Loading...

8, ఆగస్టు 2012, బుధవారం

శివవిష్ణు తత్త్వం

పోతన అమితమైన భక్తిభావముతో వ్రాసిన భాగవతములో దశమస్కంధములో చిన్నికృష్ణుడు పెరిగి పెద్దవుతూ ఉన్నప్పుడు ఆటపాటల గురించి, లీలా విలాసాల గురించి చదివేటపుడు మైమఱిచిపోతాము.

            అందులో కూడా శివవిష్ణు తత్త్వం ఒక్కటే, శివునికీ , తనకూ అభేదమన్న మాట చిన్ని కృష్ణుడు ఆయనకు నయనానందకరంగా దర్శనమిచ్చి ఈ విధంగా తెలియజేశారన్న విషయం ఎంత అందంగా ఆయన చెప్పారు
అంటే ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతితో ద్వాపర యుగానికి వెళ్ళిపోయి మనకు వ్యాఖ్యానం చెపుతున్న రీతిలో ఆనందపరవశులను చేస్తూ మనలను ఆలోకాలకు తీసికొని వెళ్ళిపోయే రీతిలో కన్నులకు కట్టినట్టుగా వర్ణించారు.

            ఆ అద్భుతమైన పద్యం, కరుణశ్రీ గారి సంపాదకత్వ బాధ్యతలో, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మనకందించిన తాత్పర్యం చదివి తరిద్దాం.

సీసపద్యము:
తనువున నంటిన ధరణీ పరాగంబు
   పూసిన నెఱిభూతి పూఁత గాఁగ
ముందఱ వెలుఁగొందు ముక్తాలలామంబు
    తొగలసంగడికాని తునుక గాఁగ
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు
    కాముని గెల్చిన కన్ను గాఁగఁ
గంఠమాలికలోని ఘననీలరత్నంబు
   కమనీయ మగు మెడకప్పుగాఁగఁగ

ఆటవెలది:
హారవల్లులురగహారవల్లు గాఁగ
బాలలీలఁబ్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెల్ప వెలయునట్లు.

భావము:
ఆటపాటల సమయాలలో బాలకృష్ణుఁడు పరమశివునివలె కనిపించేవాడు. వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పూతవలె కనిపించేది.
ఉంగరాల జుట్టును పైకి ముడిచి ముత్యాలపేరుతో ముడివేసింది యశోదమ్మ. అది శివుని తలపై ఉండే చంద్రవంకలాగా కనపడుతున్నది.
నుదుట నిలువుగా పెట్టిన ఎఱ్ఱని తిలకం మన్మథుని గెలిచిని శివుని ఫాల నేత్రంలాగా కనబడసాగింది.
మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద నీలమణి, శివుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలాగా కనపడుతున్నది.
మెడలోని ముత్యాలహారాలు శివుని మెడలో సర్పహారాలుగా కనపడుతున్నాయి.
ఎదగకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో ఈ విధంగా లీలలు చూపాడు. శివుడూ, తానూ ఒకటేసుమా అని హెచ్చరిస్తున్నాడా అన్నట్లు చిన్నికృష్ణుడు శివుని వలె కనిపించాడు.

4 కామెంట్‌లు:

  1. శివాయ విష్ణురూపాయ.. ఎంత బాగా చెప్పారండి. ! చాలా బాగుంది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. అంత బాగా చెప్పారండి మఱి. అందుకే ఇన్నేండ్లయినా ఇలా మెప్పులు లభిస్తున్నాయి.
    ధన్యవాదాలు వనజా వనమాలి గారు.

    రిప్లయితొలగించండి
  3. శివకేశవుల అభేదాన్ని ఎంత చక్కగా చెప్పారో?
    మా అమ్మమ్మగారు, తాత గారు మహాభాగవతాన్ని
    నాకు ధారపోసారు...
    మీరు మరొకసారి ఈ పద్యాన్ని గుర్తు చేసారు...
    దశమస్కంధం లోని పూర్వభాగం...
    రుక్మిణీ కళ్యాణందాకా కృష్ణుని బాల్య చేష్టలు...
    అన్నీ పోతనగారు ఆశక్తితో చదివించేలా తెనిగీకరించారు...
    ఈ రోజు ఆయనను తలచుకోవడం మన సుకృతం...
    మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు
    అభినందనలు లక్ష్మి గారూ!
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గారు,
    ఓహ్! అయితే మీరింత చక్కగా ఆ రాగబంధాన్ని అర్థం చేసుకోవడానికి పునాది చిన్నప్పుడే పడిందనమాట.
    అదృష్టవంతులు మీరు.
    ధన్యవాదాలండి, మీ ఆత్మీయస్పందనకు. మీ ఆత్మీయుల పరిచయం మాకు కలిగించినందుకు.

    రిప్లయితొలగించండి