Loading...

29, డిసెంబర్ 2022, గురువారం

భక్తి?

 इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः।

मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान् परः ॥

महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः।

पुरुषान्नपरं किञ्चित् सा काष्ठा सा परा गतिः॥


ఇంద్రియేభ్యః పరా హ్యార్థా అర్థేభ్యశ్చ పరం మనః।

మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్ పరః॥

మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషః పరః।

పురుషాన్నపరం కిఞ్చిత్ సా కాష్ఠా సా పరా గతిః।


కఠోపనిషత్.


ఇంద్రియాలకు గురి విషయాలు. విషయాలకు ఆధారం మనస్సు. మనస్సును నియంత్రించేది బుద్ధి. బుద్ధి కన్నా గొప్పది ఒక మహా ఆత్మ.  ఆ ఆత్మకూ పరమైనది అవ్యక్తమైనది. ఆ అవ్యక్తానికన్నా ఉన్నతమైనది పురుషః అన్నారు. (స్త్రీపురుషుల లెక్క కాదు.) కనిపించేదంతా ఏమి? జరిగేదంతా ఏమి? ఎలా? పునరావృతమవుతున్నదంతా ఏమి? ఏల? అని మూలాన్ని అందని లోతునూ, అందుకోలేని ఎత్తునూ అన్వేషించడంలో లేక  ఆరాధించడంలో జ్ఞానభక్తి మార్గాలు ఎన్నో చర్చలు చేసి, ఎన్నో తీరాలు చేరాయి. ఈ అన్వేషణ ఆకాశంలా, అనంతంలా మొదలూ కొనా లేనిది. ఎవరి చిదానందతీరం వాళ్ళే చేరగలరు. ఎవరి బంధ విముక్తి వారే పొందగలరు. 

అలాంటిది 'పాపం భక్తిలో పడిపోయారు' అని అదేదో తక్కువ స్థాయిగా భావించేవారున్నారని వింటుంటాం. ఎందుకు భావిస్తున్నారు అంటే భక్తి అంటే ఇప్పుడల్లా ప్రపంచంలో తెలిసినది ఆకారాలు, కళ్యాణాలు,  అభిషేకాలు, ఉపవాసాలు, నైవేద్యాలు, గోడలమధ్యని హారతులు, భజనలు వంటివి మాత్రమే. ఇవన్నీ ఎందుకు మొదలైనాయో, వీటి పరమార్థమేమిటో తెలుసుకునే అవకాశం గానీ ఓపిక గానీ మనకు లేవు. కళ్ళు తిరుగుతున్నా ఉపవాసాలు, గ్యాస్ ట్రబులున్నా నేతిచక్కెరల నైవేద్యాలు మానం. ఇలాగే మూడొంతుల మంది ఉండడంతో అంతో ఇంతో తెలిసి ఆ మార్గంలో ఉన్నవారిని కూడా అదే చట్రంలో తిరుగుతున్నవారనుకొని పాపం అంటున్నారు. అంటున్నవారికి తెలియనిదేమిటంటే తాము అంతకన్నా చిన్న చట్రంలో తిరుగుతున్న విషయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి