Loading...

28, ఫిబ్రవరి 2022, సోమవారం

కల్లోలము

 కల్లోలమ్ముల మున్గెనే జగతి, దుష్కర్మమ్ము సామాన్యమై,

యుల్లాసమ్ములు మాయమై చెడుకిదే యోకమ్ముగా మారెనే,

పల్లెల్ పట్నములెల్లెడల్ భయములున్ వ్యాపించె విస్తారమై,

యల్లల్లాడెను జీవజంతువులు యే యంతమ్ము ఎట్లుండునో!


--లక్ష్మీదేవి.

శార్దూలము.

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఏమో మరి!

 వైద్యుల (అల్లోపతీయే) దగ్గరకు ఏ జ్వరానికో, కడుపునొప్పి కో ఇలా చిన్నవాటికి దేనికి వెళ్ళినా రక్తం అదే హిమోగ్లోబిన్  తగినంత ఉందా లేదాని కనీసం కళ్ళు, గోళ్ళు, నాలుక పరీక్ష చేసేవారు. అవి కొద్దిగా ఎఱుపురంగులో ఉంటే ఫర్వాలేదు, ఉందని నిర్ధారించేవారు, స్టెతస్కోపుతో గుండెగతి, నాడి అదే పల్స్ పరీక్షించాకే మిగతా వివరాలు వినేవారు. కాలక్రమంలో అన్నీ మానేశారు. రక్తపరీక్షకు పంపడమే. కోవిడ్ లో ఉంటేనే పల్స్, హార్ట్ బీట్ చూడాలనడం ఇప్పుడొచ్చింది. 

ఇవన్నీ ఎందుకు వదిలేశారో! అది అల్లోపతికి కూడా ముఖ్యమే కదా! 


पाणिपादतले रक्ते नेत्रान्तौ च नखास्तथा।

तालु-जिह्वा-अधरोष्ठं च सप्तरक्तः सुखी भवेत्॥

-- महाभाग्यलक्षणानि।

పాణిపాదతలే రక్తే నేత్రాంతౌ చ నఖాస్తథా।

తాలు-జిహ్వా-అధరోష్ఠం చ సప్తరక్తః సుఖీభవేత్॥

--మహాభాగ్యలక్షణాలు.

అని ప్రాచీనోక్తి.


అరచేతులు, అరికాళ్ళు, కంటి చివరలు, గోళ్ళు, దవడ, నాలుక, క్రింది పెదవి ఈ ఏడింట ఎఱుపురంగు ఉన్నవాళ్ళు సుఖపడతారు. ఏడు కాకున్నా మూడు చూసేవారు.


ఆరోగ్యమే కదా మహాభాగ్యం.

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

తమములు

 చీకట్లు క్రమముగా అలముకుంటున్న వేళను శ్రీహర్షుడు తన 'రత్నావళి' రూపకంలో ఎంత సహజసుందరంగా వర్ణించాడో , అంతే అందంగా మరిన్ని హంగులు చేర్చి అంత భావాన్నీ సహజసుందరంగా చంపకమాలలో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రత్నావళి తెలుగు అనువాదంలో కూర్చిన విధానం చదవడం ఆనందంగా అనిపించింది. 😊😊


తొలి తొలి తూర్పుఁ గొండదెసఁ దోఁచి, క్రమంబుగ నున్న యన్ని ది

క్కుల యెడ నేచి, చెట్టులును గుట్టలు పట్టణముల్ సమస్త భూ

స్థలులను నాఁచి, బిట్టుబలితంబయి యెల్లెడ నెల్లవారి చూ

పుల నరికట్టి వైచెఁ దమముల్ హర కంఠ రుచి ప్రదీప్తముల్.


తొలిగా తూర్పు వైపు మొదలై, క్రమంగా అన్ని దిక్కులకూ పాకి, చెట్లు గుట్టలు, పట్టణాలు మొదలైన భూస్థలాలన్నీ ఆక్రమించి,  అన్నిచోట్లా అందరి చూపులను మందగింపజేస్తూ హరుని కంఠపు నీలాలై చీకట్లు బలీయమౌతున్నాయి.


సులువుగా అర్థమయ్యే సరళమైన తెలుగు. అంత్యానుప్రాస, అనుప్రాస,క్రమాలంకారాలతో స్వభావోక్తిలో చక్కటి ధారతో తమములు ఎల్లెడ వ్యాపించే విధానాన్ని విహంగ వీక్షణం చేయించారు.

ఇందులో ఉన్న మరో విశేషమేమంటే ఇందులో కొన్ని పదాలు మాత్రం మారిస్తే  చీకట్ల వ్యాప్తి బదులు వెలుగుల వ్యాప్తిని వర్ణించవచ్చు.


శ్రీహర్షుని సంస్కృతమూల శ్లోకం. శిఖరిణీ వృత్తం


पुरः पूर्वामेव स्थगयति ततोऽन्यामपि दिशं

क्रमात्क्रामन्नद्रिद्रुमपुरविभागांस्तिरयति।

उपेतः पीनत्वं तदनु भुवनस्येक्षणफलं

तमः संघातोऽयं हरति हरकण्ठद्युतिहरः॥ 


श्रीहर्ष कृत रत्नावली तृतीयोऽङ्कः


పురః పూర్వామేవ స్థగయతి తతోఽన్యామపి దిశం

క్రమాత్క్రామన్నద్రిద్రుమపురవిభాగాంస్తిరయతి।

ఉపేతః పీనత్వం తదను భువనస్యెక్షణఫలం

తమః సంఘాతోఽయం హరతి హరకంఠద్యుతిహరః॥


శ్రీ హర్ష విరచిత రత్నావళీ తృతీయాంకము.


కానీ వీటి కథావస్తువు, కథాగమనం అంతగా ఆకట్టుకోదు. రసాభాస ఎక్కువ.