Loading...

14, జనవరి 2013, సోమవారం

కనిపించు దైవమా! కరములు జోడించి........

సందెపొద్దుల్లో పసుపు ఎఱుపు రంగులు కలబోసిన ముద్దబంతి సూరీడు
జగతిని నిశిలో విడిచి పోతున్నా,
అరుణ కిరణాల ఎఱ్ఱంచు తెల్లటి వస్త్రాల్లో ముస్తాబై తొలిసంజె వెలుగులతో
ధరణిని అభిషేకిస్తూ వచ్చేస్తాడు కదా!
పండక్కి వచ్చిన కొత్త బావగారిని తొంగి చూసే మరదళ్ళై కొత్త మొక్కలు
ప్రభాకరుని ప్రభాతసమయంలో చూసేందుకు అలవోకగా వంగి చూస్తుంటాయికదా!
జీవరాశిని బ్రతికించేది, పోషించేదే కాక కొండొకచో జన్మలకు కూడా కారణ భూతుడై, ప్రత్యక్షనారాయణుడై
అలరారే దినకరుని తలచుకునే ప్రత్యేక మైన రోజులే సంక్రాంతి, రథసప్తమి.
శ్రీరాముని యుద్ధంలో విజయం కలగాలంటే ఆదిత్యుని పూజించమని అగస్త్యమహాముని యుద్ధరంగంలో ఆదిత్యహృదయం ఉపదేశిస్తాడు. రాముడు ఋషి ఆజ్ఞ పాటిస్తాడు.
కళ్ళెత్తి సూటిగా చూడగా రాని అద్భుత తేజోమయుడై, పరమాత్మ దర్శనము తనకన్నా కోటిరెట్లు ఎక్కువని జాగ్రత్తని చెపుతున్నట్లుగా భాస్కరుడు వెలుగుతుంటాడు.
మనకు ఇక్కడ వీడ్కోలు ఇచ్చినా, విశ్వంలో నిరంతరాయంగా వెలుగుతూ, ధాత్రిలో ఎక్కడో ఇంకోమూల జీవరాశికి బ్రతుకునిస్తూ ఉంటాడు.
చంద్రునికి, అనేక రత్నమాణిక్యాలకు తన ప్రభలను పంచుతూ, కమలముల వంటి అనేక పువ్వులకు జీవమిస్తూ ఎన్నటికీ తరిగిపోని కాంతుల రేడు.
తనచుట్టూ తిరిగే అన్ని గ్రహాలకు, ఉపగ్రహాలకు అధిపుడై, రారాజై పరిపాలిస్తూ ఉంటాడు.
శాశ్వతత్వానికి ప్రతీకగా సూర్యచంద్రులున్నంత వరకూ అని ఉదహరించురీతిగా గగనవిభుడై ఉంటాడు.
జలచక్రాన్ని నిరంతరాయంగా చలింపజేస్తూ ధాత్రిని అనేక ఔషధాలకు, ఆహారపుపంటలకు జనయిత్రిగా నిలిపేవాడీతడు.
అటువంటి సూర్యునికి శతకోటి ప్రణామములు.


కనిపించు దైవమా! కరములు జోడించి  వందనముల జేతు పాహియనుచు.
జగముల బాలించు సామర్థ్యమున్న నీ నామంబు తలతునే నన్ను గనుము.
వేల యుగంబుల వేడి తగ్గక నుండు  పేర్మియు నీదయ్య , పెరుగు నెపుడు.
నిను నమ్ము వారికి నిను గొల్చువారికి  కలుగు కష్టములెల్ల తొలుగ గలవు.


నీవు లేని భువిని నిమ్మళముగ నుండ
సాధ్యమగునె, మాకు జలజ మిత్ర.!
దేవదేవ నీవు దీవనంబొసగుచు
మమ్ము గాచినయెడ మాకు సుఖము.