Loading...

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

మయూరుని సూర్యశతకము, అర్థము-2

౧౧.ధారా రాయో ధనాయాపది సపది కరాలంబభూతాః ప్రపాతే
తత్వాలోకైక దీపాస్త్రిడశపతి పురప్రస్థితౌ వీధ్యః  ఏవ
నిర్వాణోద్యోగి యోగి ప్రగమనిజతనుద్వారి వేత్రాయమాణా
స్త్రాయన్తాం తీవ్రభానోర్దివసముఖసుఖారశ్మయఃకశ్మలాద్వః||

అర్థము
ధనాయాపది=ధనాశ చేత చేసెడి ప్రయత్నాయాసము నందు( మానవులు ధనార్జన ప్రయత్నము చేసినపుడు), రాయఃధారాః=ధనపు వర్షధారలుగా నున్నవియును, ప్రపాతే=పడుట యందు (మానవులు నరకమున పడబోవు వేళ), కరాలంబభూతాః= చేయూత అయినవియును, త్రిదివపురప్రస్థితౌ= స్వర్గమునకు బోవు ప్రయాణసమయమున, తత్త్వాలోకైక దీపాః = తత్త్వజ్ఞానమనెడి ఒక్క దీపము గల (తత్త్వజ్ఞానమును జూపు) , వీధ్యః ఏవ= వీధులే అయినవియును, (మార్గములు) ,నిర్వాణోద్యోగి యోగి ప్రగమ నిజతనుద్వారి= మోక్షము కొరకు ప్రయత్నించు యోగులకు మార్గమయిన తన (సూర్యుని యొక్క) దేహద్వారమునకు , వేత్రాయమాణాః= (మార్గము జూపు) బెత్తములయినవియును, దివసముఖ సుఖాః= ఉషఃకాలమున సుఖములయినవియగు, తీవ్రభానోః= సూర్యునియొక్క , రశ్మయః= కిరణములు, వః = మిమ్ము, కశ్మలాత్= పాపమునుండి ,త్రాయత్తాం= రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
 సూర్యుని కిరణాలు ధనసంపాదన యందు వర్షపుధారలుగా,నరకము నందు పడకుండా చేయూతగా, స్వర్గపు దారియందు వెలిగే తత్త్జ్వజ్ఞాన దీపాలున్న మార్గాలుగా, మోక్షమును కోరేవారికి దారిని చూపే చేతికర్రగా, పొద్దుటి పూట సుఖకరంగా ఉన్న సూర్యకిరణాలు
మిమ్ములను పాపమునుండి రక్షించుగాక.
ధనసంపాదన చేయుటకు, నరకము నందు పడకుండా ధర్మాచరణ గావించేందుకు అత్యంత అనుకూల సమయముగా పగలు ను రూపొందించిన సూర్యుని గురించిన సత్యమిది.
భౌతిక అన్వేషణలందు, పారమార్థిక అన్వేషణలందు దారి దీపముగా వెలిగే సూర్యకిరణములు మిమ్ములను పాపము నుండి రక్షించుగాక.
*****************************************************
౧౨.ప్రాచి ప్రాగాచరన్త్యోనతిచిరమచలే చారుచూడామణిత్వం
ముఞ్చత్యో రోచనామ్భః ప్రచురమివ దిశాముచ్చకైశ్చర్చనాయ
చాటూత్కైశ్చక్రనా  మ్నాం చతురమవిచలైర్లోచనై రర్చ్యమానా
శ్చేష్టంతాం చిన్తితానాముచితమచరమాశ్చండ రోచీరుచో వః||
అర్థము
ప్రాక్= మొదట, ప్రాచిఅచలే= ఉదయపర్వతమందు, అనతిచిరం= కొద్దికాలము, చారుచూడామణిత్వం ఆచరన్త్యః= అందమయిన శిరోభూషణమణి వలె అయినవియును, దిశాం= దిక్కులకు (గోడలకు వలె) చర్చనాయ= పూయుట కొరకు, రోచనాంబు ప్రచురం= దట్టమగు గోరోజనపు నీటిని; ఉచ్చకైః ముంచన్త్యఃఇవ= ఎత్తుగా విడచుచున్నట్లున్నవియును , చాటూత్కై =ప్రియురాండ్ర సంయోగమనెడి ప్రియముకొరకు వేగిరపడుచున్న; చక్రనామ్నాం= చక్రవాకపక్షులయొక్క, అవిచలైః  లోచనైః = స్తిమితములైన కండ్లతో,  అర్చమాన్యాః = పూజింపబడుచున్నవియునగు, అచరమాః చండరోచీ రుచః = ప్రాతఃకాలపు సూర్యకాంతులు, వః = మీ, చింతితానాం =కోర్కెలకు, ఉచితం= తగినట్లుగా, చేష్టన్తాం = ప్రవర్తించు గాక.
భావము (నాకు తెలిసి)
ఉదయపు కొండలకు పెట్టని నగవలె, దిక్కుల గోడలపై వెదజల్లిన రంగువలె ఉండిచక్రవాక పక్షుల ఎదురుచూపుల పూలతో నిరంతరం అర్చింపబడుతున్న సూర్యకాంతులు మీ కోర్కెలు సిద్ధింపజేయుగాక.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
౧౩. ఏకం జ్యోతిర్డృశౌ ద్వే త్రిజగతి గదితాన్యబ్జజా స్యైశ్చతుర్భి
ర్భూతానాం పఞ్చమం యాన్యలమృతుషుతధాషట్సు నానావిధాని
యుష్మాకం తాని సప్తత్రిదశమునినుతాన్యష్టదిగ్భాంజిభానో
ర్యాంతి ప్రాహ్ణో నవత్వం దశ దధతు శివం దీధితీనాం శతాని||
అర్థము
ఏకంజ్యోతిః = ఒక్క తేజస్సయి, ద్వే దృశౌ= రెండు నేత్రములై, జగతి = మూడు లోకములయందును, చతుర్భిః అబ్జజాస్యైః గదితాని= బ్రహ్మ యొక్క నాలుగు ముఖములచేతను చెప్పబడినవియై, (వేద ప్రతిపాదితములని), భూతానాం పఞ్చమం= పఞ్చభాతములలో తేజో భూతమై, తథా= అట్లే, ఋతుషుషట్సు= ఆరు ఋతువులయందు, నానా విధాని =అనేక విధములై (ఆరువిధములై), సప్త త్రిదశమునినుతాని = ఏడుగురు దేవర్షులచేత (సంధ్యాసమయమున) ఉపాసింపబడినవగుచు ఏడు సంఖ్య గలవై, అష్టదిగ్భాంజి = ఎనిమిది దిక్కులను పొంది (ఎనిమిది అయి) , ప్రాహ్ణో= ప్రాతఃకాలమున, నవత్వంయాన్తి= నూతనత్వమును (తొమ్మిది అను భావము కూడ) పొందినవై, యాని = ఏ, భానో వీధితీనాం = దశ శతాని= సూర్యుని పదివందల కిరణములు కలవో, తాని= అవి, వః = మీకు, వం=మంగళమును ,దధతు= కలుగజేయుగాక.
భావము (నాకు తెలిసి)
ఒక్కతేజస్సుగా, రెండు నేత్రశక్తులుగా; మూడులోకాల్లో, నాలుగు ముఖాల్లోనుంచి (బ్రహ్మ) పలుకబడ్డదిగా; పంచభూతాల్లో , ఆరు ఋతువుల్లో, సప్తఋషుల పూజలందుతూ, ఎనిమిది దిక్కులుగా, ఉదయములో నవత్వం (తొమ్మిది) గా, ఏ సూర్యుని కిరణాలు భాసిల్లుతాయో అవి మీకు మంగళముల నిచ్చుగాక.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
౧౪.ఆవృత్తి భ్రాన్తవిశ్వా శ్శ్రమమివ దధతశ్శోషిణః స్వోష్మణైవ
గ్రీష్మే దావాగ్ని తప్తా ఇవ రసమసకృద్యే ధరిత్ర్యా ధయంతి
తే ప్రావృష్యాత్త పానాతిశయరుజ ఇవో ద్వాన్తతోయా హిమర్తౌ
మార్తాణ్డస్యా ప్రచండాశ్చిరమశుభభిదేభీశవో వోభవన్తుః ||
అర్థము
యే=ఏ సూర్యకిరణములు, ఆ వృత్తి భ్రాన్తవిశ్వాః= ఆవృత్తులుగా(విరామము లేక) విశ్వమంతయు భ్రమించుచున్నవై, శ్రమందధతఃఇవ= శ్రమముగలిగినవో అనినట్లున్నవియు, స్వోష్మణాశోషిణఃఇవ= తమవేడి చేతనే శోషచెందినవో అనునట్లున్నవియును, గ్రీష్మే= గ్రీష్మఋతువునందు, దావాగ్ని తప్తాః ఇవ= దావాగ్ని చేత తాపము చెందినవి వలె, ధరిత్ర్యాః=భూమి యొక్క, రసం= నీటిని, అపక్వత్=మాటిమాటికి, ధయన్తి= పానము చేయుచున్నవో, (మరియు) ప్రావృషి= వర్షాకాలమందు, ఆత్తపానతీ శయరుజఃఇవ= (వేసవిలో) ఎక్కువగా నీరు త్రాగుట చేత వ్యాధికలిగినవో అనునట్లు, ఉద్వాన్తతోయాః= నీటిని వెడల గ్రక్కినవియును, హిమర్తో= హేమంతఋతువునందు, అప్రచండాః= భయంకరములు కానివియు (సమశీతోష్ణ స్థితి కలిగినవి) నగు, తే= ఆ , మార్తాండస్య, అభీశవః= సూర్యుని కిరణములు, చిరం= పెక్కుకాలము, వః= మీ యొక్క, అశుభభిదే= అమంగళములను పోగొట్టుటకు సమర్థములగుగాక.
భావము (నాకు తెలిసి)
అవిశ్రాంతముగా భూమియంతా తిరుగుతూ తమవేడికి తామే అలసినట్టున్న ఆ సూర్యకిరణములు భూమిలోని నీటితో దాహార్తి తీర్చుకున్నట్టు నీటిని ఆవిరి చేస్తూ, ఎక్కువ నీరు త్రాగుటతో అస్వస్థులయిన ప్రాణులవలె వర్షాలుగా ఆ నీటిని తిరిగి వెడల గ్రక్కుతూ, తర్వాతి హేమంతంలో స్వస్థత, ప్రశాంతత పొందినట్టున్న ఆ కిరణములు మీకు కలిగే అమంగళములను పోగొట్టుగాక.
##############################################################
౧౫.తన్వానా దిగ్వధూనాం సమధిక మధురాలోక రమ్యామవస్థా
మారూఢ ప్రౌఢి లేశోత్కలిత కపివిమాలంకృతిః కేవలైవ
ఉజ్జృంభాంభోజనేత్రద్యుతిని దినముఖే కించిదుద్భిద్యమానా
శ్మశృశ్రేణీవ భాసాం దిశతు దశశతీ శర్మ ఘర్మత్విషో వః||
అర్థము

ఉజృంభాంభోజ నేత్రద్యుతిని= వికసించిన పద్మములనెడి కన్నులకాంతి గల, దినముఖే= పగటియొక్క ముఖమున (పగటి ప్రారంభకాలమున), కించి దుద్బిద్యమానా= కొంచెము మొలకెత్తుచు, ఆరూఢప్రౌఢి లేశోత్కలిత కపిల మాలంకృతిః= కొంచెము ముదిరి కపిల వర్ణముచేత నొక అలంకారము కలదై, కేవలైవ= (అది ముఖ్యమగు అలంకారమయినదై) దిగ్వధూనాం= దిక్కులనెడి స్త్రీలకు, సమధిక మధురాలోకరమ్యాం=కడు మధురమగు ప్రకాశముచేత ఆనందము కలుగజేయు, అవస్థాం = స్థితిని,తన్వానా కలుగజేయుచున్నదై, శ్వశ్ముశ్రేణి ఇవ= మీసకట్టు వలె నున్న, ఘర్మత్విషః= సూర్యునియొక్క, భాసాం దశశతీ= కిరణములు వేయి(వేయి కిరణములు), వః =మీకు , శర్మ =సుఖమును, దిశతు= ఇచ్చుగాక.
తాత్పర్యము:- దినముఖమున వికసించిన పత్రములు నేత్రములవలెనున్నవి. అట్టి ముఖమున ఉదయకిరణములు నూనూగు మీసములవలె నున్నవి. దిక్కులనెడి స్త్రీలకు ఆ మీసపు మొలకలు చూచుట కానందముగా నున్నది. ఇది అంతయు రూపకాను ప్రాణీకమగు ఉత్ప్రేక్ష.
భావము (నాకు తెలిసినది)
మొత్తం పగటిని ముఖంగా అనుకుంటే , ప్రకృతిలో వికసించే పద్మాలు పత్రాలు నేత్రాలుగా , ఉదయకిరణాల గుంపు మీసకట్టు గా కనిపించి దిక్కు అనే స్త్రీలకు ఆనందం కలిగినది.
((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
౧౬.మౌళీన్దో ర్మైష మోషీద్ద్యుతిమితి వృషభాఙ్కేన యశ్శఙ్కినేవ
ప్రత్యగ్రోద్ఘాటితామ్భోరుహకుహర గుహా సుస్థితేనేవ ధాత్రా
కృష్ణేన ధ్వాన్త కృష్ణస్వతను పరిభవత్రన్నునేవ స్తుతోలం
త్రాణాయ స్తాత్తనీయానపి తిమిరరిపోస్స త్విషాముద్గమోవః||
అర్థము
ఏషః= ఈ సూర్యోదయము, మౌళీన్దో= (తన) తలపై నున్న చంద్రుని యొక్క, ద్యుతిం= కాంతిని, మా-మోషీత్=హరింపకుండుగాక, ఇతి=అని హరించునేమో అని), శంకినా ఇవ= సందేహించెనా? అనినట్లున్న వృషభాఙ్కేన=శివుని చేతను (మరియు), ప్రత్యగ్రోద్ఘాటితాంభోరుహకుహర గుహాసుస్థితేన= అప్పటికప్పుడు తెరువబడిన (వికసింపజేయబడిన) పద్మగర్భమనెడి గుహయందు సుఖముగా నున్న, ధాత్రా= బ్రహ్మచేతను (మూసికొన్న పద్మ గర్భమందు ఇంతవరకూ బ్రహ్మ సుఖముగా నున్నాడు. సూర్యోదయము చేత ఇప్పుడు తన గృహద్వారము తెఱుచుకొన్నది. అందుచేత బ్రహ్మ కూడా భయపడినాడు. మరియు, ధ్వాంతకృష్ణస్వతను పరిభవత్రస్నునా ఇవ= చీకటివలె నల్లనితన శరీరమును కూడ (అంధకారమని భ్రమించి) అపహరించునేమో అని భయపడుచున్నట్లున్న, కృష్ణేన = విష్ణువు చేతను, అలం= మిక్కిలి, యః = ఏది, స్తుతః=స్తుతింపబడినదో, సః = అట్టి, తనీయానపి= సూక్ష్మమయినదయినను, తిమిరరిపోః త్వషాం ఉద్గమః= సూర్యుని యొక్క కాంతుల, ఉదయము, వః= మీ యొక్క , త్రాణాయ= రక్షణముకొరకు, స్తాత్= అగుగాక.
త్రిమూర్తులును సూర్యునుపాసింతురని తాత్పర్యము. ఒకనిని స్తుతించుట భక్తి చేతగాని ,భయం చేతగాని జరుగును.ఇచ్చట శివుని శిరస్సుననున్న చంద్రుని, బ్రహ్మకు జన్మస్థానమయిన పద్మమును, విష్ణు శరీర నీలతత్వమును కవి ఆధారముగా చేసికొని భయముచే వారుపాసించిరని రమ్యోత్ప్రేక్ష చేసినాడు.

భావము (నాకు తెలిసి)
సూర్యోదయము కాగానే తన శిరస్సుపైనున్న చంద్రుడి కాంతి ఎక్కడ తగ్గిపోతుందో అనే భయముతో శివుడూ, సూర్యోదయముతో కమలం విచ్చుకోవడంతో అందులో ఉన్న కమలజుడు (బ్రహ్మ) భయపడుతూ, చీకటి ని మాయంచేసినట్లే చీకటి రంగున్న తననూ ఎక్కడ మాయం చేస్తాడో నని విష్ణువూ సూర్యుని పూజించిరి, అట్టి సూర్యుడు మిమ్ముల రక్షించుగాక.
 )))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
౧౭.విస్తీర్ణం వ్యోమదీర్ఘాస్సపది దశదిశో న్యస్త వేలామ్భభసోబ్ధీ
న్కుర్వద్భిర్దృశ్యనానా నగనగరనగా భోగపధ్వీంచ పృధ్వీమ్
పద్మిన్యుచ్ఛ్వాస్యతేయైరుషసి జగదపిధ్వంసయిత్వాతమిస్రా
ముస్రావిస్రావయంతు ద్రుత మనభిమతంతే సహస్రత్విషో వః||
అర్థము
సపది=తత్ క్షణమున, వ్యోమ= ఆకాశమును, విస్తీర్ణం= విస్తరించినదానిగాను, దశదిశః= పదిదిక్కులను, దీర్ఘాః =పొడవయినవిగాను, అబ్ధీన్= సముద్రమును, వ్యస్త వేలాంభసః= విడివిడిన ఒడ్డు నీరు కలవాటినిగాను (సూర్యోదయము చేత యిది వొడ్డు యిది నీరు అని విడిగా తెలియును), పృధ్విం= భూమిని, దృశ్య నానానగ నగర నగాభోగ , పృధ్వీం= కనబడుచున్న అనేక పర్వతములు , నగరములు, పర్వతవైశాల్యమును కలిగి అనంతమయిన దానిని గాను(సూర్యోదయము చేతనే అన్నియు కనబడి భూమియొక్క విస్తారము తెలుస్తుంది), కుర్వద్భిః = చేయుచున్న, యైః=వేటిచేత (ఏ కిరణములచేత), ఉషసి= ప్రాతః కాలమందు, పద్మినీ= తామరకాడ మరియు, జగదపి= లోకమును, ఉచ్ఛ్వాస్యరతే= ఊరడింపబడుచున్నదో, తే= ఆ, సహస్రత్విష ఉస్రాః=సూర్యుని కిరణములు, తమిస్రాం= అంధకారరాత్రిని, ధ్వంసయిత్వా= ధ్వంసముచేసి, ద్రుతం= శీఘ్రముగా, వః= మీ యొక్క అనభిమతం= అనిష్టమును, విస్రావయన్తు= జారిపోవచేయునుగాక.
భావము (నాకు తెలిసి)
ఆకాశమంతా విస్తరించి, భూమిపై నేది యేది అను విచక్షణకై వెలుగునిచ్చి సమస్తమూ చూపించి, తామరలను, లోకములను సంతసింపజేసి అంధకారమును ధ్వంసము చేసే ఆ కిరణములు మీకు అనిష్టాలను తొలగించుగాక.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
౧౮.అస్తవ్యస్త త్వశూన్యో నిజరుచిర నిశానశ్వరః కర్తుమీశో
విశ్వం వేశ్మేవ దీపః ప్రతిహతతిమిరం య: ప్రదేశస్థితోపి
 దిక్కాలాపేక్షయాసౌ త్రిభువనమట తస్తిగ్మభానోర్నవాఖ్యాం
 యాతశ్శాతక్రతవ్యాం దిశిదిశతు శివం సోర్చిషాముద్గమో వః||

ఈ శ్లోకమునందు కవి సూర్యకిరణోద్గమమును దీపముతో పోల్చినాడు. ఆ మేరకు రెండింటి విశేషణములను అభంగముగను నభంగముగను విరచి అర్థభేదమేర్పరుపవలెను, ముందు సూర్యకిరణ పక్షముగా పదచ్ఛేదము వివరింపబడి శ్లోకార్థము పూర్తిచేసి తరువాత దీప పక్షముగా వివరింపబడును.
అర్థము
అస్తవ్యస్తత్వశూన్యః= నాశము మార్పులేనిదియు, నిజరుచిః= సత్యమయిన కాంతి గలిగినదియును, అనిశః= రాత్రి లేనిదియును, అనశ్వరః= నాశస్వభావము లేనిదియునై, ప్రదేశస్థితః అపి = ఒకచోట నుండిఉను(కిరణోద్గమము) దీపః= దీపము, వేశ్మ ఇవ= ఇంటినివలెనే, విశ్వం= ప్రపంచమును, ప్రతిహతతిమిరం= కొట్టబడిన అంధకారము కలదానినిగా (చీకటి లేనిదానినిగా), కర్తుం = చేయుటకు, యః అసౌ= ఏ ఈ సూర్యకిరణోద్గమము, ఈశః= సమర్థమయినదో, దిక్కాలాపేక్షయా= దిక్కును కాలము సరించి, త్రిభువనం= ముల్లోకములును, అటతః= తిరుగుచున్న, తిగ్మభానోః అర్చిష్మాం ఉద్గమః= సూర్యుని కిరణముల ఉదయము కలదో, వః= అది, శాతక్రతవ్యాం దిశ= ఇంద్రుని సంబంధమగు దిక్కున (తూర్పున) నవాఖ్యాం=క్రొత్తపేరును, యాతః= పొందినదై, వః= మీకు, శివం= శుభమున, దిశకు= యిచ్చుగాక.
తాత్పర్యము
దీపపక్షమున పద విభాగము:_అస్తవ్యః= స్తుతింపతగనిది(సూర్యుని స్తుతింతురు, దీపమునట్లు స్తుతింపరు), తత్వశూన్యాః=ఒక నిలకడ స్వభావము లేనిది(దీపము గాలికి చంచలమగును, సూర్యుడేక స్వభావుడు,అని జరుచిః= స్వయంప్రకాశము కానిది (వత్తి వేసి చమురుపోసి ఒకరు వెలిగించిన వెలుగునది దీపము సూర్యుడట్లు కాదు) , అనిశః= రాత్రిలేనిది (అంధకారము లేనిదని) దీనికింకొక విధముగా చెప్పవచ్చును. నిజరుచిర నిశః= తన కాంతిని గ్రహించు రాత్రికలది(దీపరుచి రాత్రి యందుండును. సూర్యకాంతి రాత్రియుండదు.) నశ్వరః=నశించు స్వభావము కలది (గాలి తాకిడికి ఆరిపోవును)
దిక్కాలాపేక్ష చేతనే సూర్యునకు ఉదయాస్తమయములు, రంగుల మార్పులే కాని వస్తుస్థితి చేతకాదని తాత్పర్యము.
భావము (నాకు తెలిసి)
ఈ శ్లోకం లో సూర్యుడు కేవలం వెలుగు నిచ్చే సాధనం మాత్రమే కాదని, సాధారణ దీపానికి, సూర్యునికి గల అంతరాన్ని స్పష్టీకరిస్తున్నాడు. ఒకే పద్యం లోనే పదాల్ని రెండు రకాలుగా విభజించడంవల్ల ఈ అర్థభేదాన్ని సృష్టించి, స్పష్టంచేస్తున్నాడు. అదేమిటంటే
ఏ విధమైన మార్పు లేకుండా(వికాసం, నాశనము ) శాశ్వతంగా ఉండేది, స్వంత కాంతి కలిగినది, ప్రపంచమంతటి అంధకారాన్ని తొలగించగలిగినది,దిక్కును, కాలాన్ని అనుసరించి కొన్నిచోట్ల కనిపిస్తూ,కనిపించకుండా ఉండేదేకాని వస్తుస్థితిలో అంటే తన ఉనికిలో ఏ మార్పులేనిది సూర్యబింబము.
స్వప్రకాశములేనిది, నిలకడ లేనిది, రాత్రి మాత్రమే జీవనము కలిగినది, నశించు స్వభావము గలిగినది (గాలికి)దీపము.
________________________________________________________________
౧౯.మాగాన్ల్మానిం మృణాళీ మృదురితి దయయేవా ప్రవిష్టోహిలోకం
 లోకాలోకస్య పార్శ్వం ప్రతపతిన పరం యస్తదాఖ్యార్ధమేవ
 ఊర్ధ్వం బ్రహ్మాణ్డఖణ్డస్ఫుటనభయ పరిత్యక్త దైర్ఘ్యో ద్యుసీమ్ని
స్వేచ్ఛావశ్యావకాశా వధిరవతు నమప్తాపనో రోచిరోఘః||
అర్థము
యః= ఏది, మృణాళీమృదుః= తామరతూండ్ల వలె మృదువైనది కనుక, మ్లానిం మాగాత్= వాడిపోగూడదు, ఇతి = అని, దయయా ఇవ= దయచేతనో అనునట్లు, అహిలోకం = సర్పలోకమును (పాతాళమును), అప్రవిష్టః= ప్రవేశించలేదో (తామరలు తామరతూండ్లు సూర్యునకు ప్రియమయినవి, సర్పములు తామరతూండ్లవలె నుండును. ఆ సాదృశ్యము చేత సూర్యునకుదయ కలిగినదని యుత్ప్రేక్ష.) , పరం= మరియు, లోకాలోకస్య= లోకములనావరించిన చక్రవాళ పర్వతముయొక్క, పార్శ్వం= ప్రక్కభాగమును, తదాఖ్యార్థం ఏవ= చక్రవాళ పర్వతముయొక్క కీర్తికొరకే , నప్రతపతి = తపింపజేయదో, బ్రహ్మాణ్డ ఖణ్డ స్ఫుటనభయ పరిత్యక్త దైర్ఘ్యః= బ్రహ్మాండ ఖండములు పగులునను భయముచేత పొడవుగా పెరుగుట మానినదై, ఊర్ధ్వం= ఊర్ధ్వముగా, నప్రతపతి =తపింపజేయదో,(ఇది అధ్యాహారము), సః = అట్టి, ద్యుసీమ్నిస్వేచ్ఛావశ్యావకాశావధిః = ఆకాశసీమయందు తనకు తానేర్పరచుకొనిన హద్దు కలిగిన, తాపనః= సూర్యసంబంధమగు, రోచిరోషు=కిరణముల సముదాయము, వః= మిమ్ము అవతు=రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
తామరలు సూర్యునికి ప్రియము కనుక, తామరతూండ్ల పోలికతో ఉన్న  సర్పాలు ఎక్కడ మాడిపోతాయో అని మాత్రమే పాతాళంలోనికి ప్రవేశించకుండా దయచూపినట్లు, చక్రవాళ పర్వతము యొక్క కీర్తి నిలుపుటకే ఆ ప్రక్క భాగమును తపింపచేయనట్లు, ఈ విషయములలో తనకు తానే హద్దు ఏర్పఱచుకొన్న సూర్యుని కిరణములు మిమ్ములను రక్షించుగాక.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
౨౦.అశ్యామఃకాలయేకో న భవతి భువనాన్తోపి వీతేన్ధకారే
సద్యః ప్రాలేయపాదో న విలయమచల శ్చంద్రమా అప్యుపైతి
బంధస్సిద్ధాఞ్జలీనాం న హి కుముదవసప్యాపి యత్రోజ్జిహానే
తత్ప్రాతః ప్రేక్షణీయం దిశతు దినపతేర్ధామ కామాధికం వః||
అర్థము
యత్ర= ఏ సూర్యతేజస్సు, ఉజ్జిహానే= పైకి ప్రసరించుచుండగా,కాలః యేకః= కాలమొక్కటి మాత్రమే, అశ్యామః= నలుపుగానిది (తెల్లనిది) (తెల్లవారుట) అని, న భవతి =అగుటలేదు, మరి భువనాన్తోపి= లోకములయొక్క చివరిభాగముకూడా, అన్ధకారేవీతే =అంధకారము పోగా, అశ్యామః భవతి=తెల్లనిదగుచున్నది (దీనిని తెచ్చుకొనవలెను) , ప్రాలేయపాదః= మంచుకొండదగ్గరి చిన్న పర్వతము మాత్రమే, సద్యః= ఆ క్షణమందు, విలయం= నాశమును , నోపైతి= పొందుటలేదు (ఇది అధ్యాహారము) , చంద్రమా అపి= చంద్రుడు గూడా (విలయమును ), ఉపైతి = పొందుచున్నాడు, మరియు సిద్ధాంజలీనాం= ప్రాతస్సంధ్యావందనము చేయు సిద్ధుల అంజలులకు మాత్రమే, బంధః=బంధము, న= కాదు -మరి, కుముద వనస్యాపి= కలువతోటలకు కూడా బంధః=బంధము కలుగుచున్నదో (సూర్యోదయకాలమున సిద్ధులు వందనము కొరకు చేతులు ముకుళింపజేయుదురు , కలువలు ముడుచుకొనును), తత్= అట్టి ప్రాతఃప్రేక్షణీయం= ఉదయకాలమున సుందరమగు, దినపతేః ధామ= సూర్యునియొక్క తేజస్సు, వః= మీకు, కామాధికం=కోరినదానికన్నా యెక్కువగు దానిని , దిశతు= యిచ్చుగాక.
భావము (నాకుతెలిసి)
సూర్యుని కిరణములు ఎప్పుడైతే ప్రసరిస్తాయో అప్పుడు కాలము తప్ప మిగిలినవన్నీ తెల్లబడతాయి. అంటే తెల్లవారిన ప్రభావము లోకముల చివరిదాకా కనిపిస్తూనేఉంటుంది. ఆ సమయంలో కలువలు మాత్రమే గాక సంధ్యావందనం చేసేవారి చేతులు  కూడా ముకుళిస్తాయని (ముడుచుకుపోతాయి) కవి చమత్కారము.



16, ఫిబ్రవరి 2013, శనివారం

మయూరుని సూర్యశతకము , అర్థము


      మయూరుడు వ్రాసిన శతకము సూర్యభగవానుని స్తుతిస్తూ వ్రాసిన శతకము. ఈ శతకము ఎంతో ప్రసిద్ధిపొందినది. గంభీరమైన పదబంధాలతో, అచ్చెరువుకు గురిచేసే భావజాలంతో, అద్భుతమైన శబ్ద, అర్థాలంకారాలతో శోభించే ఈ శతకమును పలికి తన కుష్ఠురోగమునుంచి మయూరుడు విముక్తుడైనాడని ప్రచలితమైన కథ. విదేశీ భాషల్లోనికి కూడా అనువదించబడియున్నది.

           శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులవారు వివరించిన అర్థముతో భువనవిజయం ప్రచురణ సంస్థ వారు ప్రచురించిన పుస్తకం లో ఉన్న సమాచారమే ఇదంతా. గూగులించినపుడు పెద్ద వివరాలు దొరకలేదు. (ఈ మాట వారు సూర్యశతకాన్ని ఇచ్చియున్నారు కాని అందులో అర్థములు తెలుపలేదు.) ఇంత కష్టమైన సంస్కృతము అర్థముకాని నాలాంటి సాహిత్యాభిమానుల కోసం ఈ పుస్తకములో నున్న అర్థాన్ని యథాతథంగా ప్రచురిస్తున్నాను.

    రథసప్తమి సందర్భంగా జగత్తు పుట్టుకకు, పోషణకు, లయమునకు భౌతికంగా కనిపిస్తూ కారకుడైన సూర్యభగవానునికి శ్రద్ధాపూర్వక నమస్కారములు.

౧. జమ్భారాతీభకుమ్భోద్భవమివ దధతస్సాంద్ర సిన్దూరరేణుం
రక్తాస్సిక్తా ఇవౌఘైరుదయగిరితటీ ధాతుధారా ద్రవస్య
ఆయాన్త్యా తుల్యకాలం కమలవనరుచే వారుణావో విభూత్యై
భూయా సుర్భాసయన్తో భువనమఖినవా భానవో భానవీయాః ||
అర్థము
జమ్భారాతీభ కుమ్భోద్భవం = ఐరావతము యొక్క కుంభస్థలమందు బుట్టిన (ఉండిన), సాన్ద్ర సిన్దూరరేణుం= దట్టమగు సిందూరపు పొడిని, దధత యివ=ధరించినట్టున్నవియు, ఉదయగిరి తటీ ధాతుధారాద్రవస్య= ఉదయపర్వతపు చరియల యందలి గైరికాది ధాతువుల ధారాజలము యొక్క, ఓఘై:= ప్రవాహములచేత, సిక్తాః = తడిసినవియు (అందుచేతనే) , రక్తాః= ఎర్రగానున్నవియు, తుల్యకాలం= అదే సమయమందు, ఆయాన్త్యాః = వచ్చుచున్న, కమలవనరుచా యివ= పద్మవనముల కాంతి చేతనో అనునట్లు, అరుణాః= ఎర్రనివియు, భువనం = లోకము(ల)ను, భాసయన్తః= ప్రకాశింపజేయునవియు అయిన, భానవీయాః=సూర్యుని సంబంధమయిన, అభినవాః=క్రొత్త , భానవః=కిరణములు, వః=మీయొక్క, విభూత్యై= సంపద కొఱకు, భూయాసుః =సమర్థములగుగాక.
పైనున్న అర్థాలను కలిపి భావము నేను ఇక్కడ వ్రాస్తున్నాను. తప్పులుంటే పెద్దలు సరిదిద్దగలరు.
భావము=ఐరావతము యొక్క కుంభస్థలమందు బుట్టిన దట్టమగు సిందూరపు పొడిని ధరించినట్టు ఉదయపర్వతపు చరియల యందలి గైరికాది ధాతువుల ప్రవాహములచేతడిసినట్టు ఎర్రగానున్నపద్మవనముల కాంతి చేతనో ఎర్రనైనట్టు లోకాలను ప్రకాశింపజేసే సూర్యుని నవకిరణాలు మీ మీ సంపదలను వృద్ధి జేయుగాక.

౨. భక్తిప్రహ్వాయ దాతుం ముకుళపుట కుటీ కోటర క్రోడలీనాం
లక్ష్మీమాక్రష్టుకామా ఇవ కమల పనోద్ధాటనం కుర్వతేయే,
కాలాకారాన్ధకారా ననపతిత జగత్సాధ్వనధ్వంసకల్యాః
కల్యాణం వః క్రియాసుః కిసలయరుచయస్తే కరా భాస్కరస్య||
అర్థము
ముకుళపుటీ కుటీ కోటర క్రోడలీనాం= (సూర్యోదయమునకు ముందు ) ముకుళించియున్న పద్మపుటములనెడి కోటరములలో దాగియున్న, లక్ష్మీ= లక్ష్మిని, భక్తి ప్రహ్వాయ= భక్తి చేత వంగిన వానికి (భక్తునకు), దాతుం = ఇచ్చుటకు, ఆక్రష్టుకామా ఇవ= ఆకర్షింపగోరినవో అనునట్లు, యే=యేవి, కమలవనోద్ఘాటనం కుర్వతే= పద్మవనములను ఖేదించుచున్నవో మరియు, కాలకాలాన్ధకారాననపతిత జగత్సాధ్వసధ్వంసకల్యాః= కాలుని వంటి ఆకారము గల అంధకారము నోటబడిన జగత్తుయొక్క భయమును పోగొట్టుటయందు సమర్థములయినవో, తే= అట్టి, కిసలయరుచయః= చిగురుటాకు వలె ఎర్రని కాంతిగల, భాస్కరస్య కరా= సూర్యుని కిరణములు, వః = మీకు, కల్యాణం శుభమును,క్రియాసుః= జేయుగాక.
ఈ శ్లోకమున అంధకారమునకు విశేషణమగు కాలాకార శబ్దమునకు యముని ఆకారముగల,నల్లని ఆకారముగల , కాలమే ఆకారమయిన అని మూడు అర్థములు చెప్పవచ్చు.
భావము (నాకు తెలిసి)
పద్మమునందలి లోపలి కక్ష్యలలో విశ్రమించిన లక్ష్మి అనుగ్రహము భక్తులకు కలుగుటకు వీలుగా పద్మమును వికసింపజేయునట్టి, కాలుని లా నల్లని చీకటి కమ్ముకున్నపుడు జగత్తు భయమును పోగొట్టుటకై సామర్థ్యముతోనున్నట్టి, చిగురుటాకుల్లా ఎర్రని సూర్యకిరణములు మీకు శుభమును కలిగించుగాక.

౩.గర్భేష్వమ్భోరుహాణాం శిఖరిషు చ శితాగ్రేషు తుల్యం పతన్తః
ప్రారమ్భే వాసరస్య వ్యుపరతిసమయే చైకరూపాస్తథైవ
నిష్పర్యాయం ప్రవృత్తా స్త్రిభువనభవన ప్రాఙ్గణే పాన్తు యుష్మా
నూష్మాణం సన్తతాధ్వశ్రమజమివ భృశం బిభ్రతో బ్రధ్నపాదాః||
అమ్భోరుహాణాం గర్భేషు = (మెత్తని) పద్మములలోపలను, శితాగ్రేషు= వాడి శృంగముగల, శిఖరిషుచ= పర్వతముల యందును, తుల్యం=సమానముగా, పతన్తః = ప్రసరించుచున్నవియు, వాసరస్య ప్రారంభే= పగటియొక్క మొదటికాలమందు( ఉదయకాలమున) , ఉపరతిసమయే చ= అస్తమయ సమయమందున, ఏకరూపాః= ఒకటే రూపము కలవియు (ఎర్రనివి అని), తథైవ = అట్లే, త్రిభువన ప్రాంగణేషు= మూడులోకములనెడి ముంగిళ్ళయందు,  నిష్పర్యాయం = వేరు వేరు సమయములలో కాక ఒక్క సమయముననే, ప్రవృత్తాః= ప్రసరించుచున్నవియు మరియు, సంతతాధ్వశ్రమజం ఇవ = యెప్పుడును ఆకాశమార్గమున చరించునని కలిగినదో అనునట్లున్న, ఊష్మాణం= వేడిని, బిభ్రతో= భరించినవియునగు, బ్రధ్నపాదాః= సూర్యకిరణములు, యుష్మాన్= మిమ్ము, పాంతు = రక్షించుగాక, పాదశబ్దము కిరణము కూడా అని అర్థము.
కవి ఈ శ్లోకమున పాదశబ్దము ప్రయోగించి సూర్యసంచారమును నిర్వహించినాడు
 భావము (నాకు తెలిసి)
గిరిశిఖరాల ఎత్తులపైనా, పద్మాల లోతుల్లోనా సమానంగా ప్రసరించేవి, ఉదయాస్తమయ సమయల్లో ఒకే ఎఱ్ఱని రంగు కలవి, మూడు లోకాలనే ముంగిళ్ళలోఒకే సమయంలో ప్రసరించేవి, ఆకాశంలో పయనిస్తూ వేడిగా ఉండేవి అయిన సూర్యకిరణాలు మిమ్ము రక్షించు గాక.

౪.ప్రభ్రశ్యత్యుత్తరీయత్విషి తమసి సముద్వీక్ష్య వీతావృతీన్ప్రా
గ్జన్తూం స్తన్తూన్యథా యానతను వితనుతే తిగ్మరోచిర్మరీచీన్
తే సాన్ద్రీభూయసద్యః క్రమవిశదదశాశాదశాళీ విశాలం
శశ్వత్సంపాదయన్తోమ్బరమమలమలం మఙ్గళం వోదిశన్తు||
అర్థము
ఉత్తరీయత్విషి= (నల్లని) ఉత్తరీయమువంటి, తమసి= అంధకారము, ప్రభ్రశ్యతి= జారిపోగా, ప్రాక్ = ముందు, వీతావృతీన్= ఆవరణము(కట్టువస్త్రము) పోయిన, జంతూన్ = ప్రాణులను, సముద్వీక్ష్య= చూచి, తగ్మరోచిః=సూర్యుడు, యాన్ మరీచిన్= ఏ కిరణములను, తన్తూన్ యథా=దారములవలె , వితనుతో=చేయుచున్నాడో, తే= ఆ కిరణములు, సద్యః=తత్కణమందు,సాంద్రీభయ=దట్టములై, అంబరం = ఆకాశమును (వస్త్రమును అనియును) ,క్రమవిశదదశాశాదశాళీ విశాలం=క్రమముగా తెల్లవారిన దశదిశలనెడి అంచుల చేత విశాలమయినదిగాను, అమలం= నిర్మలమయినదిగాను(రజస్సులేనిదిగా), సంపాదయంతః= చేయుచున్నవై, వః= మీకు, అలం= చాలినంత, మంగళం= శుభమైన , శశ్వత్=శాశ్వతముగా, దిశన్తు= ఇచ్చుగాక.
" సదశం నూతనం దృఢం" " అరజేవాససీ" అనినట్లు వస్త్రమునకు అంచులుండుట, రజస్సు (దుమ్ము) లేకుండుట ప్రశస్తము. కవి ఆకాశపర్యాయముగా అంబర శబ్దమును వాడి విశేషణముల ద్వారా సవిశేషమగు ఉత్ప్రేక్షను సాధించినాడు
భావము (నాకు తెలిసి)
జారిపోయిన ఉత్తరీయము వలె అంధకారము తొలగుతుండగా, దశదిశలనెడు (ధూళి చేరని, మాయని) అంచులు గల కిరణదారములతో దట్టముగా అల్లిన గగనాంబరాన్ని శుభప్రదంగా చాలినంత యిచ్చుగాక.

౫.న్యక్కుర్వన్నోషధీశే ముషితరుచి శుచేవౌషధీః ప్రోషితాభా
భాస్వద్గ్రావోద్గతేన ప్రథమమివ క్రుతాభ్యుద్గతిః పావకేన
పక్షచ్ఛేదవ్రణాసృక్సృత ఇవ దృషదో దర్శయన్ప్రాతరద్రే
రాత్రామ్రస్తీవ్రభానోరనభిమతనుదే స్తాద్గభస్త్యుద్గమో వః||
అర్థము
ఓషధీశే=చంద్రుడు, ముషితరుచి= కాంతిహీనుడు కాగా (సూర్యోదయముచేత చంద్రుని కాంతి హీనమగును) , శుచా ఇవ= ఆ శోకము చేతనో అనునట్లు, ప్రోషితాభాః= కాంతివిహీనములయిన, ఓషధిః = ఓషధులను, న్యక్కుర్వన్=తిరస్కరించుచున్నదియు, భాస్వద్గ్రావోద్గతేన= సూర్యకాంత మణులనుండి వెడలిన, పావకేన= అగ్నిచేత, ప్రథమం=ముందుగా, కృతాభ్యుద్గతిఃఇవ= స్వాగతమీయబడినట్లున్నదియు, పక్షచ్ఛేద వ్రణాసృక్సృతః ఇవ= (ఇంద్రుడు) ఱెక్కలు నరుకుటవలన కలిగిన పుండ్లనుండి రక్తము కారుచున్నచో అనునట్లున్న, ప్రాతర ద్రేఃదృషదః= ఉదయాద్రి యొక్క రాళ్ళను, దర్శయన్= చూపుచున్న, ఆతామ్రః= అంతటను ఎర్రనగు, తీవ్రభానోః గభస్త్యుద్గమః= సూర్యునియొక్క కిరణోదయము, వః= మీకు, అనభిమతనుదే = అనిష్టములను పోగొట్టుటకు, స్తాత్= (సమర్థము) అగుగాక.
భావము (నాకు తెలిసి)
(ఉదయాద్రి గురించి)తనపై నున్న చంద్రుడు సూర్యోదయముతో కాంతిహీనుడు కాగా శోకముతో నున్నట్టి, ఓషధులను తిరస్కరించినట్టి, సూర్యకాంతమణుల అగ్నిశిఖలతో స్వాగతంపొందినట్టి, ఱెక్కలు ఇంద్రుడు కత్తిరించగా కారిన రక్తముతోనున్నట్టు కనుపించే ఉదయాద్రి పైనున్న సూర్యకిరణములు మీకు అనిష్టములను పోగొట్టుగాక.

 ౬.శీర్ణఘ్రాణాఙ్ఘ్రిపాణీన్వ్రణిభిరవఘనైర్ఘర్ఘరావ్యక్తఘోషా
న్దీర్ఘాఘ్రాతానఘౌఘైః పునరపి ఘటయత్యేక ఉల్లాఘయన్యః
ఘర్మాంశోస్తస్య వోన్తర్ద్విగుణఘన ఘృణానిఘ్ననిర్విఘ్నవృత్తే
ర్దత్తార్ఘాస్సిద్ధసఙ్ఘైర్విదధతుఘృణయశ్శీఘ్రమంహోవిఘాతం

అర్థము
అఘౌఘైః = పాప సమూహములచేత, దీర్ఘాఘ్రాతాన్= చిరకాలము ఆఘ్రాణింపబడినవారిని (అనగా పాపములు చేసినవారిని అని) అందుచేతనే, వ్రణిభిః= పుండ్లు కలిగిన, అవఘనైః= అవయవములతో, ఘర్ఘరావ్యక్తఘోషాన్=శిథిలమై స్ఫుటముకాని కంఠధ్వని కలవారిని, ఉల్లాఘయన్=రోగములేని వారినిగాచేయుచు, యః = ఎవడు, శీర్ణఘ్రాణాంఘ్రిపాణిన్= శిథిలమయిపోయిన ముక్కు కాళ్ళు చేతులును, ఏకః= ఒక్కడే , పునరపి=తిరిగి, ఘటయతి=ఘటింపజేయుచున్నాడో(అతుకుచున్నాడో), తస్య=అట్టి, అంతర్ద్విగుణఘన ఘృణానిఘ్న నిర్విఘ్నవృత్తే= దయాపరవశమయిన, నిరాటంకమయిన వృత్తి గల, ఘర్మాంశో= సూర్యునియొక్క, సిద్ధసంఘైః= సిద్ధులచేత, దత్తార్ఘా= పూజావిధులొసగబడిన ఘృణయః= కిరణములు, వః= మీకు, అంహోవిఘాతం= పాపనాశమును , విదధతు=చేయుగాక.
భావము(నాకు తెలిసి)
చిరకాలము పాపము చేయుచుండుట వలన రోగగ్రస్తులై, అవయవములు శిథిలమైన వారి రోగములను నివృత్తి చేసి, వారి దేహమునందలి అంగములను సరి చేయుటకై వారి పాపమును సూర్యుని యొక్క కిరణములు ధ్వంసముచేయుగాక.
౭.బిభ్రాణా వామనత్వం ప్రథమమథతథైవాంశవఃప్రాంశవోవః
క్రాన్తాకాశాన్తారాళాస్తధను దశదిశః పూరయన్త స్తతోపి
ధ్వాన్తాదాచ్ఛిద్య ద్వేవద్విష ఇవ బలినో విశ్వమాశ్వశ్నువానాః
కృచ్ఛ్రాణ్యుచ్ఛ్రాయహేలా వహసితహరయోహారిదశ్వాహరంతు||
అర్థము=
ప్రథమం=మొదట, వామనత్వం= వామనత్వమును(పొట్టిదనమును), బిభ్రాణాః= భరించినవియును, అథ= తరువాత, ప్రాంశవః= పొడవైనవియును , తథైవ=అట్లే, క్రాన్తాకాశాంతరాళాః= ఆకాశము నాక్రమించినవియును, తదను=తరువాత, దశదిశః=పదిదిక్కులను, పూరయన్తః= నింపినవియును(నిండినవి) ,తతోపి=తరువాత, దేవద్విషః= దేవతల శత్రువగు, బలినఃఇవ= బలిచక్రవర్తి నుండి పూర్వమాకర్షించినట్లు (గ్రహించినట్లు), ధ్వాన్తాత్=అంధకారమునుండి, విశ్వం=ప్రపంచమును, ఆచ్చిద్య= ఆకర్షించి (చీకట్లు తొలగించి అని అర్థము) ఆ ప్రపంచమును, ఆశువేశీఘ్రముగా, అశ్నువానాః= అనుభవించినవియును(వ్యాపించినవి అని భావము) ఉచ్చ్రాయహేలావహసితహరయః= తమఔన్నత్యముచేత, త్రివిక్రమావతారుడగు= విష్ణువు ను అపహసించిన, హారిదశ్వాః =సూర్యుని సంబంధములగు, అంశవః= కిరణములు, వః=మీయొక్క, కృచ్ఛ్రాణి= కష్టములను, హరన్తు= హరించుగాక.
భావము(నాకు తెలిసి)
బలి చక్రవర్తి నుంచి దానము స్వీకరించుటకై మొదట పొట్టివాడుగా ఉండి తరువాత త్రివిక్రముడైన విష్ణువులా సూర్యకిరణములు మొదట పొట్టిగా ఉండి తరువాత దశదిశలలో నిండి పోయి, చీకటినుండి ప్రపంచాన్ని గ్రహించినట్టు లాగుకొనుచు, మీ కష్టములను హరించుగాక.
౮.ఉద్గాఢేనారుణిమ్నా విదధతి బహుళం యే రుణస్యారుణత్వం
మూర్దోద్ధూతౌ ఖలీనక్షతరుధిరరుచో యే రథాశ్వాననేషు
శైలానాం శేఖరత్వం శ్రితశిఖరశిఖాస్తన్వతే యే దిశన్తు
ప్రేంఖంతః ఖే ఖరాంశోః ఖచితదినముఖాస్తే మయూఖాస్సుఖంవః||
అర్థము
యే=ఏవి, ఉద్గాఢేన= దట్టమయిన, అరుణిమ్నా= యెర్రదనముచేత, అరుణస్య= (సారథియైన)అనూరునియొక్క , అరుణత్వం=ఎఱ్ఱదనమును, బహుళం=విస్తారముగా, విదధతి= చేయుచున్నవో(మరియును), యే=ఏవి, మూర్ధోద్ధూతౌ=(తమ) తలలూపినప్పుడు , రథాశ్వాసనేషు= రథపు గుర్రముల ముఖములయందు,ఖలీనక్ష్తరుధిరరుచః= కళ్ళెపు రాపిడి వలన కలిగిన నెత్తుటివలె నున్నచో, యే= ఏవి, శ్రితశిఖరశిఖాః= శృంగాగ్రములను చేరినవై, శైలానాం= పర్వతములకు, శేఖరత్వం తన్వతే= శిరోభూషణములగుచున్నవో, తే= అట్టి, ఖే=ఆకసమునందు, ప్రేంఖంతః =చరించుచున్న, ఖచితదినముఖాః= ఉదయకాలమును వ్యక్తపరచుచున్న, ఖరాంశోః, మయూఖాః= సూర్యుని కిరణములు, వః =మీకు, సుఖం =సుఖమును , దిశన్తు= ఇచ్చుగాక.
భావము (నాకు తెలిసి)
ఏ కిరణములైతే తమ యెరుపుతో సూర్యరథసారథి అనూరుని ఎఱ్ఱదనమును విస్తరింపజేస్తున్నాయో, యేవైతే ఆ రథపు అశ్వముల ముఖాలకు కళ్ళెము రాచుకొన్న యెఱుపును దలపిస్తున్నాయో, ఏవైతే శిఖరాగ్రాలకు కిరీటములౌతున్నాయో ఆ ఆకాశము నిండిన ఆ కిరణాలు మీకు సుఖమునిచ్చునుగాక.
౯.దత్తానన్దాః ప్రజానాం సముచితసమయాకృష్టసృష్టైః పయోభిః
పూర్వాహ్ణై విప్రకీర్ణా దిశిదిశి విరమత్యహ్ని సంహారభాజః
దీప్తాంశో ర్దీర్ఘ దుఃఖప్రభవభవభయో దన్వదుత్తారనావో
గావః పావనానాం పరమపరిమితాంప్రీతిముత్పాదయన్తు||
అర్థము
సముచితసమయా కృష్ణసృష్టైః= తగిన సమయమందు ఆకర్షించుచూ మరియు విడువబడిన, పయోభిః=నీటిచేతను, (పాలచేతను), ప్రజానాం=ప్రజలకు, దత్తానన్దాః= ఆనందము నిచ్చునవియును, పూర్వాహ్ణే = పగటి మొదటిభాగమందు, దిశిదిశి=దిక్కుదిక్కులకు, విప్రకీర్ణాః=వ్యాపించినవియును, అహ్ని విరమతి=ప్రొద్దు గ్రుంకుచుండగా, సంహారభాజః= ఉపసంహారము పొందినవియును, (మరలినవియును), దెర్ఘదుఃఖ ప్రభవ భవభయోదన్వదుత్తారనావః = చిరకాలము, దుఃఖములకు కారణమయిన సంసారపు భయమనెడి సముద్రమును తరించుటకు నావలయినటువంటియును, పరం పావనానాం పావనములలోమిక్కిలి పావనములునయిన, దీప్తాంశోః= సూర్యునియొక్క , గావః కిరణములు, (గోవులు), వః=మీకు, అపరిమితాం= పరిమితిలేని, ప్రీతిం =సంతోషమును, ఉత్పాదయన్తు = కలుగజేయు గాక.
వివరణము :_ గోశబ్దమునకు గోవులనియు, కిరణములనియును రెండర్థములు. గోవులు సమయమున నీటిని ఆకర్షించి పాలిచ్చును. కిరణములు నీటినాకర్షించి వర్షమిచ్చును.గోవులు ఉదయమున మేతకు దిక్కుదిక్కులు పోయి అస్తమయ సమయమున మరలును.గోదానము చేత సంసారదుఃఖమునుగోవులు పోగొట్టును.అనగా వైతరిణిని దాటించును.కిరణములు ఉపాసనముచేత  సద్గతులు కలుగును.
భావము (నాకు తెలిసి)
గోవులు కుడితి నీళ్ళు తాగి పాలను ఇచ్చినట్లు, కిరణములు నీటిని తీసుకొని, (ఎండి పోనిచ్చి) పిదప వర్షముగానిచ్చును.పావనములైన కిరణముల ఉపాసన మీకు సద్గతులు కలిగించును.
౧౦.బన్ధధ్వంసైక హేతుం శిరసి నతి రసాబద్ధ సన్ధ్యాఞ్జలీనాం
లోకానాం యే ప్రబోధం విదధతి విపులాంభోజఖణ్డాశయేవ
యుష్మాకం తే స్వచిత్తప్రథిత పృథుతర ప్రార్థనా కల్పవృక్షాః
కల్పన్తాం నిర్వికల్పం దినకరకిరణాఃకేతవః కల్మషస్య||
అర్థము
యే= ఏవి, శిరసి నతి రసాబద్ధ సన్ధ్యాఞ్జలీనాం =సంధ్యావందనములయందు, శిరములయందు అంజలి ఘటించిన, లోకానాం= లోకులకు( జనులకు), బన్ధధ్వంసైక హేతుమ్= సంసార బంధము తొలగించుటకు హేతువైన , ప్రబోధమును, విపులామ్బోజ షణ్డాశయా ఇవ= విస్తారమైన పద్మముల యందాశ చేతనో అనునట్లు, విదధతి= చేయుచున్నచో, తే = అట్టి, స్వచిత్త ప్రథమ పృథుతర ప్రార్థనా కల్పవృక్షాః=తమ చిత్తములయందు విస్తారముగా కలిగిన కోరికలకు కల్పవృక్షములైన, దినకరకిరణా= సూర్యకిరణములు, యుష్మాకం = మీయొక్క,కల్మషస్య= పాపమునకు, కేతవః= ధూమకేతువులై (నశింపజేయునవియై) కల్పన్తాం= సమర్థులగుగాక.
భావము (నాకు తెలిసి)
అంజలి ఘటించి సంధ్యావందనము జేయు జనులకు బంధమోచనము జేయు బోధ ను జేయు కిరణములుమీపాపములను నశింపజేయుగాక.

శతకములోని అన్ని పద్యాలనూ నెమ్మదిగా ఇక్కడే వ్రాసిపెడతాను.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

దేశం మీద ప్రేమ , బాధ్యత ఉండడం అంటే ఇదీ!

 
        ఢిల్లీలోని ఒక శ్రీరామ్ కళాశాల లో రాహుల్ కి బదులుగా శ్రీ నరేంద్రమోడీ గారిని విద్యార్థులు ప్రసంగించడానికి ఎంచుకున్నారంట.వారు ఏ సొల్లు కబుర్లు లేకుండా, యువతరాన్ని స్ఫూర్తితో నింపే విధంగా ప్రసంగించారు.

         శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం సారమున్న ప్రసంగం. ప్రతి మాట ఉపయోగకరమైనది.   పనిచేసే పనిచేసే,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ముందుకు అడుగులేయించే ఇలాంటి నాయకులు ప్రతిచోటా ఉండాలి.
 సబ్సిడీల భిక్ష రెండు రోజులు వేసి మూడోరోజు చేతులెత్తేసేవాళ్ళు కాదు.


http://www.youtube.com/watch?v=0xTkKB3oNb4

         ఈరోజు అందరూ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారంటే దాని వెనుక మా అందరి కృషి ఇది అని , మా ఆలోచన విధానం ఇట్లా ఉంది అని చెపుతూ వచ్చారు.
గుజరాత్ లో విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగింది. అది ఎట్లా అంటే.....ఊరికే సంఖ్య పెరగడం కాదు.

          రక్షకభటుల నియామకాల్లో పొడవు, వెడల్పు, ఇంకా కొన్ని పరీక్షల ద్వారా కాకుండా మొత్తం ఆటిట్యూడ్ పెంపొందించేటట్లు గా అభ్యర్థుల్లో ఉండాలని గుజరాత్ లోవిశ్వవిద్యాలయం ఉంది. పదో తరగతి అయినప్పుడే అక్కడ చేరి పూర్తి ఐదేళ్ళ కోర్స్ అక్కడ చేయవచ్చు. చట్టానికి సంబంధించిన విషయాలతో సహా పోలీస్ నియామకానికి సంబంధించిన చదువు చదవవచ్చు. ఎంతో గొప్ప విషయము.

       ఇంకా విద్యాబోధనకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయము, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడినపుడు ఎంత అథారిటీ తో మాట్లాడినారో, విజన్ తో మాట్లాడినారో విని తీరాల్సిందే.
 మనది బీద దేశం కాదు. మనకు ఉన్న వనరులు మనం సక్రమంగా వాడుకోవాలని, ప్రతి కార్యక్రమము ప్రో పబ్లిక్ గా ఎట్లా ఉండాలో, గుడ్ గవర్నెన్స్ విజన్ ఎట్ల ఉండాలో చెప్పినారు.

          ఒక ట్రైబల్ మనిషి ఆలోచన కూడా ఎంత వైవిధ్యంగా, నూతనంగా ఉండగలదో ఉదాహరణతో చూపించినారు.
  ఒక గ్రామంలోని ఒక నిరక్షరాస్యుడు ఎంత ఆత్మవిశ్వాసంతో తన గ్రామానికి అతిథిగా వచ్చిన  క్లింటన్ తో ఇంకా మా దేశాన్ని మీరు పాతకాలపు వెనుకబడ్డ దేశంగా భావిస్తున్నారా అని మాట్లాడిన విషయాన్ని
సంతోషంగా ఉదహరించారు.

         ఆఫ్ఘనిస్తాన్ లో టమాటాలు, మీ ఢిల్లీలోని చాయ్ తాగితే పాలు, ఢిల్లీ లోని మెట్రో ట్రైన్ లో కోచ్ లతో సహా గుజరాత్ నుంచి మేము పంపుతున్నామన్నారు.
మనం అభివృద్ధి చెందాలంటే స్కిల్, స్కేల్, స్పీడ్ మూడు విషయాలపై రాజీ పడకూడదన్నారు.
స్కిల్ లో జీరో డిఫెక్ట్, స్కేల్ లార్జ్ స్కేల్, స్పీడ్ అంటే సమయాన్ని వృథా చేయరాదు.

              పదహైదేళ్ళక్రింద తైవాన్ కి పోయినప్పుడు (ఇంకా ముఖ్యమంత్రికాకముందే) ఒక ద్విభాషి (ఇంటర్ప్రెటేటర్) మోడీ గారిని అడిగారట. ఇంకా భారతము పాములు పట్టే స్థాయిలోనే, (మూఢనమ్మకాల స్థాయిలోనే) ఉందా అని.
మోడీ గారి జవాబు

         "అబ్బే ఇప్పుడు అంత స్థాయి కూడా మాకు లేదు. మేము ఇప్పుడు ఎలుకలు పట్టే స్థాయిలోనే ఉన్నాము.
అంటే మౌస్ లు పట్టే స్థాయి. మౌస్ లు పట్టి న మా యువజాతి ఇరవై ముప్ఫైల్లో ఉన్న మా భారతీయులు మౌస్ పట్టి ప్రపంచంలో భారతదేశమంటే ఏమిటన్నది నిరూపించారు. మీరు చేసినారా పని. ఏ రాజకీయనాయకుడూ భారతమాతకు తేని ఖ్యాతి మీ యువతరం తీసుకొచ్చింది. " అన్నారు.


             సగం నీటితోనూ , సగం గాలితోనూనిండి ఉంది  , కాబట్టి పూర్తి లోటా నిండి ఉన్నదని చెప్పిన శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం సారమున్న ప్రసంగం. ప్రతి మాట ఉపయోగకరమైనది. మాటల్లో చమత్కారాలకూ లోటు లేదు.  పనిచేసే,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ముందుకు అడుగులేయించే  ఇలాంటి నాయకులు ప్రతిచోటా ఉండాలి.
 సబ్సిడీల భిక్ష రెండు రోజులు వేసి మూడోరోజు చేతులెత్తేసేవాళ్ళు కాదు.

               అంత నిమగ్నమై మాట్లాడుతూ కూడా అరగంటకే ఇచ్చిన సమయం ముగిసిందా అని చూసుకోవడం, సమగ్ర అభివృద్ధి గురించి, ఈ దేశపు వనరుల గురించి, మానవ వనరుల గురించి అంత నమ్మకంగా, గౌరవముంచి నిరూపించి మాట్లాడే రాజకీయనాయకులున్నారా? మామూలు మనుషులు కూడా ఇది ఇండియా అని తేలికగా మాట్లాడుతారు. మోడీ గారికి నమస్కారములు.

"గోదారి" అనే బ్లాగ్ లోనేనీ రోజు ఈ ప్రసంగం లంకె చూసి పూర్తి ప్రసంగం విన్నాను. వారికి నాకృతజ్ఞతలు.