Loading...

3, అక్టోబర్ 2015, శనివారం

చిత్రమైనదీ పత్రము!



మొక్కకు పుట్టీ, చెట్టుగ పెంచిన చిత్రమీ పత్రము!

రాలిన వేళల చాచిన చేతుల మిత్రమీ ధాత్రియు!

చక్కటి అందము చెట్టుకు నిచ్చిన రీతినే

నేలకు పంచిన నేర్పును చూడుము మిత్రమా!

20, జులై 2015, సోమవారం

సరిక్రొత్త నిఘంటువు - సరిక్రొత్త హంగులతో - తెలుగు లోకానికి మన బ్లాగర్ల కానుక.

http://www.telugunighantuvu.org/

ఈ చిరునామాలో , తెలుగు నిఘంటువు అనే పేరుతో రంగులతో, హంగులతో అలరారుతూ తెలుగు భాషానురక్తులకు,
1. తెలుగు పదములు, పద్యములు, వ్యుత్పత్తి తెలుసుకోగోరే వారికి,
2 .తెలుగుని ఇతర భాషలోని పదాలతో పోల్చి చూడాలనుకునేవారికి,
3.ఆ యా పదాల్ని పద్యంలోనూ , వచనం లోనూ ఎలా ప్రయోగించారో నేర్చుకోడానికి,
4. పర్యాయ పదాలకోసం వెతికేవారికి,
5. ఒక్కో పద్యానికీ ఛందోరూపం తెలుసుకోవాలని కొన్ని ఉదాహరణలు కావాలనుకునేవారికి,
6. అసలు మన తరానికి నేర్పింపఁబడని బండి ర (ఱ) అంటే శకటరేఫనీ, అరసున్నా నీ ఎలా వాడేవారో తెలుసుకోవటానికీ
ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగ పడే ఈ మన నిఘంటువు ని చూస్తారా? అయితే
ఇక్కడ నొక్కండి.

ఇందులో మనం టైప్ చెయ్యగానే పదం తెలుగులో టైప్ అవుతుంది. అందులో ఉన్న పదాలని డిస్ ప్లే చేస్తుంది. అందులోంచి మనకు కావలసిన పదాన్ని ఎంచుకొని ఎంటర్ కొడితే , ఇక ఆ పదం యొక్క అర్థం, ఇతర రూపాలు, వ్యుత్పత్తి, ప్రయోగం, పద లక్షణము (విశేషణమా, ఇంకోటా అనేది) ఇతర భాషారూపాలు అన్నీ కనిపిస్తాయి.
ఈ సరికే కొన్ని తెలుగు నిఘంటువులు ఉన్నా, అందులో కేవలం అర్థం మాత్రమే ఇస్తారు.
"బహుళ శోధన" లో పర్యాయ పదాలు, కొన్ని ఛందో రూపాలకు లభ్యంగా ఉన్న ప్రయోగాలు చూసుకోవచ్చు.

పనిలో పని - అక్కడ ముంగిలిలో కనిపించే సరస్వతీ దేవి ప్రసన్నరూపాన్ని చూడండి. నేను రాసిన మన తెలుగు పాటని కూడా చూడండి.
సూర్యరాయాంధ్ర నిఘంటువుని డిజిటలైజ్ చెయ్యటం అనే ఈ గొప్ప పనికి అంకురార్పణ చేసి, బహు విధ సేవలు అందిస్తూ , నిరంతరం శ్రమిస్తున్న భాస్కరరామిరెడ్డి గారికి నా అభినందనలు.
ఇతోధికంగా ఆర్థిక సహాయాన్ని, సాంకేతిక సహాయాన్ని, యూనికోడ్ లో వ్రాసి సహకరిస్తున్న మిత్రులందరికీ (నాతో సహా) అభినందనలు. ఈ పని చేసే వారిలో కొంతమంది బ్లాగర్లు కాని వారు కూడా ఉన్నారు. వారికీ అభినందనలు.
మనకి మనమే చెప్పుకోవాలి అభినందనలు అని ఇలా...
ఇంకా ఈ నిఘంటు దోగాడే పాపలా తొలిదశలోనే ఉంది కాబట్టి , అయినంతవరకూ పదాలని చేరుస్తూ ఉన్నాం. త్వరలోనే పూర్తిగా అందించ గలమని ఆశిస్తున్నాను.
భాస్కరరామిరెడ్డి గారు అందిస్తున్న మరిన్ని వివరాలు చూడండి.

26, మే 2015, మంగళవారం

ఒల్లకుమమ్మా!


మంగళదాయిని మా గౌరి
జంగమరాయని శ్రీ గౌరి
సింగముపై కొలువై యుండే
బంగరు తల్లీ, మముఁ గనుమా!


త్రుంచగ లోభము, మోహము తొలగగ..
సంచిత కర్మల సంగము విడువగ..

మంచీ చెడులూ నిండిన జగమున
నెంచి మసలుకొను తెలివిడి నిడుమా! ॥ మం॥


కంటికి కనపడు కాయము కతమున
నంటును పాపము పుణ్యములన్నియు..

కంటకమగునవి మోక్షపు దారుల
నొంటరిగా విడ నొల్లకు మమ్మా!
                          
   *         *         *

30, జనవరి 2015, శుక్రవారం

సైనికబలం

      విశాలమైన భారత సరిహద్దులను సర్వదా, సర్వథా కనిపెట్టి యుండి కాపాడేందుకు ఒకప్పటి భారత ప్రధాని శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారు ఏర్పాటు చేసిన సరిహద్దు భద్రతా దళం సేవల్ని ఎన్ని నోళ్ళ కొనియాడినా చాలదు.
 
       మన సరిహద్దులను సైనికులు భద్రంగా కాపాడడం వల్లనే సరిహద్దుల మధ్యలో ఉన్న భారతంలో ప్రజలందరూ ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. బహిశ్శత్రువులనుంచి వారు కాపాడుతున్నా, అంతశ్శత్రువులైన రకరకాల విప్లవవాదులు, తీవ్రవాదులు, అరాచకవాదుల వల్ల, అరాచకశక్తుల వల్ల జరిగే ప్రమాదములనుంచి మనల్ని మనం కాపాడుకోలేక పోతున్నాం.
       
          మన సరిహద్దులు విభిన్న ప్రకృతులు గలవి.
           
                 ఒక ప్రక్క రాజస్థాన్ ఎడారుల్లో విశాలమైన నిర్జనభూములు, కంచెలు , ఒంటెల మీద ప్రయాణాలు , ఇసుకతుఫాన్ల మధ్యలో విపరీత పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్న కొలది ఆయుధ సామాగ్రి, ఆహార సామాగ్రి తో సర్దుకుంటూ అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తూ, మధ్యమధ్యలో ప్రక్క దేశం బాధ్యతా రహితంగా కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ యుద్ధంలేని సమయాల్లో కూడా ప్రాణఘాతకపు పనులకు పాల్పడుతూ ఉంటే కర్తవ్యదీక్ష నేనాడూ కల్లో కూడా మరువకుండా  పనిచేస్తూ ఉంటారు మన సైనికులు.

       ఇంకోప్రక్క ఈశాన్య రాష్ట్రాల్లో చీకటిలో, చిట్టడవుల్లో, చినుకుల నిరంతర రాపిడిలో , మెల్లగా జారిపోయి దూరిపోయే దురాలోచనాపరులైన ఆగంతకులతో తెముల్చుకోడంలో మునిగి తేలుతున్న సైనికులకు అనుక్షణం దోమల స్వైరవిహారంతో ఎడతెగని ఇబ్బందులు. ముఖానికి కూడా దోమతెర వంటిది పూర్తిగా మూయబడినట్టి వస్త్రధారణతో కర్తవ్యదీక్షా పరాయణులై ఆరుగంటల మాపటి  పొద్దుకే అర్థరాత్రి కూడా మనం చూడని చిమ్మ చీకటి, వాహనపు ఫ్లడ్ లైట్ పడినంత మేరా తప్ప చుట్టూ కన్నులు పొడుచుకొని చూసినా కానరాని కారుచీకట్లు. రాత్రీ పగలూ కాపలా కాస్తూ ప్రక్కదేశంలో కలిసిపోయినట్టున్న సరిహద్దు రేఖల పైని గ్రామాల్లో నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ ఉంటారు మన సైనికులు.
     ఇంకోప్రక్క వేల కిలోమీటర్ల ఎత్తులో చలికొండల్లో తాగే నీళ్ళు కూడా గడ్డ కట్టుకొని పోయే మంచుప్రదేశాల్లో, బలమైన ప్రక్కదేశం పైకి నవ్వుతూ, కాళ్ళక్రింద గోతులు, సొరంగాలు తవ్వుతూంటే అనుక్షణం మళ్ళీ అప్రమత్తంగా ఉంటూ, ఎటువంటి అలసత్వం లేకుండా అంతర్జాతీయ శాంతి సూత్రాలకూ, స్వంతదేశపు నీతిసూక్తులకూ ఎప్పుడూ ఎటువంటి ద్రోహమూ చేయకుండా, ఉన్నట్టుండి మోసపూరిత శత్రుదేశాల తూటాలకు బలిఅవుతున్న తోటి సైనికులను చూస్తూ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిలిచి కాపాడుతుంటారు మనల్ని మన సైనికులు.
    ఇంకోప్రక్క నీళ్ళల్లో గాలుల్లో కూడా మనపై దాడులు జరగకుండా అనుక్షణం జాగ్రత్త గా దేశాన్ని రక్షిస్తున్నవారి
సేవలూ ఏనాటికీ మనం మరువలేనివి. మరువరానివి. ఏమాత్రమూ మిగతా ఉద్యోగాలతో పోల్చరానివి.
ఆ త్యాగధనులకూ , వారి కుటుంబాలకు ఇవే నా నమోవాకాలు.
       తొంభైశాతం మంది సైనికులు చేసిన సేవలను ఏనాడూ తలచక పోయినా, వారిలో కొద్దిమంది చేసే అఘాయిత్యాలకు బలి అయిన వారి పై సానుభూతి చూపుతూ వీరసైనికులను వేలెత్తి చూపడం సరికాదు. అదీ చేయాల్సిందే ఇదీ చేయాల్సిందే. తప్పునెత్తి చూపేవారు, వారు చేసే సేవలనూ గుర్తించాలన్నది అత్యాశకాదు.
      ప్రభుత్వం కూడా వారి వేతనాలు, కనీస అవసరాలు , చలిలో ఎండలో వారికి కావలసిన ఆత్మరక్షణ పరికరాలు, ఆహారసామాగ్రి , ఆయుధ సామాగ్రి ఏ ఆలస్యం లేకుండా పంపించాలని మనందరం కోరుకోవాలని నా అభిప్రాయం.