Loading...

29, డిసెంబర్ 2022, గురువారం

మెమ్మేటి

 మిథ్యాడంబర సంఘజీవనములో  మెమ్మేటి గా నొప్పి, నే

పథ్యమ్మందున డొల్లయై బ్రతుకునభ్యాసమ్ములన్మానుమా!

తథ్యమ్మెన్నడు నీదు కంటఁ బడునో దైవేచ్ఛ యెట్లున్నదో, 

కథ్యమ్మియ్యది చెప్పి వైచితిని నీ కర్మమ్ము నిన్వీడునే!

-లక్ష్మీదేవి 
శార్దూలవిక్రీడితము 

ఆశ్చర్యమే

 తొలి సింగారపు రశ్మితోనరుణమై తూర్పెల్ల వెల్గొందగా

పలు జీవమ్ములు కర్మనిష్ఠతపమున్ ప్రారంభముంజేయగా

నిల చక్రమ్మిది నిత్యయానమును తానివ్వారు సాగింపగా

నల దివ్యాత్ములు నెవ్వరేర్పరచిరో, యాశ్చర్యమెప్పొద్దునన్.

--లక్ష్మీదేవి 
మత్తేభవిక్రీడితము 

భక్తి?

 इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः।

मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान् परः ॥

महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः।

पुरुषान्नपरं किञ्चित् सा काष्ठा सा परा गतिः॥


ఇంద్రియేభ్యః పరా హ్యార్థా అర్థేభ్యశ్చ పరం మనః।

మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్ పరః॥

మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషః పరః।

పురుషాన్నపరం కిఞ్చిత్ సా కాష్ఠా సా పరా గతిః।


కఠోపనిషత్.


ఇంద్రియాలకు గురి విషయాలు. విషయాలకు ఆధారం మనస్సు. మనస్సును నియంత్రించేది బుద్ధి. బుద్ధి కన్నా గొప్పది ఒక మహా ఆత్మ.  ఆ ఆత్మకూ పరమైనది అవ్యక్తమైనది. ఆ అవ్యక్తానికన్నా ఉన్నతమైనది పురుషః అన్నారు. (స్త్రీపురుషుల లెక్క కాదు.) కనిపించేదంతా ఏమి? జరిగేదంతా ఏమి? ఎలా? పునరావృతమవుతున్నదంతా ఏమి? ఏల? అని మూలాన్ని అందని లోతునూ, అందుకోలేని ఎత్తునూ అన్వేషించడంలో లేక  ఆరాధించడంలో జ్ఞానభక్తి మార్గాలు ఎన్నో చర్చలు చేసి, ఎన్నో తీరాలు చేరాయి. ఈ అన్వేషణ ఆకాశంలా, అనంతంలా మొదలూ కొనా లేనిది. ఎవరి చిదానందతీరం వాళ్ళే చేరగలరు. ఎవరి బంధ విముక్తి వారే పొందగలరు. 

అలాంటిది 'పాపం భక్తిలో పడిపోయారు' అని అదేదో తక్కువ స్థాయిగా భావించేవారున్నారని వింటుంటాం. ఎందుకు భావిస్తున్నారు అంటే భక్తి అంటే ఇప్పుడల్లా ప్రపంచంలో తెలిసినది ఆకారాలు, కళ్యాణాలు,  అభిషేకాలు, ఉపవాసాలు, నైవేద్యాలు, గోడలమధ్యని హారతులు, భజనలు వంటివి మాత్రమే. ఇవన్నీ ఎందుకు మొదలైనాయో, వీటి పరమార్థమేమిటో తెలుసుకునే అవకాశం గానీ ఓపిక గానీ మనకు లేవు. కళ్ళు తిరుగుతున్నా ఉపవాసాలు, గ్యాస్ ట్రబులున్నా నేతిచక్కెరల నైవేద్యాలు మానం. ఇలాగే మూడొంతుల మంది ఉండడంతో అంతో ఇంతో తెలిసి ఆ మార్గంలో ఉన్నవారిని కూడా అదే చట్రంలో తిరుగుతున్నవారనుకొని పాపం అంటున్నారు. అంటున్నవారికి తెలియనిదేమిటంటే తాము అంతకన్నా చిన్న చట్రంలో తిరుగుతున్న విషయం.

28, డిసెంబర్ 2022, బుధవారం

ఆశ్చర్యం

 తొలి సింగారపు రశ్మితోనరుణమై తూర్పెల్ల వెల్గొందగా

పలు జీవమ్ములు కర్మనిష్ఠతపమున్ ప్రారంభముంజేయగా

నిల చక్రమ్మిది నిత్యయానమును తానివ్వారు సాగింపగా

నల దివ్యాత్ములు నెవ్వరేర్పరచిరో, యాశ్చర్యమెప్పొద్దునన్.

--లక్ష్మీదేవి 
మత్తేభవిక్రీడితము 

25, డిసెంబర్ 2022, ఆదివారం

ఊగు

 సిరిహేమంతసమీరవీచికలలో చిన్నారిపత్రమ్ముపై

విరిపై నూగు తుషారబిందువులలోబృందావనాలోలునిన్

కరుణావార్నిధిఁగంటిఁగల్పనను నేఁగన్నార సంతృప్తనీ

తరుణమ్మందున ధన్యనైతి మది తాదాత్మ్యమ్మునివ్వేళనున్.

--లక్ష్మీదేవి 
మత్తేభవిక్రీడితము 

24, డిసెంబర్ 2022, శనివారం

మధురం

 శిశుపాలవధలోని మాఘుని శ్లోకము.

దృతవిలంబితము

-

మధురయా మధుబోధితమాధవీ మధుసమృద్ధిసమేధితమేధయా

మధుకరాంగనయా ముహురున్మదధ్వనిభృతా నిభృతాక్షరముజ్జగే

--

మధురమై మధుమాసపు మాధవీలత సమృద్ధి యలై మధువూరగా

మధుకరాంగనలున్మరి మత్తుగాధ్వనులఁ బాడిరి తన్మయమందగా


-లక్ష్మీదేవి.

దృతవిలంబితము.


#నాపద్యానువాదాలు



11, డిసెంబర్ 2022, ఆదివారం

చల్లగా

 ఎంతే కష్టములెన్నియున్న నిటులే హేరాళమౌ ధీరతన్ ,

సంతోషమ్మున కంతులేని కతమున్ సంగమ్ము శోభిల్లగా ,

శాంతిన్ సౌఖ్యము నిండు జీవనముగా స్వాంతమ్ములుయ్యాలగా,

చింతాకంతయుఁ జింతలేని బ్రదుకై జీవించుమా చల్లగా,

10, డిసెంబర్ 2022, శనివారం

ఉండవా?

 విచ్చుకత్తుల వంటి చూపుల భీకరమ్మగు యుద్ధముల్

పచ్చినెత్తురు కాల్వలై యిలఁ బారుచుండెడి కాలముల్

వచ్చి పోయినవంచుఁ బల్కుచుఁ భ్రాంతినుండును లోకముల్

రచ్చకెన్నడు రానివయ్యు, నిరంతరమ్మిట నుండవే?


- లక్ష్మీదేవి 

మత్తకోకిల.

3, డిసెంబర్ 2022, శనివారం

ఆకాంక్ష

 వ్యమ్మైన కథావిధానముల, భిన్నమ్మైన చిత్రోక్తితో
వ్యమ్మైన మనోవినోదములతో క్వంపు ధారార్ద్రమై
దివ్యమ్మౌ పదగుంఫనంపు కళలుద్దీపించు శబ్దాళితో
కావ్యమ్మున్ రచియింపగా కవియునాకాంక్షించు నాంతర్యమున్.

-లక్ష్మీదేవి 
శార్దూలవిక్రీడితము 

తల్లడిల్లె

 యీ ప్రపంచమెల్లఁ గాంచగా మరింతగా

నుల్లమిట్లు తల్లడిల్లి యోడె నెంతనొచ్చెనో

ముల్లుఁ గుచ్చు తీరునుండి పువ్వులౌ మనమ్ములన్

మెల్లమెల్లడంచుచుండె మిక్కుటంపు క్రూరతన్.


-లక్ష్మీదేవి 

ఉత్సాహ/సుగంధి 

2, డిసెంబర్ 2022, శుక్రవారం

సమీరమై

 సాయంకాల సమీరమై యలలుగా సౌగంధసౌభాగ్యమున్
మోయంజాలు నిధానమై వనులలో పుష్పమ్ముతో నుందు, నీ
కాయంబందు వసించుటేల జగతిన్ ర్మానుసారమ్మొకో?
నాయందుండు తలంపిదే, తెలిపితిన్నన్నట్లు మార్చంగదే!

--లక్ష్మీదేవి 
శార్దూలవిక్రీడితము 

1, డిసెంబర్ 2022, గురువారం

స్వామి

 నభో నీలవర్ణం అనంతాత్మ దేహం

స్వభావాత్ పునీతం నిసర్గప్రణేతం

శుభం సుందరం పుణ్య శుద్ధాంతరంగం

గభీరం ఘనం తం అగాధం నమామి.


--లక్ష్మీదేవి 

భుజంగప్రయాతము.