Loading...

15, నవంబర్ 2017, బుధవారం

ఉత్పలములు

అప్పుడప్పుడూ వ్రాసుకున్న పద్యాలలో కొన్నిఉత్పలమాలలు -

ముగ్గురమ్మలు-

వీణను చేతఁ బూని యలివేణిగ బ్రోచిన వాణి రూపమై
పాణిని శూలమున్నిలిపి భక్తుల గాచిన గౌరి రూపమై
రాణిలు తీరుగా ధనపు రాసుల నిచ్చిన లక్ష్మి రూపమై
రాణిగ నిల్చి, యో జనని , రాజిలు భక్తిని నిల్పు నా మదిన్.

ప్రవచనకర్త -

వేదిక పైన నిల్చి సభ విస్మయమంద వచించు శక్తితో
సాదరభావనన్ పరులు సంతసమందగ నుండు భక్తితో
సోదరులంచు నెల్లరకు సూక్తుల నెప్పుడు నేర్పు యుక్తితో
తా దరి జేరు వారలకు ధర్మపు మూర్తిగ నిల్చె నీతడే.

రైతు -

బీటలు వారెనే పుడమి బీదతనంబున రైతులేడ్వగా
మాటలు కాదు సేద్యమును మానక జేయుట నేటి రోజునన్
నాటిన పైరు వచ్చునని నమ్మకమన్నది లేకపోయెనే
చేటగు కాలమే జనుల చింతల బెంచుచునుండెనే హలా!

కవి-

ఎవ్వరు నేర్పిరో మరుల నిట్టుల నద్భుత రీతులందులన్
మువ్వల సవ్వడో యనగ మ్రోవగ జేయుచు జెల్గెనీతడే!
పువ్వుల తావిలో కలము ముంచుచు వ్రాసెనొ! బొండు మల్లెలన్
రువ్వుచు, నిల్పె నిజ్జగము రోయక నుండగ భావుకత్వమున్.

పెళ్ళిలో ఆశీర్వాదము -
యుక్తవయస్కులందరకు యోరిమిఁ దప్పక మున్నె జోడుగా
భక్తినిఁ బంచయజ్ఞములఁ బాలన జేయుమటంచు, వారలన్
ముక్తినిఁ జేర యోగ్యులను ముందుగ జేయు మహోత్సవమ్మిదే!
వ్యక్తముఁ జేయవచ్చితి, వివాహపు తంతు శుభాశయమ్ములన్.
   -----లక్ష్మీదేవి.                           


12, అక్టోబర్ 2017, గురువారం

ధర్మంబియ్యది!

శార్దూలవిక్రీడితము

కర్మంబందునఁ దక్క నే ఫలములన్ కాంక్షించలేదెన్న, డే
దుర్మార్గంబుల క్రుంగుటల్ కనద, వే దుర్వ్యూహముల్ తోచినన్
మర్మంబుల్ సడలంగ జీరు తన సమ్మానంబు వర్ధిల్లగా.
ధర్మంబియ్యది నిల్చియున్నది సదా దైవాంశ కన్పట్టగా
తీర్మానమ్ముగ నెల్ల వారి శుభముల్ దృక్కోణమందుండగా. 






21, సెప్టెంబర్ 2017, గురువారం

సమస్యాపూరణలు

కష్టమైన ప్రాసతో గురువుగారిచ్చిన సమస్యకు నా పూరణ ప్రయత్నాలు.

సుజ్ఞానమ్మను భిక్షను
నా జ్ఞానులు నరులకిడుదు,రప్రతిహతమౌ
యజ్ఞతఁ బోగొట్టు కదా
విజ్ఞతలే! నట్టి నరుడె విజయముఁ బొందున్.


( ఆ జ్ఞానులనబడే వారే నరులకు సుజ్ఞానమను భిక్షను ఇడుదురు.
అడ్డూ ఆటంకమూ లేకుండా పెరిగే అజ్ఞను అట్టి విజ్ఞతలే కదా పోగొట్టును!
అని వ్రాశాను. అన్వయము కుదరలేదంటే దిద్దుకుంటాను.)

ధర్మ్యమ్మౌ నడవడికయు,
హర్మ్యమ్ముులనాశ వీడు నభ్యాసము, నై
ష్కర్మ్యము నానందమగున్.
హర్మ్యమ్మున వెదుకఁదగునె యానందమ్మున్?

ధర్మ్యము =ధర్మమును వీడనిది
నైష్కర్మ్యము=భౌతిక ప్రపంచమునుండి పూర్తిగా తొలగిన మనసుతో కర్మను వీడుట.

9, సెప్టెంబర్ 2017, శనివారం

కర్మయోగమా? కర్మసన్యాసయోగమా?

భారతీయం ప్రవృత్తి , నివృత్తి మార్గాలను రెండిటినీ విశ్వసిస్తుంది. బోధిస్తుంది. కానీ ప్రధానంగా ప్రవృత్తిమార్గం ఎందుకైందిఅంటే నివృత్తి మార్గం బహు క్లిష్టమైనది.
--
భగవద్గీత -కర్మయోగాన్ని, కర్మసన్యాస యోగాన్ని రెండిటినీ భగవద్గీత వివరిస్తుంది.
అర్జునుడు అడుగుతాడుకూడా. కృష్ణా, మీరు ఒకపరి కర్మసన్న్యాసమును, ఆ వెంటనే కర్మయోగమును ప్రశంసించుచున్నారు.ఈ రెండిటిలో నాకు శ్రేయస్కారి యగు దానిని నిశ్చయించి చెప్పుడు అని.
రెండూ పరమశ్రేయస్సును కలిగించునవియే అనేదే(మూర్ఖులే ఇవి వేరు వేరు ఫలాలనిచ్చునని భావిస్తారని కూడా) భగవానుని నిశ్చయాత్మకమైన సమాధానము. అయితే సాధనయందు సులభమైనది కాబట్టి కర్మయోగము శ్రేష్ఠమైనది అని చెప్తాడు.
ఎందుకంటే శరీరధారికి కర్మసన్యాసము అంత సులభమైనది కాదు. ఇంద్రియములు చేసే పనులన్నీ ఊపిరి పీల్చడముతో సహా కర్మాచరణ అయినపుడు ఏ శరీరధారికీ అది అంత సులువైనది కాదు. (మనస్సునునిగ్రహించడం మరింత కష్టసాధ్యము)
అందుకే కర్మ త్యాగము కన్నా, కర్మఫల త్యాగము మంచిదని , నిష్కామకర్మ ఉత్తమమని చెప్పబడుతోంది.
--
బౌద్ధము దీనికి వ్యతిరేకమైనదాన్ని కనుగొన్నదని అనుకోను. ఇందులో అత్యుత్తమమైనదని ఒకదాన్ని ఎంచుకున్నది.
ఇందులో ఒకదాన్నే ఉత్తమమని భారతీయం నిర్ణయించదు. ఎందుకంటే ఎవరికి ఏది సాధ్యమో దాన్ని నిర్ణయించుకోవడం మంచిదని భావిస్తుంది. ఉదాహరణకు క్లోజ్/ ఓపెన్ బుక్ పరీక్షలను నిర్వహించే వారికి ఆ యా స్థాయిలననుసరించి నిర్వహించడం అవసరమని మనకూ తెలుసు కదా?
అలా కాదని నివృత్తి మార్గమే దిక్కని బోధించడం వల్ల, జ్ఞానులైన వారు కర్మల పట్ల అశ్రద్ధను కలిగించిన వారవుతారు. ప్రకృతి సిద్ధమైన గుణములతో ప్రభావితమై కర్మలలో ఆసక్తి కలిగినవారిని నిరోధించడం మాత్రంచేత వారికి కర్మసన్యాసము పట్ల శ్రద్ధ రావడం కష్టం. పైగా ఇది విపరీత పరిణామాలకు దారితీసే పరిస్థితులూ ఏర్పడతాయి. ఏర్పడడం వల్లే బౌద్ధం ఇక్కడ నిలువలేదు. ప్రాపంచిక విషయాలను వదులుకోవడం కష్టమైన అనుచరులకు అది దారి చూపలేకపోయింది. ఆ కష్టమైన దారికి ఒక ఊతకఱ్ఱను గానీ ప్రత్యామ్నాయాన్ని కానీ అందించలేనందు వల్లే అది విఫలమైంది.
--
కర్మాచరణను ఆలంబనగా అది అంగీకరించనందువల్ల అది ఇక్కడ ద్వేషానికి గురి అయి ఉండవచ్చు. కానీ అది ఉన్న ప్రాంతాలలో కూడా అది ఉంది అంతే గానీ, భౌతిక/ప్రాపంచిక లంపటాన్ని(కర్మాచరణను) వదలడం అనే విషయంలో ప్రభావాన్ని చూపించిందా అన్నది సందేహమే.
--
ఏదో ఒక ప్రయత్నము చేయనీ అని విడువడమే మంచిదికానీ, అసలు ప్రయత్నం పట్లే ఆసక్తి పోయేటట్లు చేయకూడదు కదా. ఏ ప్రయత్నాన్నీ విలువలేనిది గా తీసిపారేయకుండా, ప్రోత్సహించడం వల్ల కొన్ని ప్రయత్నాలు శీఘ్రంగాను, కొన్ని నిదానంగాను ఫలితాలను ఇస్తాయి.
---
కళలు మనోరంజకం కాకుండా అస్తిత్వాన్ని పొందలేవు. అప్పుడది ఇంద్రియాశ్రితమే అన్నది సుస్పష్టం.వీటికీ నివృత్తి మార్గానికీ చుక్కెదురు కదా?
ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అన్నది కూడా కాకుండా పూర్తిగా ద్వంద్వాలకు అతీతంగా ఉన్నప్పుడే నివృత్తి మార్గం సాధ్యం. అదీ ఆచరించినవారు ఇక్కడ ఉన్నారు. కానీ అది అతిక్లిష్టం.
----
కారణరహితం గా అంతర్ముఖుడవడం-ఈశ్వరుడు ,నరనారాయణులు, దక్షిణామూర్తి , సనకసనందాదులు అంతర్ముఖులే అయి ధ్యానిస్తారన్న ఉదాహరణ ఉండనే ఉంది. రమణమహర్షులు ఇప్పటి ఉదాహరణ.
మానవమాత్రుల్లో మనకు తెలిసిన పరిధిలో ఉదాహరణలు పరిమితమై ఉండవచ్చు. హిమాలయాల వంటి చోట ఇప్పటికీ ఉండవచ్చు.
ఇక ఆనందాన్ని అనుభవించినపుడు అది బ్రహ్మానందం, ఆనందాన్ని కాక వస్తువు ద్వారా అనుకున్నప్పుడు మాత్రమే ఆనందం దూరమౌతుంది. అహం బ్రహ్మాస్మి అన్న దానిలో పరమార్థం ఇదే కదా.
----
నేను, నాది అనుకున్నపుడే దుఃఖమని చెప్పబడింది. ఉన్నదంతా ఒక్కటి. అదే ఉంది, ఇంకోటేదీ లేదు అన్నప్పుడే ద్వంద్వాతీతమౌతుందనీ చెప్పబడింది. అప్పుడే నాది అనేది నాది కాదు అనేది రెండు ఉండవు.
మాస్నేహితురాలు అందమైన ఇల్లు దారిలో కనబడగానే అబ్బ ఎంత అందంగా ఉందో అనేది.
మరుక్షణం అటువంటిది నాకుంటే ఎంత బాగుండునో అని చింతించేది. మొదటి క్షణంలో ఉన్నదే ఆనందం. నాది,నాదికాదు అన్న ఆలోచన ఇప్పుడు అవసరమా అనిపించేది నాకు.
:) ఇది  బోధ కాదు. నాకు ఏది ఎంత అర్థమైందో అదే చెప్తున్నానంతే.

27, ఆగస్టు 2017, ఆదివారం

తల్లీపిల్లలు

వాల్మీకి రామాయణములో కౌసల్య, కైకేయి రామ వనగమన సమయంలో భావోద్వేగాలకు గురి అవడం కనిపిస్తుంది.
కౌసల్యా సుతుడైన రామయ్య , కైకేయి పుత్రుడు భరతుడు ధర్మాగ్రహం మాత్రమే చెందుతారు.
కానీ సుమిత్ర ఎప్పుడూ పరమ శాంతంగా ఉంటుంది.
శాంతమూర్తి అయిన సుమిత్ర తనయులిరువురూ కూడా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు తొందరపాటుతో, ఉద్వేగంతో ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇది వింత కాకపోవచ్చు కానీ ఇందులో తెలుసుకోవలసిన సూక్ష్మం ఏమైనా ఉందేమో నని అడుగుతున్నాను.

29, మే 2017, సోమవారం

చిన్న చర్చ

రచయిత్రి నిడదవోలు మాలతి గారికీ నాకూ జరిగిన చిన్న చర్చ-సుఖదుఃఖాలు, సదసత్తులు, జన్మాంతర కర్మఫలాల గురించి మామూలుగా మనకొచ్చే సందేహాల గురించి ఒక చిన్న చర్చ - కథ రూపంలో.
**********************************************************************************
[[గమనిక:   ఈమధ్య నేను చదువుతున్న కొన్ని పుస్తకాలవల్ల నాకు కలిగిన కొన్ని సందేహాలకి అక్షరరూపం ఈకథ. నాకే అయోమయం కనక మీకు కూడా అయోమయంగానే తోచవచ్చు. చదువుతారో లేదో నిర్ణయించుకోడానికి వీలుగా ఉంటుందని ఈవిషయం చెప్పడమయినది. ధన్యవాదాలు.- నిడదవోలు మాలతి.]
అసలు పోస్ట్ లింక్ ఇక్కడ నొక్కి చూడవచ్చు.
***
బ్రహ్మానందం బిక్కుబిక్కుమంటూ ఓమూల నక్కి, రెండు పిడికెళ్ళు గుండెలకి హత్తుకుని ముడుచుక్కూర్చుని ఉండగా –
పోలీసులు ఇల్లంతా వెతికేస్తున్నారు. ఇక్కడ చూడు అక్కడ చూడు అంటూ ఒకొరికొకరు ఆనవాళ్ళు, ఇది చూడు, అది చూడు అంటూ సందేహాలు…
ఒణికిపోతూ ఒక మూల నక్కి కూర్చున్నాడు భోజరాజు. ముచ్చెమటలు పోసేస్తున్నాయి. ఇదెక్కడిగోలరా బాబూ అంటూ నెత్తి బాదుకుంటున్నాడు బ్రహ్మానందం మౌనంగానే, మనసులోనే.
ఏమయిందేమయిందంటూ వాకిట్లో ఆడా, మగా పిల్లా పెద్దా అని లేక అన్ని రకాల శాల్తీలు గుమి గూడి గోలగోలగా మాటాడేస్తున్నారు.
తుపాకీతో కాల్చీసేట్ట.
ఎవర్ని?
ఏమో
స్కూల్లో పిల్లాణ్ణిట.
ఎందుకెందుకు?????
ఏమో11111
నిజంగానే?
లేదు లేదు. కాల్చీలేదు, బెదిరించాడంతే.
బెదిరంచడం కూడా నేరమే, తెలుసా?
అసలెందుకు బెదిరించేడూ?
ఏమో ఏమో …
రామ రామ కలికాలం
అంతే మరి. పిల్లలేదో మాటా మాటా అనుకుంటారు, ఆమాత్రానికే కాల్చిపారేయడఁవా?
***
“కలా, బాబూ?”
తల కాశీబోండాలా ఆడించేడు.
“పోనీలే. కలే కదా.”
“కాదు కాదు, చాలా నిజంలాగే ఉంది. నన్ను జైల్లో పడేశారు. ఆ జైలుకూడు రామరామ మట్టిగడ్డ నయం.”
“పోనీ, కలలో నేరానికి కలలోనే శిక్ష అయిపోయిందనుకో. ఇప్పుడు జైల్లో లేవు. వంటింట్లో ప్రవీణ కమ్మని భోజనం తయారు చేస్తోంది.”
“ప్రవీణెవరూ?”
“పూర్వజన్మలో నీభార్యలే.”
“పూర్వజన్మలో భార్య ఇప్పుడెలా ఇక్కడికి వచ్చింది?”
“ఇప్పుడు ప్రవీణ కాదులే. రామావతారం, నీ వంటవాడు.”
“నాకు వంటవాడు లేడు.”
“ఇప్పుడున్నాడులే.”
“సరే. ఇంతకీ మీరెవరు?”
“నేను కూడా నీ పూర్వజన్మనుండే వచ్చేను. తాతయ్యని.”
“ఓ, తాతయ్యా, అవును సుమా. నాకు బాగా జ్ఞాపకఁవే. పక్కవాళ్లపొలంలోంచి సీమ చింతకాయలు నీకిష్టమని తెస్తే, చింతబరికె పుచ్చుకు వీపు చీరీసేవు దొంగతనం తప్పు అని చెప్పడానికి.”
“ఏంటో అప్పట్లో అంతే తెలిసింది. పాపం, ఒళ్లు వాచిపోయింది. కానీ మరొకటి కూడా ఆలోచించు. అందుకేనేమో, ఆ దొంగతనంకారణంగానేమో ఇప్పుడు జైల్లో పడ్డావు. పాపకర్మ.”
“కలలో జైల్లో పడ్డాను. అంతకుముందే నువ్వు చింతబరికెతో బడితెపూజ చేసేవు. మరి అప్పు తీరిపోయినట్టే కదా?”
“ఏమో, తెలీదు. అదొక్కటే కాదు కదా. ఇతర కర్మలు కూడా చేసి ఉంటావు కదా. అవన్నీ లెక్కలోకి వస్తాయి. నువ్వు ఈ జన్మలో సద్వర్తన, సజ్జనసాంగత్యము, శాస్త్ర పురాణాది అధ్యయనములతో ఆ పాపములను ప్రక్షాళన గావించుకుని ఆత్మను పరిశుద్ధము చేసుకొనవచ్చును.”
***
బ్రహ్మానందానికి అంతా గందరగోళంగా ఉంది. విడదీసేకొద్దీ బిగుసుకుంటున్న ఉచ్చులా ఉంది కానీ ముళ్లు విడేమార్గం కనిపించడంలేదు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు తాతగారు చెప్పినమాటలు మననం చేసుకుంటున్నట్టు.
నేను ఉన్నాను ఈదేహము నాది, నేను సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నాను వంటి భావనలు భ్రాంతి మాత్రమే. అది శుద్ధచైతన్యము యొక్క భావన. ఆ భావనే వ్యష్టిగా రూపిస్తున్నాడు. దృక్‌దర్శనముద్వారా దర్శించునది దృశ్యము. ఈ దర్శనము, దృశ్యము కూడా భ్రమే. ఈదృశ్యము కలవంటిదే. నిజంగా ఏమీ లేవు. సరే. ఇది అంగీకరిస్తాను. మరి అయితే …
కలలో నేరం చేసేను. కలలోనే పోలీసులకి పట్టుబడ్డాను. కలలోనే జైల్లో పడ్డాను. మేలుకున్నాను. పోలీసులు లేరు. జైలు లేదు.
జీవితం కలలాటిదే అనుకుందాం. జరుగుతున్నదంతా భ్రాంతి. నిజంగా చంపేవాడు లేడు, చచ్చేవాడూ లేడు. ఈ అసత్త భ్రాంతిరూపంలో చేసిన అకృత్యాలకు ఈ దేహం శిక్ష అనుభవిస్తుంది. కలలో నేరానికి శిక్ష కలలోనే అనుభవించినట్టు, ఈ జీవితంలో చేసిన కర్మలకి ఇక్కడే శిక్ష అనుభవించడంలో అర్థం ఉంది. మళ్లీ నరకం వేరే ఎందుకు? ఇది ఒక సందేహం.
రెండో సందేహం, నరకం, స్వర్గం కూడా చిత్తము, అహంకారమువలన కలిగిన భావములు అని కూడా చెప్పేరు. అలా అయితే నరకములో పడతానేమో అన్నభావానికి ఆస్కారం ఉండకూడదు.
మరో సంశయం – వ్యష్టి ఒక చిత్తముయొక్క చిద్రూపము. బ్రహ్మమనసులో ప్రభవించిన భావానికి ప్రతిబింబము. దీనికి ఇచ్చిన దృష్టాంతము సముద్రము. అదే దృష్టాంతము తీసుకుందాం. నేను దోసిలిలో సముద్రపు నీరు తీసుకుంటాను. నాదోసిలిలో నీరు సముద్రపునీరుకంటె వేరు కాదు. నేను ఆనీరు మళ్ళీ సముద్రములోనికి వదిలస్తే ఆ సముద్రములోనే కలిసిపోతుంది. అసత్త సత్తలో లయమయిపోతుంది. ఇది సత్త, ఇది అసత్త అన్న వేర్పాటు లేదు. ఇలా వేరు కాని అసత్త పునర్జన్మ ఎలా సాధ్యం? నాదోసిలిలోంచి సముద్రములోకి వదిలిన నీరు ఇదీ అని వేరు పెట్టి చూపలేం కదా. అంతే కాదు. ఒకొక జన్మలోనూ ఆ చిత్తమునకు సంబంధించిన లోకవ్యాపారలములవల్లనూ, బంధుమిత్రులవల్లనూ మరిన్ని వాసనలు ఏర్పడతాయి కదా. అంచేత ఏ ఒక్కజన్మలో వాసనలు నిర్మూలించుకుని శుద్ధచైతన్యమునకు చేరువ కావాలన్నా కొత్తవి కూడా చేరుతూ ఉంటాయి కనక సంపూర్ణంగా శుద్ధచైతన్యములో లయమగుట అన్నది భ్రమే అనిపిస్తోంది.
లీలోపాఖ్యానంలో లీల వెనకటిజన్మ, ఆజన్మలో భర్త పిల్లలు— ఇవన్నీ సరస్వతీదేవికరుణవల్ల పునః దర్శించడం జరుగుతుంది. అదే అసత్త పునః జన్మించిందంటే అసత్తకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉందనే కదా.
***
అంతకంటె ముందు మరో ప్రశ్న. ఆ శుద్ధచైతన్యస్వరూపుడు మొదట్లోనే అసలు దుష్టభావనలు అన్నవే లేకుండా మనిషిని పుట్టించి ఉండవచ్చు కదా. నేనొక ప్రోగ్రాం రాస్తాననుకో. అది నిష్ఫలమౌతుంది అనో దుష్ఫలితాలను ఇస్తుంది అనో అనుకుంటూ రాయను కదా.
“రాయవు. కానీ అలా వికటించడం జరుగుతోంది కదా. ఇదీ అలాటిదే.”
అదీ నిజమే. కానీ నేను మానవమాత్రుడను. నాది పరిమితజ్ఞానం. ఆ శుద్ధచైతన్యస్వరూపుడు అపరిమితుడు, జ్ఞానస్వరూపుడు కదా!
***
అసలు స్వర్గసుఖాలు అంటే ఏమిటి? ఈ వేదాంతగ్రంథాల్లో సైతం స్వర్గం వర్ణించినప్పుడు విందులు, వినోదాలు, ఉద్యానవనాలలో విహారాలు వర్ణిస్తున్నారు. అవే స్వర్గసుఖాలు అయితే, భూలోకంలో సుఖాలకీ స్వర్గసుఖాలకీ ఏమిటి వ్యత్యాసం?
అసలు సుఖదుఃఖాలు సమదృష్టితో స్వీకరించాలనుకున్నప్పుడు ఈ స్వర్గసుఖాలను ఆశించడం కానీ అనుభవించడం కానీ కూడా గర్హనీయమే కదా. కష్టాలు సుఖాలు ఒక్కలాగే స్వీకరించాలంటే సుఖం కూడా స్వీకరించవచ్చు కదా.  అసలు ఏది సుఖం, ఏది కష్టం …
కష్టసుఖాలు అనుభవించేది దేహమే కాని చిత్త కాదు అనుకుంటే, కష్టాలనూ, దుఃఖాలనూ ఎందుకు హేయంగా వర్ణించడం?
లవణరాజుకథలో లవణరాజు మానసికంగా యాగం చేసి, యాగంలో తప్పనిసరిగా ఆచరించవలసివచ్చింది. ఆహింస కారణంగా 60 సంవత్సరాలు హేయమైన జీవితం గడుపుతాడు. ఛండాలస్త్రీని వివాహమాడడం, సంతానం, మాంసభక్షణ వంటివి నీచమైనవిగా చిత్రించడం జరిగింది ఇక్కడ. సుఖదుఃఖాలు సమమే అనుకున్నప్పుడు ఇది ఉత్తమము, ఇది హేయము అన్న వివక్షకి అర్థముందా?
***
సముద్రపొడ్డున కూర్చున్న బ్రహ్మానందం చుట్టూ మరొకసారి పరికించి చూసేడు. పిచికగూళ్లు కట్టుకుంటున్న పిల్లలు, గాలిలో ముళ్లచిగుళ్ల పరుగులు తీస్తున్న రావణాసురుడితలలు, ఊసులాడుకుంటూ చెట్టాపట్టాలేసుకుని పోతున్న యువజంట, వాళ్లని చూస్తూ గతాన్ని నెమరువేసుకుంటున్న ముసలాయన, మరమరాలబండిచుట్టూ చేరిన జనం …
వీళ్ళంతా ఏమైనా ఆలోచిస్తున్నారా? వీళ్ళకి తనకి వచ్చినలాటి ఆలోచనలు అసలు ఎప్పుడైనా వస్తాయా? వాళ్ళు ఈ క్షణంలో మాత్రమే బతుకుతున్నారా? నాలాటి చింత లేనివారిగతి ఏమవుతుంది? పక్షులుగానో, మృగాలుగానో, పురుగులుగానో పుట్టినజీవుడు ఎలాటి సత్కార్యాలు చేయగలడు? వాటికి విముక్తి ఎలా ఎప్పుడు కలుగుతుంది?
నీళ్ళలో ఆడుతున్న పిల్లలు పొలోమంటూ అరిచి దూరంగా పరుగెత్తేరు. అటు చూసేడు. ఉవ్వెత్తున లేచిన కెరటం ఒకటి తృటికాలం అలా గాలిలో నిలిచి, ఫెళ్లున విరిగిపడింది.
“నీ విచక్షణ అలా కొనసాగించు. నీకే తెలుస్తుంది జవాబు తగుసమయం ఆసన్నమయినప్పుడు.”
ఉలికిపడి చుట్టూ చూసేడు. ఆసందేశం ఎక్కడినుండి వచ్చిందో ఎంత తన్నుకున్నా అర్థం కాలేదు.
***
(ఇందులో ఉదహరించిన కథలు -లీలోపాఖ్యానం, లవణరాజుకథ యోగవాసిష్ఠం గ్రంథంలోనివి)
(మే 25, 2017)---వ్రాసినవారు నిడదవోలు మాలతి.
ఇక నా వ్యాఖ్యలు-
లక్ష్మీదేవి అంటున్నారు:
ఈ మార్గంలో ఉన్న అన్వేషకులకు వచ్చే సందేహాలతో ఇంత సులువుగా ఒక కథరూపమిచ్చారు.
బాగుంది.
విడదీసేకొద్దీ…..నిజమే. కానీ వేటికి ముడిపడే అవకాశముందో ఆ అవకాశమే విడిపోడానికీ దారి చూపిస్తుంది.
మెళ్ళో ఉన్న రెండు గొలుసులు ముడిపడుతుంటాయి, ప్రయత్నం చేసి విడిపించేటపుడు
మనకెంత నమ్మకం! ఖచ్చితంగా విడిపించగలమని తెలుసు. పైన తీగకు ఆరేసిన బట్టల్లోంచి
ఒక గుండీయో, హుక్కో జడలో ఇరుక్కుంటేనో! మనం తీస్తాము నమ్మకంగా; రాలేదు, కనిపించలేదు
అంటే మన తలపైకి చూడగలిగేలా ఇంకొకరిని పిలుస్తాము. ఇక సమస్యే లేదు. విడిపోతుంది ఔనా!
అప్పటికీ విడలేదా, కత్తెర పాత్ర అవసరమౌతుంది.
ఇక దోసిలి, నీళ్ళు- దోసిలిలో ఉన్నవి చక్కగా సముద్రములోకి వెళ్ళగలిగితే సరి. ఇక ఐక్యమే,లీనమే.
ప్రతి బిందువు, అందులోని ప్రతి కణమూ చేరిందంటేనే- కొన్ని చేతిలో ఉండిపోతాయి ,
కొన్ని దుస్తులమీద, కొన్ని ఇంకొకరి కోసము ఇవ్వాల్సి వస్తుంది. అన్నీ ఒక్కసారే
సముద్రంలో కలిసే అవకాశం ఎక్కడా??
కాబట్టి మళ్ళీ జన్మ వచ్చినంత మాత్రాన ప్రత్యేక అస్తిత్వం ఉన్నట్టు నిరూపణ కాదు.
ఇక శుద్ధచైతన్యస్వరూపునికి ఈ పనులేల అన్నదానికి లీలావిలాసాలని తప్ప ఇంతవరకూ
ఇంతకు మించిన తృప్తినిచ్చే సమాధానం దొరకలేదు. ఎంతమందికి దొరకగలదా సమాధానం?
తెలియదు.
ఇక ఈ సుఖాలు, ఆ సుఖాలు వ్యత్యాసాలు తెలుస్తాయా? ఏమో, ఏ తొమ్మిదో తరగతి పిల్లాడికీ
పదో తరగతి మార్కులలో అంత గొప్పేం ఉందిలే అనిపించదు. ఒకవేళ అనిపించినా ఏ లెక్కల
మాస్టారో , ఇష్టమైన మామయ్యో మెచ్చుకోలు సంపాదించాలనే ఆశలోనో ఏముందిలే అనిపించదు.
దీనికన్నా గొప్పదొకటుంది అనే మాయలోనే అందరం ఉంటాం.
సమదృష్టి – ఇదంత తేలిక కాదు. అస్సలు తేలిక కాదు. చెప్పడం, అనుకోవడం కన్నా
ఆచరించడం దాదాపు అసాధ్యం. ఎవరెన్ని కబుర్లు చెప్పినా. ఒక పరిపక్వత అది. దుస్సాధ్యం కాదు.
సంకల్పబలాన్ని బట్టి అలవడనూ వచ్చు.
అనుభవించేది దేహమే కానీ, దేహంలోపల నేను అన్నదానికి హేయమూ, ప్రియమూ తెలుస్తూ
ఉంటాయి. సమదృష్టి – ఇది వస్తే ఆ పైన ప్రియహేయాలు తెలియవు.
అందరూ – ఆలోచించరు. ఆ క్షణంలో మాత్రమే , ఆ సుఖదుఃఖాలలో మాత్రమే, ఆ శరీరంలో
మాత్రమే, ఆ జన్మలో మాత్రమే బతుకుతుంటారు. చింత లేని వారి గతి ఏమవుతుందంటే ఆ చింత
వచ్చేదాకా కొనసాగుతుంది. అందుకే పోయినవారికి ‘సద్గతులు’ ప్రాప్తించాలని కోరడం
మనకుంది.
వేరే జీవులుగా ఉన్నప్పుడు సంకల్పించి కాకపోయినా కాకతాళీయంగా విముక్తి మార్గంలో నడువ
సాధ్యమౌతుంది.
అందుకే మానవజన్మ ఉత్తమము అంటారు. సంకల్పించి, తెలిసికొని, చింతించి, విముక్తి పొంద
వచ్చని.
అయినా మీరన్నట్టు , పెద్దలందరూ అన్నట్టు తగుసమయం వచ్చినపుడు అన్నీ తెలుస్తాయి.
మీకు తెలియనివి కాదనుకోండి. అయినా ముళ్ళలో ఇంకొక్క ముడి గురించి చెప్దామనుకుంటున్నా, ఇంకా వేరే చదివేవాళ్ళ కోసమైనా.
కొన్ని ముళ్ళు అవే పడతాయి. (బంధాలు) సుఖము, దుఃఖము రెండురకాలవీను.
కొన్ని మనమే తగిలించుకుంటాము. వీటిలో కూడా పై రెండు రకాలుంటాయి.
సుఖమిచ్చినా, దుఃఖమిచ్చినా, అవే తగులుకున్నా, మనం తగిలించుకున్నా, వదిలించుకోవడం ఇష్టమున్నా, లేకపోయినా, చేతనైనా, కాకపోయినా
వదలడం జరుగుతుంది. స్వంతంగా కాకపోతే, అనుసరణగానో, లేక బయటి సహాయంతోనో.
ఉదాహరణగా పైన వ్యాఖ్యలో చెప్పినట్టు పొడవైన తల జుట్టు ఎక్కడన్నా ఇరుక్కునప్పుడు చిన్న అతిచిన్న వయసులో అసలు తెలియదు, ఏదో ఒక చిదానందంలోనే ఉండడం జరుగుతుంది.
ఒక్కొక్క వయసులో, ఒక్కొక్క సమయంలో నొప్పి కలుగుతుంది , ఏడుపూ వస్తుంది.
ఒక్కొక్క సారి ఈ నొప్పి కూడా అంత బాధించక వేరే కారణాల వల్ల నే విడిపించుకోవడం జరుగుతుంది.
ఒక్కో సారి మనవల్ల కానేకాదు. వేరే వాళ్ళు ఓదార్చవలసి వస్తుంది, విడిపించాల్సి వస్తుంది. కత్తిరించాల్సి వస్తుంది.
లేదా అలాగే చిక్కుపడి నొప్పి అనుభవించాల్సీ వస్తుంది.
ఇవన్నీ జుట్టు చిక్కుకున్నప్పుడే కాదు, భవ బంధాలలో చిక్కుకున్నప్పుడూను.
అసలు బాధ తెలియక ఆనందంలోనే ఉండడం,
బాధపడడం,
గొడవలు పడడం, దూరమవడం, దగ్గరవడం, రెండూ చేయలేకపోవడం,
చివరికి గురువు నో , ఆధ్యాత్మికతనో శరణు జొచ్చి వారి ద్వారా ముక్తి పొందగలగడం,
లేదా ఆ మార్గంలో వెళ్ళలేకో, ఇష్టంలేకో ఆ పంకిలంలోనే పడి కొట్టుకుంటూ ఉండడం.
ఇలా జీవి పయనం జరుగుతుంటుంది.

6, ఫిబ్రవరి 2017, సోమవారం

నా పఠన కార్యక్రమాలు - స్వరమాలికలో

ఈ నెలలో స్వరమాలిక జాలవాణి myindmedia.com (web radio) లో నా కార్యక్రమాలు--- మధ్యాహ్నం (1.30 pm -2.30pm) ఈ గంటలో మిగతావాటితో పాటు నా ఈ పఠన కార్యక్రమాలూ ఉంటాయి.
శనివారం-11/17
సూర్య శతక పఠనం-రెండవ భాగం
శనివారం- 18/17
సూర్యశతకపఠనం
మంగళవారం- 21/17
లెక్కంటే లెక్కే {శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి గారు వ్రాసిన కధ-november 20, 2016 సాక్షి ఫన్ డే లో ప్రచురితం}

2, ఫిబ్రవరి 2017, గురువారం

నా చిన్ని ప్రసంగాలు

కొత్తగా ప్రారంభించిన మై ఇండ్ మీడియా లోని స్వరమాలిక వారి కార్యక్రమాల్లో భాగంగా సంక్రాంతి నాడు
సూర్యభగవానుని గురించీ, ఎండ గురించీ నా చిన్ని ప్రసంగాలు రెండు.
ఈ లింక్ లో వినవచ్చు.మై ఇండ్ మీడియా డాట్ కామ్ లో స్వరమాలిక అనే లింక్.
http://myindmedia.com/index.php/2017/01/29/jan-14th-2017-svaramaalika-presented-myindmedia/

కొన్ని పద్యాలు

శార్దూల విక్రీడితము-
తల్లీ! విద్యల నేర్వ నాశగలిగెన్, దక్కించు, దీవించు, వ
ర్ధిల్లన్ కూర్మిని విద్యలందుఁ, గనుమా! దేవీ, సతీ,శారదా!
తెల్లంబై సకలంబు, జ్ఞానమది యుద్దీపింప నన్యంబు నే
నొల్లంబోవను, పాదపద్మములనే యుండంగ కాంక్షించుదున్.

మధ్యాక్కర-
మంచిది, కానిది యన్న మాన్యవిచక్షణ తెలియ
కొంచెము విజ్ఞత యుండు గొప్పలక్షణమును మాకు
పెంచుము, లోకము నందు పెరుగు సమరసము తల్లి!
యుంచుము కరుణను నీదు యుల్లమునందు నెన్నడును.
ఆటవెలది-
సృష్టికర్తనెంచి సేవలఁ జేయగా బుద్ధినిమ్ము మాకు మ్రొక్కుగొనుచు.
దృష్టిదోషమెద్దొ తీసి సత్యమరయ, గర్వమతిశయించు కతము మాన్పు.
----------------------
మత్తేభవిక్రీడితము-
జననీ జానకి! రామచంద్రు సతి! యో సాధ్వీలలామా! కటా,
కనుమా లోకము, నేఁడు నీదుకథలో కల్పించె భ్రాంతుల్ కదా!
నిను, నీ ధీరతనున్, సుశీలతఁ దపో నిష్ఠన్, నిదానించి నెం
చను లేరీ యధముల్, సహించతరమే, సాధ్యమ్మె, నాకెన్నడున్?
శార్దూలవిక్రీడితము-
శ్రీరామా! వినుమయ్య, నేటికిలలో సీతాలలామన్, సతిన్,
నేరమ్మెంచితివంచు, లోకులు సదా నిందించుచున్నారనన్,
శ్రీరామామణి నంతగా మనసులో సేవించువారే కదా
వారంచున్, కరుణించి యేలెదవహో, పాలించు దైవమ్ముగా.

------------------------------
పల్లెల ప్రకృతినిఁ జూడుము,
కల్లలు కలహముల మనము కఠినమ్మగునే?
పల్లెలను బ్రకృతిఁ జూడుము
కొల్లగ మట్టిఁ బరిమళము కోరిన దొరకున్.
చెండులు, చేమంతులటన్
మెండుగ దొరకునన పత్రమేపాటిదగున్,
పండుగ వేళల ముంగిటి
నిండుగ తోరణముఁ గట్ట నేమి కరువగున్?
విందుల పలు భక్ష్యమ్ముల
నందుచు బంధువులు కూడి యానందముతో
నుందురు, వారల వీరల
పొందుగ మర్యాదసలిపి మురిపెము తోడన్.
-----లక్ష్మీదేవి.