Loading...

14, నవంబర్ 2020, శనివారం

చెమ్మ చెక్క

 

చెమ్మ చెక్క ఆటల గురించి తెలీనివాళ్ళు జోకులు వేస్తారు గానీ ఆడినవాళ్ళకు అది ఆడేటప్పుడు ఎలా ఆనందంగా ఉంటుందో, శక్తిదాయకంగా అనిపిస్తుందో తెలుస్తుంది. ఇది చూసి నవ్వేవాళ్ళకు అది తెలీదంతే.
అలా చేతులు పట్టుకొని గిఱ్ఱున తిరగడం భలే ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. శరీరంలో నరాలన్నీ ఒక్కసారి యాక్టివ్ అవడం మంచిదా, కాదా సైన్స్ వాళ్ళు చెప్పాలి మరి. మంచిదనే చెప్పగలరు, ఇంకేం లేదు చెప్పడానికి.
పెద్దవాళ్ళైనామని ప్రతీదీ మానేస్తే మనంత దద్దమ్మలు, ఈ మాట బాలేదు, మనంత మొద్దులు  ఎవరూ ఉండరు.
-
పండరీ పురం గుడి లోపల ఇలా చేతులు పట్టుకొని గిఱ్ఱున తిరిగే కార్యక్రమం ఒక ఆచారం. ఆ గుడికి వెళ్ళినప్పుడు నేను భలే ఆశ్చర్య పోయాను. ఎందుకంటే నేనూ ఇలా తిరిగి ఎన్నేళ్ళో అయిపోయింది.
అక్కడ పెద్దా, చిన్నా తారతమ్యం లేదు. సామాన్యంగా ఆడవాళ్ళంతా ప్రాంగణంలో ఒకవైపుకి, మగవాళ్ళంతా ఒకవైపుకి వెళ్ళిపోతారు దర్శనానంతరం. కాబట్టి మగవాళ్ళు చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, ఆడవాళ్ళు మాత్రం ఎలాగూ ఒంటరిగా రాకుండా వాళ్ళ నెచ్చెలులతో వచ్చి ఉంటారు స్థానికులు. చక్కగా ఆడుతున్నారు. గుళ్ళో ప్రదక్షిణ , నమస్కారమంత ముఖ్యమది అక్కడ. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఒక్కసారి మెల్లగా అయినా సరే తిరిగి కూర్చుంటున్నారు.
ఎంత బాగుంటుందో అసలు!



ఏకాంత్

 

మొదటి సహస్రాబ్దము నుంచి గత సహస్రాబ్దము సగము వరకు కొందరు కట్టిన, మరికొందరు పడగొట్టిన భవ్యమైన కోటలు, నగరాలు ఇప్పటి భారతదేశంలోపలివి ఏవైతే ఉన్నాయో, వాటి గురించి చాలా చిన్న పరిచయం, కొన్ని వివరాలు, మరికొన్ని కథలు, ఒక మంచి ఫోటోగ్రఫీ తో పాటు కొంచెంగా వ్యాఖ్యానిస్తూ ఒకే వ్యక్తి (అకుల్ త్రిపాఠీ)- వెరసి 'ఏకాంత్' సిరీస్.
two seasons - 25 & 12 episodes - each 20 mts.
ప్రైమ్ లో ఉంది. 2014 లో తీసినది. ఈ సిరీస్ ను ఎందరో చూసి ఉండొచ్చు. ఎందరో చూసి ఉండకపోవచ్చు. అందుకే ఈ వివరాలు.
--
చరిత్ర, పురాతత్వ పరిశోధన, ఫోటోగ్రఫీ, పర్యటన -
ఈ విషయాలలో ఎందులో ఆసక్తి ఉన్నా, తప్పకుండా చూడొచ్చు. ఎక్కడా విసుగురానివ్వకుండా చక్కగా తీశారు. ముఖ్యంగా ఆ యా ప్రాంతం పూర్తిగా కనిపించేలా, అవగాహన వచ్చేలా high angle shots, bird view shots & aerial shots superb గా ఉన్నాయి.
కొన్ని ఈమధ్యే కట్టినట్టు మొత్తంగా కనిపిస్తుంటే , కొన్ని చోట్ల కొన్ని గోడలు తప్ప ఏం ఉండవు.
వీటిలో సరైన చరిత్ర తెలుస్తుందా? ఇవన్నీ ఎంత మేరకు యథార్థాలు అన్న చర్చకు ఇందులో స్థానం లేదు. కేవలం చిన్న పరిచయం, దృశ్యవీక్షణం అంతే.
ఇందులో ఒక్కో ఎపిసోడ్ లో ఒక స్థలం గురించి ఉంటుంది. అన్నీ వేటికవే. ఏది కావాలంటే అది చూసుకోవచ్చు.
ఆయా ప్రాచీన చారిత్రక స్థలం, అక్కడ పడిపోగా/పడగొట్టగా మిగిలిన/పునరుద్ధరించబడిన కట్టడాలు చూపిస్తూ,
అక్కడి ఆర్కియాలజీ శాఖ ఉద్యోగులు , చరిత్ర అధ్యాపకులు, స్థానిక చరిత్రను పాడే జానపదులు, ఆ నోటా ఈ నోటా విన్న కథలు చెప్పే ప్రజలు వీరిద్వారా కొన్ని వివరాలు అందజేస్తారు.
ఆ కథలకు అనుగుణంగా graphics తో ఆ కాలం నాటి దృశ్యాలను కొన్ని stills ద్వారా చూపిస్తారు.
సాదా మాటల్లో స్పష్టమైన క్లుప్తకథనం. స్క్రిప్ట్ ఎవరు వ్రాశారో వివరాలు తెలియలేదు. అకుల్ త్రిపాఠీనే వ్రాసుకొని ఉండొచ్చు అనుకుంటున్నా.
ఏమాత్రం emotional/sentimental baggage లేదు.
--
మొదటి సీజన్ లో చూపినవి -
 
కుల్ ధారా,విలాస్ గఢ్, భాన్ గఢ్, రామ్ గఢ్ (రాజస్థాన్)
చిక్టన్, న్యార్మా హరిపర్వత్ (కాశ్మీర్)
లఖ్ పత్, రోహా, చంపనీర్ (గుజరాత్)
ఓర్చా (బుందేల్ ఖండ్-ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్)
మురుంద్ జంజీరా(కొంకణతీరపు మహారాష్ట్ర)
తాలక్కడ్ (మైసూర్ దగ్గరి కావేరీ తీరం, కర్ణాటక)
హళేబీడు, కిత్తూరు (కర్ణాటక)
సెల్యూలర్ జైల్, రాస్ ద్వీపము (అండమాన్)
ఉన్నకోటి (త్రిపుర)
శిబ్ సాగర్ (అసోం)
నలందా, వైశాలి(బీహర్)
హంపి(కర్ణాటక)
లక్నో (ఉత్తర్ ప్రదేశ్)
బిష్ణుపుర్ (బెంగాల్)
విజయ్ దుర్గ్ (మహారాష్ట్ర)
 
రెండో సీజన్ చూడాలింకా.
 
రాయగఢ్ (మహారాష్ట్ర)
కుంబల్ గఢ్ (రాజస్థాన్)
అసీర్ గఢ్ (మధ్యప్రదేశ్)
బిజాపుర్(కర్ణాటక)
దౌలతాబాద్(మహారాష్ట్ర)
బర్హన్ పుర్ (మధ్యప్రదేశ్)
కాంగ్డా (హిమాచల్ ప్రదేశ్)
జగేశ్వర్ (ఉత్తరాఖండ్)
జమ్ము , లెహ్ (కాశ్మీర్)
భటిండా (పంజాబ్)
మెహ్రౌలి (దిల్లీ)
--

 
 

13, నవంబర్ 2020, శుక్రవారం

ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?

 

 

ఒకానొక కవితాసంకలనం లోని 36 ముక్త కవితల్లో ఒకటి మోహనమురళి. మోగేరి గోపాలకృష్ణ అడిగ అనే కవి వ్రాసిన ఈ కవిత కన్నడ సాహిత్యంలో జనప్రియమై, ప్రసిద్ధమైనది. ప్రతి రెండు పంక్తులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాసలు లయబద్ధత, గేయసౌలభ్యం ఉండడం ఇందులో విశేషాలు.
---
స్థూలంగా ఇందులోని విషయం లౌకికప్రవృత్తికి, అలౌకిక అన్వేషణకు మధ్య ఊగిసలాడు అంతరంగపు ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు.
స్వగతంలో మధ్యమపురుషలో మాట్లాడుకుంటున్న ఒక నాయకుని/నాయిక యొక్క స్పష్టాస్పష్టంగా ఉన్న భావాల కలబోతగా ఇది సగటు మనిషి యొక్క సందిగ్ధతను అద్దంలో చూపిస్తుంది.
--
లౌకిక తృష్ణల పంజరమైన దేహంలో ఇరుక్కున్న అంతః చేతన చేరలేని ఆధ్యాత్మ తీరాలకై ఆరాటపడుతోంది. ఆరాటమెంత ఉన్నా వీటిని దాటి వెళ్ళనూ లేదు, రక్తి విరక్తి గా మారగా ఉన్న ‘బంధాల’నే బంధనాలను వదిలిపోవాలనుకున్నా పోనూలేక ఉండనూలేక కొట్టుమిట్టాడుతుంది.
లౌకిక బంధనంలో ఉన్న మనసును ‘ఏ మోహనమురళీ రవము పిలుస్తోంది నిన్ను? ఏ బృందావనాలు ఈ మర్త్యనయనాలను ఆకర్షిస్తున్నాయి?’ అన్న ప్రశ్నతో మొదలౌతుంది.
పిలుపు విన్నా అక్కడిదాకా చేరలేని ‘చర్మ’చక్షువుల అశక్తతను ఎత్తిచూపిస్తూ ఈ పదం ఇక్కడ అవసరం అనిపిస్తుంది. తర్వాతి పంక్తులలో అది నిరూపణ అవుతుంది.
---
*మురళి, బృందావనాలు రాసలీలలతో పాటుగా ఆధ్యాత్మిక అంతరార్ధాలకు సమానంగా ప్రాచీన సాహిత్యంలో వర్ణింపబడినాయి.
వీటి పిలుపు వేణుగానము వలె ఆకర్షణీయమవడం,
* మానవుని అంతఃకరణము తానున్న తృష్ణపంజరమనే దేహాన్ని దాటి ఏ దివ్యతీరాలకో చేరాలనుకోవడం ,
*లౌకిక వాతావరణం మీద ఆసక్తి నశించినా ఈ కంచెను దాటి వెళ్ళలేకపోవడం
అన్న సందిగ్ధ స్థితి వర్ణన ఇందులో ఉంది.
అయితే ఆ ఉందనిపిస్తున్నదేదో ఉందోలేదో, చేరగలమో లేదో కవి ఇతమిత్థంగా తేల్చి ఏమీ చెప్పడం లేదు. ఉందేమో అన్న భావన ఒక మురళీ రవమై పిలిచి ఆకర్షిస్తున్నట్టు, కానీ ముందడుగు వేయలేని తన అశక్త యథార్థ స్థితి పై విరక్తితో ఉన్నట్టూ తెలుస్తుంది.
----
భావము సుమారుగా ఇలా ఉంది
ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?
ఏ దూర బృందావన తీరాలకు లాగుతోంది?
పువ్వులశయ్యలు, చందనచర్చలు, వెన్నెలలో బాహుబంధనాలు, చుంబనాలు ఎన్నో విరిసే ఈ తృష్ణవనపు హద్దులలోపలే ఇంద్రియాల ప్రతిధ్వనిలో (కూడా వినిపించేలా) ఏ మోహనమురళీరవము పిలుస్తోంది నిన్ను?
ఏ దూర బృందావన తీరాలకు లాగుతోంది?
రాగార్ద్రమైన హృదయము(ప్రేమతో తడిసి మెత్తబడిన మనసు), వెచ్చని స్పర్శలు చుట్టిన పంజరము, ఇదే చాలని కదా అనుకున్నావు? మరి ఈరోజు ఏల ఈ విరక్తి?
(చూపు అటు కానీ, ఇటు కానీ నిలువని) చంచలమైన ఈ కనులలో చూపేమి వెదుకుతోంది? ఇది మధుర యాతనా? దివ్యమైన యాచనా?
దారువులో అగ్ని దాగినట్టు ఈ విరక్తి నీలో ఎక్కడ దాగిఉండిందో , ఒక్కసారి అడవిలో కార్చిచ్చులా అంగాంగాలనూ దహిస్తోంది!
సప్తసాగరతీరాలంత దూరంగా(చేరలేనట్టుగా) ఉందా నీ నిదురించిన అంతఃకరణసాగరము? ఎగసి పడని ఆ అలల మూగసద్దులు ఇక్కడికి చేరాయా?
ఈ ప్రాణము వశము తప్పినది, ఈ దేహపంజరములో ఉన్న చేతన స్వ అధీనములో లేదు. ఉన్నవన్నీ వదలి లేనివాటికై తపించుటే జీవనమా?
------
సుమారుగా ఆ రాగంలో ఒక ప్రయత్నము---
-----
*దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
ఏవొ బృందావనములిట్టుల
కనుల నాకర్షించెనో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*పూలశయ్యల గంధజ్యోత్స్నల బాహుబంధన చుంబనముల
తృష్ణవనముల సీమలోపల ఇంద్రియమ్ముల నిస్వనముల
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*రాగరంజిత మానసమ్ములు వెచ్చదనముల స్పర్శలు
ఇంతె చాలని అంటివే? నేడు ఈ విసుగేలనో!
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*చంచలంపు కన్నులందున తేలె చూపుల సూచనేమో?
ఏమిది? మధుతర యాతనో ? దివ్యమగు ఏ యాచనో?
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*దారువందలి అగ్నివోలెనె ఎచటనున్న విరాగమో
సాధనన్వేషణల తీరున అంటుకున్న ఆవేగమో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*సప్తసాగరతారణమ్ముల సుప్తసాగర మంతరంగమొ
అంకురించని అలలగర్జన ఎట్లు నిన్నిటు చేరెనో
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
*వివశమైనది ప్రాణము పరవశము నీ యీ చేతనం
చెంతనున్నది వీడి, లేనివాటికి తపనే జీవనం!!
దూరతీరపు మురళి నిన్నెటు
మోహనమ్ముగ పిలిచెనో!
ఏవొ బృందావనములిట్టుల
కనుల నాకర్షించెనో!
---
( రికార్డులలో అన్ని చరణాలూ ఉండవు.) ఈ లయలో బాగా కుదురుతుందీ పాట.

వినొచ్చు.
ಯಾವ ಮೋಹನ ಮುರಳಿ ಕರೆಯಿತು ದೂರ ತೀರಕೆ ನಿನ್ನನು?
ಯಾವ ಬೃಂದಾವನವು ಸೆಳೆಯಿತು ನಿನ್ನ ಮಣ್ಣಿನ ಕಣ್ಣನು?
ಹೂವು ಹಾಸಿಗೆ, ಚಂದ್ರ, ಚಂದನ, ಬಾಹುಬಂಧನ ಚುಂಬನ;
ಬಯಕೆತೋಟದ ಬೇಲಿಯೊಳಗೆ ಕರಣಗಣದೀ ರಿಂಗಣ;
ಒಲಿದ ಮಿದುವೆದೆ, ರಕ್ತ ಮಾಂಸದ ಬಿಸಿದುಸೋಂಕಿನ ಪಂಜರ;
ಇಷ್ಟೇ ಸಾಕೆಂದಿದ್ದೆಯಲ್ಲೋ! ಇಂದು ಏನಿದು ಬೇಸರ?
ಏನಿದೇನಿದು ಹೊರಳುಗಣ್ಣಿನ ತೇಲುನೋಟದ ಸೂಚನೆ?
ಯಾವ ಸುಮಧುರ ಯಾತನೆ?ಯಾವ ದಿವ್ಯ ಯಾಚನೆ?
ಮರದೊಳಡಗಿದ ಬೆಂಕಿಯಂತೆ ಎಲ್ಲೊ ಮಲಗಿದ ಬೇಸರ;
ಏನೋ ತೀಡಲು ಏನೋ ತಾಗಲು ಹೊತ್ತಿ ಉರಿವುದು ಕಾತರ.
ಸಪ್ತಸಾಗರದಾಚೆಯೆಲ್ಲೋ ಸುಪ್ತಸಾಗರ ಕಾದಿದೆ,
ಮೊಳೆಯದಲೆಗಳ ಮೂಕ ಮರ್ಮರ ಇಂದು ಇಲ್ಲಿಗು ಹಾಯಿತೆ?
ವಿವಶವಾಯಿತು ಪ್ರಾಣ; ಹಾ ಪರವಶವು ನಿನ್ನೀ ಚೇತನ;
ಇರುವುದೆಲ್ಲವ ಬಿಟ್ಟು ಇರದುದರೆಡೆಗೆ ತುಡಿವುದೆ ಜೀವನ?

 
 
 


చిక్కనిపువ్వు

 

పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పద్యము -
ఉ .
పరుల ప్రశంస సేసి నవ భాగ్యములందుట కంటె, నాత్మ సు
స్థిరుడయి పున్క పాత్రమున దిన్నను నా మది జింత లేదు, యీ
శ్వరు గుణ తంద్ర గీతముల బాడుదు, జిక్కని పూవు వోలె నా
పరువము వాడకుండ నిలపై మని రాలిన జాలు సద్గురూ !
- పాద్యము నుండి.
-
పరులను పొగడి డబ్బు సంపాదించడం కంటె, (ప్రలోభాల వల్ల అటూ ఇటూ అల్లాడక ) మనసును స్థిరంగా ఉంచుకొని, బొచ్చెలో తిన్నా నా మనసులో చింత లేదు, ఈశ్వరుని గుణగానములు పాడుచు, చిక్కని పువ్వులా పదను వాడకుండా ఇలపై జీవించి రాలిపోతే చాలు గురువర్యా!
-
చిక్కని పువ్వు అంటే ముద్దమందారం, చెండు(బంతి)పువ్వు లా దట్టంగా రేకులు ఉన్న పువ్వు అని తీసుకోవచ్చు. చిక్కని అనే పదం కూడా ఇక్కడ సార్థకంగా వాడినట్టు తెలుస్తున్నది. రేకు మందారము గాని, ఇతర పువ్వులేవైనా వాడినంత త్వరగా ముద్దమందారము, చెండు(బంతి)పువ్వు వాడవు. ఇంకొంచెం కాలం తాజాగా ఉండగలవవి. అందుకే చిక్కని అన్న పదము పద్యము లోని పదను వాడకుండా అన్న భావానికి పొందికగా అమరి పోయింది.

ఏం జరుగుతుందో-జరగాల్సింది జరుగుతుంది.

 

when I was just a little girl
I asked my mother what will I be
Will I be pretty will I be rich
Here's what she said to me
Que sera sera
Whatever will be, will be.
The future's not ours to see
Que sera sera
What will be, will be.
when i was just a child in school
i asked my teacher what will i be
should i paint pictures should i sing songs
Here's what she said to me
Que sera sera
Whatever will be, will be.
The future's not ours to see
Que sera sera
What will be, will be.
When I grew up and fell in love
I asked my sweetheart what lies ahead
Will we have rainbows day after day
Here's what my sweetheart said
Que sera sera
Whatever will be, will be.
The future's not ours to see
Que sera sera
What will be, will be.
Now I have children of my own
They ask their mother what will I be
Will I be handsome will I be rich
I tell them tenderly
Que sera sera
Whatever will be, will be.
The future's not ours to see
Que sera sera
What will be, will be.
Que sera sera


10, నవంబర్ 2020, మంగళవారం

చదువరులు

 చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి

భారతప్రాంతపు పులులకు మంచి రక్షణ - మంచి మాట

పులుల సంఖ్య తగ్గిపోతుండడం, దానికి తగిన చర్యలు ప్రభుత్వ ప్రైవేట్ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతుండడం వింటుంటాం. అయితే ఇందులో ఒక శుభవార్త ఏమిటంటే ఈ ప్రయత్నాల ఫలితంగా పులుల సంఖ్య కొద్ది మాత్రం పెరగడం. అందులోనూ మన భారత ప్రాంతపు అడవులలో మిగతా చోట్ల కన్నా ఇంకొంచెం మంచి సంఖ్య ఉండడం సంతోషకరమైన విషయమే.దీంట్లో చాలా పెద్ద రహస్యమేమీ లేదు. చిన్న పరిశీలన. అంతే.
A culture of tolerance and good protection laws work in unison to make tiger conservation possible in India. The Indian cultural belief of 'live and let live' expands to include all living beings.
However, when people do kill wildlife or other animals illegally, there are enough teeth in India’s wildlife protection laws to punish such miscreants.

ఈ విషయం గురించి, మరికొంత పులుల జీవనంలో సాధకబాధకాల  గురించి మంచి సంభాషణ ఒకటి ఇక్కడ లింక్ లో ఉంది. చదవదగిన ఆర్టికల్.


 పులుల జీవన సాధకబాధకాలు