శ్వాస మాత్రమే మిగిలిన జారిన అవయవములుగల జగత్తును (అందులోని ప్రాణికోటిని) ఔషధము ఇచ్చి బాగుచేసినట్టు మేల్కొలుపు సూర్యకాంతి తొలికిరణాల వేడిమి మీ దారిద్ర్యాన్ని పోగొట్టుగాక.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%

౩౨. నిశ్శేషంనైశమమ్భః ప్రసభమపనుదన్నశ్రులేశానుకారి
స్తోకస్తోకాపనీతారుణరుచిరచిరాదస్తదోషామపఙ్గః
దాతాదృష్టిం ప్రసన్నాం త్రిభువననయనస్యాశుయుష్మద్విరుద్ధం
వధ్యాద్బ్రధ్నస్య సిద్ధాఞ్జనవిధరపరః ప్రాక్తనో౭ర్చిః ప్రచారః ||
అవతారిక
సిద్ధమైన అంజనవిధికండ్ల నీరును పోగొట్టి, యెరుపును విరిచి, నేత్రదోషములను పోగొట్టి నిర్మలమయిన చూపునిచ్చును. కవి ఈ శ్లోకమున ఉదయసూర్యకిరణప్రసారము సిద్ధాంజనముతో (కాటుకతో) పోల్చుచున్నాడు.
అశ్రులేశానుకారి= కన్నీటి బిందువులననుకరించు (కన్నీటివలెనున్న) నైశం అంభః = మంచునీటిని,నిశ్శేషం=పూర్తిగా, అపనుదన్= పోగొట్టుచున్నదియు, స్తోకస్తోకాపనీతారుణరుచిః= కొద్దికొద్దిగా పోగొట్టబడిన యెరుపుకలదియు (సూర్యకిరణములవలనారుణునికాంతి కొద్దికొద్దిగా తొలగిపోవును.)అచిరాత్= శీఘ్రకాలములో ,అస్తదోషామపంగః= పోగొట్టబడిన దోషసంబంధము కలదియు, దోషములను పోగొట్టెనని ,అనగా నిర్మలమయిన దృష్టిం= చూపును, దాతా= ఇచ్చునదియునయిన , త్రిభువననయనస్యబ్రధ్నస్యప్రాక్తనః అర్చిః= ప్రచారః=ముల్లోకములకు నేత్రమయిన , సూర్యుని ఉదయకిరణప్రసారము , అపరః సిద్ధాంజన విధిరివ= మరియొక సిద్ధాంజన విధ్యాము వలె, యుష్మద్విరుద్ధం= మీకు ప్రతికూలమైన దానిని (అశుభమును) వధ్యాత్= నశింపజేయుగాక.
భావము
ఇక్కడ కవి సూర్యకాంతిని కాటుకతో పోలుస్తున్నాడు. కన్నీటి బిందువులను తుడుస్తూ, కంటికి కొత్త దృష్టిని ప్రసాదిస్తూ, కొద్దిగా ఎరుపు కలిగి అపాంగ దోషములను హరిస్తూ వెలుగుతున్న సూర్యబింబము మీ దృష్టిలోపాలను హరించుగాక.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ
౩౩. భూత్వాజమ్భస్యభేత్తుః కకుభి పరిభవారమ్భభూ శ్శుభ్రభానో
ర్భిభ్రాణాబభ్రుభావం ప్రసభమభి నవామ్భోజజృమ్భాప్రగల్భా
భూషాభూయిష్టశోభా  త్రిభువనభవనస్యా స్య్వైభాకరీస్రా
గ్విభ్రాన్తిభ్రాజమానావిభవతు విభవోద్భూతయే సావిభావః ||
అర్థము
జంభస్యభేత్తుః = ఇంద్రుని యొక్క , కకుభి= దిక్కునందు , శుభ్రభానోః=చంద్రునకును, పరిభవారంభఃభూత్వా= పరాభవము పొందుటకు తొలిప్రదేశమయి, (సూర్యోదయమున చంద్రుడు కాంతిహీనుడగును, అదే చంద్రుని పరాభవము) , బభ్రుభావం బిభ్రాణాం= కపిలవర్ణమును భరించినదియు, ప్రసభం= హఠాత్తుగా, అభినవాంభోజజృంభాప్రగల్భా= క్రొత్త పద్మములను వికసింపజేయుటయందు నేర్పు కలదియు , అసనో = ఈ త్రిభువన భవనస్య= త్రిభువనములనెడి గృహమునకు, భూయిష్టశోభాభూషా= యెక్కువ శోభగల భూషణమయినదియు,  విభ్రాంతి భ్రాజమానా= విభ్రాంతి గొలుపునట్లు ప్రకాశించుచున్నదియు నగు , సా= ఆ, వైభాకరీయా= సూర్యుని సంబంధమగు విభాకాంతి , వః =మీకు, విభవోద్భూతయే= వైభవములు కలుగుట కొఱకు, విభవతు= సమర్థమగు గాక.
భావము (నాకుతెలిసి)
ఇంద్రుని దిక్కు(తూర్పు)నందలి చంద్రునకు పరాభవము జరిగే తొలి ప్రదేశమయి(సూర్యోదయమున చంద్రుడు కాంతిహీనుడగుట) , తామరలను వికసింపజేస్తూ, త్రిభువన గృహసముదాయమునకు ఆభరణంగా భాసిల్లే సూర్యకాంతి వైభవములను మీకు కలిగించుట లో సమర్థమగుగాక.
(((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
౩౪.సంసక్తం సిక్తమూలాదభినవ భువనోద్యాన కౌతూహలినా
యామిన్యాకన్యయేవామృత కరకలశావర్జితేనామతేన
అర్కాలోకః క్రియాద్వోముదముదయశిరశ్చక్రవాళాలవాలా
దుద్యన్బాలప్రవాళ ప్రతిమరుచిరహః పాదపప్రాక్పరోహః ||
అర్థము
అభినవ భువనోద్యాన కౌతూహలిన్యా= (సూర్యోదయము చేత) క్రొత్తప్రపంచమనెడి ఉద్యానవనమందు కుతూహలము కల, కన్యయేవ= కన్యకవలెనున్న, యామిన్యా= రాత్రిచేత, అమృత కరకలశావర్జితేన= చంద్రుడను కలశమునుండి పంపబడిన, అమృతేన= ఉదకముచేత, సంసక్తం ఎడతెఱిపి లేక , సిక్త మూలాత్= తడుపబడిన మూలము కలిగిన,  ఉదయశిరశ్చక్ర వాళాలవాలాత్= ఉదయ పర్వతము యొక్క శిఖరములమండలమనెడు పాదు నుండి ఉద్యన్= లేచుచున్నదియు, బాలప్రవాలప్రతిమరుచిః= లేత చిగురువలె  ఎఱ్ఱని కాంతి కలిగినదియునగు, అహఃపాదపప్రాక్పరోహః= పగలనెడి వృక్షమునకు మొదటి మొలక అయిన, అర్కాలోకః = సూర్యలోకము (కిరణప్రసారము), వః = మీకు, ముదం = సంతోషమును, క్రియాత్= చేయుగాక.
భావము(నాకు తెలిసి)
క్రొత్తప్రపంచమనెడి ఉద్యానవనంలో రాత్రికన్యక చంద్రరసమును (వెన్నెలనీటిని) విరామమెరుగక తడుపబడిన మూలాలనుంచి ఉదయపర్వతపు పాదులో ఎఱ్ఱని చిగుళ్ళతో కూడిన పగలనెడి వృక్షమునకు మొలక లాగా ఉన్న సూర్యలోకము మీకు సంతోషమును కలిగించు గాక.
****************************************
౩౫. భిన్నం భాసారుణస్య క్వచిదభినయా విద్రుమాణాం త్విషేవ
త్వఙ్గన్నక్షత్ర రత్నద్యుతి నికరకరాళాన్తరాళం క్వచిచ్చ
నాన్తర్నిశ్శేష కృష్ణశ్రియ ముదధిమివ ధ్వాన్తరాశిం పిబన్ స్తా
దౌర్యః పూర్వోప్యపూర్వోగ్నిరివ భవదఘప్లుష్టయేవార్కభాసః ||
అర్థము
క్వచిత్= ఒకచోట, అభినవయావిద్రుమాణాంత్విషేవ= క్రొత్త పగడములకాంతివలెనున్న, అరుణ స్వభాసా= అరుణుని కాంతితో, భిన్నం= కూడుకొన్నదియు, క్వచిత్= ఒకచోట, త్వంగన్నక్షత్రరత్నద్యుతినికరకరాళాన్తరాళం= మినుకుమినుకుమనుచున్న నక్షత్రములనెడి రత్నముల కాంతులలో విషయముగానున్న లోపలి భాగము కలదియు, (ఒకచోట) నాంతర్నిశ్శేషకృష్ణశ్రియం= నల్లని కాంతి పూర్తిగా పోక మిగిలియున్నదియునగు, ధ్వాంతరాశిం= చీకట్లగుంపును , ఉదధిమివ= సముద్రమువలె, పిబన్= త్రాగుచున్నదయి మరియు , పూర్వోపి= చాలాకాలము నుండి యున్నదై, అపూర్వః= మరియొక , జౌర్వః అగ్నిరివ=  బడబాగ్ని వలెనున్న , అర్కావబాసః = సూర్యుని ప్రకాశము, భవదఘప్లుష్టయే= మీ పాపములను శోషింపచేయుటకు, స్తాత్= సమర్థమగుగాక.

ఈ శ్లోకమునందు సూర్యతేజస్సు మరియొక బడబాగ్ని అని ఉత్ప్రేక్షింపబడినది. బడబాగ్ని సముద్రపు జలమును తాగును. ఇందు చీకటి సముద్రము; సూర్యతేజము దానిని తాగు బడబాగ్ని , చీకటి యందలి అరుణకాంతి ఆకాశనక్షత్రములు పగడములతో, రత్నములతో పోల్చబడినవి. ఇంతవరకూ సాధారణమే. ఇక చివరి విశేషణము నాంతరిశ్శేష క్రిష్ణశ్రియ అనునది. అంధకార పక్షమున పై ప్రతిపదార్థము చెప్పబడినది. సముద్రపక్షమున తనలోన శేషుడు, విష్ణువు, లక్ష్మీదేవి లేనిది కాదు అని చెప్పవలెను. అనగా సముద్రమున శేషుడు,  విష్ణువు లక్ష్మియుండిరని అర్థము. ఈ
విధముగా ఈ శబ్ద శ్లేషచేత ఈ విశేషము రెండు పక్షములకు సాధించబడినది.
భావము (పైన చెప్పబడియున్నది)
)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
౩౬.గన్ధర్వైః గద్యపద్యన్యతికరిత వచో హృద్యమాతోద్యవాద్యై
రాద్యైర్యో నారదాద్యైర్మునిభి రభినుతో వేదవేద్యైర్విభిద్య
ఆసాద్యాపద్యతేయం పునరపి జగద్యౌవనం సద్య ఉద్య
న్నుద్ధ్యోతౌ ద్యోతి తద్యౌర్ద్యతు దివస కృతోసావవద్యానివోద్య||
అర్థము
యః= యేది, వేదవేదైః ఆదైః నారదాదైః మునిభిః = వేదవేద్యులయిన నారదాది పూర్వమునుల చేతను, గంధర్వైః=గంధర్వులచేతనున్న, గద్యపద్యన్యతిరికతవచోహృద్యం= గద్యపద్యములు కలసిన వాక్కులతో మనోహరముగా ,ఆతోద్యవాద్యైః= సంగీతవాద్యములతో, విభిద్య= విడివిడిగా అభినుతః= అభినుతింపబడుచున్నదో మరియు, యం= దేనిని, ఆసాద్య= సమీపించి, జగత్= లోకము, పునరపిచ= తిరిగి, యౌవనం= యౌవనమును , అపాద్యతే= పొందుచున్నదో, అసౌ= అట్టి ఈ, ద్యోతితద్యౌః= ఆకాశమును ప్రకాశింపజేయునదియు, సద్య ఉద్యన్= అప్పటికప్పుడు ఉదయించుచున్నదియు నయిన , దివిసీకృతః ఉద్దోతః= సూర్యుని ప్రకాశము, వః = మీ యొక్క , అవద్యాని= అమంగళములను, అద్య= యిప్పుడు, ద్యతు= ఖండించుగాక.
భావము (నాకు తెలిసి)
వేదవేద్యులచేత, గానగంధర్వులచేత పద్య, గద్యరూపేణా సంగీతపరంగా అభినుతింపబడి యౌవనమునొసగెడి సూర్యప్రకాశము మీ అమంగళములన్నిటిని ఖండించుగాక.
౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
౩౭. ఆవానైశ్చన్ద్రకాన్తైశ్చ్యుత తిమిరతయా తానవాత్తారకాణా
మేణాఙ్కాలోకలోపాదుపహ తమహసామోషధీనాంలయేన
ఆరాదుత్ప్రేక్ష్యమాణాక్షణముదయతటాన్తర్హితస్యాహిమాంశో
రాభాప్రాభాతకీవోదతు నతు నితరాన్తావదావిర్భవన్తి||
అర్థము
ఆవానైః= శుష్కించిన, చంద్రకాంతైః= చంద్రకాంతమణులచేతను(సూర్యోదయమగుచుండగా చంద్రకాంతి తగ్గును.అంతకుపూర్వము చంద్రకిరణస్పర్శచేత చంద్రకాంతమణులు ద్రవించుచుండును. ఇప్పుడు చంద్రకిరణ ప్రసారస్పర్శతగ్గుటచేత సూర్యకిరణము చేతను, చంద్రకాంతమణులు శుష్కించునని భావము.) ,చ్యుతతిమిరతయా= అంధకారము జారిపోవుటచేతనయిన, తారాకాణాంతానవాత్= నక్షత్రముల కృశత్వము
వలనను, ఏణాంకాలోకలోపాత్= చంద్రుని తేజస్సు లోపించినకారణంగా , ఉపహతమహసాం= కాంతినశించిన, ఓషధీనాం లయేన= ఓషధులు అణగుటచేత,  క్షణం= క్షణకాలము, ఉత్ప్రేక్ష్యమాణా= ఊహించబడుచున్నది యును , నతునితరాంతావత్  ఆవిర్భవన్తి= అస్పష్టముగా ఆవిర్భవించుచున్నదియును అగు ,  ఉదయతటాంతర్హితస్య= ఉదయపర్వతప్రాంతమునమాటు పడియున్న , ఆహిమాంశో=  సూర్యుని యొక్క ప్రాభాతికీ ఆభా= ప్రభాతకాంతి , వః = మిమ్ము, అవతు= రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
చంద్రకాంతి నశించి, చంద్రకాంతమణులు శుష్కించి , నక్షత్రకాంతి కృశించిన కారణముతో ఓషధుల ప్రభావము అణగుటచేత ఏర్పడిన క్షణమాత్రపు కాలముననే అస్పష్టముగా ఆవిర్భవించుటకు ప్రారంభించిన ప్రభాత సూర్యకాంతి మిమ్ము రక్షించు గాక.
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
౩౮. సా నౌసానౌదయే నారుణీ తదళ పునర్యౌవనానాం వనానా
మాలీమాలీఢపూర్వాపరి హృతకుహరోపాన్తనిమ్నాతనిమ్నా
భావోభావోపశాన్తిం దిశతు దినపతేర్భాసమానా సమానా
రాజీ రాజీవరేణోస్సమసమయముదేతీవ యస్యావయస్యాః||
అర్థము
యా= ఏది , ఔదమేసానౌ= ఉదయ పర్వతపు చరియయందు, అరుణితదళాపునర్యౌవనానాం= (సూర్యోదయముచేత) ఆకులెఱ్ఱనై తిరిగి యౌవనమును పొందిన , వనానాం= వనములయొక్క, ఆలీం= పంక్తిని, ఆలీఢపూర్వా= తొలుతనాక్రమించినదో(మరియు) , తనిమ్నా= సూక్ష్మమగుటచేత,పరిహృత కుహరోపాన్తనిమ్నా= చెట్ల రంధ్రముల చెంతనున్న పల్లపు ప్రదేశమును పరిహరించినదో మరియు,యస్యాః=ఏ సూర్యకాంతికి , రాజీవరేణోఃరాజీ= తామరపూల పుప్పొడి, వయస్యా= చెలికత్తె అయి , సమానా= సమానమయి , సమసమయం= ఒకే సమయమున , ఉదేతీమ= పైకి వచ్చుచున్నట్లున్నదో, సాః= అట్టి, భాసమానా= ప్రకాశించుచున్న, దివసపతేః  భా= సూర్యుని కాంతి , వః= మీకు, అభావోపశాంతిం= దారిద్ర్యపరిహారమును , దిశతు= ఇచ్చుగాక.(దారిద్ర్యశాంతినికలుగజేయుగాక.)
ఈ శ్లోకమున మొదటిపాదమున మొదట సా నౌ-సా-న- ఔదయేన అని పదచ్ఛేదము. ఈ రెండు వ్యతిరేకార్థకములయిన నకారములను "ఆలీఢపూర్వా" అనుదానికి ముందు చేర్చవలెను. రెండు వ్యతిరేకార్థములుండుటచేత" ఆలీఢపూర్వా" అనియె అర్థము మిగులును. మరియు "సా నౌ సా నౌ" "యే వానానాం వనానాం" "మాలీమాలీధ" "నిమ్నాతనిమ్నా"" భావోభావో" "భాసమానా సమానా" "రాజీ రాజీవ" "ఉదేతీ వయస్యా వయస్యాం" అను తావుల రమ్యమయిన శాబ్దికమగు యమకాలంకారము ప్రయుక్తమయినది.
భావము (నాకు తెలిసి)
ఉదయపు కాలమందు చిగురించిన యౌవనముతో నున్న వనాళిని ఆక్రమించినట్టి, చెట్లరంధ్రములలోని పల్లములను సృశించినట్టి, తామరపూల పుప్పొడి చెలియై పైకి వచ్చు సూర్యకాంతి మీ దారిద్ర్యమును హరించుగాక.
౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧
౩౯.ఉజ్జృమ్భామ్భోరుహాణాం ప్రభవతి పయసాం యాశ్రియైనోష్ణతాయై
వుష్ణాత్యాలోకమాత్రం నతు దిశతి దృశ్యాం దృశ్యమానా విఘాతం
పూర్వాద్రేరేవ పూర్వం దివమనుచపునః పావనీ దిజ్ముఖానా
మేనాంస్యై నీ విభాసౌ నుదను నుతి పదైకాస్పదంప్రాక్తనీవః |
అర్థము
యా= యేది, ఉజ్జృంభాంభోరుహాణాం =వికసించిన పద్మములుగల , పయసాం= నీటికి , శ్రియై ప్రభవతి= కాంతిని చేకూర్చుటకు సమర్థమగుచున్నది, కానీ, నోష్ణతాయై= వేడిమిని కలిగింపదో మరియు దృశ్యమానా= చూడబడుచున్నదియై, ఆలోకమాత్రం= చూపును, పుష్ణాతి= పోషించుచున్నది కానీ, దృశాం విఘాతమ్= విఘాతము కలుగజేయుటలేదో మరియు, పూర్వం =ముందు,పూర్వాద్రేః = ఉదయాద్రిని (యిచట షష్ఠ్యంతశబ్దములకు ద్వితీయార్థము చెప్పుకొనవలెను, అనుచ= పిదప, దివం= ఆకాశమునకు, పునః= మరల , దిజ్ముఖానాం= దిక్కులను ,పావనీ= పవిత్రము చేయుచున్నదో, సా= ఆ, మతిపదై కాస్పదం= స్తోత్రవాక్యములకు స్థానమయిన(" ఆస్పదం"అనునది "విభా" అను పదమునకు విశేషణమయినను నిత్యనపుంసకమగుట చేత స్త్రీ ప్రత్యయము రాదు, ప్రాక్తనీ= ఉదయకాలసంబంధమయిన, ఐనీ,విభా=సూర్యునికాంతి, వః= మీయొక్క , ఏనాంసి= పాపములను , నుదతు= పోద్రోలుగాక.
భావము (నాకు తెలిసి)
ఏ ఉదయకాంతి అయితే వికసించిన పద్మములతో నున్న నీటికి కాంతిని తప్ప వేడినివ్వదో,ఏ ఉదయకాంతి అయితే  చూపులకు పోషణ (సహకారం) తప్ప హాని చేయదో ,ఏ ఉదయకాంతి అయితే  దిక్కులను పవిత్రం చేయుచున్నదో ఆ స్తవనీయమైన ఉదయకాంతి మీ పాపములను పారద్రోలు గాక.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
౪౦. వాచాం వాచస్పతే రప్యచలభిదుచితాచార్యకాణాం ప్రపఞ్చై
ర్వైరఞ్చనాన్తథోచ్చారిత చతుర ఋచాంచాననానాంచతుర్ణామ్
ఉచ్యేతార్చాసువాచ్యచ్యుతిశుచిచరితంయస్యనోచ్చైర్వివిచ్య
ప్రాచ్యం వర్చశ్చకాసచ్చిరముపచినుతాత్తస్యచణ్డార్చిషోవః ||
అర్థము
అచలభిదుచితాచార్యకాణాం= ఇంద్రునకాచార్యత్వము చేయుటకుచితములయిన, వాచస్పతేః వాచాం= బృహస్పతివాక్యముల యొక్క , ప్రపంచైః= విస్తారములచేతను మరియు, తథా= అదే విధముగా, ఉచ్చారితరుచిమదృచాం= దీప్తికల ఋక్కులను ఉచ్చరించెడి, వైరించానాం చతుర్ణానాం ఆవనానాం=బ్రహ్మవైన నాలుగు ముఖములయొక్క (వాచాం ప్రపంచైః= వాక్యవిస్తారముల చేతను ఇది మొదటిదే యిచ్చట ఆక్షిప్తమగును.), యస్య = ఏ సూర్యుని యొక్క, వాచ్యచ్యుతి శుచిచరితం= దోషములేక పరిశుద్ధమగు చరిత్రము కలిగినదయి, అర్చాసు= పూజాసమయములందు , నోచ్యేత=పెద్దగా వివేచింప చెప్పబడదో, అనగా చెప్పుటకు సాధ్యము కాని మహిమ కలదని,  తస్య చండార్చిషః= అట్టి సూర్యుని యొక్క, చకాసత్= ప్రాచ్యం వర్చః= ప్రకాశించుచున్న, ఉదయవర్చస్సు,  వః = మిమ్ము, చిరం= చిరకాలము, ఉపచినుతాత్= వృద్ధి పొందించుగాక.
భావము (నాకు తెలిసి)
ఇంద్రునికే ఆచార్యత్వం గఱిపే బృహస్పతి విస్తృతవాక్కుల చేత, బ్రహ్మ నాలుగు ముఖాల చేత ఏ సూర్య చరిత్ర ఐతే స్తుతింపబడదగినదో, మరియు స్తుతించుటకు సాధ్యము గాని మహత్తు గలిగినదో అట్టి సూర్యప్రకాశము మిమ్ము ఎల్లప్పుడూ వృద్ధి చేయు గాక.