Loading...

7, జనవరి 2012, శనివారం

తెలిసినా "తెలుసు" కోలేక.......


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్ 
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే దప్ప యితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

            గజేంద్రమోక్షం అనే ఘట్టం భాగవతం లో పరమ పావనమైనది. అందునా మహానుభావులు, పూజ్యులు శ్రీ పోతన గారు తెనిగించిన విధానం ప్రత్యక్ష ప్రసారం వింటూ మనం ఊహల్లో దృశ్యాలన్నిటినీ చూస్తున్నట్టుగా ఉంటుంది. భాగవత పద్యాలన్నీ తేనెలు చిందే మాధుర్యంతో పోతనగారు వ్రాశారు. అంతటి మహా భక్తులు వ్రాసిన పద్యాలను మన గురువు గారు పూజనీయులు, ప్రాతఃస్మరణీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలలో వింటే జన్మ ధన్యమౌతుంది. ప్రవచనాల్లో విన్నాక గజేంద్రమోక్షంలోని ముఖ్యమైన పద్యాలను నేను రోజూ మననం చేసుకుంటూ ఉంటాను.పెద్దల సలహా మేరకు మిత్రులందరితో ఈ విషయం పంచుకోవటానికి సంతోషిస్తున్నాను.

       ముఖ్యంగా మనకు తెలియవలసిందేమిటంటే భగవద్గీత, భాగవతాది పుణ్యగ్రంథాలు చదివేటపుడు " ఆఁ ఇప్పట్నించీ ఎందుకు? ముసలివాళ్ళయ్యాక చదువు/ చదువుతాను" అనే మాటలు తప్పు అని తెలియటం.

       ఇప్పుడే మనం చదవలేకపోతున్నామంటే ఇంక ముసలితనము వచ్చాక ఎన్ని దేహ బాధలో ! కాసేపు కూర్చోలేము, కళ్ళు  పెద్ద అక్షరాలైతేనే చదవగలవు, చదవగానే అర్థం చేసుకునే మెదడు వేగం తగ్గిపోతుంది,
    ఎవరితోనైనా చదివించుకుందామంటే అందరూ బిజీ, చెవులు వినబడవు ఇంకా ఎన్నో ఉంటాయని విన్నాము. అనుభవానికొస్తే ఇంకా ఎన్ని తెలుస్తాయో!


     చిన్నప్పటి నుంచీ నేర్చుకుంటే ఈత వస్తుంది కానీ, ప్రాణాపాయం వచ్చినపుడు ఈత వచ్చేస్తుందా?
ఇప్పుడు సమాజంలో కొందరు పుణ్యాత్ములు తప్ప అందరం లౌకిక కార్యక్రమాల్లో అంటే ప్రాపంచిక కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటాం. అలాగే ఒక ఏనుగు వనవిహారం, జలవిహారం ఇష్టానుసారంగా చేస్తూ, ఒక కొలను లో ఉండగా ఒక మొసలి పట్టుకుంటుంది. విడిపించుకోవటానికి వెయ్యి సంవత్సరాలు పోరాడి ఇక చాతకాదని తెలిశాక ఏనుగు సర్వేశ్వరుని ప్రార్థిస్తుంది. ఎంత భక్తి తో శరణాగతి చేసి ప్రార్థిస్తుందో పై పద్యంలో చూడండి.

       బలము కొద్దిగానైనా లేదు, మనోధైర్యము  దెబ్బతిన్నది , ఎప్పుడు పడిపోతానో తెలియదు, శరీరం అలసిపోయింది, కుప్పకూలటానికి సిద్ధంగా ఉన్నది, నీవు తప్ప నన్ను రక్షించేవారెవరయ్యా అని ఆర్తితో ప్రార్థిస్తున్నది.

       (సహస్రము)వెయ్యి అనగా అనంతము. అలాగే జీవుడు అనంతమైన కాలవాహినిలో జనన మరణాలనే సుడిగుండంలో పడి తిరుగుతూనే ఉంటాడు. అంటే ఇప్పటికి మనము ఎన్ని జన్మలెత్తామో, ఎన్ని సార్లు మరణించామో, ఇంకా ఎన్ని సార్లు జన్మిస్తామో కానీ ఇక్కడి మంచిచెడులను గుర్తించగలుగుతున్నామా ? లేదు. ఏ వస్తువు/ విషయం/ ప్రాణి ఆనందాన్ని కలిగిస్తున్నాయో వాటి వల్లనే ఒక్కో సమయంలో దుఃఖాన్నీ పొందుతున్నాము. ఇక్కడ కనిపించేదేదీ శాశ్వతం కాదనీ ఆనందం, దు:ఖం వచ్చి వెళ్తూనే ఉంటాయనీ తెలిసినా "తెలుసు" కోలేక చిక్కుకుపోతూనే ఉన్నాం.

       ఈ జీవి పైన పద్యంలో చెప్పిన విధం గా అలసిపోయాడు, శాశ్వతమైన స్థితి అయిన పరమేశ్వర సాయుజ్యాన్ని అన్ని భావాలకూ అతీతమైన పరమపదాన్ని చేరుటకు నీవే వచ్చి నన్ను తీసుకెళ్ళవయ్యా, నేను నిమిత్తమాత్రుడినని జీవుడు దేవుడికి చెప్పుకున్న మాటలుగా తీసుకోవచ్చు. కాబట్టి నాకత్యంత ఇష్టమైన పద్యమిది.

     పాఠంలో ఏమైనా తప్పులుంటే మన్నించి సూచించగలరు.అర్థ తాత్పర్యాలు ఇప్పుడు ఎన్నో చోట్ల పుస్తకాలలో లభిస్తున్నాయి కనుక భావం (నేను అర్థం చేసుకోగలిగినంత వరకూ) వ్రాశాను. 

4 కామెంట్‌లు:

  1. చాలా బాగా చెప్పారండి. నిజమే, ఏదైనా చిన్నప్పటినుంచే నేర్చుకోవాలి. పటుత్వం తగ్గి పోయే నాటికి బలం సంపాదించుకునే శక్తి వస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. జయ గారు,
    నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారు, చాలా చక్కటి వివరణ. మీరన్నట్లు గజేంద్రుడులా జీవుడు సంపూర్ణ శరణాగతితో వేడుకుంటే ఆ పరమాత్ముడే పరమపదంకు చేర్చుతాడు. ఇంతకాలం మీ బ్లాగ్ని చూడలేనందుకు ఒకింత బాధకల్గిన ఈ రోజైన రామానుగ్రహంతో మంచి బ్లాగ్ని చూసే ప్రాప్తంకల్గినందుకు ఆనందంగా వుందండి.

    రిప్లయితొలగించండి
  4. భారతి గారు,
    చాలా సంతోషమండి. మీ వ్రాతలు మరింత పరిపూర్ణతతో ఉన్నట్టు నాకనిపించిందండి.

    రిప్లయితొలగించండి