Loading...

20, మార్చి 2014, గురువారం

విద్వేష రాగాలు

     శుభాన్ని ఆశించడం, శుభాకాంక్షలతో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమూ, ఆచరణయోగ్యమూ అయినటువంటి స్వభావ లక్షణము అనిపించుకుంటాయి.
        సార్వజనీనమైన జీవనము గడిపేవారు, సమాజం గురించి ఆలోచించి, తపించి, సమాజాభివృద్ధి చేయాలనుకొనే వారు పై విధముగా తమను తాము మలచుకోవాల గానీ ఎంతసేపున్నా ద్వేషాలను రగిలిస్తూ అందరి దృష్టీ తమమీద పడాలని కోరుకొని తదనుగుణంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇన్నాళ్ళూ నోటికొచ్చిందల్లా హద్దూ అదుపూ లేకుండా మాట్లాడి, ఋజువులే లేని నిరాధార ఆరోపణలు, నిందలు మోపి తిట్టి తిట్టి పోసి  ప్రజల మనసులను భూభాగాలను ముక్కలు చేసినది చాల్లేదని ఇంకా ఎందుకీ ద్వేష రాగాలాపన? అంటే ఒక్కటే ఎన్నికల సమయములో ఈ విధంగా మాట్లాడితే స్వార్థ ప్రయోజనాలు దక్కుతాయి. ఏ పదవులు ఆశించి ఇవన్నీ చేసినారో అవి అందే సమయము. కాబట్టి ఇప్పుడు ఇవి ఆపడం కుదరదు.
      పదవులు దక్కినాక కూడా ఆపడం జరుగదు. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఎదుర్కొనే కష్టనష్టాలకు కూడా గతంలో అవతలి వాళ్ళు చేసిన మోసాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు.
ఇంకా ఎన్నేళ్ళో ఈ నీలాపనిందలు ప్రజలందరూ భరిస్తూనే ఉండాల. మా రాయలసీమ, మా తెలంగాణ, మా కోస్తా జిల్లాల వారెవరూ ఈ పరిణామాలతో ఆనందంగా లేరు. ప్రజలెవరూ బయటికొచ్చి ఏ సంబరాలూ జరుపుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ఉద్యమాల్లో పాల్గొన్న సమూహాలు, కార్యాచరణ సమితులు సంబరాలు జరుపుకున్నారే కానీ సామాన్యులెవరూ సంతోషంగా లేరు.  పదవీలాభాలు తప్ప  ఇంకేమీ ఒరగని ఈ ప్రక్రియలో ఎన్ని లోపాలున్నాయో రాన్రాను బయటపడతాయి.
         రాజుల  రాజ్యాధికార విస్తరణకాంక్ష ను, వారి యుద్ధాలను తప్పుబట్టని వారే లేరు. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అదికాదా? వీలైనంత వరకూ పదవులు, అధికారాలు పొందాలనే కాంక్ష లేని నేతలెందరు? అది దక్కని వారు అసమ్మతులను, ద్వేషాలను పెంపొందించడం సర్వసాధారణము. ఆ ప్రక్రియలో ప్రజల ఐక్యతను దెబ్బదీసి లాభం పొందాలనుకొనే వారు ఆజ్యం పోయడం. ఇంకేముంది? కొత్త రాజ్యాలనేర్పాటు చేసికొని మరీ విస్తరణకాంక్షలను తీర్చుకుంటారు.
     ఇన్నాళ్ళూ ఏ పిల్లల అమాయకపు బలిదానాలనైతే మెట్లుగా చేసికొని పీఠాలెక్కినారో ఇప్పుడు వారినే తృణీకరించడం , కావాలంటే తెలంగాణా రత్న వంటి బిరుదులిస్తాము, ఉద్యోగాలిస్తాము, పరిహారాలిస్తాము కానీ పదవుల్లో భాగం మాత్రం పంచము అనే స్వార్థ పూరిత నిర్లజ్జాకరమైన వ్యాఖ్యానాల్ని వింటున్న సమాజము , కాలము నేర్పబోయే గుణపాఠం గురించి ఎదురుచూస్తూ ఉంది.

2, మార్చి 2014, ఆదివారం

సామాజిక ధర్మం

                             ఏది జయం? ఏది అపజయం? ఏదిఎన్నాళ్ళు? ఈరోజు వచ్చిన ఫోన్ రేపుండదు. ఈరోజున్న మనిషి రేపుండడు. అన్నీ చూస్తూ కూడా ఏదో ప్రపంచాన్ని జయించేస్తున్న భావనలో మనిషి ఎందుకుంటాడు?

                  నేను లేకపోతే ఇది ఆగిపోతుంది. నేను కాబట్టే ఇంత బాగా చేసినాను. ఇంకెవరైనా ఏమి చేస్తారనే అహంకారం ఎందుకు వస్తుంది? ఎగిరిపడుతున్న ఈ శరీరం ఒక దశలో కదలకుండా మంచం పట్టి ఉండబోతుందేమో, ఎవరికి తెలుసు? ఇప్పుడు అట్లున్న వారు కూడా ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నామన్న భావనతో బ్రతకలేదూ?ఏమయింది చివరకు? మనకెమవుతుందో మనకు తెలుసా? ఎందుకీ మిడిసిపాటు? ఏమి చూసుకొని? ప్రతి నిముషమూ తనను మించిన వారు కనిపిస్తూనే ఉన్నా నాకీ ప్రత్యేకత ఉందని అనుకోకపోతే మనిషి ఎందుకు బ్రతకలేదు?

                        సాధించలేకపోతే , అనుకున్న స్థాయిలో ఏదైనా చేయలేకపోతే ఎందుకు క్రుంగిపోవడం? ఒక చిన్న ప్రశంస కనిపించినా ఎందుకు పొంగిపోవడం. నన్ను గుర్తు పెట్టుకున్నారనగానే , నాకోసం వీళ్ళిది చేస్తారు, చేసినారనగానే ఎందుకంత సంతోషం? ఏది నిజం , ఏదబద్ధం? కనిపించినదానికి ఆ పక్క ఏముంది? అది తెలిసేవరకూ తుళ్ళిపడడం, తెలిసింతర్వాత కుళ్ళుకోవడం ఏదైతే నాకోసం/నాది/ నావల్ల అనుకున్నామో అది కాదని మిగతా వారికోసమంటే తెలిసింతర్వాత  కుళ్ళుకుంటారు కదా!

                        రాజకీయాల్లో ఉన్న వాళ్ళని అనడం ఎందుకు? వాళ్ళు డబ్బు అధికారం కోసం చేసేది మిగతా అందరూ మంచితనమనుకున్నదానికోసం చేస్తున్నా ఏది ఉంటుంది? ఎన్నాళ్ళు అనే ప్రశ్న అన్నిటికన్నా పెద్దది. ఏది మంచి ఏది చెడు అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఏ ప్రాతిపదిక మీద? మంచి కి చెడుకు మధ్య ఒక చిన్న నూలుపోగంత తెర ఉన్నసందర్భాల్లో ఆ జవాబు ఇచ్చేదెవరు? అన్ని దేశకాల మాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ, ప్రతి ప్రాంతానికీ, ప్రతి కాలానికి మారే ధర్మం యొక్క రూపురేఖలేమవి? అందరికీ వర్తించే సామాజిక ధర్మమేది?

                     సామాజిక ధర్మాన్ని అనుక్షణం కాపాడే వ్యవస్థ కాలం చెల్లిపోయింది. ఎక్కడో అక్కడా అక్కడా ఉన్నా మొత్తంగా అందరూ అంగీకరించే ఒక వ్యవస్థ ఇంక లేదా? అటువంటిదే సమాజాన్ని రక్షణ కవచంగా తన కర్తవ్యాన్ని నిర్వహించి సమాజాన్ని కాపాడుతుంది. హెల్మెట్ ధరించడం ఇబ్బందిగా ఉందనో, అందం కనిపించదనే ఒక మాయలోనో పడి విడిచిపెడితే,పడితే.. ఏమవుతుంది? అదే మనము సామాజిక ధర్మాన్ని విడిచి పెట్టడం వలన వచ్చిన నష్టము. ఆచారవ్యవహారాలు పాటిస్తూ సాటిమనిషి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ, మంచి చెడు ల విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించే మంచి అలవాటున్న సమాజాన్ని స్వంత సుఖము, విశృంఖలత్వం, వ్యాపారదృష్టి తో నిరంతరమూ నాకెమి వస్తుందనే ధొరణి పెంచుకున్నాక సామాజిక ధర్మం అనేది నశించిపోయింది. ఇప్పుడు అన్యాయాలు జరుగుతున్నాయో అంటూ గోలపెట్ట్డడం కన్నా, కవచం వంటిది, జనబాహుళ్యానికి ముఖ్యమైనదీ అయిన హెల్మెట్ వంటి సామాజిక ధర్మాన్ని అవతలపెట్టి వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయం.తప్పునితప్పు అని చెప్పేవాళ్ళెవరూ ఇక్కడ లేరు.ప్రతి తప్పుకీ మూలకారణాన్ని అన్వేషించి సమర్థించుకో దలిస్తే మంచి నుంచి చెడుని వేరుగా తీసి పెట్టగల నైపుణ్యం కొరవడుతుంది. సమాజం యొక్క అస్తిత్వం రూపురేఖలు లేకుండా మాసిపోతుంది.
అటువంటి పరిస్థితిని తెచ్చుకోక ముందుగా మేలు కుంటే బయటి సమాజానికి , లోపలి యజమానికి ఋణం తీర్చినవాళ్ళమవుతాం.