Loading...

3, జనవరి 2012, మంగళవారం

క్షేత్ర దర్శనము



             దేవదేవుని దయవలన,  అభిరుచి కారణంగానూ తఱచుగా క్షేత్రదర్శనం అబ్బుతూ ఉంటుంది. ఈ సారి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం, భద్రాచల సీతారామ లక్ష్మణుల దర్శనము చేసే అవకాశము కలిగినది. అదీ రెండు చోట్ల అంతరాలయ దర్శనం టికెట్ తీసుకోవటం వల్ల ఇంకా బాగుండింది.

          భద్రాచలం లో దర్శన సమయంలో పది పదిహైదు మందిని లోపలికి పంపిస్తారు. వారందరిని ఆ చిన్న ప్రదేశంలో కూర్చోబెడతారు. అందరి గోత్రనామాలు అడిగి పూజ చేస్తారు. ఈ లోపు ధర్మదర్శనం ఆగకుండా మా వెనుక వైపు నుంచి వెళుతూనే ఉండటం వల్ల మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందిని ఆపి మనం ప్రత్యేకంగా దర్శించుకోవటం వలన మనం తప్పు చేసినవాళ్ళమవుతాం. ఈ పద్ధతి బాగుంది.

       ఆవరణలో ఆంజనేయుడు సుందరంగా కొలువై ఉన్నాడు. కొంత ఎత్తు మీద గుడి ఉన్నది. ఒక పదహైదు, ఇరవై మెట్ల మీద. మూడువైపుల మెట్లు ఎక్కవచ్చు. నాలుగోవైపు నిర్మాణ/పునరుద్ధరణ జరుగుతున్నది.
మేము వెళ్ళినపుడు వైకుంఠఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయినాయి. జనవరి ఐదు అంటే పుష్యశుద్ధ ఏకాదశి కి ముందు వారం నుంచీ అన్నమాట.

  గుడికి ఎదురుగా పెద్దస్థలము ఖాళీ చేయించి వేదిక నిర్మించారు. వేదిక ముందు భక్తులకోసం కొంచెం ఎత్తైన ప్రదేశంలో పచ్చిక రంగున్న కార్పెట్ ను పఱిచి సిద్ధం చేశారు. మొదటి రోజులు కదా, జనం పల్చగానే ఉన్నారు. మొదటిరోజు విష్ణుసహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం తో సహా చేశారు ఒక బృందం. వాటితో పాటు మామాదిరి వచ్చినవాళ్ళు గొంతు కలిపాం. తర్వాత సీతా స్వయంవరఘట్టం (కవికల్పిత కీర్తన) కు నృత్యప్రదర్శన జరిగింది. తర్వాత ఒక సంగీత కచేరి జరిగింది. తర్వాత దశావతారము అనే విషయం మీద నృత్యప్రదర్శన జరిగింది.

    రెండవరోజు వేరొక బృందం హనుమాన్ చాలీసా ౧౧ సార్లు పారాయణ జరిగింది. యథావిధిగా మేమూ.... ఒక్కొక్క సారి రాగం మార్చి పాడుతూ వచ్చారు. ౧౧ వ సారి శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి అనేపాట ఉంది కదా పాత సినిమాలో ఆఁ... ఆ  ట్యూన్ లో పాడారు. తర్వాత ఒక చిన్న అమ్మాయి చక్కటి కీర్తన సంగీత కార్యక్రమపు అంశం. తర్వాత ఇద్దరు చిన్న అమ్మాయిలు గజేంద్రమోక్షం అనే కీర్తనతో పాటు ఇంకా కొన్ని అంశాలతో నృత్యప్రదర్శన ఇచ్చారు.

   అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ఎన్నో సార్లు క్షేత్రాలకు వెళ్ళాం కానీ ఈ సారి అదేపనిగా రెండురోజులు ఉండి రిలాక్సింగ్ గా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వలన ప్రధాన ఉద్దేశ్యమయిన ప్రశాంతత అనేది మనసుకు దొరుకుతుంది. ప్రతీ క్షేత్రం లో ఇలా జరుగుతుంటే బాగుంటుంది.

తిరుపతిలో కూడా కోలాటం లాంటివి జరుగుతుంటాయి కానీ అక్కడ విపరీతమైన దోమలు కూడా కచేరీ పెట్టేస్తాయి కాబట్టి నిలువలేము.

5 కామెంట్‌లు:

  1. ఎందుకంటే చాలామందిని ఆపి మనం ప్రత్యేకంగా దర్శించుకోవటం వలన మనం తప్పు చేసినవాళ్ళమవుతాం. ఈ పద్ధతి బాగుంది. అవును నాకు కూడా అలాగె అనిపిస్తుందండి.....బాగా వ్రాసారు

    రిప్లయితొలగించండి
  2. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
    అండనే బంటు నిద్ర అదియూనొకటే
    మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
    చండాలుడుండేటి సరి భూమి యొకటే
    బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
    పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
    కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
    పుడమి శునకము మీద పొలయు ఎండొకటే
    కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
    జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
    బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
    పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
    తందనానా ఆహి తందనానా పురె
    తందనానా భళా తందనానా
    పర బ్రహ్మమొక్కటే భళా తందనానా

    కాని దేవాలయం లో దేవుడిని చూడటానికి ప్రత్యెక సదుపాయాలు అవసరం అంటారా..? నాకు తెలిసి పెద్దవారికి ఆ సదుపాయం ఉంటె బాగుంటది కాని.. ప్రతి ఒక్కరికి వి ఐ పి సదుపాయాలు.. ఏమిటో జనాలకి ఉండాలి.. దేవుని దెగ్గర కూడా ధనిక బీద బేదములు ఏమిటో.. వి ఐ పి స్పెషల్ సదుపాయాలు పెట్టటం వల్ల దేవుని విలువ తెలియకుంట పోతుంది..

    రిప్లయితొలగించండి
  3. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమండి.
    తిరుపతిలో ఈ సమస్య చాలా ఎక్కువ. అక్కడ విఐపిలూ ఎక్కువే, సామాన్య భక్తులూ ఎక్కువే. మిగతా చోట్ల ఈ సమస్య అంతగా ప్రభావం చూపించదని అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. ఇంకో మాట
    చక్కని పాట ప్రస్తావించినందుకూ పాటంతా ఇక్కడ ఉంచినందుకూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి