Loading...

14, జనవరి 2013, సోమవారం

కనిపించు దైవమా! కరములు జోడించి........

సందెపొద్దుల్లో పసుపు ఎఱుపు రంగులు కలబోసిన ముద్దబంతి సూరీడు
జగతిని నిశిలో విడిచి పోతున్నా,
అరుణ కిరణాల ఎఱ్ఱంచు తెల్లటి వస్త్రాల్లో ముస్తాబై తొలిసంజె వెలుగులతో
ధరణిని అభిషేకిస్తూ వచ్చేస్తాడు కదా!
పండక్కి వచ్చిన కొత్త బావగారిని తొంగి చూసే మరదళ్ళై కొత్త మొక్కలు
ప్రభాకరుని ప్రభాతసమయంలో చూసేందుకు అలవోకగా వంగి చూస్తుంటాయికదా!
జీవరాశిని బ్రతికించేది, పోషించేదే కాక కొండొకచో జన్మలకు కూడా కారణ భూతుడై, ప్రత్యక్షనారాయణుడై
అలరారే దినకరుని తలచుకునే ప్రత్యేక మైన రోజులే సంక్రాంతి, రథసప్తమి.
శ్రీరాముని యుద్ధంలో విజయం కలగాలంటే ఆదిత్యుని పూజించమని అగస్త్యమహాముని యుద్ధరంగంలో ఆదిత్యహృదయం ఉపదేశిస్తాడు. రాముడు ఋషి ఆజ్ఞ పాటిస్తాడు.
కళ్ళెత్తి సూటిగా చూడగా రాని అద్భుత తేజోమయుడై, పరమాత్మ దర్శనము తనకన్నా కోటిరెట్లు ఎక్కువని జాగ్రత్తని చెపుతున్నట్లుగా భాస్కరుడు వెలుగుతుంటాడు.
మనకు ఇక్కడ వీడ్కోలు ఇచ్చినా, విశ్వంలో నిరంతరాయంగా వెలుగుతూ, ధాత్రిలో ఎక్కడో ఇంకోమూల జీవరాశికి బ్రతుకునిస్తూ ఉంటాడు.
చంద్రునికి, అనేక రత్నమాణిక్యాలకు తన ప్రభలను పంచుతూ, కమలముల వంటి అనేక పువ్వులకు జీవమిస్తూ ఎన్నటికీ తరిగిపోని కాంతుల రేడు.
తనచుట్టూ తిరిగే అన్ని గ్రహాలకు, ఉపగ్రహాలకు అధిపుడై, రారాజై పరిపాలిస్తూ ఉంటాడు.
శాశ్వతత్వానికి ప్రతీకగా సూర్యచంద్రులున్నంత వరకూ అని ఉదహరించురీతిగా గగనవిభుడై ఉంటాడు.
జలచక్రాన్ని నిరంతరాయంగా చలింపజేస్తూ ధాత్రిని అనేక ఔషధాలకు, ఆహారపుపంటలకు జనయిత్రిగా నిలిపేవాడీతడు.
అటువంటి సూర్యునికి శతకోటి ప్రణామములు.


కనిపించు దైవమా! కరములు జోడించి  వందనముల జేతు పాహియనుచు.
జగముల బాలించు సామర్థ్యమున్న నీ నామంబు తలతునే నన్ను గనుము.
వేల యుగంబుల వేడి తగ్గక నుండు  పేర్మియు నీదయ్య , పెరుగు నెపుడు.
నిను నమ్ము వారికి నిను గొల్చువారికి  కలుగు కష్టములెల్ల తొలుగ గలవు.


నీవు లేని భువిని నిమ్మళముగ నుండ
సాధ్యమగునె, మాకు జలజ మిత్ర.!
దేవదేవ నీవు దీవనంబొసగుచు
మమ్ము గాచినయెడ మాకు సుఖము.

12, జనవరి 2013, శనివారం

మిత్రులారా!


4, జనవరి 2013, శుక్రవారం

మన ధర్మములో.......

       సనాతన ధర్మమునందు అనేక దేవుళ్ళుంటారని అందరూ అదొక పెద్ద విషయంగా విమర్శిస్తుంటారని స్వామి పరిపూర్ణానందగారు హైందవ శంఖారావం అనే చర్చలో ఒక సరైన సమాధానము చెప్పినారు.

              ఒకే మనిషిని అన్నగా చూసేవాళ్ళు, భర్తగా చూసేవాళ్ళు, తండ్రిగా చూసేవాళ్ళు, స్నేహితుడిగా చూసేవాళ్ళు, అధికారిగా చూసేవాళ్ళు, క్రింది ఉద్యోగిగా చూసేవాళ్ళు, గురువుగా చూసేవాళ్ళు, శిష్యుడిగా చూసేవాళ్ళు ఉన్నట్టే ఒకే పరమాత్మను రామునిగా, కృష్ణునిగా , శక్తిగా, ఇంకా పలువిధాలు గా చూస్తూ పూజిస్తూ ఉంటారని చెప్పినారు. ఈ మాట ఇంతకు ముందు ఎన్నో సార్లు విన్నదే కానీ, "చూసే" వాళ్ళు అనే పదము వాడినపుడు ఇంకా ప్రభావవంతంగా అనిపించింది.

                  ఇంకో మాట చెప్పినారు.దానివలన నాకు అర్థమయినది, తోచినది ఇది __ మన ధర్మము లో చెట్టులను, పుట్టలను, పాములను, మూషికాలను,  పక్షులను, జంతువులను అన్నిరూపాల జీవులను పూజిస్తూ ఉంటారు, మరి మనిషిని ఎందుకు పూజించరు మీరని కొందరు అంటుంటారు. మనము  చర, అచర జగత్తులో అంటే భూమి, రాయి, జీవకోటిలో దేవున్ని చూసేవాళ్ళము, మరి అదేవిధంగా మనిషిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతాము.కానీ ......
            
            మిగతా వాటిని పూజించినట్లు మనిషిని పూజించక పోవడానికి కారణము మనిషిలో ఉన్న అహము. ఈగో అనునది. నాకన్న నీవు ఏమి గొప్ప అనే భావన. మనకన్నా గొప్ప అనుకున్న గురువుగారిని, తల్లిదండ్రులను, బాలికలను (గౌరమ్మలని) పూజిస్తాము కానీ సాటివాళ్ళను పూజించము. ఆ అహము తొలగిన నాడే మనిషి దేవుడౌతాడు. ఆ అహము తొలగించుకొమ్మని మనకు బోధిస్తూ ఉన్నారు మన పూర్వీకులు.
                    ఆ అహము తొలగడానికే మనకు జంతు రూపాల, పక్షిరూపాలతో పాటు మనిషి రూపు ఉన్న దేవతా మూర్తులు ఆడ, మగ రూపాలలో కూడా పూజ చేయాలని సాంప్రదాయము. అందులో ఈ విధంగా సర్వ వ్యాపి అయిన దేవుని అన్ని రూపాలలో చూడగలగడం అనే గొప్ప సంప్రదాయాన్ని మన ధర్మములో ఉన్నవారే తెలిసీ, తెలియక విమర్శ చేయకూడదని అందరూ తెలుసుకోవాల గద!

                  తెలియని విషయాలు చెప్పటానికి, సందేహాలను తీర్చడానికి ఎంతో మంది పెద్దవాళ్ళు అర్హులైన వాళ్ళు ఉన్నారు. సంతృప్తి పఱచగలిగేటట్లు సమాధాన మిచ్చే గురువులను మనము వెతుక్కోగలగాల కానీ, మన ఆహారము సంపాదించుకోవడంలో  మనము వ్యస్తులమై తోచిన మూర్ఖపు ఆలోచనలన్నీ సిద్ధాంతాలుగా ప్రతిపాదించి ముందు తరాలను భ్రష్టు పట్టించకుండా ఉంటే అదేపదివేలు.