Loading...

26, జనవరి 2014, ఆదివారం

విద్వేషాలు పెంచుకోవద్దండి ప్రజలారా!

విద్వేషాలు పెంచుకోవద్దండి ప్రజలారా!
  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నేతలు అన్నిభాగాల్లో ప్రజలు విడిపోవడానికి కారణమవుతున్నారు. తరతరాలు కలిసి ఉండవలసిన ప్రజల్లో అపోహలు ఉండకూడదు. మనసు వికలమయ్యే ఈ రోజులు ఎప్పుడు పోతాయో అందరూ అందర్నీ మనవాళ్ళని ఎప్పుడు అనుకుంటారో అప్పటి వరకూ ప్రశాంతతకు ఆస్కారం లేదు. అభివృద్ధి జరుగదు. ఇవి రెండూ ప్రసాదించమని భగవంతుని వేడుకుంటూ, మన పెద్దలు ఆనాడు ఎన్నో ఆశలతో  పాడుకున్న ఈ  పాట విందాము.

13, జనవరి 2014, సోమవారం

కనకాంబ గారికి ప్రణతులు.

కాంచనపల్లి కనకాంబ గారు రచించిన "అమృతసారము" లో కొన్ని అమూల్యమైన సంగతులను సులభమైన రీతిలో తేలికైన మాటలలో వివరించినారు. భక్తి తత్త్వమును తెలిసినప్పటికీ నిత్యజీవితములో పాటించుటకు మానవులు పడుపాట్లను

దుష్టకర్మంబు క్రిందికిఁ ద్రోయుచుండ
భక్తి నెగఁబ్రాఁకుచుండి అన్న చిన్న పోలికతో చమత్కారంగా చెప్తారు.

తనువు మఱచి తిరుగుత్రాగుఁబోతునకును
దెలివి గలిగి మెలఁగు దీనునకును
గలుగు భేదమరయఁగలవెట్లొ నిత్యంబు
ముక్తవరునకు భవరక్తునకటు

నని చెప్పి భవబంధములలో చిక్కినవానికి ముక్తి దక్కిన వానికి గల భేదములను సునాయాసంగా వివరించినారు.ఒరులకన్నన్ నేనే మతిమంతుఁడనని మతిహీనుడు భావించునని, పరుల దోషమరయుఁ పాపాత్ముడు- తన పాపముల గణించు పుణ్యుడని,భోజన శయనాదులలో క్రమము విడువని జీవుడు శ్రీరాముని భజించుటలో అలసత్వము చూపునని, సరియైన తరుణములో లక్ష్యపెట్టక మరణంబున నేడ్చునని విలువైన హెచ్చరికలను చేస్తున్నారు.
మరి మనకది సాధ్యమా అని అడుగువారికి సమాధానంగా

కాంచునంతమేరఁ గాలు సాగించిన
దోఁచుచుండు నవలఁ ద్రోవవదియ
ఉన్నచోటనుండి యూహించుచుండినఁ
గోరుదానినెవఁడు చేరఁగలడు
అని భుజంతట్టి ధైర్యం చెపుతారు.

ఇంకా కొన్ని నచ్చిన పద్యాలు
యశమునకో! లోకము దమ
వశముం బొనరించుకొనెడు వాంఛనొ పాపో
పశమనమునకో! కాకీ
పశువుల కుపకార బుద్ధి ప్రభవించునొకో!

పరులబోధ జేయు పనికి బూనెడి వాడు
అనుభవంబు లేని యధముడందు
రదియు గల్గు కొలది యంతర్ముఖుండౌ

తనదుఃఖము పరదుఃఖము
గని యసహనమున విబుధుడు కను సత్పధమున్
తన లేమి పరుల కలిమియు
గనియసహనమున కుకవిగను నాస్తికతన్ ( ఆలోచనల్లో పాజిటివ్, నెగెటివ్ ఎట్ల వస్తాయో చూడండి)

అందరికీ అన్నీ వివరించి చెప్పగలమా, అవతలి వారికీ ఆ పరిణతి రావాలన్నదీ తెలుసుకోవాల. చూడండి-
పెండ్లి యేమిటన్న పిల్లకు బ్రీతిగా
బల్కు బల్కనగునె ప్రసవబాధ
యెప్పుడెంతవఱకుఁ జెప్పగానొప్పునో
తప్పకంతవఱకుఁ జెప్పవలయు

చతురులూ విసిరినారు చూడండి
సుద్దులు సెప్పఁగ వినఁగాఁ
బద్దెములల్లంగ మోహపాశము విడునా?
యద్ధిర! గురుసన్నిధిలో
దిద్దుకొనంజెల్లుఁగాక దీనార్తిహరా!

రూపభేదములెంచక సర్వకారకమైన ఆ పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ
పరమార్థంబది జీవకోటికొసగన్ వాగ్దేవియై ప్రీతియై
హరియై శంకరుడై, గణేశ్వరుడునై యాదిత్యుడై యంబయై
పరుడై దేశికుడె పరాత్పరుడునై ప్రత్యేకరూపంబులన్
ధరియింపంగల నీదు శక్తి దలతున్ ధర్మార్థకామంబులన్
బరినర్జించిన భక్తపాళికి గదాప్రాప్తించు దద్యోగమో
కరుణాసాగర రామచంద్ర నృపతీ కైవల్యదాత్రకృతీ!

పండిత పామర స్త్రీపురుషవయో భేదములేక అందరూ పాశ్చాత్యవిద్య విజ్ఞాన తత్త్వాదులే గొప్పవని భ్రాంతి లో పడిన ఈ శతాబ్దిలోని ముప్పయ్యవ దశకంలో భారతీయాత్మతత్త్వమును దర్శించి ప్రదర్శించిన కనకాంబ గారికి ప్రణతులు.