Loading...

9, ఏప్రిల్ 2012, సోమవారం

జగమే మాయ......


జగమే మాయ అనే పాట నాకు చాలా నచ్చింది. మొత్తం ప్రవచనాల సారం అంతా నాలుగు ముక్కల్లో చెప్పారు సముద్రాల గారు.

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా

 కలిమిలేములు కష్టసుఖాలు
కావడికుండలనే భయమేలోయీ
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయీ ఈ వింతేనోయీ

కావడి అని భుజంమీద ఒక కర్రను పెట్టుకొని దానికి పెద్ద తాడు కట్టి తక్కెడ మాదిరి ముందు వెనక కుండలు పెట్టుకొని నీళ్ళు మోస్తుంటారు. నీళ్ళు ఖాళీ అయి తేలిక కావటం, మళ్ళీ నీళ్ళు నింపుకుని బరువు మోయటం మారి మారి వచ్చినట్టు కష్టము, సుఖము, కలిమి, లేమి వచ్చి పోతుంటాయి. వాటి గురించి దిగులు చెందకు.
కంటికి కనిపించేదంతా భ్రమ. కావడి రూపంలో ఉన్నా మరే రూపంలో ఉన్నా అదొక చెక్క , కుండల రూపంలో ఉన్నా పగిలినా అది మన్ను తప్ప ఇంకేం కాదు. చెరువులో నీళ్ళు దోసిట్లో తీసుకున్నా అవీ ఇవీ కూడా నీళ్ళే కదా అలాగే జగత్తులో మనకు లభించేదంతా పరమాత్మ పెట్టిన భిక్ష. సుఖము, దుఃఖము అన్నిటినీ స్వీకరించు. అని అర్థము.

ఆశామోహముల దరిరానీకోయీ
అన్యులకు నీ సుఖము అంకితమోయీ
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఈ ఎరుకే నిశ్చలానందమోయ్
బ్రహ్మానందమోయ్

ఇది కావాలని, నాతోనే ఉండాలని ఆశలు, మోహాలు వదలిపెట్టు. ఎందుకంటే ఉండేది ఉంటుంది. పోయేది పోతుంది. ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం కాకపోవటమే ప్రకృతి సహజం. పంటభూమి బీడుగా మారటం, బీడు భూమి భవనంగా మారటం, భవనం కుప్పలా కూలిపోవటం. ఇలా మార్పు అనేది సహజం దీనిని స్వీకరించాలంటే మోహము వదలుకోవాలి.
పరులకొరకు జీవించాలి.
ఉద్యోగం చేసేటప్పుడు చాలా మటుకు సంస్థ లాభనష్టాలతో ఉద్వేగం చెందకుండా, మన జీతం మనకు వస్తుందా లేదా అని చూసుకున్నట్టే పరుల కొరకు ఉపయోగపడే పనులే చేస్తుంటే మోహం దరిజేరదు. విజయం వచ్చినా రాకపోయినా డిప్రెషన్ కు లోను కాకుండా మరలా పని చేస్తుంటాం. మనది అయితే అలా చేయలేం. కాబట్టి ఏదైనా నాకు, నాది అనుకోకుండా చేయగలగాలి.
బాధ , సౌఖ్యము అన్నిటినీ ఒకేలా స్వీకరించగలగాలి. ఎంత బాధ అయినా, ఎంత సంతోషం అయినా కాలం గడిచే కొద్దీ అది ఒక జ్ఞాపకం గా మిగులుతుందే తప్ప ఇంకేమీ కాదు. తండ్రి పోయిన దుఃఖమైనా, స్కూల్ ఫస్ట్ వచ్చిన సంతోషమైనా కొన్నాళ్ళకు అది ఒక జ్ఞాపకం. అంతే. ఇంకేమీ కాదు.ఇది తెలుసుకోవటమే ముక్తి, బ్రహ్మానందం. తెలుసుకోవటం అంటే ఈ పదాలకు అర్థం తెలియటమో, ఇలా వ్రాయగలగటమో కాదు. ఇది ఫీల్ కాగలగాలి. ఆ భావన చేయగలగాలి అని అర్థం.
పాట ఇక్కడ వినండి.

http://mp3skull.com/mp3/jagame_maya.html

6 కామెంట్‌లు:

  1. జీవిత సత్యాన్ని తెలియజెప్పే మంచి పాటను చక్కటి వివరణతో అందించినందుకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  2. మంచి విశ్లేషణ. మీ బ్లాగు నా సైన్సు బ్లాగు డిజైన్ కలిగి వుంది.

    రిప్లయితొలగించండి
  3. రవిశేఖర్ గారు,
    ధన్యవాదాలండి.
    ఓహ్! మీ సైన్స్ బ్లాగ్ ని నేను చూడలేదే, మీరు కవితలు వ్రాస్తారు కదా, ఆ బ్లాగ్ చూశాను, నాకు నచ్చాయి కూడా.

    రిప్లయితొలగించండి