Loading...

17, జూన్ 2009, బుధవారం

మంచి మాటలు

విత్తంబు విద్య కులము
న్మత్తులకు మదంబొసగు మాన్యులకున్ స
ద్వృత్తినొసంగున్ వీనిం
జిత్తంబున నిడి మెలంగ జెలువు కుమారా!

కుమారా!
ధనము, విద్య, ఉన్నతకులము మదించిన వారికి గర్వము పెంచును.
మాన్యులకు మంచి స్వభావమును వృద్ధి చేయును.
ఈ విషయమును మనసులో ఉంచుకుని మెలగుట మంచిది.

పక్కి అప్పల నరసయ్య గారు రచించిన కుమార శతకములోనిది ఈ పద్యము.

విద్వాన్ దండిపల్లి వేంకత సుబ్బా శాస్త్రి గారు వ్యాఖ్యానం రాశారు.

3, జూన్ 2009, బుధవారం

భగవద్గీత

భగవద్గీత ప్రపంచంలోని అన్ని వ్యక్తిత్వ వికాస గ్రంధాల్లోకీ గొప్పదని నాకూ అనిపిస్తుంది. ఈ విషయం యండమూరి గారు చెప్పగా విన్నట్లు గుర్తు. మా చిన్నప్పుడు మా తాతగారు ఇంటి బయట అరుగు మీద కూర్చుని ప్రతిరోజూ శ్రావ్యంగా గీతా గానం చేసేవారు. వెళ్తూ వస్తూ వుంటున్నప్పుడు అందులోని శబ్ద సౌందర్యం నన్ను ఎంతో ఆకర్షించేది.

సర్వాలంకార శోభితమైనట్టి నవ వధువు/వరుడిని చూసినప్పుడు కలిగే నేత్రానందం, ఈ సంస్కృత సబ్ద సౌందర్యంలో ఉందనీ, అది చక్కగా గీతలో కర్ణానందం చేస్తుందని ఒప్పుకోని వాళ్ళెవరు చెప్పండి?

నేను ఆరవ తరగతి చదివేప్పుడనుకుంటా మా వూళ్ళో విశ్వహిందూ పరిషద్ వాళ్ళు భగవద్గీతా పఠనం పోటీలు పెట్టారు 18 శ్లోకాల్ని ఎన్నిక చేసి ఇచ్చారు. అందులో నేను మొదటి బహుమతి గెల్చుకున్నాను. అంగ్ల-తెలుగు చిన్న నిఘంటువు నొకదాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. అది ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.

తర్వాత వాళ్ళు మరిన్ని శ్లోకాల్ని ఎన్నిక చేసిచ్చి మళ్ళీ వచ్చి పోటీ పెడతామన్నారు కానీ రానేలేదు. కాకపోతే అందుకు నేను మా తాతగారి దగ్గర నేర్చుకున్న ఒక శ్లోకం నాకెంతగానో నచ్చి ఇప్ప్పటికీ గుర్తుండిపోయింది. తలుచుకున్నప్పుడు నేనేం చేస్తున్నా మొత్తం శ్లోకం అలా పెదాలమీద దొర్లిపోతుంది.

మత్కర్మకృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జిత:
నిర్వైర స్సర్వభూతేషు యస్సమా మేతి పాండవ!

తాత్పర్యం ఇలా ఉంది.
ఓ అర్జునా! ఎవడు కేవలం నా కొరకే సకల కర్తవ్య కర్మల జేయుచున్నాడో, మత్పరాయణుడో, ఆసక్తిరహితుడో సకల ప్రాణులయందు వైర భావము లేక యుండునో, అట్టి అనన్య భక్తులైన వారు నన్నే పొందుచున్నారు.

ఈ శ్లోకము భగద్గీత లోని 11 వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగములోని చివరిది.
ఇలాంటి శ్లోకాల్ని వినిపించటానికో వీటి గొప్పదనం తెలపటానికో ఇప్పటి తాతయ్యలకు అవకాశము లేదు. ఎందుకంటారా? కొంతమంది వృద్ధాశ్రమాల్లో వదలి వేయబడి వుంటారు. మరికొందరికి స్వయంగా ఆసక్తి ఉండక ఏ టి వి సీరియల్స్ చూడ్డమో, సినిమాలు చూడ్డమో చేస్తుంటారు.

ఇంకొంతమందికి ఇయర్ ఫోన్లు, సెల్ ఫోన్లు చెవులకు తగిలించుకుని ఏమాత్రం పలకరించినా కసురుకునే పిల్లల్ని చూస్తే భయం.

ఫలితాన్ని ఆశించకుండా పనిలో పూర్తి సామర్థ్యాన్ని చూపించమని సలహా ఇచ్చే,
పోరాటం అంటూ దిగాక తన పర భేదం వద్దని బోధించే,
మొదలెట్టిన ఏ పనినైనా ముగించకుండా వదలొద్దనే ,
ఇంకా ఎన్నెన్నో చెప్పే గీత కన్నా ఎక్కువగా వ్యక్తిత్వ వికాస గ్రంధాలు కానీ, కోచింగ్ సెంటర్లు గానీ ఏం చెపుతారబ్బా?