Loading...

20, మార్చి 2014, గురువారం

విద్వేష రాగాలు

     శుభాన్ని ఆశించడం, శుభాకాంక్షలతో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమూ, ఆచరణయోగ్యమూ అయినటువంటి స్వభావ లక్షణము అనిపించుకుంటాయి.
        సార్వజనీనమైన జీవనము గడిపేవారు, సమాజం గురించి ఆలోచించి, తపించి, సమాజాభివృద్ధి చేయాలనుకొనే వారు పై విధముగా తమను తాము మలచుకోవాల గానీ ఎంతసేపున్నా ద్వేషాలను రగిలిస్తూ అందరి దృష్టీ తమమీద పడాలని కోరుకొని తదనుగుణంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇన్నాళ్ళూ నోటికొచ్చిందల్లా హద్దూ అదుపూ లేకుండా మాట్లాడి, ఋజువులే లేని నిరాధార ఆరోపణలు, నిందలు మోపి తిట్టి తిట్టి పోసి  ప్రజల మనసులను భూభాగాలను ముక్కలు చేసినది చాల్లేదని ఇంకా ఎందుకీ ద్వేష రాగాలాపన? అంటే ఒక్కటే ఎన్నికల సమయములో ఈ విధంగా మాట్లాడితే స్వార్థ ప్రయోజనాలు దక్కుతాయి. ఏ పదవులు ఆశించి ఇవన్నీ చేసినారో అవి అందే సమయము. కాబట్టి ఇప్పుడు ఇవి ఆపడం కుదరదు.
      పదవులు దక్కినాక కూడా ఆపడం జరుగదు. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఎదుర్కొనే కష్టనష్టాలకు కూడా గతంలో అవతలి వాళ్ళు చేసిన మోసాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు.
ఇంకా ఎన్నేళ్ళో ఈ నీలాపనిందలు ప్రజలందరూ భరిస్తూనే ఉండాల. మా రాయలసీమ, మా తెలంగాణ, మా కోస్తా జిల్లాల వారెవరూ ఈ పరిణామాలతో ఆనందంగా లేరు. ప్రజలెవరూ బయటికొచ్చి ఏ సంబరాలూ జరుపుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ఉద్యమాల్లో పాల్గొన్న సమూహాలు, కార్యాచరణ సమితులు సంబరాలు జరుపుకున్నారే కానీ సామాన్యులెవరూ సంతోషంగా లేరు.  పదవీలాభాలు తప్ప  ఇంకేమీ ఒరగని ఈ ప్రక్రియలో ఎన్ని లోపాలున్నాయో రాన్రాను బయటపడతాయి.
         రాజుల  రాజ్యాధికార విస్తరణకాంక్ష ను, వారి యుద్ధాలను తప్పుబట్టని వారే లేరు. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అదికాదా? వీలైనంత వరకూ పదవులు, అధికారాలు పొందాలనే కాంక్ష లేని నేతలెందరు? అది దక్కని వారు అసమ్మతులను, ద్వేషాలను పెంపొందించడం సర్వసాధారణము. ఆ ప్రక్రియలో ప్రజల ఐక్యతను దెబ్బదీసి లాభం పొందాలనుకొనే వారు ఆజ్యం పోయడం. ఇంకేముంది? కొత్త రాజ్యాలనేర్పాటు చేసికొని మరీ విస్తరణకాంక్షలను తీర్చుకుంటారు.
     ఇన్నాళ్ళూ ఏ పిల్లల అమాయకపు బలిదానాలనైతే మెట్లుగా చేసికొని పీఠాలెక్కినారో ఇప్పుడు వారినే తృణీకరించడం , కావాలంటే తెలంగాణా రత్న వంటి బిరుదులిస్తాము, ఉద్యోగాలిస్తాము, పరిహారాలిస్తాము కానీ పదవుల్లో భాగం మాత్రం పంచము అనే స్వార్థ పూరిత నిర్లజ్జాకరమైన వ్యాఖ్యానాల్ని వింటున్న సమాజము , కాలము నేర్పబోయే గుణపాఠం గురించి ఎదురుచూస్తూ ఉంది.

2 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారు లక్ష్మి గారు . సమాజం నేడు విద్వేష రాగాలనే మీటుతోంది

    రిప్లయితొలగించండి
  2. అదే బాధండి. ప్రతిరోజూ ఒక వార్త గుండెమంటల రేపుతున్నది.

    రిప్లయితొలగించండి