Loading...

9, జూన్ 2012, శనివారం

ఎందుకు దొరకదు?


  పుట్టినరోజులు, పెళ్ళి, పెళ్ళిరోజులు, ఏమైనా సాధించిన రోజు, చిరకాలం తర్వాత కలిసిన రోజులు, గౌరవభావంతో, ప్రేమతో, చనువుతో, సంతోషంతో ఇలా ఎన్నో రకాలుగా మనం ఒకరికొకరం కానుకలు, బహుమానములని ఇచ్చుకుంటూ, పుచ్చుకుంటూ ఉంటాం.

           గంటలో వాడిపోయే పువ్వులనుంచి, ఎప్పటికీ మిగిలిపోయే ఆస్తుల వరకూ కానుకల్లో ఉంటాయి.ఇవన్నీ ఎందుకు? అవి నశించినా, నశించకపోయినా వాటితో మనకు నిమిత్తం లేదు. వాటిని ఇచ్చినవారిని ప్రేమగా, గౌరవంతో తలచుకోవటానికే మన ప్రాధాన్యత. ఔనా, కాదా?

          ఆ యా వస్తువులతో మనకు అనుబంధం తాత్కాలికం. ఆ ఇచ్చిన వారికి , తీసుకున్న వారికి మధ్య ఉన్న అనుబంధం కలకాలం పచ్చగా ఉండటానికి అవి ఉపయోగ పడతాయి. ఇవి వస్తువులు గానే ఉంటాయనీ అనుకోలేము. నవ్వులు, పలకరింపులు, కుశలప్రశ్నలు, ఉత్తరప్రత్యుత్తరాలు కూడా ఈ అనుబంధాన్ని నిలపటానికీ, పటిష్ఠ పఱచటానికే. ఈ విషయంలో ఎవరికీ భేదాభిప్రాయము ఉండదు.

                ఇప్పుడు మనం అవతలి వారినుంచి అందుకున్న కానుక ఏదైనా సరే ఆ వ్యక్తిని గుర్తుంచుకొని మనం వారిపట్ల అభిమానం తో ఉన్నట్టే, మనం పుట్టినప్పటినుంచీ చనిపోయిన తర్వాత కూడా మనకు సహకరించే ప్రకృతిని, ప్రతిదీ అందించే పరమాత్ముని పట్ల మనం ఎంత మాత్రం అభిమానంగా, విశ్వాసపాత్రత తో ఉంటున్నాము అనే ప్రశ్న నా మనసుని తొలుస్తూ ఉంటుంది.
                ఆ పరబ్రహ్మ నామ స్మరణ మాత్రం తోనే మనము కృతజ్ఞత ప్రకటించవచ్చే...ఒక్క నమస్కారంతో ఆయనికి ధన్యవాదాలు మనము తెలుపవచ్చే...ఎందుకు మనము ఆసక్తి ని చూపము? మనకు జీవితంలో ఎంత అదృష్టం ఉన్నా , ఎన్ని సౌకర్యాలు ఉన్నా అన్నీ ఆ దైవస్వరూపం యొక్క కృపాకటాక్షమే అని పరిపూర్ణంగా నమ్మే మనము ఆ దేవదేవునితో అనుబంధం ఎందుకు పెంచుకోవటంలేదు?

                     కొంతసేపైనా దైవధ్యానం లో మనసుని ఎందుకు లగ్నం చేయడం లేదు? పొద్దున్న నుంచీ రాత్రి వరకూ ఎన్నో విషయాల్లో పాలు పంచుకోవటానికి మనకు దొరికే సమయం దైవపూజకు ఎందుకు దొరకదు? ఆ విధమైన పూజల్లో దైవంతో సంభాషించే అవకాశాన్ని మనం ఎందుకు విడిచి పెట్టుకుంటున్నాము? పరస్పరం మాటలు జరుగవనా? అలా అయితే మన ఇంట్లో బోసినవ్వుల పాపలతో, మాటలు రాని మూగలతో మనం ఏమీ చెప్పమా? ఆ దైవం మనకెన్నో విధాలుగా అన్నివిధాలు గా మనకు అండదండగా ఉంటుందని నమ్మే మనము ఆ దైవంతో కొంతసేపు ఎందుకు గడపము?

                                ఒక విపత్తు వచ్చినపుడు వెంటనే కాపాడమంటూ చిట్టచివరకు మనము వేడుకునేది ఎవరిని? స్వామీ, నీవే దిక్కు, అమ్మా , నీవే కాపాడాలి అంటూ మొఱ పెట్టుకునేది ఎవరికి? ఆ పరబ్రహ్మానికేగా. ఇన్ని తెలిసి ఉండీ నిర్లక్ష్యము తగదు. ప్రతిరోజూ దైవపూజలకు, భజనలకు, నామస్మరణకు ఎంతో కొంత సమయాన్ని కేటాయించి తీరాలి. అపుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే ఏదో అపరాధ భావన ....ఇందులోంచి బయటపడాలి.

దేవా! నాకు సంకల్పబలము ప్రసాదించు. అనుకున్నది చేయటానికి శక్తిని, మనోదార్ఢ్యాన్ని ఇయ్యి.

15 కామెంట్‌లు:

  1. చాలామంది యదార్ధస్థితికి దర్పణం ఈ టపా. చక్కటి యదార్ధఅంశమును ప్రస్తావించారు. స్ఫూర్తిదాయకమైన ఈ టపాను అందరూ చదివి ఆచరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పింది నిజం లక్షీదేవి గారు.. దైవ ప్రార్దనలకు తప్పకుండా సమయం కేటాయించాల్సిందే నండీ....
    మంచి పోస్టు.. ధ్యాంక్యూ

    రిప్లయితొలగించండి
  3. భారతి గారు,
    సంతోషమండి. ముందు నేను ఎంతమటుకు ఆచరిస్తున్నాననేది గమనించుకోవాలనే వ్రాసుకున్నానండి.
    ధన్యవాదమ్ములు మీ స్పందనకు.

    రిప్లయితొలగించండి
  4. సాయి గారు,
    ధన్యవాదాలండి. కానీ ఆచరణలో కొంచెం కష్టమనుకోకూడదు కదా!

    రిప్లయితొలగించండి
  5. అన్నీ బాగున్నపుడు గుర్తురాడండీ! విష్ణుమాయ!!!

    రిప్లయితొలగించండి
  6. శర్మ గారు,
    సరిగ్గా చెప్పారు. అన్నీ బాగున్నపుడు గుర్తు రాకపోడమే సహజంగా జరిగేది. అందుకే ఈ తలపులు.
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి