Loading...

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

పదాలతో సదాశివుని పదార్చన







దేవరా! నను గావుమయ్య సతీమనోహర!శంకరా!
దీవనల్ గొన కాచియుంటిమి తృప్తిమాకది నిచ్చు, మా
భావనా జగమంత నిండిన వాడివై కనిపించరా!
నీవె నాకిక దిక్కు,నేరమునెంచకో పరమేశ్వరా!        (మత్తకోకిల)


నటనలొప్పెడి నాట్యశాస్త్రమునందునొజ్జవు నీశ్వరా!
జటలధారివి సుందరమ్మున సాటిగా మరి లేరురా!
భటులపై కరుణారసమ్ము నపారసంద్రము పోలురా!
జటిలమైన భవాబ్ధి పారణ సాగ నీదయ నిమ్మురా!         (తరలము)


మహేశ్వరుండవై, శుభమ్ముమాకు చేయబూనుమా!
సహాయమున్ దయాళువై ప్రసాదమిమ్ము,కోరితిన్
మహానుభావులెందరో హిమాంశుధారునెప్పుడున్
మహామహుండుగా నివాళి మానకుండజేతురే!          (పంచచామరము)


గౌరీనాథుని మనమున
నారాధింపగ నవిద్య నజ్ఞానములున్
చేరక నిర్మలమగునట,
ఆరాటమ్ములు తొలగునటంచును చెపుమా!               (కందము)


నినుగని పొంగిపోవగ ననేకములైన మనోవికారముల్
ననువిడిపోవు నిక్కముగ, నాకములన్నియు నన్నుచేరునే!
మనమిక వెండికొండయగు, మాటయె మంత్రము కాకయుండునా
వినుమొక మాఱు నాదు మొఱ, వేడితి నీకడ నాదిదేవరా!                        


 (చంపకమాల)


ఇంటికి నీవె దైవమయి యెప్పుడు బ్రోచుచు నుండువానివే!
కంటికి రెప్పవై మముల కాచెడు జంగమవీవు దేవరా!
మంటను కంటిలో గలిగి మన్మథ మాయను గెల్చువానిగా
బంటుల తోడునీడవయి భక్తిని పెంచుము రక్తి వీడగన్.                                


 (ఉత్పలమాల)


మాయామర్మమెఱుంగమయ్యనభవా! మమ్మేల రావేలనో
కాయమ్మందున లావు తగ్గెనిక నాకై జాలి చూపించవో! 
న్యాయమ్మీ భువి లేదులేదు, నరులన్యాయంబునే నమ్మిరే!
చేయూతమ్మిడి,భక్తిభావములనే చిత్తమ్ములో నింపుమా!                        


 (శార్దూలము)


నరుడా పొద్దున కొట్టబోయినను బాణాలిచ్చి దీవించవే! (దీవించలేదా అని భావము)
కరువా ముద్దకు నన్నపూర్ణ మగడా! గైకొంటి యెంగిళ్ళనున్,
వరముల్ కోరుచు నిన్ను వేడగనె పాపాలెంచబోవందురే!
గురువే నీవని నమ్మియుంటినిను; నే కోరంగ లేదందువా! (లేదనవు అని భావము)  


 (మత్తేభము)





(ఆష్టమూర్తితత్వమైన ఆదిదేవునికి అష్టపదార్చన.


చివరి ఐదు శ ష స హ(నిషిద్ధాక్షరిలో) లేకుండా శివపూజ
శంకరాభరణం బ్లాగులో నా సమాధానాలు.)

---లక్ష్మీదేవి


4 కామెంట్‌లు:

  1. ఓం నమః శివాయ.
    శివర్రాత్రి శుభాకాంక్షలండి.

    రిప్లయితొలగించండి
  2. శివ విశ్వరూపం - మీ కవితా విశ్వరూపం కూడా. శుభం. మీ రచనల్లో ఈ కోణం (పద్య రచన) కూడా ఉన్నదని తెలిసి చాలా సంతోషం. ఇంతకు మునుపు చూసిన గుర్తు లేదు.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలండీ,చాలా సంతోషం కలిగినది.

    నిజమే.
    నా బ్లాగుల్లో తక్కువే పద్య రచనలు.
    ఎప్పుడైనా థీమ్ తీసుకుని వ్రాస్తాను.
    దీపావళి అప్పుడు మూడు వ్రాశాను. ఇదిగోండి లంకె.

    http://paarijatam.blogspot.in/2011/10/blog-post_25.html

    రిప్లయితొలగించండి