Loading...

26, మార్చి 2018, సోమవారం

అలవాట్లలో ఆలోచనలు

     మొదట శాస్త్రీయంగా ఆలోచించి మొదలుపెట్టబడినా, కాలక్రమంలో అర్థం ఉద్దేశ్యం తెలియకుండా తరతరాలూ ఆచరించడంలో చాదస్తాలుగా అనిపిస్తున్నాయి.
ఇప్పుడు చదువులో కూడా ఏది ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియకుండా బోలెడు సబ్జెక్ట్ లు ఉంటున్నాయి. పిల్లలకు ఇదీ ఈనాడు చాదస్తమూ, మూఢనమ్మకంలాగే అయిపోయింది.:)
అర్థం లేని చదువు వ్యర్థము అన్నట్టు మొక్కుబడిగా ఆచరించి ఇలా తయారైపోయినాయి.


       నీళ్ళతో, ఉప్పు కారాలతో వండినవి ఒక్క రోజుకో, ఒక్క పూటకో. అవి నిలువ ఉండవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు ఆ ఒక్కరోజు కు కూడా.
వాటిని అందరూ అన్ని (శుభ్రమైన, కాని) చేతులతో , గుడ్డలతో తగలడం వల్ల వాటి లైఫ్ (మన్నిక) ఇంకా తగ్గవచ్చునని, పాసి పోవచ్చునని, ఇలా కొన్ని కారణాలవల్ల ప్రత్యేకంగా ట్రీట్ చేయడమే అంటు లాంటి పదాలతో గుర్తించడం.

 
                   ఇక నూనె, నేయి వంటి వాటిలో వేగినవి, తీపి పదార్థాలు వీటిలో నీటి శాతం చాలా తక్కువ. ఉన్నా అది ఇగిరిపోయేంత వరకూ జిడ్డులో వేగుతుంటాయి. కాబట్టి వీటి జీవితకాలం ఎక్కువ. వీటిని అలా జాగ్రత్తగా చూడాల్సిన పని లేదు. కాబట్టి అవి అంటు అనే లాంటి మాటలతో గుర్తించడం ఉండదు.

                       మనం చేతితో తీసుకొని తినేటపుడు కూడా చేయి తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలనేది కూడా ఎక్కువ శాతం మంది వాటి జీవితకాలం అంశం దృష్టిలో ఉంచుకొనే.
ఎందుకంటే మన చేతిలో ఆ ఆహారాంశాలు మిగిలిపోతే, శుభ్రం చేసుకోకపోతే, చేతిలోని ఆ ప్రాంతంలోనే అది చెడిపోయి, పాసిపోయి రకరకాల క్రిములను ఆకర్షించే అవకాశం ఉంది అనే శాస్త్రీయ దృక్పథంతో నే చేతులను సరిగ్గా శుభ్రం చేసుకొనే నియమం ఉంచుతూ వాటిని అంటు వంటి పేర్లతో గుర్తిస్తారు.
 

                           మిగతా ఏ మైసూరుపాకో, చక్కిలమో తిన్నప్పుడు అవి చేతిమీద అంటుకోవు , నీటిశాతం ఇగిరిపోయి ఉంటుంది కాబట్టి. అవి చెడిపోవు అంత వెంటనే (అంటే మళ్ళీ ఏ స్నానం వల్లనో మొత్తం శుభ్రం చేసుకొనే లోపల) అందుకని అవి అంతలో ఏ క్రిములనో ఆకర్షించే అవకాశమూ లేదు. కాబట్టి వీటిని చేతితో తిన్నా శుభ్రం గురించి కొంచెం లైట్ తీసుకోవచ్చు కాబట్టి వీటిని అంటు అన్నటువంటి పేర్లతో గుర్తుపెట్టుకొనేలా బ్రెయిన్ వాష్ చేయబడదు. 

ఈ ఫేస్ బుక్ చర్చలో మిగతా మిత్రుల అభిప్రాయాలు కొన్ని-


            కూరలు అన్నం ఇలాంటివి త్వరగా చెడిపోయే పదార్ధాలు ఒకటి నుంచి ఒకటి కలిసినప్పుడు ఇంకా త్వరగా పాడవుతాయి .అందుకే వేటి గరిటలు వాటికి వాడటం ...ఇప్పటిలా నిల్వవుంచుకునేందుకు( చద్దిపెట్టెలు) గట్రా లేనికాలంలో ప్రాధమిక జాగ్రత్తలు..తప్పకుండా ఇప్పుడుకూడా ఆచరణీయమైన ఆరోగ్యసూత్రాలు...
  
                            పతంజలి సూత్రాలప్రకారం....ఆయుర్వేదం ప్రకారం...వండిన పదార్థాలు ఏవైన వెంటనే తినాలని చెబుతారు..నిలువ వుంచిన పిండినికూడా వాడవద్దని చెబుతుంది ఆయుర్వేదం.అందుకే అప్పుడు రోళ్ళకు, తిరగలి మా రాయలసీమలో ఇసుర్రాయి అంటాము వీటికి అంతటి ప్రాధాన్యత....వండిన పదార్థం కేవలం ఒక గంట వ్యవధిలో విషతుల్యం అవుతుంది!!!!! పాలను, పెరుగును, తరిగిన ఉల్లిపాయ ముక్కలను అసలు ఫ్రిజ్ లో పెట్టరాదు....ఈ నిజాలన్ని తెలియాలంటే రాజివ్ దీక్షిత్ సీ.డి..ఒకటి మార్కెట్ లో లభ్యమవుతుంది....18 గంటల నిడివిగల సీ.డి.లో ఇలాంటి ఆరోగ్యసూత్రాలు ఎన్నో తెలుసుకోవచ్చు... నాగరికతో, ఫ్రిజ్ లు, మిక్సీలపైన వ్యామోహమో,పని త్వరగా కావాలని ఆరాటమో తెలియదు గాని ఇటువంటి వస్తువుల్లో నిలువ వుంచినవి అంటు క్రిందే లెక్క..
ప్రతి పనికి శుచి, శుభ్రతే ప్రధానం...అందులోనే ఆరోగ్యము, మానసిక స్వచ్చత ఇమిడి ఉంటాయ్..
 
 

 
  ప్రశ్న ఇలా మొదలైంది.
       మామూలుగా అన్నం, కూరలు అంటు అంటాం. దానికి ఒకరి వివరణ వండినవి అంటు అని.
మరి తీపి, కారం చిరుతిళ్ళు కూడా వంట చేస్తాం కదా. అవి అంటు కాదు. ఇది ఎలా వివరించడం.
తెలుగు చదివిన మరియు ఆంధ్రదేశంలో కొంతకాలం ఉన్న ఒక అమెరికను ప్రశ్న ఇది.

13, మార్చి 2018, మంగళవారం

ఒక్కటే!

                  మనదేశం శాంతికాముక దేశం అని చెప్పడంలో ఉద్దేశ్యం ఇతరదేశాలపై దురాక్రమణ చేసే ఉద్దేశ్యాలు లేవనే గాని ఆవేశకావేషాలు లేనిదని కాదు. ఎప్పుడూ చైతన్యవంతమైన సమాజమే మనది. తను దాడి చేయదు కాబట్టి ఇతరదేశాల దాడిని ఊహించకుండా ఉండి పోయి తీరా ఆ సమయానికి ఉలిక్కి పడే సామాన్య నర/నారీ లక్షణం వంటిదే ఇక్కడా జరిగింది.
            ముఖ్యంగా కొందరు క్రూర మహమ్మదీయుల వలన శతాబ్దాల క్రిందట ఈ దేశం మీద చేయబడిన దాడి  వాయవ్యదిశ నుంచి ప్రారంభమైంది. తర్వాత దౌర్జన్యంతో  దేశాన్నంతా ఆక్రమించుకుంది. వారి ప్రభావం అంతా ఉత్తరాది రాష్ట్రాల మీద అంటే ఉత్తరభారతం మీద చాలా ఎక్కువ. ఎందుకంటే వారు అక్కడే ఉండి పాలించారు గనక ప్రత్యక్ష ప్రభావం చాలా ఉంది. దక్షిణభాగాలకు వారి ప్రతినిధులను పంపడమూ లేదా దక్షిణ రాజ్యాల అధిపతులతో సంధుల ద్వారా దక్షిణ భారతంపై పెత్తనం చేయడమూ జరిగింది కాబట్టి ఇక్కడ పరోక్ష ప్రభావమే గాని ప్రత్యక్షంగా లేదు. ఈ తేడా మనకు స్పష్టంగా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. రోజువారీ ఆహారవ్యవహారాల్లో గానీ, భాషాప్రయోగాల్లో గానీ ఉత్తరభారతం మీద ఈ ప్రభావం ఇప్పటికీ ఉంది. హిందూ మహమ్మదీయుల మధ్య ఎన్నో విషయాల పరస్పర మేళవింపు లేదా ఆదానప్రదానాల్లాంటివి జరిగినాయి. దక్షిణం పై ఈ ప్రభావం చాలా తక్కువ.
            ఇక దుష్ట కుటిలబుద్ధి గలిగిన ఆంగ్లేయుల దాడి నేరుగా కాకుండా చాపక్రింద నీరులా దేశమంతా జరిగింది. వీళ్ళకు సముద్రమార్గమే దారి కాబట్టి ఇది ఎక్కువగా తూర్పు, దక్షిణ భారతదేశ భాగాల మీద మొదలైంది. అవి కేంద్రాలుగా కొనసాగింది. తర్వాత ఢిల్లీ వైపు వెళ్ళింది నెమ్మదిగా. కాబట్టి దక్షిణ భారతదేశం మీద ఆంగ్లేయుల  ఆంగ్ల భాష, వేషధారణ, చదువులు, నాగరికతల ప్రభావం ఉన్నంత ఉత్తరభారతం మీద లేదు.  పైగా ముస్లిం పాలకుల వలె వీరు వచ్చి ఇక్కడే స్థిరపడి పోలేదు. చివరివరకూ ఇంగ్లండు నుంచి వస్తూ పోతూ నే పాలించారు కాబట్టి ఈస్టిండియా కంపెనీ మద్రాసు వంటి ఓడరేవుల స్థానాలను  ఎక్కువగా కేంద్రంగా చేసుకున్నది.
       అప్పట్లో దాదాపు దక్షిణానికంతా మద్రాసు లేదా చెన్నపట్నం రాజధాని మాదిరిగా పెద్దగా అభివృద్ధి చెందడానికీ ఇదే కారణం.
         ఈ నేపథ్యంలో దశాబ్దాలూ, శతాబ్దాలూ మహమ్మదీయ పాలన యొక్క నిరంకుశత్వంలో చచ్చి బ్రతుకుతున్న నాటి ఉత్తరభారతం కన్నా, కొద్దిగా తక్కువే బాధింపబడిన దక్షిణ భారతం ఆంగ్లేయుల వల్ల ఎక్కువ ప్రభావితమైంది.(ఇదీ చచ్చి బ్రతకడమే) వారి క్రింద పనిచేయడానికీ దుభాషీలకు ఆంగ్లేయులు ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనా క్రమేపీ ఆంగ్లభాషల్లో విద్యలు, ఆ యా దేశాల్లో విషయాలకు ప్రభావితమైన దక్షిణ భారతం లో బడిచదువుల ప్రాముఖ్యత పెరిగింది. సహజంగానే ఆరోగ్య విషయాలపట్ల అవగాహన కొద్దిగా పెరిగింది. పూర్తిగా అవగాహన ఐతే ఇక్కడ కూడా రాలేదు. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ పెరగకుండా పెద్ద పరిధిలో చేపట్టాల్సిన చర్యలు ఇక్కడా పూర్తిగా ఏం జరగడం లేదు. అక్కడక్కడా మాత్రమే జరుగుతున్నాయి.
              ఇక మళ్ళీ ఉత్తరం వైపు చూస్తే , ఈ ఆధునిక ఆయుధాలవల్ల విస్తృతమైన భయాలు ప్రపంచాన్ని పట్టుకున్న కాలంలో కూడా మనదేశానికి చైనా, పాకిస్తాన్ ప్రత్యక్ష, పరోక్ష దాడుల బెడద తప్పడం లేదు. ఈ పరిస్థితులలో నేటికీ ఈ బెడదల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కువ శాతం బాధింపబడుతున్నది మళ్ళీ ఉత్తరభారత సరిహద్దులే. ఈశాన్యరాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్(ఉత్తరాంచల్), రాజస్థాన్, పంజాబ్, బెంగాల్ లు. ఇక్కడ తరాల తరబడి చదువు, వికాసం వెనుకబడే ఉండడానికి కారణం ఇదే. ఈ ప్రజాసమూహంలోంచే నేతలు వస్తారు కాబట్టి వారికీ వీటిమీద అవగాహన లేకపోవడం మరియు అనేక స్వార్థ కారణాలవల్ల వాళ్ళూ విద్యా వికాసాల పట్ల శ్రద్ధ పెట్టరు. ఈ కారణాల వల్ల చదువు (భారతీయ భాషల్లో బోధనకు ఎవరూ ఇంకా సుముఖంగా లేరు గాబట్టి) గానీ, ఆరోగ్యం కానీ, పరిసరాలు కానీ అక్కడ వృద్ధి కి నోచుకోవడం లేదు. వీటికి తోడు అడవులు, ఎడారులు కూడా అక్కడ ఎక్కువ కాబట్టి విద్యాసంస్థలు, ఆరోగ్యసంస్థలు స్థాపించడం, పోషించడం, వాటికి పనిచేసేవారిని  సౌకర్యాలు లేని చోట్ల బదిలీలు చేసుకోకుండా ఉంచగలగడం కష్టతరమౌతున్నది. ఇవన్నీ సరిచేయాలంటే చిత్తశుద్ధి గల నాయకులు, రాజేచ్ఛ (పొలిటికల్ విల్) ఉండాలి.
           రాయలసీమనుంచి ఎందరు ముఖ్యమంత్రులు వచ్చినా , అభివృద్ధిలో కోస్తా, తెలంగాణ ప్రాంతాలకన్నా ఇది ఎలా వెనుకబడి ఉందో, ఉత్తరభారతం నుంచి ఎందరు ప్రధానులు వచ్చినా ఈ అన్ని కారణాలవల్ల, కొన్ని స్వార్థ శక్తుల వల్ల ఉత్తరభారతమూ విద్యారోగ్యాల విషయంలో వెనుకబడి ఉంది.
             అంత మాత్రాన మొత్తం ఉత్తరభారతాన్ని చిన్నచూపు చూడవల్సిన పని లేదు.  సైన్యంలో ఎక్కువ శాతం మంది ఉండేది ఉత్తరభారతీయులే అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్,  రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, హర్యానా ప్రాంతాల నుంచి సైన్యంలో చేరడానికి ముందుంటారు. వారికి ఉన్నత విద్యల సంస్థలు తక్కువే, అంత ప్రశాంతంగా చదువులకు జీవితాలు కేటాయించగలిగే సౌకర్యాలూ తక్కువే. కాబట్టి వారి జీవనోపాధికైతేనేమి, వారి శరీర దార్డ్యాల వల్లనైతేనేమి అక్కడి ప్రజలు సైన్యంలో ఎక్కువ చేరతారు. వారు సరిహద్దులను రక్షిస్తున్నా, ఎన్నోరకాల ప్రకృతి వైపరీత్యాలలో దేశంలో ప్రతీచోటా సహాయసహకారాలనందిస్తున్నా అది దేశం మొత్తానికి సేవచేస్తున్నారు. అదేసమయంలో  మంచి చదువు, చికిత్సలు అవసరమైనప్పుడు దక్షిణంవైపే వాళ్ళు రావలసి ఉంటుంది. వస్తున్నారు.
                 దక్షిణభారతీయులు పోల్చి చూసినపుడు ఉత్తరభారతీయులకన్నా కొంచెం భద్రమైన వాతావరణంలో జీవిస్తున్నట్టే కాబట్టి ఇక్కడ విద్యావికాసం గానీ , ఆరోగ్య వికాసం గానీ, సౌకర్యాల ఏర్పాటు గానీ ఎక్కువ. ఈ విషయాలలో దక్షిణభారతీయులు దేశం మొత్తానికి సేవ చేస్తున్నారు.
             మొత్తం మీద దక్షిణమైనా, ఉత్తరమైనా పరస్పర ఆధారితమే గానీ ఒకరికన్నా ఒకరు ఎక్కువో తక్కువో కాదు. ఈ అవగాహన మరింత పెంపొందించుకొని సఖ్యంగా ఉండకుండా చిచ్చులు రేపడానికి ఈమధ్య సినిమా వాళ్ళు ఉత్సాహ పడుతుండడం చూస్తే వింత గా ఉంటుంది. బహుశా హిందీ సినిమాలకు ఇక్కడున్న డిమాండ్ వీరి వ్యాపారాన్ని తగ్గిస్తోంది. ఇక్కడి సినిమాలు అక్కడ ఆడవు. కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారనుకోవాలా?
                ఇక కేంద్రం ఆధిపత్యం మీద పోరాటం ఈ రంగు తీసుకుంటోందనుకుంటే, విడిపోవడం పరిష్కారం కానే కాదు. ఇక్కడి నాలుగైదు రాష్ట్రాలకు నాయకత్వం వహించబోయే ఏ యూనిట్ అయినా మళ్ళీ అదే అన్యాయం చేయవచ్చు.
           కాబట్టి రాజకీయాల్లో మార్పులు రావాలి. అక్కడి నేతలైనా, ఇక్కడి నేతలైనా దేశం మొత్తం గురించి ఆలోచించగలగాలి. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రధాని అభ్యర్థులెవరైనా ఉత్తరంలో ఒకటి, దక్షిణంలో ఒకటి ఎంచుకోవాలి.  దేశాన్నంతటిని  రహదారులు, రైలు దారులు, గగన వీధుల ద్వారా కలిపే ప్రయత్నాలు జరగాలి. ఆహార పదార్థాలు ఐనా, ఇతర వస్తువులు ఐనా వినియోగంలో దాదాపు మొత్తం దేశంలో ఎక్కువ సామ్యాలు ఉన్నాయి కాబట్టి వీటి ఉత్పత్తి, వాణిజ్యం రాష్ట్రాల మధ్య పరస్పరం పెంపొందించే చర్యలివి. దీనికి కూడా ఒకే పన్ను విధానం ఉపయోగపడుతుంది. వీటివల్ల పరస్పర మైత్రి, అవగాహన కూడా పెరుగుతాయి. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులలో విడిపోవడం కన్నా కలిసుండడమే బలాన్ని , రక్షణను ఇవ్వగలదు.
              తెలీని విషయాలని చెప్పడం లేదు గానీ ఒక పునశ్చరణ అంతే.
                   ఉదాహరణకు వీధుగదులు, వరండాలు ఎక్కువ దుమ్ముపట్టి, రంగులు వెలిసి పోవడమూ, భోజనాల గదులు, పడకటిళ్ళూ శుభ్రంగా , కొత్తగా ఉండడమూ చూసి  వాటినీ వీటినీ వేరుచేయడమే వివేకం అనుకునే వాళ్ళకు ఏమీ చెప్పలేం. ఒకటి రక్షణ, ఇంకొకటి పోషణ చేస్తున్న గదులు/భాగాలన్నీ అవసరమే.
          
                      
                 

3, మార్చి 2018, శనివారం

ఈశాన్యం

            వాస్తునిర్మాణంలో ఈశాన్య ప్రాధాన్యత తో పోలుస్తూ, గౌ. ప్రధాని చమత్కరించినా,
ఈ నలభై యాభై ఏళ్ళ కాలంలో ఈశాన్య రాజ్యాలలో దేశసమగ్రత పరంగా బలమైన స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వాలు లేకపోవడం వల్ల దేశమంతటిపై ప్రభావం చూపే విధంగా ప్రక్కనున్న చైనా దురాలోచనలు మనందరమూ చూస్తూనే ఉన్నాము. దేశానికి వాయువ్యంగా ఏర్పడిన పాకిస్తాన్ కవ్వింపులు ఒక ప్రక్కనుండగా ఈశాన్య మూలనుంచి చైనా భారత భూభాగాలను ఆక్రమించుకుంటుండడాన్ని అడ్డుకోవాలంటే దేశం పట్ల అంకిత భావం ఉన్న పార్టీల చేతిలో ప్రభుత్వం ఉండితీరాలి.
         అక్షరశః ప్రాణాల పై ఆశ వదలుకొని పనిచేసిన కార్యకర్తలకు, నేరుగా పోరాడలేక హత్యలకు పాల్పడే శత్రుపక్షాల దుర్మార్గాలకు అంతమైన కార్యకర్తలకు ఈ విజయం ఒక బహుమానం.
       మోసపూరిత మతాంతరీకరణలకు స్థానిక ప్రజలు గురికాకుండా,
, తమదైన ఆచారవ్యవహారాలపై  నాగరీకులమనిపించుకుంటున్న వారి దౌర్జన్యాలకు బలికాకుండా ఈశాన్యరాజ్యాలు రక్షింపబడాలని కోరుకుందాం.

     ప్రతి శనివారం ఉదయం 7.30 కు ఈశాన్య రాజ్యాలపై కార్యక్రమాలను దూరదర్శన్ చూపిస్తూ ఉంటుంది. అక్కడి ప్రజల జీవన విధానాలు- సంస్కారాలు, అలవాట్లు, భోజనాదులు,  కలుపుగోలుతనాలు, పనిపాటలు, ఆటపాటలు, జానపదుల నృత్యాలు,  నైపుణ్యాలు, నిరాడంబరత అన్నీ మన ఇక్కడి పల్లెల్లో లాగానే ఉంటాయి.
          వారి వేషధారణ, ముఖాకృతుల్లో తేడా ఉండవచ్చు. అది అంతా భౌగోళిక పరిస్థితుల మీద ఆధార పడి ఉంటుందని మనకు తెలిసినదే.
          ఇక్కడి కూచిపూడి, ఆంధ్రనృత్యం, పేరిణి లాగా అక్కడి మణిపురి నృత్యకళలో కృష్ణునిపై కీర్తనలకు లాలిత్యమైన అంగవిన్యాసంతో సాగే మృదువైన నాట్యము కొంచెము మోహినీ ఆట్టంలోని లాలిత్యాన్ని తలపిస్తుంది.

1, మార్చి 2018, గురువారం

వివేకానంద కళాశాల లో జరిగిన సంస్కృత సంగోష్ఠి

సంగోష్ఠి పై నివేదిక ఈ మాట పత్రికలో ప్రచురింపబడింది.
వీటిలో నాకు తెలిసినంత మేరకు సంస్కృత శ్లోకాలకు భావం వ్రాశాను.
కొన్నిటికి వాటిలోని టాపిక్ చెప్పి ఊరుకున్నాను.
తెలిసిన వారు చెప్తే సంతోషంగా తెలుసుకుందాం.

http://eemaata.com/em/issues/201803/15214.html