Loading...

29, జనవరి 2009, గురువారం

సంస్కృతంలో...రాశానోచ్!(తెలుగు లో కూడా చదవండి)

माधव प्रियं मालवी मल्लेश्वरम्
मया मानस गृहेसदा पूजितं|
मनमंदिरम् य: कुर्वन्ति दर्शनीयं

मनसा स्मरामि तं सुमनोहरं ||

ఇప్పుడు ఇదే తెలుగు లో .. .చిత్తగించండి.

మాధవ ప్రియమ్ మాళవీ మల్లేశ్వరం
మయా మానస గృహే సదా పూజితం|
మనమందిరం య: కుర్వన్తి దర్శనీయమ్
మనసా స్మరామి తం సుమనోహరం
-
లక్ష్మీదేవి.


కొంత సందిగ్ధత వల్ల కొంచెం మార్చాను.

24, జనవరి 2009, శనివారం

వికటకవి ...లాగా...

భాష మీద పట్టు ఉన్నవాళ్లు ఎలా అయినా పద్యాలు రాసి చమత్కారాలు చేయగలరు.
జుట్టున్నమ్మ లాంటి కొప్పయినా కట్టగలదన్నట్టు..
వాళ్లు ఎలా రాయగలరో గాని చదివి అర్థం చేసుకోవడానికే మనకు నిఘంటువు కావలసి వస్తుంది. ఇంతకీ తెలుగు-తెలుగు నిఘంటువు అంతర్జాలంలో దొరుకుతుంది -- telugunighntuvu.org
ఇక
ఇప్పుడు నేను పారిజాతాపహరణం లోని రెండు పద్యాలని ఇక్కడ రాయబోతున్నాను. నంది తిమ్మన గారు శ్రీ కృష్ణున్ని వర్ణిస్తూ రాసిన పద్యాలివి. బహుశా అందరికీ ఇవి తెలిసిన వై ఉండవచ్చును. కాని వీటిని నాకోసం పరిరక్షించుకోవడం కోసం రాసుకుంటున్నాను.
మొదటి పద్యం లో మొదటి అక్షరం నుంచి చివరికి, చివరి అక్షరం నుంచి మొదటికి అక్షరాల క్రమం ఒకేలా ఉంటుంది.

నాయసరగసార విరయ
తాయన జయసార సుభగధర ధీనియతా
తాయనిధీ రధగభసుర
సాయజనయ తాయరవిరసాగర సయనా

రెండవ పద్యం లో ఎ పాదానికి ఆ పాదానికి ఆ పాదం అట్నుంచి చదివినా ,ఇట్నుంచి చదివినా ఒకేలా ఉంటుంది.

ధీరవయనీయవరధీ
మారవిభానుమత మమత మనుభావిరమా
సారసవననవసరసా
దారద సమతారహార తామసదరదా

భలే గమ్మత్తుగా ఉన్నాయికదూ!

ఇకపోతే అసలు సంగతేమిటంటే వీటికి అర్థం, భావం తెలీవు. ఎక్కడో క్విజ్ లాగా ఇస్తే రాసిపెట్టుకున్నాను. విజ్ఞులెవరికైనా అర్థం తెలిస్తే వివరింప ప్రార్థన.

22, జనవరి 2009, గురువారం

వ్రతమూ-మనమూ

మససులో మాట సుజాత గారు రాసిన వ్రతము గురించి టపా చదివాక వ్యాఖ్య రాయబోతే అదే పెద్ద టపా అయింది. అందుకే నా బ్లాగులోనే రాస్తున్నాను.

చాలామంది వ్రతాల అనుభవాలు ఇలాగే ఉంటున్నప్పుడు మనం కొత్తగా ఒక ప్రయోగం చేద్దామనిపిస్తుంది. ఏంటంటే పూజ అంతా అయ్యాక కథలు మనం తలా ఒక కథ చెప్తే ఏం? ఎలాగు అన్ని కథలు మనకు తెలిసినవే కదా! పిల్లలకు తెలిస్తే వాళ్లు చెపితే ఇంకా బాగుంటుంది కదా!

మనమూ వ్యావహారిక భాషలో చెప్పడం వల్ల అందరికి చక్కగా అర్థం కూడా అవుతుంది. ఏమంటారు? ఎందుకంటే రుద్రాభిషేకాలు, మిగిలిన పూజల కన్నా ఈ సత్యనారాయణ వ్రతం ఎంతో సులభంగా చేసుకోగలిగేది. ఎంతో గొప్పదైన ఈ వ్రతము చేసుకున్నప్పుడు మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా అవుతుంది. ఇలాంటి గోప్పవ్రతమును ఇలాంటి చిన్న కారణాలవల్ల మనమూ ఆసక్తి ని కోల్పోకూడదని నా ప్రయత్నం.

ఒకవేళ పిల్లలు కథ పూర్తి గా చెప్పలేని పక్షంలో కథ మనం చెబుతూ వాళ్ళని చిన్న చిన్న ప్రశ్నలు వేయవచ్చును.
లేదా కథలో పాత్రల పేర్లు అడుగుతూ కథని కొంచెం ఆసక్తి కరంగా చేయవచ్చును. ఎప్పుడైనా అందరు కలిసి చేసినప్పుడే ఎ పనైనా విసుగు రాకుండా ఉంటుంది.

ఇంకో విషయం ఏమిటంటే మనముఎవరింటికైనా వెళితే వాళ్లు ఆహారపానీయాలు అందించి సంతోషిస్తారు. మనము వద్దంటే ఎంతో బాధ పడతారు. మనము కూడా వాళ్ళను బాధపెట్టకూడదని కొంచెం ఆలస్యమవుతుందని తెలిసినా వేచివుండి వారి ఆతిథ్యము తీసుకుని మరీ వస్తాము.( బహుశా ఈ పరిస్థితి ఏదో ఒకరోజు అందరికి ఎదురయ్యే ). అలాగే

మనము దేవుని ముంగిటిలో కెళ్ళి ప్రసాదం ఆలస్యమవుతుందనుకుంటే ఎట్లా?
ఏదో నాకు తోచింది రాశాను తప్పులుంటే విజ్ఞులు దిద్దగలరని ఆశిస్తాను.

19, జనవరి 2009, సోమవారం

ఎంత భాగ్య శాలివో..

నాకు తెలిసిన ఒక కన్నడ పాటని నాకు తెలిసినట్లు తెలుగులో రాసుకున్నాను.

ఎంత భాగ్యశాలివో ఎట్టి పుణ్యమో
ప్రాణనాథుఁ ప్రేమమీర సేవించే శ్రీదేవీ "ఎంత"
కోటి కోటి భక్త జనులు స్వామి సేవకు వేచివున్నా
సాటిలేని భక్తి తోటి నిత్య సేవ చేసేవు  "ఎంత"

సర్వలోకనాథుడైన .....సర్వ వ్యాపి విష్ణు మూర్తి
స్వామి సన్నిధి పొందినావు ధన్య వైతి వమ్మ నీవు "ఎంత"
గరుడ గమనుడైన వాడు చిత్త చోరుడైన వాడు
భక్త సులభుడైన  స్వామి మదిని నిలుచు నీవు  "ఎంత"
 
-లక్ష్మీదేవి.

15, జనవరి 2009, గురువారం

సందేహం

మిత్రులందరికీ నమస్కారం! నేను ఇంతవరకూ రాసినవన్నీ నా సొంత బుర్రలో పుట్టినవే. దేనికీ అనువాదం కాదు.సేకరించినవి కాదు. మరి ఈ నా బ్లాగుని ఎందుకు సేకరణలు విభాగంలో చేర్చారో తెలీదు. ఈ సందేహాన్ని మనమిత్రులెవరైనా తీరిస్తే సంతోషిస్తాను.

12, జనవరి 2009, సోమవారం

పునరపి జననం-2

చరాచర జగత్తులో ఉండే ఎన్నో వస్తువుల మీద ఆశ, వాటినన్నింటినీ పొందాలనే ఆశ, పొందేవరకూ జీవించాలనే ఆశ, ఎప్పటికీ జీవించాలనే ఆశ, తన బాధ్యతలు తీరేవరకూ ఉండాలనే ఆశ ..... ఎందుకీ ఆశలు?  

ఆశ మీద అసలు ఆశ ఎందుకు?  
బుద్ధ భగవానుడు  
అన్ని దుఖాలకు కోరికలే మూలం  
అని చెప్పాడు.

కోరికలు , ఆశలు లేకపోతే దు:ఖాలే ఉండవు.
దు:ఖం ఉండకూడనేదీ (సుఖం ఉండాలనే కదా తాత్పర్యం) ఆశే. సుఖ దు:ఖాలను సమానంగా , చేదుని తీపిని ఒకే రకంగా ఆస్వాదించడం మనకు ఎప్పుడు వంటబడుతుంది? చేదు మీద, తీపి మీద, సుఖం మీద, దు:ఖం మీద ఆశ పోయినప్పుడు.

ఆశ లేకపోవడం అంటే ఏమిటొ చిన్నప్పుడు అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు చక్కగా అర్థం అవుతూంది మంచి జరిగితే సరే, చెడు జరిగితే సరే ఏదైనా ఒకే రకంగా తీసుకోవడం కొంచెం కొంచెంగా అలవాటు అవుతూంది. మనము నిమిత్తమాత్రులమని జరిగేది జరగక మానదని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వ్రాసే కలానికి మనం ఏం వ్రాశామో తెలిసే అవకాశం లేదు. అవసరమూ లేదు. ఏ ప్రభావమూ ఉండదు. కాని మనకు ఈ అవసరం ఉంది. ఇదేవిధంగా మనకు, మనచుట్టూ జరిగే విషయాల మీద నియంత్రణ ఉండదని మనము అర్థం చేసుకోవాలి.మనం నిమిత్తమాత్రులమని అర్థం చేసుకోవాలి.
 
ఈ దేహం లోకి మనం రావటం, వెళ్ళిపోవటం కూడా మన ప్రమేయం లేకుండా జరిగినప్పుడు అర్థం కాదా మనము నిమిత్తమాత్రులమని. మనము వేరని దేహము వేరని అర్థం చేసుకోవాలి. మనది కాని దేహం మీద మన ప్రమేయం లేకుండా జరిగే ఈ ప్రపంచపు ఘటనల మీద ఆసక్తిని వదలాలని గుర్తించిన నాడు ఈ జర్జర దేహాన్ని వదిలేందుకు ఎటువంటి దు:ఖమూ మనల్ని బాధించే అవకాశము లేదు.

10, జనవరి 2009, శనివారం

సరస్వతీ నమస్తుభ్యం!


9, జనవరి 2009, శుక్రవారం

పునరపి జననం-1


పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం

ఆది శంకరాచార్యులవారు చెప్పిన ఈమాటలో ఎంత అర్థం ఉందో!
మళ్ళీ పుట్టుక మళ్ళీ చావుమళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, మళ్ళీ తల్లి కడుపులో శయనం. ఇది ఒక చక్రం. తిరుగుతూనే ఉండాలి.
లేకపోతే సృష్టి క్రమం ఆగిపొతుంది.

ఇవన్నీ నేను కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతాలు కావని నాకూ తెలుసు. అందరికీ తెలిసినవేనని తెలుసు.

అయినా తమకు చావు వస్తుందేమోనని ఎందుకూ భయపడటం?

మాకు తెలిసినావిడ 102 ఏళ్ళ వయసులో నిన్ననే పొయారు.

సుమారు ఐదారేళ్ళుగా తానెవరో ఎదుటివాళ్ళెవరో తెలీకుండా, కొడుకు కలిపి నొట్లొ పెడితే అర ఇడ్లీ లేదా అంత కొంచెం ఆహారం మాత్రమే తినగలుగుతూ మంచంలో ఉన్నావిడ. ఆవిడ పోతే పాపం ఇన్నేళ్ళకు ఆ ఆత్మ కు విముక్తి లభించింది అనిపించింది.

ఈ జర్జర దేహాన్ని వదిలి హాయిగా అనంత లోకాల్లో కలిసిపోయింది.

ఇది జర్జర దేహమే అని తెలిసినప్పుడు ఎప్పుడు పోతే ఏం?

చక్కటి ఆరోగ్యంతో నవనవలాడుతూ బంతిపూవులా ఉన్నప్పుడు ఏ హార్ట్ ఎటాక్ తోనో, ఏ ప్రమాదంలోనో పోతే మిగిలిన వాళ్ళంతా అయ్యో పాపం అని ఎందుకంటారు? కాళ్ళు చేతులు విరిగితేనో,కళ్ళు పోతేనో,నయం కాని దీర్ఘ వ్యాధి బారిన పడితేనో సంతాపం, సానుభూతి కలిగితే సరే కాని మరణిస్తే ఎందుకు సానుభూతి?

ఈ లోకంలో
అసూయా ద్వేషాల పంకిలంలో
కామక్రోధాగ్నిలో
కష్టనష్టాల సుడిగుండంలో

పడి కొట్టుకుంటూ ఉండటం కన్న మరణం భయంకరమైనదా? ఎంత మాత్రం కాదు. అది ఒక ఆత్మకు విముక్తి. జర్జర దేహం ఎప్పుడు వదిలేసినా ఒకటే

మంచి పండు రాలి పడితే కొన్ని మొక్కలు మొలకెత్తుతాయి.

దెబ్బతిన్న, కుళ్ళిపోయిన పండైతే నేల సారవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.అంతే తేడా.

ఏదో నాకు తోచింది చెప్పాను. తప్పులుంటే విజ్ఞులు దిద్దవలసిందిగా వేడుకోలు.

4, జనవరి 2009, ఆదివారం

మొదటి టపా గురించి

మా ఇంటి దైవం మాళవీమల్లేశ్వరులు అందుకేమాళవీ స్తుతి ఇంటిభాష కన్నడలోరాసింది అలాగేటపాగాజత చేశాను.కన్నడలో దేవుని పాటలు మాత్రమే ప్రయత్నిస్తుంటాను. తెలుగులో అన్నీ రాసేస్తుంటాను(సొంత డబ్బా) హి..హి..హి.. చదివే వాళ్ళ ఖర్మ ఏమో కానీ రాసినప్పుడు నాకు కలిగే తృప్తి ఉంది చూశారూ, అది సాటి లేనిది. త్వరలో నా పెన్సిల్ స్కెచెస్ కూడా అతికించబొతున్నాను. కాచుకోండి!!